Skip to main content

Yadadri Temple History: యాదాద్రి దివ్యక్షేత్రం.. చరిత్రలో నిలిచేలా..

యాదగిరి నరసింహుని దివ్యదర్శనం ఆరేళ్ల తర్వాత భక్తులకు లభించనుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా యాదాద్రి పంచ నారసింహ క్షేత్రానికి సర్వాంగ సుందరంగా పునర్నిర్మాణం జరిపించింది.
Yadadri Temple
Yadadri Temple

పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే రీతిలో వివిధ ఆలయాల శిల్పకళా శైలీవిన్యాసాలన్నీ ఒకేచోట కొలువుదీరేలా ప్రపంచస్థాయి క్షేత్రంగా ఈ దివ్యధామాన్ని నేత్రపర్వంగా తీర్చిదిద్దారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తొలిభక్తునిగా పూజలు జరిపించిన‌ తర్వాత.. భక్తులకు నరసింహుని దర్శన అవ‌కాశం క‌ల్పించారు.  యాదాద్రి దివ్యక్షేత్రం పునఃప్రారంభం అయిన‌ సందర్భంగా ఈ ప్రత్యేక కథనం..

ఆలయ పునర్నిర్మాణం కోసం ఏకంగా..

Yadadri Temple Construction


యాదాద్రిలో వెలసిన పంచ నారసింహక్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. జ్వాలా నారసింహుడు, గండభేరుండ నారసింహుడు, యోగ నారసింహుడు, ఉగ్ర నరసింహుడు, లక్ష్మీనరసింహుడు స్వయంభువులుగా వెలసిన ఈ దివ్యక్షేత్రాన్ని దేశంలోని ఇతర దివ్యక్షేత్రాల్లోని మరే ఆలయానికీ తీసిపోని రీతిలో వివిధ శిల్పకళా శైలుల వైభవం ఒకేచోట భక్తులకు కనువిందు చేసేలా అత్యంత అపురూపంగా, అనన్యసామాన్యంగా నిర్మాణాన్ని పూర్తిచేశారు. ఈ నిర్మాణంలో శ్రేష్ఠమైన కృష్ణశిలదే సింహభాగం. ఆలయ పునర్నిర్మాణం కోసం ఏకంగా 9.5 లక్షల ఘనపు మీటర్ల (2.5 లక్షల టన్నులు) కృష్ణశిలను వినియోగించారు.


ఆధారశిల నుంచి శిఖరం వరకు పూర్తిగా కృష్ణశిలను వినియోగించారు. ఆధునికకాలంలో ఇలా పూర్తిగా కృష్ణశిలతో ఆలయ నిర్మాణం చేపట్టడం విశేషం. విమాన గోపురాన్ని ద్రవిడ శిల్పకళారీతిలోను, అష్టభుజి మండపంలోని గోపురాలను పల్లవ శైలిలోను రూపొందించారు. కాకతీయ వైభవాన్ని తలపిస్తూ ముఖమంటపాలను కాకతీయ శైలిలో నిర్మించారు. పదిమంది స్థపతులు, ఎనిమిదివందల మంది శిల్పులు ఆలయ మండపాలు, గోపురాలపై 541 దేవతారూపాలను, 58 యాలీ పిల్లర్లను అత్యంత నైపుణ్యంతో తీర్చిదిద్దారు. ఆలయ నిర్మాణం, శిల్పాల రూపకల్పనలో రఘునాథ పాత్రో, ముత్తయ్య స్థపతి, సౌందరరాజన్, డాక్టర్‌ ఆనందాచారి వేలు వంటి నిష్ణాతులు పాల్గొన్నారు. ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన కృష్ణశిల ఏళ్లు గడిచేకొద్ది మరింత నునుపుదేలి, నాణ్యతను సంతరించుకుంటుంది.

