Skip to main content

National Party: ఓ రాజకీయ పార్టీని జాతీయ పార్టీగా గుర్తించాలంటే ఉండాల్సిన అర్హతలివే..

ఎన్నికల సంఘం తాజాగా కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (సీపీఐ), ఆలిండియా తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ), నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ)లకు ఉన్న‌ జాతీయ పార్టీ గుర్తింపును రద్దు చేసింది.
National Party

కొత్తగా అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఈసీ జాతీయ హోదా ఇచ్చింది.  అయితే ఓ రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి..? ఎన్ని ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు గెలవాలి..? ఎన్ని రాష్ట్రాల్లో ఉనికి ఉండాల‌నే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఓ పార్టీ జాతీయ హోదా పొందాలంటే..
☛ ఒక రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కనీసం నాలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీ గుర్తింపు పొంది ఉండాలి. 
☛ అసెంబ్లీ లేదా సార్వత్రిక ఎన్నికల్లో(లోక్‌సభ) నాలుగు రాష్ట్రాల్లో కనీసం 6 శాతం ఓట్లు పొంది ఉండాలి. లేదా నాలుగు ఎంపీ సీట్లైనా గెలవాలి. లేదా లోక్‌సభలో రెండు శాతం సీట్లు కలిగి ఉండాలి. 
☛ కనీసం మూడు రాష్ట్రాల నుంచి ఆ పార్టీ ఎంపీలు ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించి ఉండాలి.  
☛ వీటిలో ఏ అర్హత ఉన్నా ఎన్నికల సంఘం ఓ రాజకీయ పార్టీని జాతీయ పార్టీగా గుర్తింపునిస్తుంది.

Tigers in India: దేశంలో పెరుగుతున్న పులుల సంఖ్య.. తాజా లెక్కలివే..

ఓ పార్టీ రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలంటే..
☛ కేంద్ర ఎన్నికల సంఘం 1968 ప్రకారం చివరి సారిగా జరిగిన సాధారణ ఎన్నికలు లేదా శాసనసభ ఎన్నికల్లో అసెంబ్లీలో క‌నీసం 3 శాతం సీట్లు గెలుచుకోవాలి. 
☛ సార్వత్రిక ఎన్నికల్లో ఆ రాష్ట్రంలోని ప్రతి 25 లోక్‌సభ స్థానాలకు ఒక‌ లోక్‌సభ సీటైనా గెలుచుకోవాలి.
☛ లోక్‌సభ లేదా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కనీసం 6 శాతం ఓట్లు సాధించాలి. అలాగే అదనంగా ఒక లోక్‌సభ, రెండు అసెంబ్లీ సీట్లను గెలుచుకోవాలి. 
☛ లోక్‌సభ లేదా శాసనసభకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో 8 శాతం ఓట్లు సాధించాలి. 
☛ ఒక రాజకీయ పార్టీ పై షరతుల్లో ఏదో ఒకదాన్ని నెరవేర్చినా రాష్ట్రంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా పరిగణిస్తారు.

President Droupadi Murmu: యుద్ధ విమానంలో ప్ర‌యాణించిన రాష్ట్రపతి ముర్ము

ప్రస్తుతం దేశంలోని జాతీయ పార్టీలు ఆరు..  
☛ ప్రస్తుతం దేశంలో ఆరు పార్టీలకు జాతీయ హోదా ఉంది. అవి బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ), నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ. 
☛ కొత్తగా జాతీయ హోదా పొందిన ఆప్‌ను అరవింద్‌ కేజ్రీవాల్‌ 2012లో స్థాపించారు. 2015, 2020లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో, 2022లో పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ విజయం సాధించింది. 
☛ 1925లో ఏర్పాటైన సీపీఐ 1989లో జాతీయ పార్టీగా గుర్తింపు పొందింది. పశ్చిమ బెంగాల్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతినడం, దేశవ్యాప్తంగా కూడా తగిన సంఖ్యలో లోక్‌సభ సీట్లను సాధించలేకపోవడంతో జాతీయ హోదాను కోల్పోయింది. 
☛ జాతీయ హోదా కోల్పోయిన టీఎంసీని 1998లో మమతా బెనర్జీ స్థాపించారు. టీఎంసీ 2004లో రాష్ట్ర పార్టీ హోదా పొందింది. తర్వాత అరుణాచల్‌ ప్రదేశ్, మణిపూర్, త్రిపురకూ విస్తరించగా.. 2016లో జాతీయ పార్టీ హోదా వచ్చింది. కానీ తర్వాత పెద్దగా ప్రభావం చూపకపోవడంతో హోదా కోల్పోవాల్సి వచ్చింది.
☛ శరద్‌పవార్‌ 1999లో కాంగ్రెస్‌ నుంచి బయటికి వచ్చి ఎన్సీపీని స్థాపించారు. వివిధ ఎన్నికల్లో విజయం సాధించడంతో 2000 సంవత్స రంలో జాతీయ హోదా లభించింది.

Rahul Gandhi: రాహుల్ గాంధీపై అనర్హత వేటు.. లోక్‌స‌భ స‌భ్య‌త్వం ర‌ద్దు

జాతీయ హోదా ఉంటే పార్టీ పొందే ప్రయోజనాలివే..
☛ దేశవ్యాప్తంగా జాతీయ హోదా ఉన్న‌ పార్టీ ఒకే గుర్తుపై పోటీ చేసే అవకాశం ఉంటుంది.
☛ సార్వత్రిక ఎన్నికల సమయంలో దూరదర్శన్‌, ఆకాశవాణిలలో ప్రసారాలకు అవకాశం లభిస్తుంది. 
☛ ఎన్నికల సమయంలో జాతీయ‌ పార్టీలకు గ‌రిష్టంగా 40 మంది స్టార్‌ క్యాంపెయినర్లకు అవకాశం ఉంటే, రాష్ట్ర పార్టీలకు మాత్రం 20 మంది దాకా పెట్టుకోవచ్చు. వారి ప్రయాణ ఖర్చులు అభ్యర్థుల ఖర్చు కింద పరిగణించరు.
తమ పార్టీ ప్రధాన కార్యాలయాలు నిర్మాణానికి ప్రభుత్వ భూమిని పొందొచ్చు. 
అభ్యర్థి నామినేషన్‌ దాఖలు చేసేందుకు ప్రతిపాదించేవారు ఒకరు ఉంటే సరిపోతుంది. 
☛ జాబితా సవరణ సమయంలో రెండు ఓటరు జాబితా సెట్లు ఉచితంగా పొందుతారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో జాతీయ పార్టీ అభ్యర్థులు ఒక కాపీని ఉచితంగా పొందే వీలు ఉంటుంది.

Weekly Current Affairs (Economy) Bitbank: ప్రస్తుతం చలామణిలో ఉన్న ఈ-రూపాయి(E-Rupee) విలువ ఎంత?

Published date : 11 Apr 2023 03:30PM

Photo Stories