Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 27th కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu September 27th 2022 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
Current Affairs in Telugu September 27th 2022
Current Affairs in Telugu September 27th 2022

New Mandals : తెలంగాణలో కొత్తగా మరో 13 మండలాలు

రాష్ట్రంలో మరో 13 కొత్త మండలాలు ఏర్పడ్డాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్త ర్వులు జారీ చేసింది. గతంలోనే వీటికి సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ అయింది. తాజాగా ప్రజల నుంచి అభ్యంతరాలు, వినతులను స్వీకరించిన అనంతరం తెలంగాణ జిల్లాల ఏర్పాటు చట్టం (1974లోని సెక్షన్‌ 3) ప్రకారం ఈ మండలాలను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సెప్టెంబర్ 26న జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మండలాలన్నీ సెప్టెంబర్‌ 26, 2022 నుంచి ఉనికిలోకి వస్తాయి. ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఫైనల్‌ గెజిట్‌లో పేర్కొంటున్నట్టు ఆ ఉత్తర్వుల్లో వెల్లడించారు. జగిత్యాల, సంగారెడ్డి, నల్లగొండ, మహబూబాబాద్, సిద్దిపేట, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌ జిల్లాల్లో ఈ కొత్త మండలాలను ఏర్పాటు చేశారు. 

Also read: Telanganaలో కొత్తగా 13 రెవెన్యూ మండలాలు

రాష్ట్రంలో ఇప్పటికే 607 మండలాలు ఉండగా, ఇప్పుడు మరో 13 కొత్తగా ఏర్పాటు కావడంతో రెవెన్యూ మండలాల సంఖ్య 620కి చేరింది. 

కొత్త మండలాలివే..

మండలం గ్రామాల రెవెన్యూ
పేరు సంఖ్య డివిజన్‌
ఎండపల్లి 13 జగిత్యాల
భీమారం 09 కోరుట్ల
నిజాంపేట 09 నారాయణ్‌ఖేడ్‌
గట్టుప్పల 06 నల్లగొండ
డోంగ్లీ 15 బాన్సువాడ
సీరోల్‌ 06 మహబూబాబాద్‌
ఇనుగుర్తి 05 మహబూబాబాద్‌
కౌకుంట్ల 09 మహబూబ్‌నగర్‌
ఆలూరు 07 ఆర్మూరు
డొంకేశ్వర్‌ 12 ఆర్మూరు
సాలూర 10 బోధన్‌
అక్బర్‌పేట– భూంపల్లి 13 సిద్దిపేట
కుకునూర్‌పల్లి 15 గజ్వేల్‌

Planet Jupiter : భూమికి అతి సమీపానికి 

సౌర మండలంలో అతి పెద్ద గ్రహమైన బృహస్పతి (Jupiter) సెప్టెంబర్ 26న  భూమికి  అతి సమీపానికి, అంటే 59 కోట్ల కిలోమీటర్ల దూరంలోకి వచ్చింది. ఫలితంగా సెప్టెంబర్ 26న సాయంత్రం 5.29 నుంచి మంగళవారం తెల్లవారుజాము 5.30 దాకా ఆకాశంతో అత్యంత ప్రకాశవంతంగా కన్పించి కనువిందు చేసింది. బృహస్పతి భూమికి ఇంత దగ్గరికి రావడం గత 59 ఏళ్లలో ఇదే మొదటిసారి. మళ్లీ ఇంత సమీపానికి రావాలంటే 2129 దాకా ఆగాల్సిందే. 53 ఉపగ్రహాలున్న బృహస్పతి సూర్యుడి చుట్టూ ఒక్కసారి తిరగడానికి ఏకంగా 11 ఏళ్లు తీసుకుంటుంది.

