Skip to main content

New Virus in China:మళ్లీ కొత్త వైరస్‌? ..అసలు సంగతి ఇదే.. ఊపిరి పీల్చుకుంటున్న స‌మ‌యంలోనే..

ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేసే వార్త, కథనాలు మరోసారి తెర మీదకు వచ్చాయి. చైనా నుంచి మరో వైరస్‌ పుట్టుకొచ్చిందని, కాదు కాదు కరోనాలోనే కొత్త వేరియెంట్‌ విజృంభిస్తోందని.. హడలెత్తించే పోస్టులు సోషల్‌ మీడియాలోనూ దర్శనమిచ్చాయి.
new virus in china
new virus in china

ఈ తరుణంలో కరోనా లెక్కలతో దోబుచులాడుతున్న చైనాలో అసలేం జరుగుతుందనే విషయాన్ని కొన్ని రహస్య దర్యాప్తు మీడియా విభాగాలు బయటపెట్టే ప్రయత్నం చేశాయి.   

అనేక ప్రాంతాల్లో లాక్‌డౌన్‌లు..
ఈశాన్య చైనాలోని జిలిన్ ప్రావిన్స్‌లో ఉన్న చాంగ్‌చున్ పట్టణంతోపాటు, అనేక ప్రాంతాల్లో ఇటీవల లాక్‌డౌన్‌లు విధించారు. ఒక్క చాంగ్‌చున్ పట్టణ పరిధిలో దాదాపు 90 లక్షల మంది నివసిస్తున్నారు. కరోనా వైరస్‌  వెలుగు చూశాక వుహాన్‌ లాక్‌డౌన్‌ తర్వాత.. ఈ రేంజ్‌లో భారీగా లాక్‌ డౌన్‌ విధించడం ఇదే కావడం గమనార్హం. ఈ సిటీలో ప్రస్తుతం లాక్‌డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు అన్నీ మూతపడ్డాయి. రెండు రోజులకు ఒకసారి, ఇంటి నుంచి ఒక్కరు మాత్రమే బయటకు రావడానికి అనుమతిస్తున్నారు. ఈ విషయాలన్నీ చైనా అధికారిక మీడియా సంస్థ కూడా ధృవీకరించింది.

అసలు విషయం ఇదే.. 
ఈ తరుణంలో ప్రస్తుతం విజృంభిస్తోంది కరోనా వైరస్సేనని, అందులో శరవేగంగా వ్యాపించిన ఒమిక్రాన్‌ వేరియెంట్‌ కేసులేనని స్పష్టత ఇచ్చాయి ఇండిపెండెంట్‌ మీడియా హౌజ్‌లు. గడిచిన వారం రోజుల్లోనే వెయ్యికిపైగా కేసులు నమోదు కావడంతో అక్కడి ప్రభుత్వం లాక్‌డౌన్ విధించారట. శుక్రవారం ఒక్కరోజే వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదుకాగా, చాంగ్‌చున్‌లో దాదాపు నాలుగు వందల కేసులు, జిలిన్ ప్రాంతంలోనే 98 కేసులు నమోదయ్యాయి. బయటి ప్రపంచానికి తెలిసి.. సుమారు రెండేళ్ల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా.. శుక్రవారం నాడు నమోదైన కేసుల్లో.. అత్యధికంగా న్యూజిలాండ్‌ తొలిస్థానంలో ఉంది. చైనాలో మాత్రం 1,369 కేసులు నమోదు అయ్యాయి. వీటిలో చాలావరకు ఒమిక్రాన్‌ కేసులే ఉన్నాయి. దీంతో ప్రతీ ముగ్గురిలో ఒకరికి కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో..

ఊపిరి పీల్చుకుంటున్న స‌మ‌యంలోనే..
చైనాలో కొత్త వైరస్‌, వేరియెంట్‌ వార్త‌లతో ఆందోళ‌న‌కు గురయ్యాయి. అయితే చైనాలో విజృంభిచేది ఒమిక్రాన్‌ వేరియెంట్‌ అని, ప్రమాదకరమైంది కాదని సైంటిస్టులు ఊరట ఇస్తున్నారు. భారత్‌లో మరో వేవ్‌ కష్టమేనని, అయినా అప్రమత్తంగా ఉండడం మంచిదన్న సంకేతాలు ఇటీవలె వైద్య నిపుణులు ఇచ్చిన సంగతీ తెలిసిందే. 

ప్రపంచం నివ్వెరపోయిందిలా..
గత కొన్ని రోజులుగా చైనాలో రోజువారీ అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. గ్వాంగ్‌ డాంగ్, జిలిన్, షాన్‌ డాంగ్ ప్రావిన్సులలో మెజారిటీ కేసులు నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు. వింటర్‌ ఒలింపిక్స్‌ నేపథ్యంలో కట్టడి ద్వారా కేసుల్ని నియంత్రించుకోగలిగింది చైనా. అయితే జీరో కోవిడ్‌ టోలరెన్స్‌ పేరిట దారుణంగా వ్యవహరించిన దాఖలాలు చూసి ప్రపంచం నివ్వెరపోయింది. వింటర్‌ ఒలింపిక్స్‌ ఈవెంట్స్‌ ముగిశాక జనసంచారం పెరిగిపోవడంతో ఇప్పుడు కేసులు మళ్లీ పెరుగుతున్నాయి అంతే. మరోవైపు హాంకాంగ్‌లో కూడా భారీగా కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయట‌. దీంతో ఆయా ప్రాంతాల్లో ప‌రిస్థితికి త‌గ్గ‌ట్లుగా అధికారులు ఆంక్ష‌ల‌ను అమ‌లు చేస్తున్నారు. ఇది అసలు సంగతి.

Published date : 12 Mar 2022 10:35AM

Photo Stories