దేశంలో ఇదే తొలిసారి..
ఆలయ పునర్నిర్మాణం కోసం భారీస్థాయిలో కృష్ణశిల అవసరం కావడంతో రాష్ట్ర గనులశాఖ అధికారులు, ఇతర నిపుణులు దేశమంతటా పర్యటించి, నాణ్యమైన కృష్ణశిలను గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రకాశం జిల్లా గురుజపల్లిలో నాణ్యమైన కృష్ణశిల లభించడంతో, ఆలయ నిర్మాణానికి అవసరమైన మొత్తం శిలను ఆ గ్రామంలోని ఒకే క్వారీ నుంచి సేకరించారు. రాళ్ల నాణ్యతను ‘నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ సిమెంట్‌ అండ్‌ బిల్డింగ్‌ మెటీరియల్‌’ సంస్థ, వాటితో చెక్కిన శిల్పాల నాణ్యతను ‘మెస్సెర్స్‌ సివిల్స్‌ ఇంజినీర్స్‌’ సంస్థలు పరిశీలించి, ధ్రువీకరించాయి. ఆలయ నిర్మాణానికి సంబంధించి ఇలాంటి పరీక్షలు నిర్వహించడం దేశంలో ఇదే తొలిసారి కావడం విశేషం. యాదాద్రి ఆలయాన్ని శ్రీవైష్ణవ సంప్రదాయానికి అనుగుణంగా తీర్చిదిద్దారు.


శ్రీవైష్ణవ భక్తిసంప్రదాయాన్ని ప్రచారం చేసిన పన్నెండు మంది ఆళ్వార్ల విగ్రహాలను, రెండో అంతస్తులో కాకతీయ స్తంభాలు, అష్టభుజి మండపాలు, మాడవీథులు, పురవీథుల ప్రాకారాలు, త్రితల, పంచతల, సప్తతల, మహారాజ గోపురాలు, విమాన గోపురాలు– ఇలా ఆలయంలోని ప్రతి నిర్మాణంలోనూ అణువణువునా విష్ణుతత్త్వం ప్రతిఫలించేలా రూపొందించారు. ఆలయ పునర్నిర్మాణం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ సైతం దేశంలోని అనేక శిల్పకళారీతులను స్వయంగా అధ్యయనం చేశారు. వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు, ఈవో గీతారెడ్డి, ఇతర అధికారులు దేశవ్యాప్తంగా సంచరించి, వివిధ ఆలయ శిల్పరీతులను పరిశీలించి వచ్చారు. చెన్నై, మహాబలిపురం, ఆళ్లగడ్డ తదితర ప్రాంతాల నుంచి దాదాపు రెండువేల మంది శిల్పులు యాదాద్రి పునర్నిర్మాణంలో అహరహం శ్రమించారు. 

గుట్టకు మరో గుట్ట..

Temple


ఇది వరకు యాదాద్రి చుట్టూ కలిపి 14 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. ఇప్పుడు దీనికి ఇంకో గుట్టను జోడించి, మరో మూడెకరాలను కలిపారు. ఉపరితలం నుంచి ఎనభై అడుగుల ఎత్తువరకు ఉన్న కొండను కాంక్రీటుతో నింపకుండా, సహజసిద్ధంగా ఉండేలా మట్టితో ఎనభై అడుగుల ఎత్తు వరకు నింపి, మూడెకరాలను విస్తరించారు. మహాయజ్ఞంలా సాగిన ఈ ప్రక్రియకు ఏడాదిన్నర పట్టింది. కొండ కోసం తరలించిన మట్టి, రాళ్లు కూలిపోకుండా పటిష్ఠంగా ఉండేందుకు ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టారు. కొత్తగా విస్తరించిన కొండభాగం పటిష్ఠతను, నాణ్యతను జేఎన్టీయూ, ‘నిట్‌’ నిపుణులు పరీక్షించారు. చలికాలంలో, ఎండాకాలంలోనే కాకుండా భారీగా వర్షాలు కురిసినప్పుడు కొత్తగా జోడించిన కొండ ఎలా ఉంటుందనే దానిపై క్షుణ్ణంగా అధ్యయనం చేశారు.

ఆలయ నిర్మాణమంతా..
రెండు సీజన్లలో భారీ వర్షాలు పడినప్పటికీ, కొత్తగా జోడించిన కొండ ఏమాత్రం చెక్కుచెదరలేదు. భారీ వాహనాలు, క్రేన్లు వంటి వాటితో కూడా పరీక్షలు జరిపినా ఎలాంటి సమస్యలూ తలెత్తకపోవడంతో, కొన్ని వందల ఏళ్ల వరకు కొండ మనుగడకు ఎలాంటి ఢోకా ఉండదని నిపుణులు తేల్చారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి సీఎం కేసీఆర్‌ దాదాపు 2,400 డ్రాయింగ్‌లను పరిశీలించి, ప్రస్తుత రూపాన్ని ఆమోదించారు. మొత్తం ఆలయ నిర్మాణమంతా యాదగిరిగుట్ట ఆలయాభివృద్ధి ప్రాధికార సంస్థ (వైటీడీఏ) ఆధ్వర్యంలో జరిగింది.

