Skip to main content

G20 summit : బంధం బలోపేతం.. జో బైడెన్‌తో ప్రధాని మోదీ చర్చలు

అమెరికాతో భారత సంబంధాలపై ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ లోతైన చర్చలు జరిపారు. సమీప భవిష్యత్తులో అత్యంత కీలకంగా మారనున్న పలు అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్, సాంకేతిక పరిజ్ఞానాల వంటి రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యం తాలూకు పురోగతిని సమీక్షించారు.

రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధంపైనా చర్చించారు. జీ 20 సదస్సు సందర్భంగా ఇద్దరు నేతలు నవంబర్‌ 15న (మంగళవారం) విడిగా సమావేశమయ్యారు. అంతర్జాతీయ, ప్రాంతీయ పరిణామాలపైనా బైడెన్‌తో మోదీ చర్చించినట్టు విదేశాంగ శాఖ వెల్లడించింది. 
‘‘క్వాడ్, ఐ2యూ2 తదితర నూతన గ్రూపుల్లో భారత్, అమెరికా సన్నిహిత సంబంధాల పట్ల ఇరువురూ సంతృప్తి వెలిబుచ్చారు. ఇండో–యూఎస్‌ బంధాన్ని బలోపేతం చేసేందుకు మద్దతుగా నిలుస్తున్నందుకు బైడెన్‌కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఏడాది భారత సారథ్యంలో జరిగే 18వ జీ 20 సదస్సు సందర్భంగా కూడా ఈ సహకారం ఇలాగే కొనసాగుతుందని విశ్వాసం వెలిబుచ్చారు’’ అని వివరించింది. ఇరువురి మధ్య ప్రయోజనాత్మక చర్చలు జరిగినట్టు విదేశాంగ శాఖ తెలిపింది. గత వారం కాంబోడియా రాజధాని నాంఫెన్‌లో ఆసియాన్‌ ఇండియా శిఖరాగ్రం సందర్భంగా భారత, అమెరికా విదేశాంగ మంత్రులు  చర్చలు జరపడం తెలిసిందే. 

సునాక్‌తో మోదీ ముచ్చట్లు  

Rishi Sunak


ఆక్టోబర్‌–2022లో బ్రిటన్‌ ప్రధానిగా ఎన్నికై, ఆ ఘనత సాధించిన తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్ర సృష్టించిన రిషి సునాక్‌తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. బాలిలో జీ 20 సదస్సు సందర్భంగా ఇరువురు నేతలు కాసేపు ముచ్చటించారు. సునాక్‌ పీఎం అయ్యాక వారిరువురూ భేటీ కావడం ఇదే తొలిసారి. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్, ఇండోనేíషియా అధ్యక్షుడు జోకో విడొడొ, ఇతర దేశాధినేతలు, ఐఎంఎఫ్‌ చీఫ్, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు తదితరులతోనూ మోదీ ముచ్చటించారు. 

జిన్‌పింగ్‌తో కరచాలనం 
జీ 20 సదస్సు సందర్భంగా బాలిలో మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ కరచాలనం చేసుకోవడం దేశాధినేతలతో సహా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇండోనేíషియా అధ్యక్షుడు ఏర్పాటు చేసిన స్వాగత విందు ఇందుకు వేదికైంది. అటుగా వెళ్తున్న జిన్‌పింగ్‌ ఆగి మోదీకి షేక్‌హ్యాండిచ్చారు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకుంటూ కని్పంచారు. భారత్, చైనా మధ్య కొన్నేళ్లుగా ఉద్రిక్తతలు పెరగడం తెలిసిందే. 

2020లో గాల్వన్‌ లోయలో చైనా సైన్యం భారత సైనికులపై దొంగ దెబ్బ తీసి 20 మందికి పైగా పొట్టన పెట్టుకున్న తీరుపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలొచ్చాయి. అప్పటినుంచీ మోదీ, జిన్‌పింగ్‌ల ముఖాముఖి జరగలేదు. సెపె్టంబర్‌లో షాంఘై కో ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ వార్షిక శిఖరాగ్రం సందర్భంగా ఇరువురూ కలుసుకున్నారు.

Published date : 16 Nov 2022 04:52PM

Photo Stories