Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 30th కరెంట్ అఫైర్స్
Abortion : గర్భస్రావం మహిళ హక్కు : సుప్రీంకోర్టు
గర్భధారణ, మాతృత్వపు హక్కుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. చట్టపరమైన సురక్షిత గర్భస్రావం మహిళలందరికీ సమానంగా వర్తించే హక్కేనని తేల్చిచెప్పింది. వివాహితులు, అవివాహితులు అంటూ తేడా చూపించడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. పెళ్లయిన వారితో సమానంగా అవివాహితులకు కూడా 24 వారాల్లోపు గర్భస్రావం చేయించుకునే హక్కు ఉంటుందని పేర్కొంది. అంతేగాక వైవాహిక అత్యాచారాన్ని కూడా వైద్యపరమైన గర్భవిచ్ఛిత్తి (ఎంటీపీ) చట్ట నిర్వచనం ప్రకారం రేప్‌గానే పరిగణించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎంటీపీ చట్ట పరిధిని విస్తరిస్తూ న్యాయమూర్తులు జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ పార్డీవాలా, జస్టిస్ ఎ.ఎన్.బొపన్నలతో కూడిన ధర్మాసనం సెప్టెంబర్ 29న చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. అంతర్జాతీయ సురక్షిత అబార్షన్ దినోత్సవం (సెప్టెంబర్ 28) మర్నాడే ఈ తీర్పు రావడం విశేషం.
Also read: Weekly Current Affairs (Awards) Bitbank: 64వ రామన్ మెగసెసే అవార్డు 2022 గ్రహీతలు/గ్రహీతలు ఎవరు?
"చట్టపరంగా సురక్షిత అబార్షన్ చేయించుకోవడానికి మహిళలందరూ అర్హులే. గర్భిణులు 20–24 వారాల మధ్య అబార్షన్ చేయించుకోవచ్చని గర్భవిచ్ఛిత్తి చట్టం సెక్షన్ 3(2)(బీ) చెబుతోంది. దీన్ని వివాహితులకే వర్తింపజేసి అవివాహితులను దూరం పెట్టడం ఆర్టికల్ 14ను ఉల్లంఘించడమే.
స్త్రీకి తన శరీరంపై సంపూర్ణ హక్కుంటుంది. అవాంఛిత గర్భం ఆమె శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. కనుక పెళ్లయిందా, లేదా అనేదానితో నిమిత్తం లేకుండా అబార్షన్‌పై ఆమెదే అంతిమ నిర్ణయం. అత్యాచారానికి, లైంగిక వేధింపులకు గురైనట్టు నిరూపించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కుటుంబ సభ్యుల సమ్మతీ అవసరం లేదు. మైనర్, లేదా మానసిక వైకల్యమున్న వారికి మాత్రమే సంరక్షకుల సమ్మతి అవసరం" – జస్టిస్ డీవై చంద్రచూడ్
ఇప్పటిదాకా వీరు అర్హులు...
2021లో చేసిన సవరణ నేపథ్యంలో ఎంటీపీ చట్టం సెక్షన్ 3(బి) ప్రకారం 24 వారాల దాకా అబార్షన్ చేయించుకోవడానికి ఇప్పటిదాకా ఈ కింది కేటగిరీల మహిళలకు అర్హత ఉంది...
☛ లైంగిక దాడి, అత్యాచార బాధితులు
☛ మైనర్లు
☛ గర్భధారణ తర్వాత భర్తను కోల్పోయిన, విడాకులు తీసుకున్నవాళ్లు
☛ కాన్పును కష్టతరం చేసే తరహా శారీరక వైకల్యమున్న వాళ్లు
☛ మానసిక సమస్యలున్నవాళ్లు
☛ పిండం సరిగా ఎదగనివాళ్లు
☛ ప్రకటిత అత్యవసర పరిస్థితులు, విపత్తుల వేళల్లో గర్భం ధరించిన వాళ్లు
తాజా తీర్పుతో అవివాహితలు/సహజీవనం చేస్తున్న వారికీ 24 వారాల దాకా అబార్షన్ చేయించుకునే హక్కు దఖలుపడింది.
కేసు నేపథ్యం ఇదీ...