ఆల‌య వ్యయం రూ.1200 కోట్లు..
వైటీడీఏ చైర్మన్‌గా సీఎం వ్యవహరిస్తుండగా, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి కిషన్‌రావు వైస్‌చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణాన్ని రూ.1800 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టగా, వ్యయం రూ.1200 కోట్లకు పరిమితమైంది. ఇందులో భూసేకరణ కోసమే ప్రధాన వ్యయం జరిగింది. దాదాపు రెండువేల ఎకరాల భూమిని సేకరించారు. ప్రధాన ఆలయ పునర్నిర్మాణానికి రూ.250 కోట్లు ఖర్చు చేశారు. రోడ్లు, కాటేజీల నిర్మాణం, ల్యాండ్‌స్కేపింగ్‌ వంటి వాటికి భారీగా ఖర్చు చేశారు. రోజుకు నలభైవేల మంది భక్తులు వచ్చినా, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 15 వీవీఐపీ కాటేజీలను నిర్మించారు. దాతల సహకారంతో 252 వీఐపీ కాటేజీలను నిర్మించనున్నారు. 

ఆలయ పునర్నిర్మాణంలో ఎక్కడా సిమెంటు వాడలేదు.. పూర్తిగా..

Temple


ఆధునిక నిర్మాణాల్లో రాళ్లు, ఇటుకలను జోడించి, వాటిని దృఢంగా నిలపడానికి సిమెంటు వాడటం మామూలే! అయితే, యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో ఎక్కడా సిమెంటు వాడలేదు. పూర్తిగా సంప్రదాయ పద్ధతిలో సున్నం, కరక్కాయ, బెల్లం మిశ్రమంతో తయారు చేసిన గానుగ సున్నాన్నే ఉపయోగించారు. ఈ గానుగ సున్నం మిశ్రమం నాణ్యతను బెంగళూరులోని ‘బ్యూరో వెర్టీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ సంస్థ పరీక్షించి, ధ్రువీకరించింది. పెద్దపెద్ద జాయింట్ల వద్ద కొన్నిచోట్ల సీసాన్ని కూడా వాడారు.

Yadadri temple stones

ఆలయంలోని తలుపులకు వాడిన కలపకు సైతం క్షుణ్ణంగా నాణ్యత పరీక్షలు నిర్వహించిన తర్వాతే వాటిని అమర్చారు. బెంగళూరుకు చెందిన ‘ఇండియన్‌ ప్లైవుడ్‌ ఇండస్ట్రీస్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌’ (ఐపీఐఆర్టీఐ) సంస్థ ఆధ్వర్యంలో కలప నాణ్యతపై పరీక్షలు నిర్వహించారు. కలప రకం, మందం, దారుఢ్యం, తేమను తట్టుకునే శక్తి వంటి లక్షణాలన్నింటినీ పరీక్షించి, ఉత్తమమైన కలపనే తలుపుల నిర్మాణం కోసం ఎంపిక చేశారు. 

యాదాద్రికి ఆనుకుని..
ఇప్పుడున్న యాదాద్రికి తోడుగా మరో 850 ఎకరాలలో టెంపుల్‌ సిటీని ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల వసతి సౌకర్యాల కోసం దాదాపు వెయ్యికి పైగా వసతి గృహాలను అక్కడ నిర్మించనున్నారు. తొలిదశలో 252 వీఐపీ కాటేజీలను ఒక్కొక్కటి రూ.1.50 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్నారు. వీటి దాతలు ఏడాదిలో ముప్పయి రోజులు ఈ వసతిగృహాల్లో ఉండవచ్చు. వీటికి తోడు 13.5 ఎకరాల్లో ప్రత్యేకంగా వీవీఐపీల కోసం ప్రెసిడెన్షియల్‌ సూట్ల పేరిట 15 కాటేజీలను నిర్మించారు. వీటి నిర్మాణానికి ఒక్కోదానికి ఏడు కోట్లు ఖర్చు చేశారు. ఇక గుట్ట కింద తులసి కాటేజీలో అదనంగా 120 గదులు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. ఇవి కాకుండా, ఇంకా ఫైవ్‌స్టార్‌ హోటళ్లు, కన్వెన్షన్‌ సెంటర్లు, పెండ్లి మండపాలు, ఆస్పత్రి, పాఠశాల వంటి వాటిని కూడా నిర్మించనున్నారు.

