AI: ChatGPTకి పోటీగా.. Google Bard!!
ఆల్ఫాబెట్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తన బ్లాగ్‌స్పాట్‌లో ఈ మేరకు ప్రకటించారు. విడుదలకు ముందు ఈ Chatbotను ‘నమ్మకస్తులైన టెస్టర్ల’తో కొద్ది వారాలపాటు మదింపు చేస్తామని తెలిపారు. ‘‘బార్డ్ మీ సృజనాత్మకతకు చక్కని తోడవుతుంది. మీ ఉత్సుకతకు రెక్కలు తొడుగుతుంది. నాసా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కొత్త ఆవిష్కరణలు మొదలుకుని ఎలాంటి సంక్లిష్టమైన విషయాలనైనా తొమ్మిదేళ్ల పిల్లలకు కూడా సులువుగా అర్థమయ్యేలా వివరించగలగడం దీని ప్రత్యేకత’’ అని చెప్పుకొచ్చారు. ChatGPTని మైక్రోసాఫ్ట్ తన సెర్చ్ ఇంజన్ బింగ్‌కు అనుసంధానం చేయనుందన్న వార్తల నేపథ్యంలో గూగుల్ ప్రకటన ఆసక్తికరంగా మారింది. గూగుల్ ప్రధాన ఆదాయ వనరు కూడా సెర్చ్ ఇంజనే అన్నది తెలిసిందే. చాట్‌జీపీటీ రూపంలో కంపెనీకిప్పుడు పెను సవాలు ఎదురైంది.
Train Passengers: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక వాట్సాప్ నుంచే ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు
లాఎండీఏ మోడల్‌పైనే..
బార్డ్‌ను గూగుల్ తన ప్రస్తుత ఏఐ లాంగ్వేజ్ మోడల్ లాఎండీఏపైనే అభివృద్ధి చేసింది. ఇది బోల్డ్‌గా, సృజనాత్మకంగా ఉంటూనే బాధ్యతాయుతంగా పని చేస్తుందని పిచాయ్ చెప్పారు. ‘‘బార్డ్‌ను తొలుత తక్కువ కంప్యూటింగ్ పవర్‌తో కూడా నడిచే లైట్‌వెయిట్ మోడల్‌లో విడుదల చేస్తాం. ఫీడ్‌బ్యాక్, యూజర్ల సంఖ్య ఆధారంగా ముందుకెళ్తాం’’ అని వివరించారు. 2022 నవంబర్లో విడుదలైన చాట్‌జీపీటీ సూపర్‌హిట్‌గా నిలిచింది. ఓపెన్‌ఏఐ కంపెనీకి చెందిన ఈ ప్రాజెక్టులో మైక్రోసాఫ్ట్ బిలియన్ల కొద్దీ పెట్టుబడులు పెట్టింది.