Daily Current Affairs in Telugu: 2022, డిసెంబర్ 1st కరెంట్ అఫైర్స్
National Sports Awards: జాతీయ క్రీడా పురస్కారాలు ప్రదానం
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రతిష్టాత్మక జాతీయ క్రీడా పురస్కారాల ప్రదాన కార్యక్రమం నవంబర్ 30న ఘనంగా జరిగింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము క్రీడాకారులు, శిక్షకులకు అవార్డులు అందజేశారు. దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న’ అవార్డును టేబుల్ టెన్నిస్ (టీటీ) స్టార్ ఆచంట శరత్ కమల్ అందుకున్నాడు. తమిళనాడుకు చెందిన 40 ఏళ్ల శరత్ కమల్ ఈ ఏడాది కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల సింగిల్స్, టీమ్, మిక్స్‌డ్ డబుల్స్‌లో స్వర్ణ పతకాలతో సహా ఐదు కామన్వెల్త్ క్రీడల్లో కలిపి మొత్తం 13 పతకాలు సాధించాడు. నాలుగుసార్లు ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన శరత్ ఆసియా చాంపియన్‌షిప్‌లో రెండు కాంస్యాలు, ఆసియా క్రీడల్లో రెండు కాంస్యాలు సాధించాడు. కాగా ఈ ఏడాది 25 మందిని ‘అర్జున అవార్డు’ వరించింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రపంచ చాంపియన్ బాక్సర్ నిఖత్ జరీన్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఆకుల శ్రీజలు కూడా ఈ పురస్కారాన్ని రాష్ట్రపతి నుంచి అందుకున్నారు. ఈ జాబితాలో షట్లర్లు హెచ్‌ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్.. అథ్లెట్లు సీమా పూనియా, అవినాశ్ సాబ్లే, షూటర్ ఇలవెనిల్, చెస్ ప్లేయర్ ప్రజ్ఞానంద తదితరులు ఉన్నారు. తన కోచింగ్‌తో రోహిత్ శర్మ సహా పలువురు క్రికెటర్లను తీర్చిదిద్దిన దినేశ్ లాడ్‌కు ‘ద్రోణాచార్య’ అవార్డు లభించింది.
Suryakumar Yadav: నంబర్‌వన్ బ్యాటర్‌గా సూర్యకుమార్ యాదవ్
మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు: ఆచంట శరత్ కమల్
అర్జున అవార్డులు: సీమా పూనియా (అథ్లెటిక్స్), ఆల్డస్ పాల్ (అథ్లెటిక్స్), అవినాష్ సాబుల్ (అథ్లెటిక్స్), లక్ష్య సేన్ (బ్యాడ్మింటన్), హెచ్ఎస్ ప్రణయ్ (బ్యాడ్మింటన్), అమిత్ (బాక్సింగ్), నిఖత్ జరీన్ (బాక్సింగ్), భక్తి కులకర్ణి (చెస్) , ఆర్ ప్రజ్ఞానంద (చెస్), దీప్ గ్రేస్ ఇక్కా (హాకీ), సుశీలా దేవి (జూడో), సాక్షి కుమారి (కబడ్డీ), నయన్ మోని సైకియా (లోన్‌బాల్), సాగర్ ఓవల్కర్ (మల్కాంబ్), ఎలవెనిల్ వలరివన్ (షూటింగ్), ఓంప్రకాష్ మిథర్వాల్ (షూటింగ్) శ్రీజ ఆకుల (టేబుల్ టెన్నిస్), వికాస్ ఠాకూర్ (వెయిట్ లిఫ్టింగ్), అన్షు (రెజ్లింగ్), సరిత (రెజ్లింగ్), పర్వీన్ (వుషు), మాన్సీ జోషి (పారా బ్యాడ్మింటన్), తరుణ్ ధిల్లాన్ (పారా బ్యాడ్మింటన్), స్వప్నిల్ పాటిల్ (పారా స్విమ్మింగ్), జెర్లిన్ అనికా జె (చెవిటి బ్యాడ్మింటన్)
ద్రోణాచార్య అవార్డు (రెగ్యులర్ విభాగంలో కోచ్‌లకు): జీవన్‌జోత్ సింగ్ తేజ (ఆర్చరీ), మహ్మద్ అలీ కమర్ (బాక్సింగ్), సుమా షిరూర్ (పారా-షూటింగ్) మరియు సుజిత్ మాన్ (రెజ్లింగ్)
జీవితకాల పురస్కారం: దినేష్ లాడ్ (క్రికెట్), బిమల్ ఘోష్ (ఫుట్‌బాల్), రాజ్ సింగ్ (రెజ్లింగ్)
ధ్యాన్ చంద్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు: అశ్విని అక్కుంజీ (అథ్లెటిక్స్), ధరమ్‌వీర్ సింగ్ (హాకీ), బిసి సురేష్ (కబడ్డీ), నీర్ బహదూర్ గురుంగ్ (పారా అథ్లెటిక్స్)
► ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు 11 పతకాలు
Best Cities: ప్రపంచంలో అత్యుత్తమ నగరాలు ఇవే..
మూడు ఖండాల నుంచి మూడు నగరాలు ఇంటర్‌నేషన్స్ సంస్థ తాజా సర్వేలో అత్యుత్తమ సిటీల జాబితాలో నిలిచాయి. ప్రవాసులు నివసించడానికి 2022లో ప్రపంచంలో అత్యుత్తమ నగరాల్లో స్పెయిన్‌లోని వెలెన్సియా టాప్‌లో నిలిచింది. అద్భుతమైన జీవన ప్రమాణాలుంటాయని జీవన వ్యయం భరించే స్థాయిలో ఉంటుందని, ప్రజలు స్నేహపూర్వకంగా ఉంటారని సర్వేలో అత్యధికులు వెలెనికా నగరానికి ఓటు వేశారు. ఆ తర్వాత స్థానంలో దుబాయ్, మూడో స్థానంలో మెక్సికో సిటీ నిలిచాయి. 181 దేశాల్లో నివసిస్తున్న 11,970 మంది ప్రవాసుల అభిప్రాయాలను తెలుసుకొని ఈ జాబితాకు రూపకల్పన చేశారు.
టాప్ 10 నగరాలివే..
1. వెలెన్సియా (స్పెయిన్): జీవన ప్రమాణాలు, అల్ప జీవన వ్యయం, మంచి వాతావరణం.
2. దుబాయ్: పని చేయడానికి అనుకూలం, ఖాళీ సమయాన్ని ఎంజాయ్ చేయొచ్చు.
3. మెక్సికో సిటీ: ఫ్రెండ్లీ నగరం.
4. లిస్బన్ (పోర్చుగల్): అద్భుత వాతావరణం.
5. మాడ్రిడ్ (స్పెయిన్): సాంస్కృతిక అద్భుతం.
6. బాంకాక్: సొంత దేశంలో ఉండే ఫీలింగ్.
7. బాసిల్ (స్విట్జర్లాండ్): ఆర్థికం, ఉపాధి, జీవన ప్రమాణాల్లో ప్రవాసుల సంతృప్తి
8. మెల్‌బోర్న్ (ఆస్ట్రేలియా): అన్నింటా బెస్ట్.
9. అబుదాబి: ఆరోగ్యం రంగట్లో టాప్. ప్రభుత్వోద్యోగుల పనితీరు అద్భుతం.
10. సింగపూర్: మంచి కెరీర్.
రోమ్ (ఇటలీ), టోక్యో (జపాన్), మిలన్ (ఇటలీ), హాంబర్గ్ (జర్మనీ), హాంగ్‌కాంగ్ ప్రవాసుల నివాసానికి అనుకూలంగా ఉండవని సర్వే పేర్కొంది.
6511 ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
Jiang Zemin: చైనా మాజీ అధినేత జియాంగ్ జెమిన్ మృతి
డ్రాగన్ దేశం చైనాలో అధ్యక్షుడిగా ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన జియాంగ్ జెమిన్ నవంబర్ 30న కన్నుమూశారు. 96 ఏళ్ల జెమిన్ కొంతకాలంగా లుకేమియా, అవయవాల వైఫల్యంతో బాధపడుతున్నారు. గతంలో మేయర్‌గా సేవలందించిన షాంఘై నగరంలోనే ఆయన తుదిశ్వాస విడిచారని చైనా అధికారిక షిన్‌హువా వార్తా సంస్థ వెల్లడించింది.
నిరంకుశ వైఖరి
1993 మార్చి 27 నుంచి 2003 మార్చి 15 దాకా పదేళ్లపాటు చైనాను పరిపాలించిన జియాంగ్ జెమిన్ చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. మార్కెట్ ఆధారిత సంస్కరణలకు ప్రాధాన్యం ఇచ్చారు. బ్రిటిష్ పాలనలో ఉన్న హాంకాంగ్‌ను 1997లో చైనాలో తిరిగి విలీనం చేశారు. జెమిన్ చొరవతో 2001లో ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ)లో చైనా సభ్యదేశంగా చేరింది. దాంతో విదేశీ పెట్టుబడిదారులు చైనాలో అడుగుపెట్టారు. అభివృద్ధిని కాంక్షించిన జియాంగ్ జెమిన్ పరిపాలనలో నిరంకుశంగా వ్యవహరించారన్న అపవాదు మూటగట్టుకున్నారు. మానవ హక్కుల సంఘాలు, కార్మిక, ప్రజాస్వామ్య అనుకూల సంఘాల నేతలు, కార్యకర్తలపై ఉక్కుపాదం మోపారు. వారిని జైలుపాలు చేశారు. తన అధికారానికి ముప్పుగా మారిందన్న అనుమానంతో ‘ఫలూన్ గాంగ్’ అనే ఆధ్యాత్మిక ఉద్యమాన్ని నిషేధించారు.
☛ తిరగబడ్డ చైనా.. భారీగా వీధుల్లోకి వచ్చి నిరసనలు
సబ్బుల కంపెనీలో కార్మికుడిగా..
జియాంగ్ జెమిన్ 1926 ఆగస్టు 17న చైనా తూర్పు ప్రాంతంలోని యాంగ్‌జై సిటీలో మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. 1947లో షాంఘైలోని జియాటోంగ్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ మెషినరీ డిపార్టుమెంట్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తొలుత ఫుడ్ ఫ్యాక్టరీలో, తర్వాత సబ్బుల తయారీ పరిశ్రమలో, ఆటోమొబైల్ ప్లాంట్‌లో పనిచేశారు. 1966 నుంచి 1976 దాకా కారి్మక సంఘాల్లో సభ్యుడిగా చురుగ్గా సేవలందించారు. కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనాయకుల దృష్టిని ఆకర్శించారు. పార్టీలో ఆయన పరపతి పెరిగిపోయింది. 1985 నుంచి 1989 దాకా షాంఘై మేయర్‌గా పనిచేశారు. తియానన్మెన్ స్క్వేర్‌లో విద్యార్థులపై సైన్యం దాడి తర్వాత 1989లో అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ప్రధాన కార్యదర్శిగా జెమిన్ బాధ్యతలు చేపట్టారు. 2002 దాకా ఈ పదవిలో కొనసాగారు. 1989 నుంచి చైనా మిలటరీ కమిషన్ చైర్మన్‌గా కొనసాగిన ఆయన 2004లో ఈ పదవి నుంచి తప్పుకున్నారు. చైనా ప్రస్తుత అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఎదుగుదల వెనుక జియాంగ్ జెమిన్ ప్రోత్సాహం ఎంతో ఉంది.
TSPSC & APPSC Groups Best Books: గ్రూప్స్‌కు ప్రిపేరయ్యే అభ్యర్థులు ఈ పుస్తకాలను చదివారంటే..
Lancet Study: భారత్‌లో అబ్బాయిలకే కేన్సర్ వ్యాధి ఎక్కువ!
భారత్‌లో అమ్మాయిల కంటే అబ్బాయిలే అధికంగా కేన్సర్ బారిన పడుతున్నారని లాన్సెట్ తాజా నివేదిక వెల్లడించింది. సమాజంలో లింగ వివక్షే దీనికి కారణమై ఉండవచ్చునని అభిప్రాయపడింది. దేశంలో జనవరి 1, 2005 నుంచి డిసెంబర్ 31, 2019 మధ్య మూడు కేన్సర్ ఆస్పత్రులతో పాటు ఢిల్లీలోని పాపులేషన్ బేస్డ్ కేన్సర్ రిజిస్ట్రీ (పీబీసీఆర్), మద్రాస్ మెట్రోపాలిటన్ ట్యూమర్ రిజిస్ట్రరీల నుంచి రికార్డుల్ని సేకరించి ఈ నివేదిక రూపొందించారు. పీబీసీఆర్‌లో 11 వేలు, ఇతర ఆస్పత్రిల్లోని 22 వేల క్యాన్సర్ రోగుల్లో అబ్బాయిల సంఖ్యే అధికంగా ఉందని ఎయిమ్స్ ప్రొఫెసర్ సమీర్ బక్షీ చెప్పారు.
World Health Organization: గాయాలతో ఏటా 44 లక్షల మంది మృతి
గాయాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతిఏటా దాదాపు 44 లక్షల మంది మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది. వీరిలో ప్రతి ముగ్గురిలో ఒకరు రోడ్డు ప్రమాదాల్లో గాయపడి, ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపింది. ఈ మేరకు ‘గాయాల నివారణ, సంరక్షణ’ 14వ ప్రపంచ సదస్సు సందర్భంగా డబ్ల్యూహెచ్‌ఓ ఒక నివేదిక విడుదల చేసింది. గాయాలు, హింస వల్ల ప్రపంచవ్యాప్తంగా నిత్యం 12,000 మంది బలైపోతున్నారని నివేదికలో వివరించింది. 5 నుంచి 29 ఏళ్ల వయసున్న వారిలో సంభవిస్తున్న మరణాలకు తొలి 5 కారణాల్లో 3 కారణాలు గాయాలకు సంబంధించినవేనని స్పష్టం చేసింది. జనం మృత్యువాత పడడానికి రోడ్డు ప్రమాదాలు, హత్యలు, ఆత్మహత్యలు, నీటిలో మునిగిపోవడం, అగ్ని ప్రమాదాలు, విషం తీసుకోవడం వంటివి ప్రధానంగా కారణమవుతున్నాయని డబ్ల్యూహెచ్‌ఓ తేల్చిచెప్పింది. ప్రతి 6 మరణాల్లో ఒకటి ఆత్మహత్య, ప్రతి 9 మరణాల్లో ఒకటి హత్య, ప్రతి 61 మరణాల్లో ఒకటి యుద్ధం, ఘర్షణల వల్ల సంభవిస్తున్నాయని పేర్కొంది. సంపన్నులతో పోలిస్తే పేదలు గాయాల వల్ల చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధానోమ్ గెబ్రీయెసస్ తెలిపారు.
➤ మనిషిలో తొలిసారి బర్డ్‌ఫ్లూ వైరస్‌ను ఏ దేశంలో గుర్తించారు?
Zombie Virus: మళ్లీ తెరపైకి జాంబీ వైరస్!
ప్రమాదకరమైన జాంబీ వైరస్. రష్యాలో అతి శీతల ప్రాంతమైన సైబీరియాలోని ఓ సరస్సులో 48,500 ఏళ్లుగా మంచు పలకల నడుమ గడ్డకట్టిన స్థితిలో నిద్రాణంగా పడి ఉంది. దాన్ని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. ఒకరి నుంచి ఇంకొకరికి సోకే లక్షణమున్న ఈ వైరస్ కరోనాను మించిన పెను ఆరోగ్య విపత్తుకు దారి తీయొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, ఇలాంటి దాదాపు రెండు డజన్ల పురాతన వైరస్‌లను శాస్త్రవేత్తలు ఇటీవలి కాలంలో గుర్తించారు. గ్లోబల్ వార్మింగ్ దెబ్బకు నిత్యం సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతలుండే ప్రాంతాల్లో కూడా మంచు పలకలు వేగంగా కరిగిపోతుండటం తెలిసిందే. దాంతో ఇంతకాలంగా వాటి కింద నిద్రాణంగా ఉన్న ఇలాంటి ప్రమాదకర వైరస్‌లెన్నో ఒళ్లు విరుచుకుని మానవాళిపైకి వచ్చి పడతాయని వారు హెచ్చరిస్తున్నారు. ఈ శాస్త్రవేత్తల బృందమే 2013లో ఇలాగే 30 వేల ఏళ్ల నాటి వైరస్‌లను వెలుగులోకి తెచ్చింది. ఇప్పుడు తన రికార్డును తానే అధిగమిస్తూ పండోరా వైరస్ ఎడొమాగా పేర్కొనే జాంబీ వైరస్‌ను కనిపెట్టిందని బ్లూంబర్గ్ నివేదిక పేర్కొంది.
'కరెంట్ అఫైర్స్'పై పట్టు.. సక్సెస్‌కు తొలి మెట్టు!
Alzheimer’s Disease: మతిమరుపు బాధితులకు ‘లెసానెమాబ్’
మనుషుల్లో వయసు పెరుగుతున్నకొద్దీ మతిమరుపు (అల్జీమర్స్) తలెత్తడం సహజం. ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల మందికి పైగా దీనితో బాధపడుతున్నారని అంచనా. బ్రిటన్లోని అల్జీమర్స్ రీసెర్చ్ సంస్థ లెసానెమాబ్ పేరుతో నూతన ఔషధాన్ని అభివృద్ధి చేసింది. దీనితో మతిమరుపు పెరుగుదల నెమ్మదిస్తుందని సైంటిస్టులు చెప్పారు. అల్జీమర్స్ చికిత్సలో ఇదొక కీలక మలుపన్నారు.
క్లినికల్ ట్రయల్స్‌లో 1,795 మందిపై సంతృప్తికరమైన ఫలితాలు వచ్చినట్లు వెల్లడించారు. వారికి 18 నెలలపాటు చికిత్స అందిస్తే మతిమరుపు పెరుగుదల నాలుగింట మూడొంతులు తగ్గిపోతుందని చెప్పారు. అల్జీమర్స్‌కు ప్రధాన కారణమైన బీటా–అమైలాయిడ్ అనే ప్రొటీన్‌ను ఈ ఔషధం కరిగించేస్తుందని పేర్కొన్నారు. మెరుగైన అల్జీమర్స్ చికిత్సల కోసం ప్రపంచం ఎదురు చూస్తోందని, ఈ దిశగా లెసానెమాబ్ డ్రగ్ ఒక ఉత్తమమైన పరిష్కారం అవుతుందని పరిశోధకుడు ప్రొఫెసర్ జాన్ హర్డీ తెలియజేశారు.
☛ బరువు తక్కువ.. భయం ఎక్కువ.. వీటి గర్భధారణ సమయం ఎంతంటే?
Tokay Gecko Lizard: అరిష్టం కాదు.. అదృష్టం.. ఈ బల్లి విలువ రూ.కోటిన్నర
బల్లి మీద పడితే అరిష్టం అంటారు కొందరు. కానీ టోకే గెక్కో రకం బల్లి దొరికితే మాత్రం అదృష్టం తలుపు తట్టినట్లే. చూడ్డానికి ప్లాస్టిక్ బల్లిగా కనిపిస్తున్న ఇది అంతరిస్తున్న జీవ జాతుల జాబితాలో ఉన్న టోకే గెక్కో రకం బల్లి. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ ఏకంగా రూ.1.5 కోట్లు పలుకుతోంది. వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని పూర్నియా జిల్లాలోని ఓ మెడికల్ స్టోర్‌లో అరుదైన టోకే గెక్కో బల్లి, మత్తునిచ్చే దగ్గు సిరప్‌లను పోలీసులు నవంబర్ 30న స్వాధీనం చేసుకున్నారు. ఇది అంతరించిపోయిన తక్షక్ జాతికి చెందిన బల్లిగా అధికారులు వెల్లడించారు.
టోకే గెక్కో బల్లిని పశ్చిమ బెంగాల్‌లోని కరాండిఘి నుంచి బీహార్‌కు తీసుకెళ్లినట్లు ఏరియా ఎస్‌డిపిఓ ఆదిత్య కుమార్ తెలిపారు. ఈ ఘటనలో 5 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మధుమేహం, ఎయిడ్స్, క్యాన్సర్ వంటి ఇతరాత్ర మందుల తయారీలో వీటిని ఉపయోగిస్తారు. ఆగ్నేయాసియా దేశాల్లో తక్షకు మంచి డిమాండ్ ఉంది. తక్షక్ అనేక దేశాలలో అదృష్టానికి చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది.
TSPSC: తెలంగాణలో గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలో గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదలైంది. 9,168 పోస్టులు గ్రూప్-4 ద్వారా భర్తీ చేయనున్నట్టు టీఎస్‌పీఎస్సీ పేర్కొంది. డిసెంబర్ 23 నుంచి జనవరి 12 వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపింది. ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్ష నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు.
TSPSC Groups Success Tips: కోచింగ్‌కు వెళ్లడం శుద్ధ దండగ.. ఇలా చదివితే నెలలో ‘గ్రూప్స్’ కొట్టొచ్చు..
G20 summit: జీ-20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన భారత్
ప్రపంచ దేశాల్లో బలమైన కూటమిగా పేరుపొందిన జీ-20 అధ్యక్ష బాధ్యతలను భారత్ ఈరోజు(డిసెంబర్ 1) చేపట్టింది. ఇటీవల ఇండోనేషియాలో జరిగిన జీ-20 సమావేశాల్లో ఈ బాధ్యతలను భారత్‌కు బదిలీ చేశారు. డిసెంబరు 1 నుంచి జీ-20 అధ్యక్ష బాధ్యతలను భారత్ నిర్వర్తిస్తుందని ఆ సమావేశంలో ప్రకటించారు. భారత్ ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగనుంది. ఈ ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా 32 ప్రాంతాల్లో వివిధ అంశాలపై 200 సమావేశాలను నిర్వహించనున్నారు. జీ-20 అధ్యక్ష బాధ్యతల నేపథ్యంలో ప్రత్యేక లోగోను రూపొందించారు. దేశంలోని 100 స్మారక చిహ్నాలపై ఈ లోగోను ప్రదర్శించనున్నారు. ఈ లోగోను త్రివర్ణ పతాకం స్ఫూర్తిగా రూపొందించారు. జీ 20 అధ్యక్ష బాధ్యతలు నిర్వహించడం ప్రతి భారతీయుడికీ గర్వకారణమని మోదీ అన్నారు. 2024లో బ్రెజిల్‌లోనూ, ఆ తర్వాత ఏడాది 2025లో దక్షిణాఫ్రికాలోనూ జీ 20 సదస్సు జరగనుంది.
Vikram Kirloskar: విక్రమ్ కిర్లోస్కర్ కన్నుమూత
ప్రముఖ పారిశ్రామికవేత్త, టయోటా కిర్లోస్కర్ వైస్ చైర్మన్ విక్రమ్ ఎస్ కిర్లోస్కర్ (64) గుండెపోటుతో నవంబర్ 29వ తేదీ బెంగళూరులో అకాల మరణం చెందారు. ఆయనకు భార్య గీతాంజలి కిర్లోస్కర్, కుమార్తె మానసి కిర్లోస్కర్ ఉన్నారు. విక్రమ్ కిర్లోస్కర్ మృతితో తాము తీవ్ర విషాదంలో మునిగిపోయినట్టు టయోటా కిర్లోస్కర్ మోటార్ ప్రకటన విడుదల చేసింది. టయోటా కారును భారత్‌కు తీసుకురావడం వెనుక విక్రమ్ పాత్ర ఎంతో ఉందని చెప్పుకోవాలి. అమెరికాలోని ప్రతిష్టాత్మక మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో విక్రమ్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. జపాన్‌కు చెందిన టయోటాతో కలసి ‘టయోటా కిర్లోస్కర్ మోటార్’ జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటు ఆయన వల్లే సాకారం అయింది. ఈ కంపెనీ 1997లో బిడది∙వద్ద 3.10 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పాదక సామర్థ్యంతో కార్యకలాపాలు మొదలు పెట్టింది.