భక్తుల రాకపోకలకు వీలుగా..

Yadadri Temple Transport


వీటి నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. కొండపైన విష్ణుపుష్కరిణి, కొండ దిగువన లక్ష్మీ పుష్కరిణి, స్వామివారి తెప్పోత్సవం కోసం గండిచెరువు, కల్యాణ కట్ట, దీక్షాపరుల మండపం, నిత్యాన్నదాన సత్రం, సత్యనారాయణస్వామి వ్రతమండపం, ఆర్టీసీ, దేవస్థానం బస్టాండులు, గుట్ట చుట్టూ రెండు ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టారు. భక్తుల రాకపోకలకు వీలుగా ఐదువందల బస్సులు తిరిగేందుకు అనువుగా బస్‌ టెర్మినల్‌ను నిర్మిస్తున్నారు. యాదాద్రి చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటినీ అనుసంధానిస్తూ ఆరులేన్ల రహదారిని నిర్మించారు.

ఈ రహదారికి ఇరువైపులా అందమైన పూల మొక్కలను పెంచడంతో, ఈ మార్గం పూలవనాన్ని తలపిస్తుంది. ఈ మార్గంలో నాలుగుచోట్ల ఏర్పాటు చేసిన కూడళ్లలోనూ పూలమొక్కలను ఏర్పాటు చేశారు. గిరిప్రదక్షిణ చేయదలచుకున్న భక్తుల కోసం పన్నెండు అడుగుల వెడల్పుతో ప్రత్యేకమైన రోడ్డును నిర్మిస్తున్నారు. దాదాపు ఇరవైవేల మంది భక్తులు సులువుగా నడిచేందుకు వీలుగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో తయారుచేసిన అల్యూమినియం, ఇత్తడి క్యూలైన్లను ఏర్పాటు చేశారు. 

125 కిలోల బంగారంతో..

Gold


యాదాద్రి ప్రధాన ఆలయానికి సప్తగోపురాలను సర్వాంగ సుందరంగా మలచారు. ద్వితీయ ప్రాకారంలో నాలుగు దిక్కులా నాలుగు గోపురాలను, మూడు పంచతల గోపురాలను, ఒక సప్తతల మహారాజ గోపురాన్ని నిర్మించారు. పశ్చిమదిశలో మహారాజ గోపురాన్ని 85 అడుగుల ఎత్తున, ఒక్కో పంచతల గోపురాన్నీ 57 అడుగుల ఎత్తున, తూర్పు గోపురం నుంచి ముఖమండపానికి వెళ్లే దారిలో 30.8 అడుగుల ఎత్తున త్రితల గోపురాన్ని, గర్భాలయంపైన విమాన గోపురాన్ని నిర్మించారు. విమానగోపురానికి భక్తుల విరాళాలతో 125 కిలోల బంగారు తాపడం చేయిస్తున్నారు. బ్రహ్మోత్సవాలు ముగిసే నాటికి భక్తుల నుంచి రూ.17.59 కోట్ల నగదు, ఐదు కిలోల బంగారం వచ్చింది. 

దర్శన మార్గం ఇలా..
గర్భగుడిలోని స్వామివారిని దర్శించుకున్న తర్వాత భక్తులు పశ్చిమ గోపురం నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. సరిగ్గా గర్భాలయంపైన విమాన గోపురం ఉంటుంది. ప్రధాన ఆలయంలోకి ప్రవేశించగానే మొదటగా క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామి, గండభేరుండ నారసింహుడు దర్శనమిస్తారు. గర్భాలయానికి ఎదురుగా బలిపీఠం, ధ్వజస్తంభం, గరుత్మంతుని విగ్రహం, స్వామివారి ఎదుట భారీ దర్పణం, గర్భగుడికి పక్కన ఆండాళ్‌ అమ్మవారు, శయన మండపం, మెట్ల వెంబడి గరుత్మంతుని విగ్రహాలు, ఆలయంలో వెలుగులు విరజిమ్మే షాండ్లియర్లు, రాజస్థానీ పద్మాలు భక్తులకు కనువిందు చేస్తాయి.

