Sarvai Papanna : పేదలకు దోచిపెట్టిన వీరుడు.. ఇప్పటికీ నిలిచిపోయిన కట్టడాలు.. ఇదే ఆయన కథ..
సాక్షి ఎడ్యుకేషన్:
శ్రీ సర్వాయి పాపన్న గారు
బహుజనుల ఏకమై పోరాడితే రాజ్యాధికారం సాధించవచ్చునని నిరూపించిన గొప్ప సామాజిక విప్లవకారుడు సర్దార్ సర్వాయి పాపన్న. ఆధిపత్య కులాల పాలకులు బహుజనులను అణగదొక్కుతున్న 17వ శతాబ్దంలోనే... స్వీయ సైన్యంతో దాడిచేసి దక్కన్లో తొలి బహుజన రాజ్య స్థాపన చేసిన గొప్ప వీరుడు.
పాపన్న ఒక సాధారణ గౌడ కుటుంబం నుండి వచ్చినవాడు కనుక అతనికి ప్రజల కష్టనష్టాలన్నీ తెలుసు. అందుకే పాపన్న రాజ్యంలో పన్నులు లేవు. ఖజానా కొరకు జమీందార్, సుబేదార్లపై తన గెరిల్లా సైన్యంతో దాడి చేయించేవాడు. వారి వద్ద నుండి దోచుకున్న సొమ్మును ప్రజలకు పంచిపెట్టాడు. వారి భూములను కూడా ప్రజలకు పంచాడు. పాపన్న అనేక ప్రజామోదయోగ్యమైన పనులు చేశాడు. అతని రాజ్యంలో సామాజిక న్యాయం పాటించేవాడు. తాటికొండలో చెక్ డ్యామ్ నిర్మించాడు. అతను ఎల్లమ్మకు భక్తుడు కావున హుజురాబాద్ లో ఎల్లమ్మ గుడి కట్టించాడు. అది రూపం మారినా నేటికీ అలాగే ఉంది.
పాపన్న జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని ఖిలాషాపూర్ (1650-1709)లో నాసగోని ధర్మన్న, సర్వమ్మలకు జన్మించాడు. తండ్రి చిన్నతనంలోనే చనిపోతే అన్నీ తానై పెంచింది తల్లి. పాపన్న గౌడ కులస్థుల ఆరాధ్య దైవం ఎల్లమ్మ పరమ భక్తుడు. తల్లి కోరిక మేరకు గౌడ వృత్తిని స్వీకరించాడు. పూజలు చేసే సంప్రదాయాలను యుక్త వయసు వచ్చే నాటికి క్రమక్రమంగా వ్యతిరేకించాడు. బానిసత్వం నుండి ప్రజలకు విముక్తి కల్పిస్తాననీ, కులవృత్తి చేయననీ తల్లి దగ్గర ప్రతిజ్ఞ చేశాడు. పాపన్న ఎక్కువగా ఇతర బహుజన కులాల వారితో కలిసి తిరిగేవాడు. వీరిలో చాకలి సర్వన్న, మంగలి మాసన్న, కుమ్మరి గోవిందు, జక్కుల పెరుమాళ్లు, దూదేకుల పీరు, కొత్వాల్ మీరు సాహేబ్ ముఖ్యులు.
పిచ్చుక కుంట్లవారు, దాసరి కాండ్రవారు, వీరముష్టి వారు పాపన్న చరిత్రను వీరగాథలుగా ఊరూరా తిరిగి చెప్పేవారు. అలా జానపద కళా రూపాల ద్వారానే పాపన్న చరిత్రకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు లభించాయి. అయితే ఆంగ్లేయ కవి జే.యే. బోయాల్ ఇండియన్ యెంటిక్వెరి పత్రికలో 1874లోనే రాశారు.
పాపన్నకు ఎలాంటి వారసత్వ నాయకత్వం కాని, ధనంకాని లేవు. గిరిజనులను చేరదీసి వారికి యుద్ధ విద్యలను నేర్పాడు. పాపన్న ముందుగా తన చుట్టుపక్కల ఉన్న ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించి విజయ దుర్గాలు, కోటలు నిర్మించాడు. 1678 నాటికి తాటికొండ, వేములకొండలను తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. చివరకు గోల్కొండ కోటను స్వాధీనపర్చుకొని 7 నెలలపాటు అధికారం చలాయించాడు. అయితే మొఘల్ సేనలు వచ్చి అతడిని అతి క్రూరంగా చంపారు.
పాపన్న వీరత్వానికి గుర్తుగా లండన్ మ్యూజియంలో విగ్రహాన్ని పొందుపరిచారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రెస్బుక్లో పాపన్న గురించి రాశారు. జనగామ జిల్లా ఖిలాషాపూర్లో 17వ శతాబ్దంలో పాపన్న నిర్మించిన చారిత్రక కోట ఇప్పటికీ నిలిచి ఉంది. దాన్ని పరిరక్షించడానికి తెలంగాణ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి.
పాకాల శంకర్ గౌడ్ | టీచర్, సిరిసిల్ల (నేడు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి)
UGC NET June 2024 Re-exam: సీబీటీ విధానంలో యూజీసీ నెట్ రీఎగ్జామినేషన్.. పరీక్షల షెడ్యూల్ విడుదల
Tags
- Sardhar Sarvai Papanna Goud Sena
- Freedom fighter
- warrior king
- Poor People
- golconda fort
- Papadu
- Mughals
- 17th century
- Indian History
- General Knowledge
- GK History
- sarvai papanna lifestory
- papanna story
- GK History latest
- Sardhar Sarvai Papanna Goud Sena Birth Anniversary
- Education News
- Sakshi Education News
- sardhar sarval papanna history
- sakshieducation current affairs