ఈశాన్య ప్రాంతానికి చెందిన ఓ 25 ఏళ్ల అవివాహిత 23 వారాల 5 రోజుల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతివ్వాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. భాగస్వామి పెళ్లికి నిరాకరించి తనను వదిలేశాడని పేర్కొంది. కానీ, ‘‘ఆమె ఇష్టపూర్వకంగా గర్భం దాల్చింది. 20 వారాలు దాటినందున ఎంటీపీ చట్టం ప్రకారం అబార్షన్‌కు అనుమతివ్వలేం’’ అని హైకోర్టు పేర్కొంది. దీన్ని ఆమె సుప్రీంకోర్టులో సవాలు చేసింది. అబార్షన్‌కు అనుమతిస్తూ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఎంటీపీ చట్టానికి 2021లో చేసిన సవరణ ద్వారా ‘భర్త’ అనే పదాన్ని ‘భాగస్వామి’గా మార్చిన విషయాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని అభిప్రాయపడింది. ఆగస్టు 23న వాదనలు ముగించి తాజాగా తీర్పు వెలువరించింది.
వైవాహిక అత్యాచారానికి గురైనా...
వైవాహిక అత్యాచారాన్ని కూడా ఎంటీపీ చట్టానికి సంబంధించినంత వరకు అత్యాచారం పరిధిలోకి తేవాల్సి ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. ‘‘అత్యాచారమంటే మహిళ తన సమ్మతి లేకుండా లైంగిక సంపర్కంలో పాల్గొనాల్సి రావడం. అపరిచితులు మాత్రమే రేప్‌లకు, లైంగిక వేధింపులకు పాల్పడతారన్న అపోహ ఉంది. భర్త/జీవిత భాగస్వామి చేతిలో లైంగిక వేధింపులు చిరకాలంగా మహిళలు ఎదుర్కొంటున్న చేదు అనుభవాలే. కాబట్టి వీటినీ అత్యాచారంగానే పరిగణిస్తూ, తద్వారా దాల్చే బలవంతపు గర్భం బారినుంచి మహిళలను కాపాడాల్సి ఉంది. వారికీ 24 వారాల్లోపు అబార్షన్ చేయించుకునే హక్కుంటుంది’’ అని పేర్కొంది. అయితే ‘‘వైవాహిక అత్యాచారాన్ని ఐపీసీ సెక్షన్ 375 ప్రకారం రేప్‌గా పరిగణించాలా, లేదా అన్నది మరో ధర్మాసనం విచారణలో ఉంది. దీనిపై వారిదే తుది నిర్ణయం’’ అని పేర్కొంది.
Also read: Weekly Current Affairs (Economy) Bitbank: ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తంలో GST వసూలు చేసింది?
మైనర్ల పేరు వెల్లడించాల్సిన పని లేదు
మైనర్‌కు అబార్షన్ సందర్భంగా పోలీసు రిపోర్టు తప్పనిసరే అయినా బాధితురాలి పేరు, వ్యక్తిగత వివరాలను వైద్యులు తెలపాల్సిన అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. పోక్సో చట్టాన్ని సామరస్యపూర్వకంగా వర్తింపజేయాలని సూచించింది. ‘‘వివాహితలు మాత్రమే లైంగిక కార్యకలాపాల్లో పాల్గొంటారన్నది సరికాదు. అవివాహితలు, మైనర్లు కూడా లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం, లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు గురవడం, గర్భం దాల్చడం జరుగుతోంది. సరైన లైంగిక ఆరోగ్య విద్య లేక కౌమారదశలో పునరుత్పత్తి వ్యవస్థ, సురక్షిత లైంగిక పద్ధతులు, గర్భనిరోధక పరికరాల గురించి తెలియడం లేదు. ఈ సమాచారాన్ని అందరికీ అందుబాటులో ఉంచాలి. ప్రతి జిల్లాలో వైద్య సదుపాయాలు, గుర్తింపు పొందిన వైద్యులు తప్పనిసరిగా ఉండాలి’’అని ఆదేశించింది.
ఏ దేశంలో ఎలా ?