స్వామివారి ప్రధాన ఆలయం రెండో అంతర ప్రాకారాల వద్ద నాలుగు వైపులా నాలుగు మండపాలను నిర్మించారు. ఆగ్నేయంలో స్వామివారి కైంకర్యాల కోసం ఏర్పాటు చేసిన రామానుజకూటం మండపం ఉంటుంది. ఈశాన్యంలో నిత్యకల్యాణ మండపాన్ని ఏర్పాటు చేశారు. రెండో బాహ్య ప్రాకారం వద్ద నాలుగు దిక్కుల్లో అష్టభుజి మండపాలను నిర్మించారు. స్వామివారి గర్భగుడి ఎదురుగా ఉండే ముఖమండపాన్ని 150 మందికిపైగా కూర్చునేందుకు అనువైన వేదికగా ఏర్పాటు చేశారు. ప్రధానాలయంలోకి అడుగుపెడుతూనే భక్తులు ఆధ్యాత్మిక అనుభూతికి లోనయ్యేలా లోపలి వాతావరణాన్ని తీర్చిదిద్దారు.

గర్భగుడి గోడలపై స్వామివారి శంఖుచక్రనామాలు, పంచనారసింహ రూపాలు, ప్రహ్లాద చరిత్ర శిల్పాలు భక్తులను ఆకట్టుకుంటాయి.  గర్భాలయ ద్వారానికి ఇరువైపులా జయవిజయుల విగ్రహాలు భక్తులకు స్వాగతం పలుకుతాయి. మూడు ఉపాలయాలు, శయన మండపం, బలిపీఠం, బంగారు తాపడంతో ధ్వజస్తంభం, దర్పణం భక్తులకు కనువిందు చేస్తాయి. 

యాదాద్రి చరిత్ర..
చరిత్రను తరచి చూసుకుంటే, కాకతీయ రాజుల నుంచి నిజాం నవాబుల వరకు ఎందరో యాదగిరిగుట్ట ఆలయాన్ని దర్శించుకుని, ఆలయ అభివృద్ధికి బాటలు వేశారు. కాకతీయులు పదమూడో శతాబ్దిలో ఒక ఆయుర్వేద వైద్యునికి ఈ స్థలాన్ని దానంగా ఇచ్చినట్లు ప్రచారంలో ఉన్నా, అందుకు తగిన ఆధారాలు లేవు. యాదగిరిగుట్ట మండలం సైదాపురం వద్ద లభించిన శాసనాల్లో కాకతీయులు ఈ ఆలయ అభివృద్ధి కోసం చేసిన పనులు వెలుగులోకి వచ్చాయి. పదిహేనో శతాబ్దిలో శ్రీకృష్ణదేవరాయలు యాదాద్రిలో స్వామివారిని దర్శించుకున్నట్లు కొలనుపాకలో దొరికిన శాసనం ద్వారా తెలుస్తోంది. ఈ ప్రాంతంలో దొరికిన ఆరువందల సంవత్సరాల నాటి శాసనాలను ఆర్కియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా వారు భద్రపరచారు.

ఆళ్వార్ల మండపం.. ఆకట్టుకునేలా..
శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఆళ్వార్లకు ప్రత్యేక స్థానం ఉంది. వైష్ణవ భక్తిమార్గ ప్రచారకులుగా, స్వామివారి ప్రియభక్తులుగా ప్రఖ్యాతి పొందిన పన్నెండుమంది ఆళ్వార్లను వైష్ణవభక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో సేవించుకుంటారు. అందుకే యాదాద్రి ప్రధాన ఆలయంలో ఆళ్వార్ల మండపాన్ని  ఆకట్టుకునే రీతిలో ఏర్పాటు చేశారు. ఆళ్వార్ల మండపానికిపైన కాకతీయుల స్తంభాలను నిర్మించారు. ఒక్కో ఆళ్వార్‌ విగ్రహం, ఒక్కో కాకతీయ స్తంభం ఎత్తు 32 అడుగులు ఉంటాయి. పొయ్‌గయాళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్, పెరియాళ్వార్, తిరుమళిశైయాళ్వార్, కులశేఖరాళ్వార్, తిరుప్పొణాళ్వార్, తొండరడిప్పొడియాళ్వార్, తిరుమంగయాళ్వార్, మధురకవి ఆళ్వార్, ఆండాళ్, నమ్మాళ్వార్‌ విగ్రహాలను, తెలంగాణ శిల్పులు వెంకటకృష్ణ, పోతలూరు చారి, రాము తమ బృందంతో కలసి అద్భుతంగా తీర్చిదిద్దారు. 

