WHO: ప్రపంచ కోవిడ్ మరణాలు 1.5 కోట్లు.. ఒక భారత్‌లోనే..
భారత్‌లో కోవిడ్ మరణాలు 47 లక్షలని తెలిపింది. అయితే సంస్థ ప్రకటనను భారత్ అంగీకరించలేదు. మరణాల లెక్కింపునకు సంస్థ అనుసరించిన పద్ధతులపై భారత్ అభ్యంతరం తెలియజేసింది. తమ లెక్కల ప్రకారం ప్రపంచంలో జనవరి 2020 ఆరంభం నుంచి 2021 డిసెంబర్ చివరకు మరణించినవారి సంఖ్య 1.33– 1. 66 కోట్లు ఉంటుందని, సరాసరిన తీసుకుంటే ఈ సంఖ్య 1.49 కోట్లని డబ్లు్యహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ తెలిపారు. ఈ గణాంకాలు ప్రభుత్వాలకు ఆరోగ్యవ్యవస్థ మెరుగుపరచాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయన్నారు. ఈ లెక్కలో కరోనా సోకి చనిపోయినవారితో పాటు ఆరోగ్యవ్యవస్థ, సమాజంపై కరోనా ప్రభావం వల్ల మరణించినవారు కూడా ఉన్నారు. ఈ పరోక్ష మరణాలు దక్షిణాసియా, యూరప్, అమెరికాలో అధికమని సంస్థ తెలిపింది. ఇండియాలో ఈ లెక్క 47, 40,894గా సంస్థ ప్రకటించింది. తమ గణాంకాలు భారత అధికారిక గణాంకాలతో భిన్నంగా ఉండొచ్చని తెలిపింది. అయితే సంస్థ మరణాల లెక్కింపునకు వాడిన పద్ధతులు సరైనవి కావని, ఈ లెక్కపై తమ అభ్యంతరాలను సంస్థకు తెలియజేస్తామని భారత ఆరోగ్య శాఖ తెలిపింది. భారత అధికార లెక్కల ప్రకారం దేశంలో నమోదైన మొత్తం మరణాలు 2019లో 76.4 లక్షలు కాగా 2020లో 6.2 శాతం పెరిగి 81.2 లక్షలకు చేరాయి. ఈ పెరుగుదలకు కేవలం కరోనా కారణం కాదని నీతీఆయోగ్ సభ్యుడు పాల్ చెప్పారు. అధికారిక లెక్కల ప్రకారం ఒక్క 2020లో ఇండియాలో 1.49 లక్షల కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. కానీ ప్రపంచ కోవిడ్ మరణాల్లో మూడింట ఒకవంతు భారత్‌లో సంభవించినట్లు సంస్థ గణాంకాలు చూపుతున్నాయి.