Pakistan-Iran: పాక్ ఉగ్రస్థావరాలపై ఇరాన్ దాడులు
దీంతో ఇప్పటికే హమాస్–ఇజ్రాయెల్ యుద్ధంతో ఉద్రిక్తతలు పెరిగిన పశ్చిమాసియాలో పరిస్థితి మరింత దిగజారింది. దీంతో ఇన్నాళ్లూ దౌత్య సంబంధాలు మాత్రమే కొనసాగుతున్న పాకిస్తాన్, ఇరాన్‌ల మధ్య ఒక్కసారిగా వైరం ప్రజ్వరిల్లింది.
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని గ్రీన్ మౌంటేన్ పర్వతప్రాంతంలోని జైష్ అల్ అదిల్(ఆర్మీ ఆఫ్ జస్టిస్) సంస్థకు చెందిన రెండు స్థావరాలపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ బలగాలు డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు గాయపడ్డారు. ఇరాన్ విదేశాంగ మంత్రితో పాక్ ఆపద్ధర్మ ప్రధాని అన్వరుల్లా దావోస్ నగరంలో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో మంతనాలు జరిపిన రోజే ఈ దాడులు జరిగాయి.
ఇరాన్ రాయబారిపై వేటు..
జైష్ అనేది 2012లో పాక్‌లో నెలకొల్పిన సున్నీ ఉగ్రసంస్థ. ఇరాన్‌లో జైష్ తరచూ ఇరాన్ భద్రతాబలగాలపై దాడులకు దిగుతోంది. సైనికులను అపహరిస్తూ ఇరాన్ ప్రభుత్వానికి పెద్దతలనొప్పిగా తయారైంది. పాక్ సరిహద్దు పట్టణం పంజ్‌ఘర్ కేంద్రంగా పనిచేస్తూ జైష్ దాడులకు దిగుతోందని ఇప్పటికే పలుమార్లు ఇరాన్ ఆరోపించింది. ఈనెలలో సున్నీ ఉగ్రసంస్థ ఒకటి సైనిక జనరల్ సులేమానీ సంస్మరణ సభలో జంట ఆత్మాహుతి దాడులకు పాల్పడి వంద మందిని బలితీసుకున్నారు.
China Population: రెండో ఏడాది కూడా తగ్గిన చైనా జనాభా.. కారణం ఇదే..
దీంతో సున్నీ ఉగ్రసంస్థలపై ఉక్కుపాదం మోపాలని ఇరాన్ నిశ్చయించుకుంది. అందులోభాగంగానే పాక్‌లోని జైష్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. అయితే తమ భూభాగంపై విదేశీ దాడిని పాకిస్తాన్ తీవ్రంగా ఆక్షేపించింది. పాక్‌లోని ఇరాన్ మంత్రిత్వశాఖ ఉన్నతాధికారిని పిలిపించుకుని తన నిరసన వ్యక్తంచేసింది.
తమ దేశంలోని ఇరాన్ రాయబారిని బహిష్కరించింది. ఇరాన్‌లోని తమ రాయబారిని వెనక్కి పిలిపించుకుంది. ‘పాక్ గగనతలాన్ని అనుమతిలేకుండా వినియోగించడం, దుర్వినియోగం చేయడం ద్వారా ఇరాన్ అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించింది. ఇది పాక్ సార్వబౌమత్వాన్ని అవమానించడమే. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలను అపహాస్యం చేస్తూ ఇలా దాడులకు దిగడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. దీని తీవ్ర పరిణామాలను ఇరాన్ ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని పాక్ ఆగ్రహం వ్యక్తంచేసింది.
ఇరాన్ ఆర్మీ అధికారి కాల్చివేత..
జైష్ ఉగ్రస్థావరాలపై దాడి జరిగిన మరుసటి రోజే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అధికారిని ఉగ్రవాదులు కాల్చిచంపారు. పాక్, అఫ్గానిస్తాన్‌లతో సరిహద్దు పంచుకుంటున్న సిస్తాన్–బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఈ ఉగ్రదాడి ఘటన జరిగిందని ఇరాన్ అధికార వార్తా సంస్థ ఐఆర్‌ఎన్‌ఏ జనవరి 17వ తేదీ (బుధవారం) తెలిపింది.