సరిగ్గా మూడు నెలలు క్రితం అగ్రరాజ్యమైన అమెరికా సుప్రీం కోర్టు అబార్షన్లపై రాజ్యాంగబద్ధంగా మహిళలకు వచ్చిన హక్కుల్ని తోసిపుచ్చుతూ తీర్పు చెప్పడం సంచలనం సృష్టించింది. 1973లో రియో వర్సెస్ వేడ్ కేసు ద్వారా రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన హక్కుని 50 ఏళ్ల తర్వాత కొట్టేసింది. ఫలితంగా కొన్ని పరిమితుల మధ్య అబార్షన్ చేయించుకునే దేశాల జాబితాలో చేరిపోయింది. అయితే అమెరికాలో రాష్ట్రాలే శక్తిమంతం కావడంతో ఆయా రాష్ట్రాల నిబంధనల ఆధారంగా మహిళలకు అబార్షన్‌పై హక్కులు వస్తాయి. యూరప్ దేశాల్లో అబార్షన్ చేయించుకోవడం అత్యంత సులభమైతే, ఆఫ్రికా దేశాల్లో నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి. చైనాలో 1953 నుంచి అబార్షన్ చట్టబద్ధం. జనాభా విపరీతంగా పెరిగిపోతూ ఉండడంతో 1970 తర్వాత బలవంతపు అబార్షన్లని కూడా ప్రోత్సహించింది. ఇప్పుడు వృద్ధులు పెరిగిపోతూ ఉండడంతో అనవసరంగా అబార్షన్ చేయించుకోవడానికి వీల్లేదంటూ గత ఏడాది ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Also read: Weekly Current Affairs (Persons) Bitbank: DRDO కొత్త ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
యూరప్ దేశాల్లో...
యూరప్‌లోని అత్యధిక దేశాల్లో మహిళలకు గర్భ విచ్చిత్తిపై హక్కులున్నాయి. 12–14 వారాల్లోపు అబార్షన్ చేయించుకోవడం పూర్తిగా మహిళల ఇష్టమే. ఇంగ్లండ్, స్కాట్‌లాండ్, వేల్స్‌లో 1967లో చట్టం చేశారు. 24 వారాలవరకు అబార్షన్ చేయించుకోవచ్చు. యూకేలో గర్భంలో శిశువు సరిగా ఎదగలేదని తేలితే ఎన్నో నెలలో అయినా గర్భాన్ని తీయించుకునే హక్కు మహిళలకి ఉంది. కెనడాలో గర్భవిచ్చిన్నానికి ప్రత్యేకంగా చట్టం లేకపోయినప్పటికీ ఏ దశలోనైనా అబార్షన్ చేయించుకోవచ్చు. యూరప్, లాటిన్ అమెరికా సంప్రదాయ కేథలిక్ దేశాల్లో కూడా మహిళా కార్యకర్తల ఉద్యమాలతో అబార్షన్‌పై హక్కులు కల్పించారు. గత ఏడాది కొలంబియాలో 24 వారాల్లోపు అబార్షన్ చేయించుకోవడం చట్టబద్ధం చేశారు. ఐర్లాండ్‌లో అబార్షన్ చట్టాలకు పరిమితులు విధించడంపై 2018లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో మహిళలు తిరస్కరించారు. 12 వారాల్లో ఎప్పుడైనా అబార్షన్ చేయించుకునే హక్కు వారికి ఉంది. న్యూజిలాండ్‌లో 2020లోనే మహిళలకు అబార్షన్లపై హక్కులు వచ్చాయి.
Also read: Weekly Current Affairs (National) Bitbank: 300 మీటర్ల పొడవైన అటల్ వంతెన ఏ నగరంలో ప్రారంభించబడింది?
24 దేశాల్లో అబార్షన్ చట్టవిరుద్ధం
ప్రపంచంలోని 24 దేశాల్లో అబార్షన్ చేయించుకోవడం చట్టవిరుద్ధం. వీటిలో అత్యధికంగా ఆఫ్రికా దేశాలుంటే ఆసియా, సెంట్రల్ అమెరికా, యూరప్‌కు చెందిన దేశాలు వీటిలో ఉన్నాయి. సెనగల్, మార్షినియా, ఈజిప్టు, లావోస్, ఫిలిప్పైన్స్, ఎల్ సాల్వోడర్, హోండరస్, పోలాండ్, మాల్టాలో మహిళలు చట్టబద్ధంగా అబార్షన్ చేయించుకోలేరు. కొన్ని దేశాల్లో అబార్షన్ చేయించుకుంటే కఠినమైన శిక్షలు కూడా ఉంటాయి. ఎల్ సాల్వేడర్‌లో మహిళలు అబార్షన్ చేయించుకుంటే దోషిగా నిర్ధారించి జైలు శిక్ష కూడా విధిస్తారు. పోలాండ్ గత ఏడాదే అబార్షన్లపై సంపూర్ణ నిషేధాన్ని విధించింది.పునరుత్పత్తి సామర్థ్యం కలిగిన వయసులో ఉండే ప్రపంచ మహిళా జనాభాలో 5% మంది ఈ 24 దేశాల్లోనే ఉన్నారు. అంటే దాదాపుగా 9 కోట్ల మందికి మహిళలకి అబార్షన్ చేయించుకునే హక్కు లేదని సెంటర్ ఫర్ రీప్రొడక్టివ్ రైట్స్ సంస్థ నివేదికలో వెల్లడైంది.