Also read: NASA: భూమి కంటే లోతైన సముద్రాలున్న గ్రహాన్ని కనుగొన్న నాసా

రష్యాలో గబ్బిలాల్లో New Virus 

కోవిడ్‌–19 లాంటి వైరస్‌ను రష్యాలోని గబ్బిలాల్లో పరిశోధకులు గుర్తించారు. ఇది గబ్బిలాల నుంచి మనుషులకు సోకుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా వైరస్‌ నియంత్రణ వ్యాక్సిన్లు ఈ కొత్త వైరస్‌పై ఏమాత్రం ప్రభావం చూపలేవని అంటున్నారు. అమెరికాలోని వాషింగ్టన్‌ స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకుల బృందం రష్యా గబ్బిలాలపై అధ్యయనం నిర్వహించింది. వీటిలో ఖోట్సా–2 అనే వైరస్‌లో స్పైక్‌ ప్రొటీన్లను గుర్తించారు. ఇవి మనుషుల్లోని కణాల్లోకి చొచ్చుకుపోయి, విషపూరితం చేస్తాయని తేల్చారు. కరోనా వైరస్‌లలో (సార్బీకోవైరస్‌లు) ఖోట్సా–2, సార్స్‌–కోవిడ్‌–2 అనేవి ఒకే ఉప కేటగిరీకి చెందినవని పరిశోధకులు చెప్పారు. అధ్యయనం వివరాలను ప్లాస్‌ పాథోజెన్స్‌ పత్రికలో ప్రచురించారు. కేవలం సార్స్‌–కోవ్‌–2 వంటి వేరియంట్లను నియంత్రించడానికి కాదు, సార్బీకోవైరస్‌ల నుంచి రక్షణ కల్పించే యూనివర్సల్‌ వ్యాక్సిన్లను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని సైంటిస్ట్‌ మైఖేల్‌ లెట్కో చెప్పారు. ఖోట్సా–2 వైరస్‌ వ్యాపిస్తే మనుషులకు తీవ్ర అనారోగ్యం ముప్పుందని గుర్తించారు. కోవిడ్‌–19, ఖోట్సా–2 లాంటి వైరస్‌లు ప్రొటీన్‌ స్పైక్‌ల సాయంతో మనుషులపై దాడి చేస్తాయి.

Also read: Gogo Rock Formation: ఈ గుండె వయసు... 38 కోట్ల ఏళ్లు!

World Tourism Day : థీమ్ - రీ థింకింగ్ టూరిజం  

కరోనాతో తీవ్రంగా నష్టపోయిన ప్రధాన రంగాల్లో పర్యాటకం ఒకటి. రెండేళ్ల పాటు లాక్‌డౌన్లు, అంతర్జాతీయ రాకపోకలపై నిషేధాలతోనే సరిపోయింది. దాంతో పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న శ్రీలంక వంటి దేశాలు ఆర్థికంగా చితికిపోయాయి. సాధారణ పరిస్థితులు నెలకొంటుండటంతో సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ‘రీ థింకింగ్‌ టూరిజం’ థీమ్‌తో పలు దేశాలు ముమ్మరంగా ప్రమోట్‌ చేస్తున్నాయి. టూరిస్టులు ఇష్టపడే ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేయడం, కాస్త అలా తిరిగి వస్తే నిత్య జీవిత ఒత్తిళ్ల నుంచి బయట పడవచ్చంటూ ప్రచారం చేయడంపై దృష్టి పెట్టాయి. 

Also read: ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఎవరెస్టు ఎత్తు ఎంత?

పర్యాటక రంగంలో ప్రపంచ దేశాల్లో ఫ్రాన్స్‌కు తిరుగు లేదని ఎన్నో సర్వేలు తేల్చాయి. 2019లో ఏకంగా 9 కోట్ల మంది అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించింది. దేశ జీడీపీలో 8% వాటా పర్యాటక రంగానిదే. కరోనా వేళ ఫ్రాన్స్‌కు టూరిస్టులు సగానికి సగం తగ్గిపోయారు. మళ్లీ ఈ ఏడాది ఆ దేశానికి టూరిస్టుల తాకిడి పెరిగింది. తర్వాతి స్థానాల్లో స్పెయిన్, అమెరికా, జర్మనీ, స్విట్జర్లాండ్, సింగపూర్‌ తదితరాలున్నాయి. టాప్‌ 10 దేశాల్లో యూరప్, ఆసియా ఫసిఫిక్‌ దేశాలే ఎక్కువగా ఉండటం విశేషం.

