Daily Current Affairs in Telugu: 2022, అక్టోబర్ 7th కరెంట్ అఫైర్స్
TS: టీఆర్‌ఎస్ .. ఇక బీఆర్‌ఎస్!.. పేరు మారుస్తూ పార్టీ ఏకగ్రీవ తీర్మానం
తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ టీఆర్‌ఎస్ పార్టీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన అక్టోబర్ 5న తెలంగాణ భవన్‌లో జరిగిన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు. ‘అక్టోబర్ 5న టీఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయంలో జరిగిన జనరల్ బాడీ సమావేశం తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ ఏకగ్రీవంగా తీర్మానం అమోదించింది. పార్టీ కార్యకలాపాలను జాతీయ స్థాయిలో విస్తరించడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ మేరకు పార్టీ నియమావళిలో మార్పులు చేశాం..’ అంటూ కేసీఆర్ చేసిన ప్రకటనకు జనరల్ బాడీ సభ్యులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఆమోదం తెలిపారు. కాగా పార్టీ నిర్ణయాన్ని తెలియచేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి కేసీఆర్ లేఖ రాశారు. ‘టీఆర్‌ఎస్ పేరును భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ పార్టీ రాజ్యాంగంలో చేసిన సవరణలకు జనరల్ బాడీ సమావేశం ఆమోదం తెలిపింది. వీటికి సంబంధించిన తీర్మానాలు, పార్టీ రాజ్యాంగ సవరణ అంశాలను సమర్పిస్తున్నాం..’ అని లేఖలో పేర్కొన్నారు.
Also read: Quiz of The Day (October 07, 2022): మలేరియా వ్యాధి ఏ అవయవంపై ప్రభావాన్ని చూపుతుంది?
ఢిల్లీ సర్దార్ పటేల్ రోడ్డులో కార్యాలయం
ఢిల్లీ కౌటిల్యమార్గ్ సమీపంలోని సర్దార్ పటేల్ రోడ్‌లో ఉన్న రాజకుటుంబీలకు చెందిన ఓ భవనంలో బీఆర్‌ఎస్ కార్యాలయం ఏర్పాటు కానుంది.
Also read: Weekly Current Affairs (Sports) Bitbank: BCCI టైటిల్ స్పాన్సర్‌గా Paytm స్థానంలో ఏ కంపెనీ వచ్చింది?
AP: ప్రపంచ వారసత్వ కట్టడంగా ‘ధవళేశ్వరం’
గోదావరి డెల్టాను 160 ఏళ్లుగా సస్యశ్యామలం చేస్తూ.. భారతదేశపు ధాన్యాగారంగా నిలిపిన ధవళేశ్వరం బ్యారేజ్ (సర్ ఆర్ధర్ కాటన్ ఆనకట్ట) మణిహారంలో మరో కలికితురాయి చేరింది. ప్రపంచ సాగునీటి వారసత్వ కట్టడంగా బ్యారేజ్‌ను ఐసీఐడీ(ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్) గుర్తించింది. ఇందుకు సంబంధించిన గుర్తింపు పత్రాన్ని ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో జరుగుతున్న ఐసీఐడీ 24వ కాంగ్రెస్‌లో అక్టోబర్ 6న ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డిలకు ఆ సంస్థ చైర్మన్ ప్రొ.ఆర్. రగబ్ రగబ్ అందజేశారు.
Also read: Nobel Prize In Physics 2022: కణ కవలలపై పరిశోధనలు
పక్కన గోదావరి ప్రవహిస్తున్నా సాగు, తాగునీటికి తల్లడిల్లే గోదావరి డెల్టాను సస్యశ్యామలం చేయడం.. కాకినాడ నుంచి పుదుచ్చేరికి జలరవాణా మార్గానికి కేంద్ర బిందువుగా చేసేందుకు 1857లో బ్రిటిష్ సర్కార్ ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణాన్ని ప్రారంభించి 1862లో పూర్తిచేసి కాలువల వ్యవస్థను అభివృద్ధి చేసింది. కాకినాడ కెనాల్ మీదుగా ధవళేశ్వరం బ్యారేజ్‌కు చేరి.. అక్కడి నుంచి ఏలూరు కెనాల్ మీదుగా ప్రకాశం బ్యారేజ్‌కు చేరి అక్కడి నుంచి కొమ్మమూరు, బకింగ్‌హాం కెనాల్ ద్వారా బంగాళాఖాతంలోకి చేరుకుని అక్కడి నుంచి చెన్నై, పుదుచ్చేరికి వెళ్లేలా అప్పట్లోనే జలరవాణా మార్గాన్ని అభివృద్ధి చేశారు.
