Nikki Haley: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో భారతీయ అమెరికన్
51 ఏళ్ల నిక్కీ ఫిబ్రవరి 14వ తేదీ ఒక వీడియో సందేశంలో ఈ ప్రకటన చేశారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి సొంత పార్టీ నేత, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను సవాల్ చేసిన తొలి వ్యక్తిగా నిలిచారు. ‘ప్రెసిడెంట్ ఎన్నికల బరిలో అడుగుపెట్టా. దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడం, సరిహద్దు రక్షణ, దేశాన్ని మరింత శక్తివంతం చేయడం, సమున్నత స్థానంలో నిలపడం కోసం నవ్య నాయకత్వం సారథ్యం వహించాల్సిన సమయమొచ్చింది. వలస వచ్చిన భారత కుటుంబం నుంచి వచ్చిన కూతురుగా గర్వపడతాను. నలుపు కాదు. తెలుపు కాదు. నేనింకా భిన్నం’ అని నిక్కీ వ్యాఖ్యానించారు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (అవార్డ్స్) క్విజ్ (22-28 జనవరి 2023)
ట్రంప్ విధానాలను ఆయన హయాంలోనే తప్పుబట్టిన నిక్కీ.. ట్రంప్‌కు సరైన యువ ప్రత్యామ్నాయంగా తనను తాను అభివర్ణించుకున్నారు. ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్, దేశ మాజీ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, మైక్ పాంపియో, టిమ్ స్కాట్ తదితర రిపబ్లికన్ నేతలూ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీపడే అవకాశముంది. బాబీ జిందాల్ (2016), ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (2020) తర్వాత అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వం కోసం పోటీపడిన మూడో భారతీయ అమెరికన్‌గా నిక్కీ నిలిచారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ఎన్నిక ప్రక్రియ 2024 జనవరిలో మొదలవుతుంది.
పంజాబ్ నుంచి వలసవచ్చి..
పంజాబ్‌లోని అమృత్‌సర్ నుంచి 1960ల్లో కెనడా వలస వచ్చిన సిక్కు దంపతులు అజిత్ సింగ్ రణ్‌ధావాలా, రాజ్ కౌర్ రణ్‌ధావాలాలకు జన్మించిన నిక్కీ పూర్తి పేరు నిమ్రతా నిక్కీ రణ్‌ధావాలా. వారి కుటుంబం కెనడాకు అక్కడి నుంచి అమెరికా వెళ్లింది. 2011 జనవరిలో 39 ఏళ్లకే గవర్నర్ పదవి చేపట్టి అమెరికాలో ఆ పదవి చేపట్టిన అత్యంత పిన్న వయస్కురాలిగా నిక్కీ చరిత్ర సృష్టించారు. దక్షిణ కరోలినా తొలి మహిళా గవర్నర్‌గా, రెండు సార్లు ఆమె బాధ్యతలు కొనసాగించి రికార్డు నెలకొల్పారు. దాదాపు రెండేళ్లపాటు ఐరాసలో అమెరికా రాయబారిగా ఉన్నారు.