PTI డైరెక్టర్‌గా ఆదిమూలం
దినమలర్ పత్రిక పబ్లిషర్ ఎల్.ఆదిమూలం పీటీఐ వార్తా సంస్థ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. సెప్టెంబర్ 29న జరిగిన పీటీఐ బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పీటీఐ వైస్ చైర్మన్ కె.ఎన్.శాంత్‌కుమార్ మరోసారి ఆ పదవికి ఎన్నికైనట్టు ప్రకటించింది. ఆదిమూలం ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ అధ్యక్షునిగా, ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ (ఏబీసీ) ప్రత్యేక ఆహ్వానితునిగా కూడా చేశారు. శాంత్‌కుమార్ గతంలో ఏబీసీ చైర్మన్‌గా పనిచేశారు.
ఏడేళ్లు నివాసముంటే US Green Card - సెనేట్ లో బిల్లు
అమెరికాలో ఉంటూ ఏళ్ల తరబడి గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న 80 లక్షల మందికి శుభవార్త ఇది. వీరికి శాశ్వత నివాస హోదా కల్పించే కార్డును మంజూరు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును డెమోక్రాటిక్ పార్టీకి చెందిన నలుగురు సభ్యుల బృందం సెనేట్‌లో ప్రవేశపెట్టింది. ఇమిగ్రేషన్ చట్టంలోని కొన్ని నిబంధనలను సవరిస్తూ సెనేటర్లు అలెక్స్ పడిల్లా, ఎలిజబెత్ వారెన్, బెన్ రే లుజాన్, సెనేట్ మెజారిటీ విప్ డిక్ డర్బన్ సెప్టెంబర్ 28న ఈ బిల్లును ప్రవేశపెట్టారు. దీని ప్రకారం.. అమెరికాలో వరుసగా కనీసం ఏడేళ్లపాటు నివాసం ఉన్న వలసదారు చట్టబద్ధమైన శాశ్వత నివాస అర్హత పొందవచ్చు.
‘గతంలో సవరించిన ఇమిగ్రేషన్ విధానం ఎందరికో ఇబ్బందికరంగా మారింది. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. మా బిల్లులో గత 35 ఏళ్లలోనే మొదటిసారిగా రిజిస్ట్రీ కటాఫ్ తేదీని సవరించాం. దీనితో మరింతమంది వలసదారులు చట్టబద్ధ శాశ్వత నివాస హోదా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు’అని సెనేటర్ పడిల్లా చెప్పారు. ‘దశాబ్దాలుగా ఇక్కడే నివాసం ఉండి పనులు చేసుకుంటూ అభివృద్ధిలో తమ వంతు తోడ్పాటునందిస్తున్న లక్షలాది మంది వలసదారులు అనిశ్చితితో భయపడాల్సిన అవసరం లేకుండా ఇకపై స్వేచ్ఛగా జీవించవచ్చు’అని ఆయన అన్నారు. ‘‘ఈ బిల్లు కార్యరూపం దాలిస్తే డ్రీమర్లు, లాంగ్ టర్మ్ వీసాదారుల సంతానం, అత్యవసర సిబ్బంది, హెచ్–1బీ వీసాలు కలిగిన అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగులు తదితర 80 లక్షల మందికి ప్రయోజనం ఉంటుంది’’ అని వలసదారుల తరఫున పనిచేసే ఎఫ్‌డబ్ల్యూడీ డాట్ యుఎస్ అంచనావేసింది. ‘చట్టపరమైన అడ్డంకి వల్ల వలసదారులు గ్రీన్‌కార్డుకు నోచుకోలేకపోతున్నారని హౌస్ సబ్ కమిటీ సారథి లోఫ్‌గ్రెన్ అన్నారు. ఈ పరిణామాన్ని ఆశావహులు స్వాగతించారు.
