Atiq Ahmed shootout: అతీక్ సోదరుల హత్య.. ఇద్దరి తలల్లోకి దూసుకెళ్లిన తూటాలు!
అంతే..! పేరుమోసిన గ్యాంగ్‌స్టర్, మాజీ రాజకీయ నాయకుడు అతీక్ అహ్మద్ (60), ఆయన సోదరుడు అష్రఫ్ అక్కడికక్కడే నేలకొరిగారు. ఇద్దరి శరీరాలూ తూటాలతో తూట్లు పడ్డాయి. తాము పుట్టి పెరిగిన, నేర సామ్రాజ్యానికి కేంద్రంగా మలచుకున్న ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోనే వారి కథ అలా ముగిసిపోయింది. అతీక్ మూడో కుమారుడు అసద్‌ను ఏప్రిల్ 13న యూపీ పోలీసులు ఝాన్సీలో ఎన్‌కౌంటర్ చేయగా, అతని అంత్యక్రియలు ఏప్రల్ 15న ప్రయాగ్‌రాజ్‌లో ముగిశాయి. వాటిలో పాల్గొనాలన్న అతీక్ కోరిక తీరకపోగా రాత్రికల్లా సోదరునితో సహా తానూ కడతేరిపోయాడు. ఈ జంట హత్యలు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించాయి. యూపీలో సీఎం యోగి సారథ్యంలో సాగుతున్న ఎన్‌కౌంటర్ల పరంపరకు ఇది కొనసాగింపంటూ విపక్షాలు దుయ్యబడుతున్నాయి.
Ambedkar Statue: దేశంలోనే ఎత్తైన అంబేడ్కర్ విగ్రహం.. 125 అడుగుల విగ్రహ రూపకర్త, విగ్రహ ప్రత్యేకతలివే..
మీడియాతో మాట్లాడుతుండగానే..
పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ అయిన అతీక్‌పై 100కు పైగా క్రిమినల్ కేసులున్నాయి. 2005 నాటి బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్యకు ప్రధాన సాక్షి ఉమేశ్‌పాల్‌ను హత్య చేసిన కేసులో విచారణ నిమిత్తం అతీక్ సోదరులను పోలీసులు ఇటీవలే అహ్మదాబాద్ సెంట్రల్ జైలు నుంచి ప్రయాగ్‌రాజ్‌కు తీసుకొచ్చారు. అసద్ అంత్యక్రియలు జరిగిన ప్రదేశానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధూమన్‌గంజ్ పోలీస్‌స్టేషన్లో వారిని ఏప్రిల్ 15న విచారించారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం రాత్రి దాదాపు 10 గంటల ప్రాంతంలో పోలీసులు ఎంఎల్‌ఎన్ వైద్య కళాశాలకు తరలించారు. చేతులకు బేడీలతో ఉన్న సోదరులిద్దరూ అక్కడికి చేరుకున్న మీడియాతో మాట్లాడుతూ ముందుకు నడుస్తున్నారు. కుమారుని అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు కదా అని ప్రశ్నించగా, ‘పోలీసులు తీసుకెళ్లలేదు. ఏం చేస్తాం?’ అని అతీక్ బదులిచ్చారు. ‘అల్లా తానిచ్చిన దాన్ని వెనక్కు తీసుకున్నాడు’ అని అష్రఫ్ అన్నారు. ‘అసలు విషయం ఏమిటంటే గుడ్డు ముస్లిం (అతీక్ అనుచరుని పేరు)’ అంటూ ఏదో చెబుతుండగానే రెప్పపాటులో నాటకీయ పరిణామాలు జరిగిపోయాయి.
National Party: ఓ రాజకీయ పార్టీని జాతీయ పార్టీగా గుర్తించాలంటే ఉండాల్సిన అర్హతలివే..
మీడియా ముసుగులో వారితో పాటు నడుస్తున్న ముగ్గురు యువకులు ఉన్నట్టుండి పిస్టళ్లు తీశారు. నేరుగా వారిపైకి కాల్పులకు దిగారు. ఒకడు ముందు అతీక్ తలపై కాల్చాడు. విస్మయంతో చూస్తున్న అఫ్రష్ తలపైకి మరో తూటా దూసుకెళ్లింది. దాంతో సోదరులిద్దరూ కుప్పకూలిపోయారు. వారితో పాటున్న పోలీసులు కాల్పులు జరుగుతుంటే తలోవైపు చెదిరిపోయారు. ఆ వెంటనే హంతకులు ముగ్గురూ కుప్పకూలిన అతీక్ సోదరుల దగ్గరికి వెళ్లి వారిపై తూటాల వర్షం కురిపించారు. అంతలో తేరుకున్న పోలీసులు వారివైపు దూసుకొచ్చారు. హంతకుల్లో ఇద్దరు చేతులు పైకెత్తి వారికి లొంగిపోయారు. మూడో వ్యక్తి కొద్ది దూరం పరిగెత్తినా అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హంతకులను లవ్లేశ్ తివారీ, సన్నీ, అరుణ్ మౌర్యగా గుర్తించారు. వారు వాడిన మూడు బైకులను, ఘటనా స్థలి నుంచి రెండు పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల్లో మాన్‌సింగ్ అనే కానిస్టేబుల్, ఏఎన్‌ఐ విలేకరి స్వల్పంగా గాయపడ్డారు. కాల్పుల నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నతస్థాయి సమావేశంలో పరిస్థితిని సమీక్షించారు. ముందుజాగ్రత్తగా ప్రయాగ్‌రాజ్‌లో 144 సెక్షన్ విధించారు. ఈ ఘటనకు సంబంధించి 17 మంది పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. దీనిపై యూపీ ప్రభుత్వం త్రిసభ్య జ్యుడీషియల్ కమిషన్ వేసింది.
నలుగురు కొడుకులూ పోలీసుల అదుపులోనే..
మారిన పరిస్థితుల నేపథ్యంలో తనకు, సోదరునికి, కుమారులకు ప్రాణ హాని తప్పదని అతీక్ కొద్ది రోజులుగా భయపడుతూనే ఉన్నారు. కనీసం తన కుటుంబంలోని ఆడవాళ్లకు, పిల్లలకు హాని తలపెట్టొద్దని ఇటీవలే పోలీసులకు విజ్ఞప్తి కూడా చేశారు. అతీక్ పెద్ద కుమారుడు ఉమర్ లఖ్‌నవూ జైల్లో, రెండో కొడుకు అలీ ప్రయాగ్‌రాజ్‌లోనే నైనీ జైల్లో, నాలుగో కొడుకు ఆజం, ఐదో కొడుకు అబాన్ జువనైల్ హోమ్‌లో ఉన్నారు.