Also read: అంతర్జాతీయ సరిహద్దులు

ఎటు చూసినా ఎకో టూరిజమే 
ఎకో టూరిజం. సింపుల్‌గా చెప్పాలంటే ప్రకృతి సౌందర్యంలో లీనమైపోవడం. కాంక్రీట్‌ అడవుల్లో నిత్యం రణగొణధ్వనుల మధ్య బతికేవారు అప్పుడప్పుడూ ప్రకృతి అందాల మధ్య రిలాక్సవడం. ఉద్యానవనాలు, అడవులు, సముద్ర తీర ప్రాంతాల సందర్శన, కొండలు గుట్టలు ట్రెక్కింగ్, ఆయా ప్రాంతాల సంస్కృతిని తెలుసుకోవడంపై ప్రజలు ఆసక్తి చూపుతుండటంతో అన్ని దేశాలూ ఎకో టూరిజం అభివృద్ధిపై దృష్టి పెట్టాయి. మారుమూలల్లోని ప్రాకృతిక అందాలని టూరిస్ట్‌ స్పాట్లుగా తీర్చిదిద్దితే ఇటు ఆదాయం రావడంతో పాటు పేదరికంలో మగ్గుతున్న స్థానికుల బతుకులూ బాగుపడతాయి. ఐస్‌ల్యాండ్, కోస్టారికా, పెరు, కెన్యా, అమెజాన్‌ అడవులతో అలరారే బ్రెజిల్‌ వంటివి ఎకో టూరిజానికి పెట్టింది పేరు. ప్రపంచ ఎకో టూరిజం మార్కెట్‌ 2019లో 9 వేల కోట్ల డాలర్లు. 2027 నాటికి 11 వేల కోట్ల డాలర్లకు చేరొచ్చని అంచనా.  

కరోనా ఎఫెక్ట్‌ 

  • వరల్డ్‌ ట్రావెల్‌ అండ్‌ టూరిజం కౌన్సిల్‌ ప్రకారం పర్యాటక రంగాన్ని కరోనా ఘోరంగా దెబ్బ తీసింది. 
  • 2019తో పోలిస్తే 2020లో అంతటా ఏకంగా 74% పర్యాటకులు తగ్గిపోయారు! 
  • ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగం 4.5 లక్షల కోట్ల డాలర్ల మేర నష్టపోయింది. 
  • దేశీయ పర్యాటకులు 45% తగ్గారు.
  • అంతర్జాతీయంగా చూసుకుంటే పర్యాటకుల సంఖ్య ఏకంగా 69.4% తగ్గింది.
  • .2 కోట్ల ఉద్యోగాలు పోయాయి.

Also read: ప్రముఖ నగరాలు, ప్రదేశాలు - మారుపేర్లు

భారత్‌.. పర్యాటక హబ్‌ 

  • పర్యాటక రంగ పురోగతికి భారత్‌ పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 
  • సుస్థిర, బాధ్యతాయుత పర్యాటకమే లక్ష్యంగా కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి జి.కిషన్‌ రెడ్డి ఇటీవల ధర్మశాల డిక్లరేషన్‌ ఆమోదించారు. 
  • పర్యాటక రంగ వృద్ధితో విదేశీ మారక నిల్వలు పెరిగి దేశం ఆర్థికంగా సుసంపన్నంగా మారుతుంది. 
  • 2030 నాటికి పర్యాటక ఆదాయం జీడీపీలో 10 శాతానికి పెంచడం, 2.5 కోట్ల విదేశీ పర్యాటకులను రప్పించడం, 14 కోట్ల ఉద్యోగాలు కల్పించడం లక్ష్యం. 


Also read: మన విశ్వం (Universe)

పర్యాటకానిది పెద్ద పాత్ర 
పర్యాటక రంగానికున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ప్రపంచ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 10% వాటా దీనిదే! 

  • ప్రపంచ ఎగుమతుల్లో 7% పర్యాటకుల కోసమే జరుగుతున్నాయి. 
  • ప్రతి 10 ఉద్యోగాల్లో ఒకటి పర్యాటక రంగమే కల్పిస్తోంది. 
  • 2019లో అత్యధికంగా ఫ్రాన్స్‌ను 9 కోట్ల మంది సందర్శించారు. 8.3 కోట్లతో స్పెయిన్, 7.9 కోట్ల పర్యాటకులతో అమెరికా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 
  • పర్యాటక రంగం 2019లో ప్రపంచవ్యాప్తంగా 33.3 కోట్ల ఉద్యోగాలు కల్పించింది. కరోనా దెబ్బకు 2020లో ఇది ఏకంగా 2.7 కోట్లకు తగ్గిపోయింది. 
  • 2019లో భారత జీడీపీలో పర్యాటక రంగానిది 6.8% వాటా. 2020 నాటికి 4.7 శాతానికి తగ్గింది. 
  • 2019లో 1.8 కోట్ల మంది భారత్‌ను సందర్శిస్తే 2020లో 60 లక్షలకు పడిపోయింది. 
  • 2020 నాటికి దేశ పర్యాటక రంగం 8 కోట్ల ఉద్యోగాల కల్పించింది. 


