Skip to main content

World Boxing Championships: బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భార‌త్‌కు 11 పతకాలు

ప్రపంచ యూత్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత బృందం రన్నరప్‌గా నిలిచింది. భారత కాలమానం ప్రకారం న‌వంబ‌ర్ 26వ తేదీ స్పెయిన్‌లో ముగిసిన ఈ మెగా ఈవెంట్‌లో భారత్‌ మొత్తం 11 పతకాలు సాధించింది.

ఇందులో నాలుగు స్వర్ణాలు, మూడు రజతాలు, నాలుగు కాంస్య పతకాలు ఉన్నాయి. చివరిరోజు బరిలోకి దిగిన భారత బాక్సర్‌ కీర్తి మహిళల ప్లస్‌ 81 కేజీల విభాగం ఫైనల్లో 0–5తో సిలోనా డార్సీ (ఐర్లాండ్‌) చేతిలో ఓడిపోయి రజతం సాధించింది. ఈ టోర్నీలో 73 దేశాల నుంచి 600 మంది బాక్సర్లు పోటీపడ్డారు.  

వన్షజ్, దేవిక, రవీనాల‌కి స్వ‌ర్ణం 
ప్రపంచ యూత్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మూడు స్వర్ణ పతకాలు లభించాయి. స్పెయిన్‌లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌లో పురుషుల 63.5 కేజీల విభాగంలో హరియాణా కుర్రాడు వన్షజ్‌, మహిళల 52 కేజీల విభాగంలో పుణే అమ్మాయి దేవిక ఘోర్పడే, 63 కేజీల విభాగంలో రవీనా పసిడి పతకాలు గెలిచారు. ఫైనల్స్‌లో వన్షజ్‌ 5–0తో దెముర్‌ కజై (జార్జియా)పై, దేవిక 5–0తో లౌరెన్‌ మెకీ (ఇంగ్లండ్‌)పై, రవీనా 4–3తో మేగన్‌ డెక్లెయిర్‌ (నెదర్లాండ్స్‌)పై గెలిచారు. పురుషుల 54 కేజీల ఫైనల్లో ఆశిష్‌ 1–4తో యుటా సకాయ్‌ (జపాన్‌) చేతిలో ఓడిపోయి రజత పతకంతో సరిపెట్టుకున్నాడు.

చాంపియన్‌షిప్‌లో విశ్వనాథ్‌కు స్వర్ణ

ప్రపంచ యూత్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి స్వర్ణ పతకం లభించింది. నవంబర్‌ 25న జరిగిన పురుషుల 48 కేజీల విభాగంలో విశ్వనాథ్‌ సురేశ్‌ విజేతగా నిలిచాడు.

స్పెయిన్‌ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో ఫైనల్లో తమిళనాడుకు చెందిన విశ్వనాథ్‌ 4–1తో సుయోమ్‌ రోనెల్‌ (ఫిలిప్పీన్స్‌)పై గెలిచాడు. మరోవైపు మహిళల 48 కేజీల విభాగంలో భావన శర్మ రజత పతకం సాధించింది. ఫైనల్లో భావన 0–5తో జనియెవా (ఉజ్బెకిస్తాన్‌) చేతిలో ఓడిపోయింది.

Published date : 28 Nov 2022 06:39PM

Photo Stories