Academic Bank of Credits: ఈ కోర్సులు పూర్తి చేశారా.. అయితే నగదు లావాదేవీలకు బ్యాంకులు, ఖాతాలు ఉన్నట్లే..
ఏబీసీ (అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్) పేరుతో అకడమిక్ బ్యాంక్ ఖాతాను ప్రతి విద్యార్థీ ప్రారంభించాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇందులో పూర్తి చేసిన కోర్సులు అత్యంత ప్రామాణికంగా ఉండడంతో పాటు ప్రపంచంలో ఎక్కడి నుండైనా ఈ ఖాతాను పరిశీలించి ప్రతిభను అంచనా వేయవచ్చు. బహుళ జాతి సంస్థ (మల్టీ నేషనల్ కంపెనీ)లో కొలువు దక్కించుకోవాలనుకుంటే విద్యార్థి ఏబీసీ ఖాతాను పరిశీలిస్తే చాలు. విద్యార్థి నైపుణ్యం, ప్రతిభ, అర్హత అన్ని అంశాలూ పసిగట్టవచ్చు. జేఎన్‌టీయూ అనంతపురం ఉన్నతాధికారులు గతేడాది నుంచి ఈ విధానాన్ని అమలులోకి తెచ్చారు. గతేడాది 20 వేల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, ఈ ఏడాది 52 వేల మంది విద్యార్థులు అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం విశేషం. వీరందరికీ నగదు లావాదేవీలకు బ్యాంకులు, ఖాతాలు ఉన్నట్లే..
Distribute Tabs: ప్రభుత్వ బడిలో సాంకేతిక విప్లవం.. ఎక్కడ అంటే..!
విద్యార్థి ప్రతిభకు తార్కాణం..
నాణ్యమైన బోధన – అభ్యసనా ప్రక్రియను పెంపొందించడానికి యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్)–2021 మార్గదర్శకాలకు అనుగుణంగా ఏబీసీని ఏర్పాటు చేశారు. పరిశ్రమల ఆధారిత సిలబస్‌ను విద్యార్థి అభ్యసించడానికి వీలుగా ఇలాంటి విధానాన్ని అమల్లోకి తెచ్చారు. కోర్సు చదివే సమయంలో విద్యార్థి పరిశ్రమకు వెళ్లి అనుభవం గడించిన అనంతరం తిరిగి కోర్సులోకి ప్రవేశించవచ్చు. పరిశ్రమలో పనిచేసే సమయంలో ఆన్‌లైన్ విధానంలో నేర్చుకున్న కోర్సులు ఏబీసీలో నమోదు చేసుకోవచ్చు.
అయితే ఆన్‌లైన్ కోర్సుకు తప్పనిసరిగా సర్టిఫై అయిన సంస్థల నుంచి సర్టిఫికెట్ ఉండాలి. ఇలా మొత్తం 40 శాతం ఆన్‌లైన్ కోర్సులను పరిగణనలోకి తీసుకుంటారు. బీటెక్‌లో మొత్తం 163 క్రెడిట్లు ఉండగా, ఇందులో 40 శాతం క్రెడిట్‌లు ఏబీసీలో నమోదైన ఆన్‌లైన్ విధానంలో పూర్తి చేయొచ్చు. ఎంటెక్ మొత్తం 95 క్రెడిట్లు ఉండగా 40 శాతం ఆన్‌లైన్ విధానంలో పూర్తి చేసే వెసులుబాటు ఉంది.
ఎప్పటికప్పుడు క్రెడిట్స్ లెక్కింపు
జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో మొత్తం 90 ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ప్రతి విద్యార్థికి అకడమిక్ బ్యాంక్ అకౌంట్ (ఏబీఏ)ను అందజేస్తున్నారు. యూనిక్ ఐడీ, పాస్‌వర్డ్ సాయంతో ఏబీసీ ఖాతాను తెరవచ్చు. విద్యార్థి ఏ కోర్సునైనా అభ్యసించవచ్చు. ఎప్పటికప్పుడు క్రెడిట్స్ లెక్కిస్తారు. విద్యార్థి సాధించిన క్రెడిట్లు 9 సంవత్సరాల కాల పరిమితి వరకు చెల్లుబాటు అవుతాయి. తొమ్మిదేళ్ల తరువాత తిరిగి కొత్త కోర్సులు అభ్యసించాల్సి ఉంటుంది. అప్పటి దాకా ఉన్న పాత కోర్సులు రద్దు చేస్తారు. జేఎన్ టీయూ రిజిస్ట్రార్ సి.శశిధర్, ఎవాల్యుయేషన్స్ డైరెక్టర్ కేశవరెడ్డి ఆధ్వర్యంలో ఏబీసీ ఖాతాను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.