పడమటి రాజగోపురం ముందుభాగంలో వేంచేపు మండపాన్ని నిర్మించారు. ప్రత్యేక ఉత్సవాల్లో ఊరేగింపు చేసేటప్పుడు స్వామివారిని భక్తుల సందర్శనార్థం ఇక్కడ కొద్దిసేపు అధిష్ఠింపజేస్తారు. తూర్పు రాజగోపురం ముందుభాగంలో బ్రహ్మోత్సవ మండపాన్ని నిర్మించారు. స్వామివారి బ్రహ్మోత్సవాల సమయంలో ఈ మండపాన్ని ఉపయోగిస్తారు. ఉత్సవమూర్తులను బ్రహ్మోత్సవ మండపంలో అధిష్ఠింపజేసి, ఉత్సవ పర్వాలను నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలకు మాత్రమే కాకుండా సహస్ర దీపాలంకరణ కోసం కూడా ఈ మండపాన్ని వినియోగించేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అరుదుగా అతికొద్ది ఆలయాల్లో మాత్రమే కనిపించే అష్టభుజి ప్రాకార మండపాన్ని యాదాద్రిలోనూ నిర్మించారు. అష్టభుజి ప్రాకార మండపం పైభాగంలో సాలహారాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో కేశవమూర్తులు, నవ నారసింహులు, ఆళ్వార్లు, అష్టదిక్పాలకులు, అష్టలక్షు్మలు, దశావతారాల విగ్రహాలను ప్రతిష్ఠించారు. అష్టభుజి మండప శిఖరాలపై రాగి కలశాలను బిగించారు. 


వైకుంఠద్వారం ఇలా..

Yadadri Temple Way


యాదాద్రి ఆలయానికి మెట్లమార్గం మొదలయ్యే ప్రాంతంలో ఉంటుంది ఈ వైకుంఠద్వారం. పూర్వం వాహన సౌకర్యం లేని కాలంలో ఆనాటి భక్తులు కొందరు కొండపైకి వెళ్లేందుకు వీలుగా రాళ్లతో మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ మెట్ల మార్గంలో మోకాళ్లపై నడిచి వెళ్లి, మొక్కులు తీర్చుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. చాలాకాలం వరకు ఇక్కడ మెట్లు ఉన్నాయనే విషయమే జనాలకు తెలిసేది కాదు. రామదయాళ్‌ సీతారామయ్య శాస్త్రి, నరసింహారెడ్డి, కొండల్‌రెడ్డి, గాదె కిష్టయ్య తదితర భక్తులు 1947లో ఆస్థాన కమిటీగా ఏర్పడి, భక్తుల కోసం ఈ వైకుంఠద్వారాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైకుంఠద్వారం నుంచి కొండపైకి వెళ్లేందుకు 350 మెట్లు ఉండేవి. వీటికి ప్రతిరోజూ పసుపు కుంకుమలు పెట్టి భక్తులు పూజించేవారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా వైటీడీఏ, ఆర్‌ అండ్‌ బీ అధికారులు 2019 నవంబరు 15న ఈ వైకుంఠద్వారాన్ని కూల్చివేసి, యాలీ పిల్లర్లపై భారీ వైకుంఠద్వారాన్ని కొత్తగా నిర్మించారు. ప్రస్తుతం ఈ వైకుంఠద్వారం నుంచే భక్తులు మెట్లమార్గంలో స్వామివారి దర్శనానికి వెళుతున్నారు. ఇదివరకు స్వామివారి పాదాల వద్ద ఉన్న మెట్లదారిని తొలగించిన అధికారులు, కొత్తగా నిర్మించిన వైకుంఠద్వారం నుంచే మెట్లదారిని ఏర్పాటు చేశారు. 