Also read: Swachh survekshan awards 2022: దేశంలో ఎక్కువ అవార్డులు సాధించిన రెండో రాష్ట్రం తెలంగాణ
ఆనకట్ట స్థానంలో బ్యారేజ్..
బ్రిటిష్ సర్కార్ నిర్మించిన ఈ ఆనకట్ట శిథిలావస్థకు చేరడంతో 1970లో ధవళేశ్వరం బ్యారేజ్‌ను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. తూర్పు, పశ్చిమ, మధ్య డెల్టాల్లో 10,13,376 ఎకరాల ఆయకట్టు, 833 గ్రామాలకు తాగునీరు అందించడమే లక్ష్యంగా కాలువలను విస్తరించింది. జలయజ్ఞంలో భాగంగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ కాలువల వ్యవస్థను ఆధునీకరించారు.
Also read: Weekly Current Affairs (Awards) Bitbank: ఇంటర్నేషనల్ ట్రావెల్ అవార్డ్ 2023ని ఏ రాష్ట్రం గెలుచుకుంది?
దేశంలో నాలుగు కట్టడాలకు గుర్తింపు
పురాతన కాలం నుంచి ఆయకట్టుకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందిస్తున్న కట్టడాలను ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడాలుగా ఐసీఐడీ గుర్తిస్తోంది. ఈసారి అడిలైడ్‌లో జరుగుతున్న 24వ కాంగ్రెస్‌లో ప్రపంచవ్యాప్తంగా 22 ప్రాజెక్టులను గుర్తించగా.. ఇందులో దేశంలోని నాలుగు ప్రాజెక్టులకు స్థానం దక్కింది. వీటిలో ఏపీలోని ధవళేశ్వరం బ్యారేజ్, తమిళనాడులోని లోయర్ ఆనకట్ట, ఒడిశాలోని బైతరణి, రుషికుల్య ప్రాజెక్టులున్నాయి.
2019లో ఇండోనేషియాలో జరిగిన 23వ కాంగ్రెస్‌లో రాష్ట్రంలోని కేసీ (కర్నూల్–కడప) కెనాల్ (కర్నూల్ జిల్లా), కంబం చెరువు (ప్రకాశం జిల్లా), పోరుమామిళ్ల చెరువు (వైఎస్సార్ జిల్లా)లను ప్రపంచ సాగునీటి వారసత్వ కట్టడాలుగా ICID గుర్తించింది.
Nobel Prize 2022: రసాయన శాస్త్రంలో ముగ్గురికి ఉమ్మడిగా నోబెల్
రసాయన శాస్త్రంలో ఈ ఏడాదికి (2022) గాను ముగ్గురు శాస్త్రవేత్తలకు ఉమ్మడిగా నోబెల్ బహుమతి దక్కింది. అమెరికాకు చెందిన కరోలిన్ ఆర్.బెర్టోజీ, కె.బ్యారీ షార్ప్‌లెస్, డెన్మార్క్‌కు చెందిన మోర్టెన్ మెల్డాల్ ఈ ప్రతిష్టాత్మక బహుమతికి ఎంపికయ్యారు. పాలిమర్స్, క్యాన్సర్ ఔషధాల తయారీ, డీఎన్‌ఏ మ్యాపింగ్ వంటి వాటిలో ఉపయోగపడే క్లిక్ కెమిస్ట్రీ, బయో ఆర్థోగానల్ రియాక్షన్స్‌లో వారు విశేషమైన కృషి చేశారని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అక్టోబర్ 5న ప్రకటించింది. మరింత మెరుగైన ఔషధాలను రూపొందించడానికి వారి పరిశోధనలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొంది. విశేషం ఏమిటంటే.. ఈసారి కెమిస్ట్రీలో నోబెల్‌కు ఎంపికైన ముగ్గురిలో ఒకరైన కె.బ్యారీ షార్ప్‌లెస్(81) 2001లో నోబెల్ బహుమతి అందుకున్నారు. ఇప్పుడు రెండోసారి స్వీకరించబోతున్నారు. ఇలా రెండుసార్లు నోబెల్ ప్రైజ్ స్వీకరించిన ఐదో వ్యక్తిగా రికార్డు సృష్టించబోతున్నారు.
Also read: Nobel Peace Prize for 2022 : ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారం వీరికే..