Berlin Marathon : కిప్‌చోగె కొత్త ప్రపంచ రికార్డు 

కెన్యా దిగ్గజ అథ్లెట్, ఒలింపిక్‌ చాంపియన్‌ ఎలీడ్‌ కిప్‌చోగె మారథాన్‌లో తన పేరిట కొత్త ప్రపంచ రికార్డును లిఖించుకున్నాడు. ప్రతిష్టాత్మక బెర్లిన్‌ మారథాన్‌లో 37 ఏళ్ల కిప్‌చోగె 42.195 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల 1 నిమిషం 9 సెకన్లలో పూర్తి చేసి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. 2018 బెర్లిన్‌ మారథాన్‌లోనే 2 గంటల 1 నిమిషం 39 సెకన్లతో తానే నెలకొలి్పన ప్రపంచ రికార్డును కిప్‌చోగె సవరించాడు.   

Also read: India Vs Australia : టీ20 సీరీస్ భారత్ కైవసం

WTA Rankings : మళ్లీ భారత నంబర్‌వన్‌గా అంకిత  

గతవారం కొరియా ఓపెన్‌లో ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరిన భారత అగ్రశ్రేణి క్రీడాకారిణి అంకిత రైనా మహిళల టెన్నిస్‌ సంఘం (డబ్ల్యూటీఏ) తాజా ర్యాంకింగ్స్‌లో పురోగతి సాధించింది. సెప్టెంబర్ 26న విడుదల చేసిన ఈ ర్యాంకింగ్స్‌లో 29 ఏళ్ల అంకిత 55 స్థానాలు ఎగబాకి 274వ ర్యాంక్‌కు చేరుకుంది. అంతేకాకుండా వారం వ్యవధిలోనే మళ్లీ భారత నంబర్‌వన్‌ ర్యాంకర్‌గా నిలిచింది. వారంరోజులపాటు భారత నంబర్‌వన్‌గా నిలిచిన కర్మన్‌కౌర్‌ ఒక స్థానం పడిపోయి 323వ ర్యాంక్‌లో నిలిచింది.

Also read: Women's cricket: ఇంగ్లండ్‌పై నెగ్గిన భారత్‌

ICC T20 Rankings : అగ్రస్థానంలోనే భారత్ 

ప్రపంచ చాంపియన్‌ ఆ్రస్టేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న భారత జట్టు అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) టీమ్‌ ర్యాంకింగ్స్‌లో తన టాప్‌ ర్యాంక్‌ను పటిష్టం చేసుకుంది. సెప్టెంబర్ 26న విడుదల చేసిన టీమ్‌ ర్యాంకింగ్స్‌లో రోహిత్‌ శర్మ బృందం 268 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 261 పాయింట్లతో ఇంగ్లండ్‌ రెండో స్థానంలో ఉండగా... 258 పాయింట్లతో దక్షిణాఫ్రికా, పాకిస్తాన్‌ సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాయి. ఇంగ్లండ్‌తో ఏడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో పాకిస్తాన్‌ గెలిస్తే రెండో ర్యాంక్‌కు ఎగబాకే అవకాశం ఉంది.  252 పాయింట్లతో న్యూజిలాండ్‌ ఐదో స్థానంలో నిలిచింది. 250 పాయింట్లతో ఆరో ర్యాంక్‌లో ఉన్న ఆ్రస్టేలియా సొంతగడ్డపై ప్రపంచకప్‌నకు ముందు వెస్టిండీస్‌తో రెండు, ఇంగ్లండ్‌తో మూడు టి20 మ్యాచ్‌లు ఆడనుంది. 

Also read: Women's cricket: ఇంగ్లండ్‌పై నెగ్గిన భారత్‌

Smart Caluclator : హైదరాబాద్‌ స్టార్టప్‌ కంపెనీ టుహ్యాండ్స్‌ ఘనత

చిన్న, మధ్యతరహా వ్యాపారులకు రోజువారీ లావాదేవీలు, ఆదాయ, వ్యయాల లెక్కింపులో దోహదపడేందుకు ప్రపంచంలోకెల్లా తొలి స్మార్ట్, మేడ్‌ ఇన్‌ ఇండియా కాలిక్యులేటర్‌ పరికరం హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది. కాలిక్యులేటర్‌కు అనుసంధానంగా ఉండే టు­హ్యాండ్స్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా ఇది పనిచేయనుంది. ఒక్కో లావాదేవీని యాప్‌లోకి వ్యాపారులు నమోదు చేయాల్సిన అవసరం లేకుండా రియల్‌టైమ్‌లోనే లావాదేవీల వివరాలన్నీ ఈ పరికరంలో నిక్షిప్తం కావడం దీని ప్రత్యేకత. స్టార్టప్‌ ఇండియా సీడ్‌ ఫండ్, టీ–హబ్‌ సహకారంతో టుహ్యాండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే స్టార్టప్‌ కంపెనీ రూ. 50 లక్షల నిధులను సమీకరించి స్మార్ట్‌ కాలిక్యులేటర్‌ను అభివృద్ధి చేసింది. సెప్టెంబర్ 26న నగరంలోని ‘టీ–హబ్‌’లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ఈ పరికరాన్ని ఆవిష్కరించారు. 

Also read: Samudrayan Project: సముద్రాల గుట్టు ఛేదించే మత్స్య యంత్రం

దీని ధరను రూ. 2,999గా నిర్ణయించారు.  ఏడాది వారంటీతో పనిచేసే ఈ పరికరంలో 90 రోజుల డేటాను సులభంగా పొందొచ్చు. 

Epigraphy Museum : హైదరాబాద్ లో కాకుండా తమిళనాడుకు ? 

దేశంలోనే తొలి శాసనాల ప్రదర్శనశాల (ఎపిగ్రఫీ మ్యూజియం)ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే ప్రక్రియకు ఆదిలోనే అవాంతరం ఎదురవుతోంది. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి ఆమోదించిన ప్రతిపాదనే బుట్టదాఖలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ మ్యూజియాన్ని హైదరాబాద్‌లో కాకుండా తిరుచ్చిలో ఏర్పాటు చేసేలా తమిళనాడుకు చెందిన కొందరు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు తెరవెనుక చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. భారత పురావస్తు శాఖ  (ఏఎస్‌ఐ)లో పనిచేస్తున్న కొందరు ఉన్నతాధికారులు, ఢిల్లీలోని మరికొందరు తమిళ ఐఏఎస్‌ అధికారులు ఈ దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వెరసి.. భాగ్యనగరానికి మరింత పర్యాటక శోభ తీసుకురావాల్సిన ప్రాజెక్టు కాస్తా మనకు దక్కకుండా పోయే పరిస్థితి నెలకొంది. 

Also read: Andhra University: మధుమేహ వ్యాధిని గుర్తించేందుకు AU అద్భుత ఆవిష్కరణ.. ఒక స్ట్రిప్‌ ఆరు నెలల వినియోగం

తొలుత హైదరాబాద్‌లో ఏర్పాటుకు మొదలైన కసరత్తు.. 

దేశంలో ప్రస్తుతం శాసనాలకు ప్రత్యేకంగా మ్యూజియం లేదు. మైసూరు కేంద్రంగా ఏఎస్‌ఐలో భాగంగా శాసనాల విభాగం ఉంది. దీని పరిధిలో లక్నో, చెన్నై, నాగ్‌పూర్‌లలో ప్రాంతీయ కార్యాలయాలున్నాయి. మైసూరులో దాదాపు 75 వేల శాసనాలకు చెందిన నకళ్లు ఉన్నాయి. కానీ ప్రజలు సందర్శించి శాసనాల వివరాలు తెలుసుకునేలా మ్యూజియం మాత్రం లేదు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో లభించిన శాసనాలను భద్రపరిచేందుకు, పర్యాటకులు వాటిని తిలకించేందుకు వీలుగా ఎపిగ్రఫీ మ్యూజియాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని చరిత్ర పరిశోధకులు గతేడాది కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి దృష్టికి తెచ్చారు. దీనికి ఆయన ఆమోదం తెలిపారు. దీంతో వెంటనే స్థానికంగా మ్యూజియం ఏర్పాటుకు వీలుగా కసరత్తు ప్రారంభమైంది. 

Also read: AI: ప్రపంచంలో మొట్టమొదటి రోబో CEOగా టాంగ్‌ యూ

ఓ చిన్న పెవిలియన్‌తో సరిపెట్టేలా.. 
కానీ ఏఎస్‌ఐలో పనిచేసే తమిళనాడుకు చెందిన ఓ సీనియర్‌ అధికారి కేంద్ర మంత్రి ప్రతిపాదనకు గండికొట్టి ఎపిగ్రఫీ మ్యూజియాన్ని తమిళనాడులోని తిరుచ్చిలో ఏర్పాటు చేసే పని ప్రారంభించారు. హైదరాబాద్‌లో ఎపిగ్రఫీ మ్యూజియం బదులు సాలార్‌జంగ్‌ మ్యూజియంలో ఓ చిన్న పెవిలియన్‌ ఏర్పాటుకు ప్రతిపాదించారు. దీంతో ఏఎస్‌ఐ తెలంగాణ సర్కిల్‌ అధికారులు సాలార్‌జంగ్‌ మ్యూజియంలో ప్రతిపాదిత పెవిలియన్‌ కోసం 132 శాసన కాపీలను ప్రదర్శించేందుకు ఓ జాబితా రూపొందించారు. దాదాపు రూ. 20 లక్షలు వెచ్చించి పెవిలయన్‌ గ్యాలరీలు సిద్ధం చేశారు. 

Also read: Visakhapatnam: అస్త్ర పరీక్షల కేంద్రంగా విశాఖ

మైసూరు నుంచి తమిళ శాసన కాపీల తరలింపు యత్నం.. 
మైసూరులోని ఎపిగ్రఫీ డైరెక్టరేట్‌లో దాదాపు 75 వేల శాసన నకళ్లున్నాయి. వాటిల్లో 23 వేలకుపైగా తమిళ భాషవే ఉన్నాయి. ఇప్పుడు వాటిని తమిళనాడుకు తరలించేందుకు ఆ అధికారులు తెరవెనక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత తిరుచ్చిలో జాతీయ మ్యూజియం ఏర్పాటు చేయాలన్నది ఆ అధికారుల యోచన. 

Also read: Vande Bharat Trains: అధునాతన సాంకేతికతతో వందేభారత్‌ రైళ్లు

Digital Health Services : ఏపీకి 6 అవార్డులు

ప్రజలకు డిజిటల్‌ వైద్యసేవలు అందించడంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్రానికి జాతీయ స్థాయిలో ఆరు అవార్డులు లభించాయి. ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన (ఏబీ పీఎం–జేఏవై) నాలుగో, ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ (ఏబీడీఎం) ఒకటో వార్షికోత్సవం సందర్భంగా ఢిల్లీలో కేంద్ర వైద్యశాఖ నిర్వహిస్తున్న ఆరోగ్య మంథన్‌–2022 కార్యక్రమంలో సెప్టెంబర్ 26న కేంద్ర వైద్యశాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ చేతుల మీదుగా రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక  కార్యదర్శి నవీన్‌కుమార్‌ ఈ అవార్డులను అందుకున్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ అకౌంట్స్‌ (అభా)కు అత్యధికంగా ఆరోగ్య రికార్డులను అనుసంధానం చేసిన రాష్ట్రం, జిల్లాలు, 100 శాతం ఆస్పత్రులు ఈహెచ్‌ఆర్‌లో ఎన్‌రోల్‌మెంట్, ఉత్తమ ప్రభుత్వ ఆరోగ్య రికార్డు ఇంటిగ్రేటర్‌ విభాగాల్లో ఏపీ ఆరు అవార్డులు సాధించింది. దేశంలోనే అభాకు అత్యధిక ఆరోగ్య రికార్డులు అనుసంధానించిన విభాగంలో పార్వతీపురం మన్యం, బాపట్ల, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు జాతీయ స్థాయిలో అవార్డులు లభించాయి. .

Also read: AP: ఆకట్టుకుంటున్న RBK చానల్‌

3.4 కోట్లమందికి హెల్త్‌ ఐడీలు
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 24.38 కోట్లమంది ప్రజలకు డిజిటల్‌ హెల్త్‌ ఐడీలను సృష్టించారు. 3.4 కోట్లమందికి హెల్త్‌ ఐడీలు సృష్టించి ఏపీ దేశంలోనే మొదటిస్థానంలో ఉంది. 2.6 కోట్ల హెల్త్‌ ఐడీలతో మధ్యప్రదేశ్, 1.99 కోట్ల హెల్త్‌ ఐడీలతో ఉత్తరప్రదేశ్‌ తరువాత స్థానాల్లో నిలిచాయి. రాష్ట్రంలో 3.4 కోట్ల మందికి ఐడీలు సృష్టించగా వీరిలో కోటిమందికిపైగా ఐడీలకు ఆరోగ్య రికార్డులను అనుసంధానించారు. మరోవైపు రాష్ట్రంలో 13,335 ప్రభుత్వ ఆస్పత్రులు, వాటిల్లో పనిచేస్తున్న వైద్యులు 16,918 మందిని ఏబీడీఎంలో రిజిస్టర్‌ చేశారు.

Also read: Green Hydrogen Hub గా ఆంధ్రప్రదేశ్‌

Unemployment : ఆగస్టులో దేశ సగటు నిరుద్యోగ రేటు 8.3%

 

ఈ ఏడాది ఆగస్టు నాటికి జాతీయ సగటు నిరుద్యోగ రేటు 8.3 శాతంగా ఉందని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ(సీఎంఐఈ) తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడైంది. ఇక దేశంలోని పెద్ద రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ లోనే నిరుద్యోగ రేటు తక్కువగా ఉంది. ఏపీ నిరుద్యోగ రేటు 6 శాతంగా ఉంది. ఇక పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన పొరుగు రాష్ట్రాలు తమిళనాడు, తెలంగాణతో పాటు పశ్చిమ బెంగాల్, రాజస్తాన్, పంజాబ్‌ వంటి పెద్ద రాష్ట్రాల కంటే కూడా ఏపీలోనే నిరుద్యోగ రేటు చాలా తక్కువగా ఉంది. తమిళనాడులో 7.2%గా ఉంటే.. తెలంగాణలో 6.9%గా నమోదయ్యింది. దేశంలో అత్యధికంగా హరియాణాలో 37.3%, జమ్మూ అండ్‌ కశ్మీర్‌ 32.8, రాజస్తాన్‌లో 31.4% ఉండగా.. అత్యల్పంగా చత్తీస్‌గఢ్‌లో 0.4% మేర నిరుద్యోగముంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన మహారాష్ట్రలో 2.2%, మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో 2.6%గా నిరుద్యోగ రేటు నమోదయ్యింది. 

Also read: YSR ఆరోగ్య విశ్వ విద్యాలయంగా మార్చేందుకు రాష్ట్ర ఉభయ సభలు ఆమోదం..

ప్రభుత్వ ప్రోత్సాహంతో కోవిడ్‌ను అధిగమించి..
కోవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో దేశవ్యాప్తంగా నిరుద్యోగ రేటు రికార్డు స్థాయికి చేరుకుంది. 2020 ఏప్రిల్‌లో దేశ నిరుద్యోగ రేటు 23.6 శాతానికి చేరగా.. ఏపీలో 20.5 శాతంగా నమోదయ్యింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై తీసుకున్న చర్యలతో నిరుద్యోగ రేటు తగ్గుతూ వచ్చింది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం శాశ్వత, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ విభాగాల్లో కలిపి మొత్తం 6,16,323 మందికి ప్రభుత్వ రంగంలో ఉపాధి కల్పించింది. ఇందులో శాశ్వత ఉద్యోగాలు 2,06,638 ఉన్నాయి. ఇవి కాకుండా కోవిడ్‌ సమయంలో పరిశ్రమలు, వ్యాపార సముదాయాలు మూతపడకుండా.. ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకునే విధంగా చేపట్టిన చర్యలు కూడా సత్ఫలితాలనిచ్చాయి. రీస్టార్ట్‌ ప్యాకేజీ ప్రకటించి ఎంఎస్‌ఎంఈలను ఆదుకోవడం వల్ల లక్షలాది మందికి ఉపాధి లభించింది. అలాగే ప్రభుత్వ చొరవతో రాష్ట్రంలో ప్రముఖ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టడం.. ఇప్పటికే పలు సంస్థలు తమ పరిశ్రమలను ప్రారంభించడంతో ఉపాధి అవకాశాలు భారీగా పెరిగాయి. ప్రభుత్వం తీసుకున్న ఇలాంటి ఎన్నో నిర్ణయాల వల్ల రాష్ట్రంలో నిరుద్యోగ రేటు గణనీయంగా తగ్గిందని నిపుణులు పేర్కొంటున్నారు.

Also read: AP State Economy: ‘నికరం’గా ఆర్థికవృద్ధి!

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 27 Sep 2022 07:00PM

Photo Stories