ప్రసాదం తయారీకి..
ప్రసాదం తయారీ కోసం యాదాద్రి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక భవనాన్ని నిర్మించారు. పెద్దసంఖ్యలో భక్తులు రానున్న దృష్ట్యా ప్రసాదం తయారీ కోసం ఆధునిక యంత్రాలను ఏర్పాటు చేశారు. రోజుకు లక్ష లడ్డూలను, రెండువేల కిలోల పులిహోర తయారు చేసేందుకు వీలుగా యంత్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ‘అక్షయపాత్ర’ సంస్థవారు ప్రసాదం తయారు చేస్తున్నారు. రానున్న రోజుల్లో దేవస్థానంవారే ప్రసాదం తయారు చేసేలా ‘అక్షయపాత్ర’ సంస్థవారు శిక్షణ ఇస్తున్నారు. 

స్వర్ణకాంతులతో ధగధగలాడేలా..

yadadri temple gold


యాదాద్రి ఆలయాన్ని స్వర్ణకాంతులతో ధగధగలాడేలా తీర్చిదిద్దారు. పంచనారసింహులు కొలువై ఉన్న గర్భాలయ ద్వారాలకు బంగారుతాపడం చేసిన కవచాలను బిగించారు. ఆళ్వార్‌ మండపంలో 35 అడుగుల ఎత్తున ఏర్పాటు చేసిన ధ్వజస్తంభానికి సైతం ఇటీవల బంగారు తొడుగులు వేశారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న ఉపాలయాల ద్వారాలకు వెండితొడుగులను బిగించనున్నారు. ప్రథమ, ద్వితీయ ప్రాకారాల్లోని ద్వారాలకు ఇత్తడి తొడుగులు వేశారు. త్రితల, పంచతల, సప్తతల రాజగోపురాలకు బంగారు కలశాలను బిగించారు. అష్టభుజి ప్రాకార మండప శిఖరాలపై రాగి కలశాలను బిగించారు. ఆలయంలో అమర్చిన బంగారు తొడుగుల పనులన్నీ చెన్నైలోని స్మార్ట్‌ క్రియేషన్‌ సంస్థలో చేయించారు. 

ఉగాది తర్వాత..
యాదాద్రిని హరిహర క్షేత్రంగా చెబుతారు. కొండపైనే అనుబంధ ఆలయంగా కొలువై ఉన్న పర్వతవర్ధని రామలింగేశ్వర స్వామివారి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ శివాలయంలో ప్రధాన ఆలయం, ముఖ మండపం, ప్రాకార మండపం, త్రితల రాజగోపురం నిర్మించారు. ప్రధాన ఆలయంలోని మండపాల్లో నాలుగువైపులా కృష్ణశిలతో స్టోన్‌ ఫ్లోరింగ్‌ పనులు చేశారు. ప్రధాన ఆలయం ముందు భారీ నందీశ్వరుని విగ్రహాన్ని కొలువుతీర్చారు. ఆలయానికి ఉత్తరాన స్వామివారి కల్యాణ మండపం, ఆ పక్కనే రథశాల నిర్మించారు. ఉగాది తర్వాత జరగనున్న ఆలయ ఉద్ఘాటన నాటికి ఆలయంలో స్ఫటిక లింగాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఆలయ మండపాల్లోని ప్రాకారాల్లోని సాలహారాల్లో అష్టాదశ శక్తిపీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, శివుని అవతారాలు, భైరవులు, పార్వతి అమ్మవారి విగ్రహాలను నెలకొల్పారు. ముఖమండపంలో దక్షిణామూర్తి, బ్రహ్మ, భైరవులతో పాటు ఇతర దేవతామూర్తుల విగ్రహాలను అమర్చారు. ఈ శివాలయ ప్రాంగణంలో అన్నివైపులా భక్తులను ఆకట్టుకునే రీతిలో ఉపాలయాలను నిర్మించారు. నైరుతిలో ఏకతల విమానగోపురంతో గణపతి, వాయువ్యంలో ఏకతల విమాన గోపురంతో పర్వతవర్ధని అమ్మవారు, ఈశాన్యంలో ఆంజనేయస్వామి ఆలయాలు, నవగ్రహ మండపం, ఆగ్నేయంలో యాగశాలలను నిర్మించారు. శివాలయానికి ఎదురుగా సుమారు 26 అడుగుల ఎత్తున ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం భూపాలపల్లి అడవుల నుంచి ఎల్తైన నారవేప చెట్టు నుంచి సేకరించిన కలపదుంగను తీసుకువచ్చారు. 

యాదాద్రి పరిసర క్షేత్రాలు ఇవే..

yadadri temple surroundings


యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో పర్యాటక రంగం శరవేగంగా అభివృద్ధి చెందనుంది. పర్యాటకులను మరింతగా ఆకట్టుకునేందుకు ప్రభుత్వం ఈ ప్రాంతంలోని పురాతన చారిత్రక కట్టడాలు, ఆలయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. భువనగిరి మండలం వడాయిగూడెంలోని సురేంద్రపురి కుందా సత్యనారాయణ కళాధామం సకల దేవతల ఆలయాలకు నెలవుగా ఇప్పటికే పర్యాటకులను ఆకట్టుకుంటోంది. యాదగిరిగుట్టకు వచ్చే భక్తులు స్వామివారి దర్శనం తర్వాత సురేంద్రపురికే వెళుతుంటారు. యాదగిరిగుట్ట నుంచి సురేంద్రపురికి బస్సు, ఆటో సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి జట్కాబళ్లు కూడా అందుబాటులో ఉంటాయి. యాదగిరిగుట్ట నుంచి 8 కిలోమీటర్ల దూరంలోని బస్వాపూర్‌ గ్రామంలో కాళేశ్వరం జలాలతో సింహసాగర్‌ రిజర్వాయర్‌ను నిర్మించారు.

యాదాద్రి క్షేత్రానికి అతి సమీపంలోనే..
పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఇక్కడ బెంగళూరులోని బృందావన్‌ గార్డెన్‌ తరహా ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసేందుకు పర్యాటక శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. యాదగిరిగుట్టకు 12 కిలోమీటర్ల దూరంలోని భువనగిరి కోటను కూడా తెలంగాణ పర్యాటక శాఖ అభివృద్ధి చేయనుంది. ఇందులో భాగంగా కోట పైకి రోప్‌వే ఏర్పాటు చేయనున్నారు. యాదాద్రి క్షేత్రానికి అతి సమీపంలోని వడాయిగూడెం, రాయగిరి రైల్వేస్టేషన్‌ సమీపంలోని గుట్టలను భక్తులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు. రాయగిరి వద్ద ఆంజనేయ అభయారణ్యం, వడాయిగూడెం సమీపంలో నృసింహ అభయారణ్యం ఏర్పాటు చేశారు. భక్తులకు ఆహ్లాదభరితమైన వాతావరణం కల్పించేందుకు ఇక్కడ వివిధ రూపాల్లో గొడుగులు, వంతెనలు ఏర్పాటు చేశారు.

రాయగిరి చెరువుకట్టపై రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో మినీ శిల్పారామాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రాయగిరి కమాన్‌ నుంచి కట్టమైసమ్మ ఆలయం వరకు పూలమొక్కలను ఏర్పాటు చేశారు. అలాగే, ఇక్కడ ఒకటిన్నర ఎకరాల స్థలంలో బోటింగ్‌ జరిపేందుకు వీలుగా పనులు చేస్తున్నారు. పర్యాటకుల కోసం ఇక్కడ రెండు ఫుడ్‌కోర్ట్స్, ఆరు స్టాల్స్, ఒక చేనేత వస్త్రశాల ఏర్పాటు చేసేందుకు పనులు సాగిస్తున్నారు. పర్యాటకులను ఆకర్షించేందుకు ఒడిశా నుంచి తెప్పించిన భారీ ఇసుకరాతి శిల్పాలను ఇక్కడకు తీసుకొచ్చారు. యాదాద్రికి 20 కిలోమీటర్ల దూరంలోని కొలనుపాక గ్రామంలో సోమేశ్వర ఆలయం, మహాలక్ష్మీ వీరనారాయణస్వామి ఆలయాల పునరుద్ధరణ కోసం వైటీడీఏ ఇటీవల రూ.1.79 కోట్లు కేటాయించింది. ఇక్కడ ఒక జైన ఆలయం, పద్దెనిమిది మఠాలు కూడా ఉన్నాయి. యాదాద్రికి 22 కిలోమీటర్ల దూరంలోని రాజపేట సంస్థానం కోట, మల్లాపురం, సైదాపురం, మైలార్‌గూడెంలలో మినీ ట్యాంక్‌బండ్‌లను అభివృద్ధి చేయనున్నారు.

Published date : 28 Mar 2022 02:55PM

Photo Stories