Ukraine లోని 4 ప్రాంతాలు Russiaలో విలీనం
ఇటీవల రెఫరెండం చేపట్టిన ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలను తాము కలిపేసుకుంటామని రష్యా సెప్టెంబర్ 29న ప్రకటించింది. ఈ రెఫరెండంలో దక్షిణ, తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాలైన జపొరిఝియాలో 93%, ఖేర్సన్‌లో 87%, లుహాన్‌స్క్ లో 98%, డొనెట్‌స్క్‌లో 99% మంది రష్యాకు అనుకూలంగా ఓటేశారని క్రెమ్లిన్ అనుకూల పరిపాలనాధికారులు సెప్టెంబర్ 27న ప్రకటించారు. సెప్టెంబర్ 30న క్రెమ్లిన్ కోటలోని సెయింట్ జార్జి హాల్‌లో జరిగే కార్యక్రమంలో విలీనం విషయాన్ని అధ్యక్షుడు పుతిన్ స్వయంగా ప్రకటిస్తారని అధికార ప్రతినిధి పెషో్కవ్ చెప్పారు. విలీనానికి సంబంధించిన పత్రంపై ఈ నాలుగు ప్రాంతాల అధికారులు సంతకాలు చేస్తారన్నారు. రష్యా చర్యను ఉక్రెయిన్, అమెరికా, జర్మనీ ఇతర పశి్చమ దేశాలు ఖండించాయి. రష్యా చేపట్టిన రెఫరెండంను, విలీనం చేసుకోవడాన్ని గుర్తించబోమన్నాయి. ఈ ప్రాంతాలను తిరిగి స్వా«దీనం చేసుకుంటామని ఉక్రెయిన్ ప్రతిజ్ఞ చేసింది. ఇలా ఉండగా, ఉక్రెయిన్‌లో ద్నీప్రో ప్రాంతంపై రష్యా జరిపిన రాకెట్ దాడిలో చిన్నారి సహా 8 మంది చనిపోయినట్లు అధికారులు చెప్పారు. ఈశాన్య ప్రాంత లెమాన్ నగరంపై పట్టు కోసం ఉక్రెయిన్, రష్యా బలగాల మధ్య భీకర పోరు సాగుతోందని బ్రిటిష్ నిఘా వర్గాలు వెల్లడించాయి.
తెలంగాణలో schneider రెండో ప్లాంట్
విద్యుత్ పరికరాల తయారీ, ఆటోమేషన్ రంగంలో ఉన్న ష్నైడర్ ఎలక్ట్రిక్ తెలంగాణలో మరో ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. శంషాబాద్ వద్ద 18 ఎకరాల్లో ఇది రానుంది. రూ. 300 కోట్ల వ్యయంతో చేపడుతున్న తొలి దశ 2023 సెప్టెంబర్‌కు సిద్ధం అవుతుంది. ఉత్పత్తుల తయారీకి స్మార్ట్ యంత్రాలు, ఉపకరణాలను ఉపయోగించనున్నట్లు కంపెనీ సెప్టెంబర్ 30న ప్రకటించింది. కొన్ని ఉత్పత్తులను దేశంలో తొలిసారిగా శంషాబాద్ కేంద్రంలో ఉత్పత్తి చేయనున్నట్లు వెల్లడించింది. 30కిపైగా దేశాలకు ఇక్కడ తయారైన సరుకు ఎగుమతి చేస్తారు. భారత్‌లో సంస్థకు ఇది 31వ కేంద్రం కాగా తెలంగాణలో రెండవది. స్మార్ట్ ఫ్యాక్టరీలపరంగా కంపెనీకి దేశంలో ఇది ఎనిమిదవది కానుంది.
వర్చువల్ గా శంకుస్థాపన
భారత్‌లో ఫ్రాన్స్ రాయబారి ఎమాన్యుయల్ లెనిన్‌తో కలిసి రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు ష్నైడర్ ప్రతిపాదిత నూతన కేంద్రానికి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. కొత్త ప్లాంటు మూడు దశలు పూర్తి అయితే 3,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. భారత్‌లో కంపెనీకి ఇది అతిపెద్ద, అత్యంత స్మార్ట్ ఫ్యాక్టరీ అవుతుందని చెప్పారు. 75 శాతం ఉత్పత్తులు ఇక్కడి నుంచి ఎగుమతి అవుతాయని వివరించారు. స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్‌లో యువతకు శిక్షణ ఇచ్చేందుకు ముందుకు రావాల్సిందిగా కంపెనీ ప్రతినిధులను ఆయన కోరారు.