మోర్టెన్ మెల్డాల్ (68) యూనివర్సిటీ ఆఫ్ కోపెన్‌హగన్‌లో పని చేస్తున్నారు. షార్ప్‌లెస్ కాలిఫోరి్నయాలోని స్క్రిప్స్ రీసెర్చ్ సంస్థలో పనిశోధనలు సాగిస్తున్నారు. ఇక కరోలిన్ ఆర్.బెర్టోజీ (55) స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. ఆమె క్లిక్ కెమిస్ట్రీని కొత్త స్థాయికి తీసుకెళ్లారని నోబెల్ కమిటీ ప్రశంసించింది.
Also read: Nobel Prize 2022: భౌతిక శాస్త్రంలో ముగ్గురికి ఉమ్మడిగా నోబెల్
రసాయన శాస్త్రంలో గత ఏడాది (2021) నోబెల్ .. బెంజమిన్ లిస్ట్, డేవిడ్ మెక్‌మిలన్‌లకు లభించింది.
Nobel Prize in Literature: అన్నీ ఎర్నౌవ్(Annie Ernaux)కు సాహిత్య నోబెల్
ప్రముఖ ఫ్రెంచ్ రచయిత్రి అన్నీ ఎర్నౌవ్(82) 2022 సంవత్సరానికి గాను సాహిత్య రంగంలో అత్యున్నత నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. సాహిత్యంలో ఆమె విశేషమైన కృషి చేశారని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రశంసించింది. ‘ద కరేజ్ అండ్ క్లినికల్ అక్యూటీ’ పేరిట వ్యక్తిగత జ్ఞాపకశక్తికి సంబంధించిన మూలాలపై ఎర్నౌవ్ చేసిన రచనలకు గాను నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్లు తెలియజేసింది. ఎర్నౌవ్ తొలుత ఆటోబయెగ్రాఫికల్ నవలు రాశారు. తర్వాత కాల్పనిక సాహిత్యాన్ని వదిలేసి, జ్ఞాపకశక్తికి సంబంధించిన పుస్తకాల రచనపై దృష్టి పెట్టారు. 30కి పైగా పుస్తకాలు వెలువరించారు. ఇందులో అధికశాతం తన జీవితంలో, ఇరుగుపొరుగు ప్రజల జీవితాల్లో చోటుచేసుకున్న సంఘటనలపై ఆధారపడినవే కావడం విశేషం. తన తల్లిదండ్రుల మరణం, అనారోగ్యాలు, గర్భస్రావాలు, స్త్రీ పురుషుల మధ్య సంబంధాలను సున్నితంగా వ్యక్తీకరించారు. ఎర్నౌవ్ రాజీపడని రచయిత్రి, అందరికీ అర్థమయ్యేలా సులభ శైలిలో రచనలు చేశారని నోబెల్ కమిటీ చైర్మన్ ఆండర్స్ ఒల్సాన్ కొనియాడారు.
Also read: Nobel Prize In Physics 2022: కణ కవలలపై పరిశోధనలు
‘ద ఇయర్స్’ పేరిట 2008లో వెలువడిన ఎర్నౌవ్ రచన విమర్శకుల ప్రశంసలు పొందింది. తండ్రితో తన అనుబంధాన్ని వివరిస్తూ ‘ద ప్లేస్’ పేరిట మరో పుస్తకం రాశారు. లింగ, భాష, వర్గం వంటి అంశాలకు స్వీయ అనుభవాలను జోడిస్తూ, భిన్నమైన కోణాల్లో విశ్లేషిస్తూ ఎర్నౌవ్ చేసిన రచనలు పాఠకాదరణ పొందాయి. ఆమె 1940లో ఫ్రాన్స్ దేశం నార్మండీలోని యెవెటోట్ అనే పట్టణంలో పుట్టిపెరిగారు.
Also read: Daily Current Affairs in Telugu: 2022, అక్టోబర్ 6th కరెంట్ అఫైర్స్
1901 నుంచి ఇప్పటిదాకా సాహిత్య రంగంలో 119 మందికి నోబెల్ ప్రైజ్ ప్రదానం చేయగా, ఈ బహుమతికి ఎంపికైన 17వ మహిళ ఎర్నౌవ్ కావడం గమనార్హం.
Also read: Daily Current Affairs in Telugu: 2022, అక్టోబర్ 4th కరెంట్ అఫైర్స్
UAPA ట్రిబ్యునల్ పీవోగా జస్టిస్ దినేశ్ శర్మ
చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) ట్రిబ్యునల్ ప్రిసైడింగ్ అధికారి (పీవో)గా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దినేశ్ కుమార్ శర్మ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ), అనుబంధ సంస్థలపై విధించిన ఐదేళ్ల నిషేధాన్ని ఈ ట్రిబ్యునల్ సమీక్షించనుంది. యూఏపీఏలోని సెక్షన్–3 ప్రకారం ఏదైనా సంస్థచట్ట విరుద్ధమని ప్రకటితమైతే ఆ మేరకు వచ్చిన నోటిఫికేషన్‌ను కేంద్రం తగిన కారణాలు తెలుపుతూ ట్రిబ్యునల్‌కు పంపాలి. సెక్షన్–5 ప్రకారం ట్రిబ్యునల్‌లో హైకోర్టు న్యాయమూర్తి స్థాయి వ్యక్తి ఉండాలి. కేంద్రం కారణాలు పరిశీలించిన ట్రిబ్యునల్... చట్ట విరుద్ధమని ఎందుకు ప్రకటించకూడదో 30 రోజుల్లోగా తెలపాలని సదరు సంస్థ కోరుతుంది. సెక్షన్–4 ప్రకారం కేంద్రం విధించిన నిషేధం UAPA ట్రిబ్యునల్ నిర్ధారించిన తర్వాతే అమలులోకి వస్తుంది.
Also read: Daily Current Affairs in Telugu: 2022, అక్టోబర్ 3rd కరెంట్ అఫైర్స్
21న GSLV మార్క్3 ప్రయోగం
న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ సంయుక్త ఆధ్వర్యంలో 21న సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ ప్రయోగవేదిక నుంచి జియో శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (జీఎస్‌ఎల్‌వీ మార్క్3)ను ప్రయోగించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. నెట్‌వర్క్ యాక్సెస్ అసోసియేషన్ లిమిటెడ్ (వన్‌వెబ్) ఇస్రో, న్యూస్పేస్ ఇండియా, డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్‌లు ఈ ప్రయోగాన్ని చేసేందుకు ఇటీవల ఒప్పందం చేసుకున్నారు. వన్‌వెబ్ ఇండియా–1 పేరుతో 36 ఉపగ్రహాలను ఒక్కటిగా చేసి వాణిజ్యపరంగా రోదసీలోకి జీఎస్‌ఎల్‌వీ మార్క్3 రాకెట్ ద్వారా పంపేందుకు సిద్ధం చేస్తున్నారు. ఇన్నాళ్లూ పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌నే వాణిజ్యపరమైన ప్రయోగాలకు వాడారు.
Also read: Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 30th కరెంట్ అఫైర్స్
జీఎస్‌ఎల్‌వీ మార్క్3 భారీ రాకెట్‌ను వాణిజ్యపరమైన ప్రయోగాలకు వాడటం ఇదే తొలిసారి. ప్రాజెక్టు ఒప్పందంలో భాగంగా 36 ఉపగ్రహాలను లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లో ప్రవేశపెడతారు. ‘వన్‌వెబ్ అనేది గ్లోబల్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్. ఇది అంతరిక్ష వ్యాపారాలకు, ప్రభుత్వాలకు వెబ్ కనెక్టివిటి సేవలు అందించే విధంగా రూపొందించారు’ అని ఇస్రో పేర్కొంది.
ఉక్రెయిన్‌లో మళ్లీ రష్యా క్షిపణి దాడులు
దక్షిణ ఉక్రెయిన్‌లోని జపొరిజాజియా సిటీలో రష్యా క్షిపణులు గర్జించాయి. క్షిపణి దాడుల్లో 40కిపైగా భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారని, కనీసం 12 మంది గాయపడ్డారని స్థానిక అధికారులు గురువారం వెల్లడించారు. ఒకటి సూర్యోదయానికి ముందు, మరొకటి ఉదయం క్షిపణి దాడి జరిగిందని పేర్కొన్నాయి. యూరప్‌లోనే అతి పెద్దదైన అణు విద్యుత్ ప్లాంట్ జపొరిజాజియాలో ఉంది. ఈ ప్లాంట్ సమీపంలోనే రష్యా సైన్యం క్షిపణి దాడులు నిర్వహించడం గమనార్హం. అణు విద్యుత్ ప్లాంట్‌ను రష్యా గతంలోనే ఆక్రమించుకుంది. రష్యా ఆక్రమించుకున్న తమ భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకుంటున్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు. దీనివల్ల రష్యా అధినేత పుతిన్ అణ్వస్త్ర ప్రయోగానికి పాల్పడతారా? అనేది చెప్పడం కష్టమని అన్నారు. అణు దాడికి పుతిన్ సాహసించకపోవచ్చని తాను భావిస్తున్నాని తెలిపారు. సిడ్నీలో లౌవీ ఇనిస్టిట్యూట్‌లో జరిగిన ఓ సదస్సులో జెలెన్‌స్కీ వీడియో లింక్‌లో ప్రసంగించారు.
Also read: North Korea Missile: జపాన్ మీదుగా ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగం
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP