Skip to main content

Chess Olympiad 2024: చెస్‌ ఒలింపియాడ్‌లో చరిత్ర సృష్టించిన భారత్‌.. తొలిసారి పసిడి పతకాలు సొంతం

వందేళ్ల చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక చెస్‌ ఒలింపియాడ్‌లో ఏకకాలంలో భారత పురుషుల, భారత మహిళల జట్లు చాంపియన్‌గా నిలిచి తొలిసారి స్వర్ణ పతకాలను సొంతం చేసుకొని కొత్త చరిత్రను లిఖించాయి.
India Creates History in Chess Olympiad with Gold Medal

సెప్టెంబ‌ర్ 22వ తేదీ ముగిసిన ఈ మెగా టోర్నీలో గ్రాండ్‌మాస్టర్లు ఇరిగేశి అర్జున్‌ (తెలంగాణ), దొమ్మరాజు గుకేశ్, ప్రజ్ఞానంద (తమిళనాడు), విదిత్‌ సంతోష్‌ గుజరాతి (మహారాష్ట్ర), పెంటేల హరికృష్ణ (ఆంధ్రప్రదేశ్‌)లతో కూడిన భారత పురుషుల జట్టు అజేయంగా నిలిచి 21 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అమెరికా జట్టుకు (17 పాయింట్లు) రజతం, ఉజ్బెకిస్తాన్‌ జట్టుకు (17 పాయింట్లు) కాంస్యం లభించాయి.  

➽ గ్రాండ్‌మాస్టర్లు ద్రోణవల్లి హారిక (ఆంధ్రప్రదేశ్‌), వైశాలి (తమిళనాడు), అంతర్జాతీయ మాస్టర్లు దివ్య దేశ్‌ముఖ్‌ (మహారాష్ట్ర), వంతిక అగర్వాల్, తానియా సచ్‌దేవ్‌ (ఢిల్లీ)లతో కూడిన భారత మహిళల జట్టు 19 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో నిలిచింది. కజకిస్తాన్‌ (18 పాయింట్లు) జట్టుకు రజతం, అమెరికా (17 పాయింట్లు) జట్టుకు కాంస్యం దక్కాయి.  

➽ వ్యక్తిగత విభాగాల్లో గుకేశ్‌ (బోర్డు–1; 9 పాయింట్లు), అర్జున్‌ (బోర్డు–2; 10 పాయింట్లు), దివ్య దేశ్‌ముఖ్‌ (బోర్డు–3; 9.5 పాయింట్లు), వంతిక అగర్వాల్‌ (బోర్డు–4; 7.5 పాయింట్లు) అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకాలను సొంతం చేసుకున్నారు. 

Asian Champions Trophy: ఐదోసారి ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ టైటిల్‌ గెలుచుకున్న భారత్‌

➽ చివరిదైన 11వ రౌండ్‌ మ్యాచ్‌ల్లో భారత పురుషుల జట్టు 3.5–0.5తో స్లొవేనియాపై గెలుపొందగా.. భారత మహిళల జట్టు కూడా 3.5–0.5తో అజర్‌బైజాన్‌ జట్టును ఓడించింది.  

➽  పురుషుల 11వ రౌండ్‌ గేముల్లో గుకేశ్‌ 48 ఎత్తుల్లో ఫెడోసీవ్‌పై, అర్జున్‌ 49 ఎత్తుల్లో జాన్‌ సుబెల్‌పై, ప్రజ్ఞానంద 53 ఎత్తుల్లో అంటోన్‌ డెమ్‌చెంకోపై నెగ్గగా... మాతెజ్‌ సబెనిక్‌తో జరిగిన గేమ్‌ను విదిత్‌ 59 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. 

➽ మహిళల 11వ రౌండ్‌ గేముల్లో ద్రోణవల్లి హారిక 51 ఎత్తుల్లో గునె మమాద్‌జాదాపై, దివ్య 39 ఎత్తుల్లో గొవర్‌ బెదులయేవాపై, వంతిక 53 ఎత్తుల్లో ఖానిమ్‌ బలజయేవాపై గెలుపొందగా.. ఉలివియా ఫతలెవియాతో జరిగిన గేమ్‌ను వైశాలి 47 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది.  

➽ గతంలో భారత పురుషుల జట్టు ఈ టోర్నీలో రెండుసార్లు కాంస్య పతకాలు (2014, 2022) గెలుపొందగా.. భారత మహిళల జట్టు ఒకసారి (2022) కాంస్య పతకాన్ని సాధించింది.

Paris Paralympics 2024: పారిస్‌ పారాలింపిక్స్‌లో భారత్‌కు ఎన్ని ప‌త‌కాలొచ్చాయో తెలుసా.. ?

Published date : 24 Sep 2024 10:13AM

Photo Stories