హైదరాబాద్‌లో House of France
తెలంగాణ, ఫ్రాన్స్ నడుమ వాణిజ్య సంబంధాలు, రాకపోకలు పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ‘హౌస్ ఆఫ్ ఫ్రాన్స్’ పేరిట కొత్త కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రకటించడాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్వాగతించారు. 2023 అర్ధభాగంలో కొత్త ఫ్రెంచ్ బ్యూరో పనిచేయడం ప్రారంభిస్తుందని, ఇది వాణిజ్య కార్యకలాపాల కేంద్రంగా పనిచేయడంతోపాటు కాన్సులార్, వీసా సేవలను కూడా అందిస్తుందన్నారు. తద్వారా తెలంగాణ విద్యార్థులు, బిజినెస్ వర్గాలకు ఫ్రాన్స్‌తో సన్నిహిత సంబంధాలు ఏర్పడుతాయన్నారు. ఫ్రెంచ్ బిజినెస్ మిషన్ బృందం సెప్టెంబర్ 29న హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌తో భేటీ అయింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిశీల విధానాలు, పారిశ్రామిక విధానాలు, సాధించిన విజయాలు, పెట్టుబడి అవకాశాలపై కేటీఆర్ ఆ బృందానికి వివరించారు. ఈ భేటీలో ఫ్రెంచ్ బృందం ప్రతినిధులు పాల్ హెర్మెలిన్, గెరార్డ్ వోల్ఫ్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఇ. విష్ణువర్దన్‌రెడ్డి పాల్గొన్నారు.
S&P Rating : వర్ధమాన దేశాల్లో ‘స్టార్’ భారత్
ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఎస్‌అండ్‌పీ భారత్‌ను వర్ధమాన దేశాల్లోనే స్టార్ (ఆశాకిరణం)గా అభివర్ణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 7.3 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని అంచనా వేసింది. పెరుగుతున్న వడ్డీ రేట్లు, యూరోప్‌లో పెరిగిపోయిన ఇంధన అభద్రత ప్రభావం ప్రతి దేశాన్ని తాకుతోందని.. ఈ తరుణంలో 7.3 శాతం వృద్ధితో భారత్ స్టార్‌గా నిలవనుందని వివరించింది. ఈ మేరకు సెప్టెంబర్ 29న ఒక నివేదికను విడుదల చేసింది. సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపుతో కఠిన ఆర్థిక పరిస్థితుల కారణంగా, వచ్చే కొన్ని త్రైమాసికాల్లో అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి నిదానిస్తుందని తెలిపింది. ‘‘ద్రవ్యోల్బణం గృహ ఆదాయాన్ని తగ్గించేసింది. వ్యాపార విశ్వాసం సైతం క్షీణించింది. వెలుపలి వాతావరణం కూడా మరింత క్లిష్టంగా మారింది’’అని ఎస్‌అండ్‌పీ పేర్కొంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి కేంద్ర బ్యాంకులు దూకుడుగా వడ్డీ రేట్లను పెంచుతున్నాయని, అమెరికాలో స్వల్ప మాంద్యాన్ని అంచనా వేస్తున్నట్టు పేర్కొంది.
Small savings schemes interest rates పెంపు
వరుసగా రేట్ల తగ్గింపులతో చిన్నబోయిన చిన్న మొత్తాల పొదుపు పథకాలకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. అంతర్జాతీయంగా సెంట్రల్ బ్యాంకులు ద్రవ్యోల్బణం కట్టడికి కీలకమైన వడ్డీ రేట్లను పెంచుతూ వెళుతున్నాయి. మన ఆర్‌బీఐ కూడా ఇదే బాటలో నడుస్తోంది. మే చివరి నుంచి ఇప్పటి వరకు 1.4 శాతం మేర రెపో రేటును పెంచింది. దీంతో మార్కెట్ తీరుకు అనుగుణంగా, తొమ్మిది వరుస త్రైమాసికాల యథాతథ స్థితి తర్వాత.. చిన్న మొత్తాల పొదుపు పథకాల రేట్లను సైతం కేంద్ర సర్కారు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 0.30 శాతం వరకు పలు పథకాల రేట్లను పెంచుతూ ప్రకటన విడుదల చేసింది. పన్ను పరిధిలోకి వచ్చే పథకాలపై ప్రధానంగా రేట్లను పెంచింది. అదే సమయంలో కొన్ని పథకాల రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదు. ప్రతి త్రైమాసికానికీ ఈ పథకాల రేట్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంటుంది. ఇందులో భాగంగా అక్టోబర్ 1 నుంచి మొదలయ్యే తదుపరి మూడు నెలల కాలానికి తాజా రేట్లపై కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Also read: Weekly Current Affairs (Important Dates) Bitbank: ప్రపంచ సింహాల దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు?
మూడేళ్ల టైమ్ డిపాజిట్‌పై ప్రస్తుతం 5.5 శాతం రేటు ఉంటే, ఇక మీదట ఇది 5.8 శాతం కానుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌పై రేటు 0.20 శాతం పెరిగి 7.6 శాతానికి చేరింది. ప్రస్తుతం ఈ పథకంలో రేటు 7.4 శాతంగా ఉంది. కిసాన్ వికాస్ పత్ర రేటును 6.9 శాతం నుంచి 7 శాతానికి (123 నెలలకు మెచ్యూరిటీ).. పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో రేటును 6.6 శాతం నుంచి 6.7 శాతానికి కేంద్రం సవరించింది.
Also read: Weekly Current Affairs (Science and Technology) Bitbank: ఏ దేశ శాస్త్రవేత్తలు కృత్రిమ పిండాలను సిద్ధం చేశారు?
వీటిల్లో మార్పు లేదు..:
ఏడాది, ఐదేళ్ల ఎఫ్‌డీలు, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) పథకాల రేట్లు ప్రస్తుతమున్న మాదిరే మరో మూడు నెలలు కొనసాగుతాయి. ఈ పథకాల రేట్లను కేంద్రం సవరించలేదు. సవరించిన రేట్లు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి.
Also read: Weekly Current Affairs (Sports) Bitbank: కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ స్థానం ఏమిటి?
National Games ప్రారంభించిన ప్రధాని మోదీ
గుజరాత్ ఆతిథ్యమిస్తున్న 36వ జాతీయ క్రీడలు సెప్టెంబర్ 29న అట్టహాసంగా ఆరంభమయ్యాయి. సుమారు లక్షా 25 వేల మందితో కిక్కిరిసిన నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించిన వేడుకలు అంబరాన్నంటాయి. 600 మంది గుజరాతీ కళాకారులు తమ సాంస్కృతిక ప్రదర్శనతో కట్టిపడేశారు. ప్రేక్షకుల జయజయధ్వానాల మధ్య భారత ప్రధాని మోదీ అంగరంగ వైభవంగా ఆటల పండగను ప్రారంభించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ ఈవెంట్లలో పతకాలతో దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన క్రీడాకారులను ప్రధాని ఆకాశానికెత్తారు. స్టేడియంలో గుజరాత్‌కు చెందిన స్టార్ స్విమ్మర్ మాన పటేల్ ఐక్యతా జ్యోతిని ప్రధాని మోదీకి అందజేసింది. ఆ వెంటే స్టేడియమంతా కరతాళధ్వనులతో మార్మోగిపోయింది. ఈ కార్యక్రమంలో చాంపియన్ అథ్లెట్ నీరజ్ చోప్రా, స్టార్ షట్లర్ పీవీ సింధు, వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను, రెజ్లర్ రవి దహియా, మాజీ షూటర్ గగన్ నారంగ్, హాకీ మాజీ కెప్టెన్ దిలీప్ టిర్కీ, మాజీ మహిళా అథ్లెట్ అంజూ జార్జ్ తదితరులు హాజరయ్యారు. 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు సర్వీసెస్ కు చెందిన సుమారు 7000 మందికి పైగా అథ్లెట్లు 36 క్రీడాంశాల్లో పాల్గొనేందుకు వచ్చారు. గుజరాత్‌లోని ఆరు ప్రముఖ నగరాల్లో పోటీలు నిర్వహిస్తారు.
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP