Khandavavanam Forest: ఖాండవవనం దహనానికి సహాయం చేసిన కృష్ణార్జునులు
ఒకరోజు కృష్ణార్జునులు వనవిహారం చేస్తుండగా, ఒక బ్రాహ్మణుడు వారి వద్దకు వచ్చాడు. వారు అతడికి అర్ఘ్యపాద్యాలు సమర్పించి, సత్కరించారు. కుశల ప్రశ్నలయ్యాక ఏం కావాలని ప్రశ్నించారు.‘అయ్యా! నాకు బాగా ఆకలిగా ఉంది. భోజనం పెట్టించగలరా?’ అని అడిగాడు.‘విప్రోత్తమా! మీకు ఏమేమి ఇష్టమో చెప్పండి. వండించి పెడతాం’ అన్నారు కృష్ణార్జునులు. అప్పుడా బ్రాహ్మణుడు తన నిజరూపంలో అగ్నిదేవుడిగా వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. ‘నేను అగ్నిదేవుడిని. ఔషధమూలికలు పుష్కలంగా ఉన్న ఖాండవవనాన్ని నేను దహించాలి. అప్పుడు గాని నా అజీర్తిబాధకు ఉపశమనం కలగదు.
Bela Mitra: నేతాజీకి అండగా నిలిచిన మహిళా సేనాని బేలా
కృష్ణార్జునుల శరణు కోరిన అగ్నిదేవుడు
అయితే, నేను ఖండవవనాన్ని దహించకుండా దేవేంద్రుడు ఆటంకం కలిగిస్తున్నాడు. మీరిద్దరూ తోడుంటే, ఖాండవాన్ని దహించివేస్తాను’ అన్నాడు.‘స్వామీ! అమితశక్తిమంతులు మీరు. మీకు అజీర్తిబాధ కలగడమా? ఆశ్చర్యంగా ఉందే!’ అన్నాడు అర్జునుడు.‘చాలాకాలం కిందట శ్వేతకి అనే రాజర్షి వందేళ్ల సత్రయాగం చేయ సంకల్పించాడు. అన్నేళ్లు ఏకధాటిగా రుత్విక్కుగా ఉండేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దాంతో అతడు ఈశ్వరుని కోసం తపస్సు చేసి, ఆయనను మెప్పించాడు. శ్వేతకి తన సంకల్పం చెప్పడంతో ఈశ్వరుడు దుర్వాస మహర్షిని అతడికి యాజ్ఞికుడిగా నియమించాడు. దుర్వాసుడి ఆధ్వర్యంలో శ్వేతకి నిరాఘాటంగా వందేళ్లు సత్రయాగం చేశాడు. యజ్ఞగుండంలో విడిచిన నేతిధారలను నేను అన్నేళ్లూ ఆరగించాను. అందువల్ల నాకు అజీర్తి పట్టుకుంది.
నివారణ కోసం బ్రహ్మ వద్దకు వెళితే, ఖాండవవనంలో పుష్కలంగా ఔషధ మూలికలు ఉన్నాయి. వాటిని ఆరగిస్తే, అజీర్తి నయమవుతుందని సెలవిచ్చాడు. ఖాండవ దహనానికి నేను ఎన్నిసార్లు ప్రయత్నించినా, ఇంద్రుడు అడ్డుకుంటూ వస్తున్నాడు’ అని అగ్నిదేవుడు గోడు వెళ్లబోసుకున్నాడు. ‘దేవా! నీకు మేము సహాయం చేయగలం గాని, ఇప్పుడు మా వద్ద ఆయుధాలేవీ లేవు’ అన్నాడు అర్జునుడు. ‘మీకా చింత వద్దు’ అంటూ అగ్నిదేవుడు వెంటనే వరుణ దేవుడిని పిలిచాడు. వరుణుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు.‘వరుణదేవా! నీకు బ్రహ్మదేవుడు ఇచ్చిన ధనుర్బాణాలను, రథాన్ని అర్జునుడికి ఇవ్వు. చక్రాన్ని, గదను కృష్ణుడికి ఇవ్వు’ అన్నాడు.వరుణుడు సరేనంటూ, కృష్ణార్జునులకు ఆయుధాలను, రథాన్ని ఇచ్చాడు. కృష్ణార్జునులను తనకు తోడుగా తీసుకువెళ్లి, అగ్నిదేవుడు ఖాండవవనాన్ని దహించడం మొదలుబెట్టాడు.
Yadadri Temple History: యాదాద్రి దివ్యక్షేత్రం.. చరిత్రలో నిలిచేలా..
ఇంద్రుడుతో అర్జునుడి యద్దం
కృష్ణార్జునులు ఇరువైపులా అగ్నిదేవుడికి రక్షణగా నిలిచారు. అడ్డు వచ్చిన వనరక్షకులను సంహరించారు. అడవిలోని పశుపక్ష్యాదులన్నీ అగ్నిజ్వాలలకు ఆహుతి కాసాగాయి.ఇంద్రుడికి ఈ సంగతి తెలిసి, ఖాండవవనం మీద కుంభవృష్టి కురవాలంటూ మేఘాల దండును పంపాడు. ఖాండవంపై మేఘాలు కమ్ముకోగానే, అర్జునుడు తన బాణాలతో ఖాండవ వనమంతా కప్పేస్తూ పైకప్పును నిర్మించాడు.మేఘాలు కుంభవృష్టి కురిసినా, ఖాండవంపై చినుకైనాకురవలేదు. అగ్నిదేవుడికి ఎలాంటి ఆటంకం ఏర్పడలేదు.అగ్నికీలల నుంచి రక్షించుకోవడానికి తక్షకుడి కొడుకైన అశ్వసేనుడు తల్లి తోకను పట్టుకుని ఆకాశంలోకి ఎగిరాడు. అర్జునుడు అశ్వసేనుడిని బాణాలతో కొట్టాడు. అది చూసి ఇంద్రుడు అర్జునుడితో తలపడ్డాడు. అర్జునుడిపై మోహినీ మాయ ప్రయోగించి, అశ్వసేనుడిని, అతడి తల్లిని కాపాడాడు.
Dholpur-Karauli Tiger Reserve: ధోల్‌పూర్-కరౌలీ టైగర్ రిజర్వ్‌కు ఆమోదం
నిమిషంలోనే తేరుకున్న అర్జునుడు వెంటనే ఇంద్రుడిపై తిరగబడ్డాడు. చాలాసేపు యుద్ధం సాగింది. తనను తాను కాపాడుకోవడానికి ఇంద్రుడు యుద్ధం కొనసాగిస్తూ ఉండగా, ‘దేవేంద్రా! వీరిద్దరూ నరనారాయణులు. వీరిని జయించడం నీకు అసాధ్యం.తక్షకుడు తప్పించుకుని కురుక్షేత్రానికి పారిపోయాడు’ అని అశరీరవాణి పలికింది. చేసేదేమీ లేక ఇంద్రుడు తిరిగి స్వర్గానికి బయలుదేరాడు. ఖాండవదహనం సాగుతుండగా, సముచి అనే రాక్షసుడి కొడుకైన మయుడు అర్జునుడిని శరణుజొచ్చి ప్రాణాలను దక్కించుకున్నాడు. మయుడితో పాటు అతడి తల్లి, మందపాలుడు, అతడి కొడుకులైన నలుగురు శారఙ్గకులు కూడా ప్రాణాలు దక్కించుకున్నారు.అగ్నిదేవుడు పదిహేను రోజుల పాటు ఖాండవవనాన్ని సమూలంగా దహించి, తన ఆకలి తీర్చుకున్నాడు. అగ్నిదేవుడి అజీర్తిబాధ నయమైంది. తనకు సహకరించిన కృష్ణార్జునులకు కృతజ్ఞతలు తెలిపి తన దారిన వెళ్లిపోయాడు.