Rishi Sunak : ప్రతి ఏటా 3,000 ప్రొఫెషనల్ వీసాలు!
ఈ యూకే–ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ కింద చదువుకోవడంతో పాటు రెండేళ్ల దాకా పని చేసేందుకు కూడా వారికి వెసులుబాటు కల్పించనుంది. జీ 20 సదస్సు సందర్భంగా ప్రధానులు నరేంద్ర మోదీ, రిషి సునాక్ నవంబర్ 16(బుధవారం) అధికారికంగా సమావేశమయ్యాక బ్రిటన్ ఈ మేరకు ప్రకటించింది.
ఉక్రెయిన్ యుద్ధంతో పాటు పలు అంతర్జాతీయ, ద్వైపాక్షిక అంశాలపై మోదీ, సునాక్ లోతుగా చర్చించారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ముఖ్యంగా చర్చ జరిగింది. 2030 కల్లా ద్వైపాక్షిక సంబంధాలను సుదృఢం చేసుకునే దిశగా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. తాను ప్రధాని అవడం పట్ల భారత్ నుంచి లభించిన అపూర్వ స్పందనను రిషి ప్రస్తావించారు. ఇందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. బ్రిటన్‌తో సంబంధాలకు భారత్ అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని చర్చల అనంతరం మోదీ వెల్లడించారు. ‘‘రిషితో భేటీ గొప్పగా సాగింది. వర్తకం, రక్షణ, భద్రత సహా పలు కీలక రంగాల్లో మరింత సన్నిహిత సంబంధాల దిశగా లోతుగా చర్చించాం’’ అంటూ ట్వీట్ చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, జర్మనీ చాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ సహా పలువురు దేశాధినేతలతో కూడా మోదీ వరుసగా భేటీ అయ్యారు.