Daily Current Affairs in Telugu: 2022, అక్టోబర్ 6th కరెంట్ అఫైర్స్
National Games 2022: తెలంగాణకు బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్‌లో స్వర్ణాలు
జాతీయ క్రీడల్లో అక్టోబర్ ౩న తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. రెండు స్వర్ణ పతకాలతోపాటు ఒక రజతం, ఒక కాంస్యంతో మొత్తం నాలుగు పతకాలు సొంతం చేసుకున్నారు. బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో తెలంగాణ 3–0తో కేరళను ఓడించి చాంపియన్‌గా నిలిచింది. తొలి మ్యాచ్‌లో సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి జోడీ 21–15, 14–21, 21–14తో ట్రెసా జాలీ–ఎం.ఆర్.అర్జున్ ద్వయంపై గెలిచి తెలంగాణకు 1–0 ఆధిక్యం అందించింది. రెండో మ్యాచ్‌లో సాయిప్రణీత్ 18–21, 21–16, 22–20 తో ప్రణయ్‌ను ఓడించి తెలంగాణ ఆధిక్యాన్ని 2–0కు పెంచాడు. మూడో మ్యాచ్‌లో సామియా ఇమాద్ ఫారూఖి 21–5, 21–12తో గౌరీకృష్ణపై గెలవడంతో తెలంగాణ విజయం ఖరారైంది.
Also read: Weekly Current Affairs (Sports) Bitbank: BCCI టైటిల్ స్పాన్సర్‌గా Paytm స్థానంలో ఏ కంపెనీ వచ్చింది?
మహిళల బాస్కెట్‌బాల్ 3x3 ఈవెంట్ ఫైనల్లో తెలంగాణ జట్టు 17–13తో కేరళను ఓడించి బంగారు పతకాన్ని దక్కించుకుంది.
మహిళల స్విమ్మింగ్ 800 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో తెలంగాణ అమ్మాయి వ్రిత్తి అగర్వాల్ రజత పతకం దక్కించుకుంది. ఆమె 9ని:23.91 సెకన్లలో రేసును ముగించి రెండో స్థానంలో నిలిచింది.
పురుషుల రోయింగ్ కాక్స్‌డ్–8లో బాలకృష్ణ, నితిన్ కృష్ణ, సాయిరాజ్, చరణ్ సింగ్ కెతావత్, మహేశ్వర్ రెడ్డి, గజేంద్ర యాదవ్, నవదీప్, హర్దీప్ సింగ్, వెల్ది శ్రీకాంత్‌లతో కూడిన తెలంగాణ జట్టు మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించింది.
Also read: Weekly Current Affairs (Persons) Bitbank: క్వీన్ ఎలిజబెత్ II యొక్క పాలన ఎన్ని సంవత్సరాలు కొనసాగింది?
Novak Djokovic: జొకోవిచ్ ఖాతాలో 89వ సింగిల్స్ టైటిల్
సెర్బియా టెన్నిస్ స్టార్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ జొకోవిచ్ తన కెరీర్‌లో 89వ సింగిల్స్ టైటిల్ సాధించాడు. టెల్ అవీవ్ ఓపెన్ టోర్నీలో జొకోవిచ్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో జొకోవిచ్ 6–3, 6–4తో యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా)పై గెలుపొందాడు.
Also read: Weekly Current Affairs (Awards) Bitbank: ఇంటర్నేషనల్ ట్రావెల్ అవార్డ్ 2023ని ఏ రాష్ట్రం గెలుచుకుంది?
చాంపియన్‌గా నిలిచిన జొకోవిచ్‌కు 1,44,415 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. కోటీ 17 లక్షలు)తోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
Swachh survekshan awards 2022: దేశంలో ఎక్కువ అవార్డులు సాధించిన రెండో రాష్ట్రం తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు సాధించిన మున్సిపాలిటీలకు రూ.2 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేయనున్నట్టు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. అద్భుతంగా పురోగతి సాధిస్తున్న గ్రామాలు, పట్టణాలను ప్రోత్సహించేందుకు ఈ నిధులను ఇస్తున్నామని, వీటిని ప్రత్యేకంగా పారిశుధ్యం కోసం వినియోగించాలని సూచించారు. స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు సాధించిన మున్సిపాలిటీల ప్రజాప్రతినిధులు, కమిషనర్లను అభినందిస్తూ హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్‌డీలో అక్టోబర్ 4న ప్రత్యేక కార్యక్రమం జరిగింది.
కేటీఆర్ దీనికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బడంగ్‌పేట్, కోరుట్ల, సిరిసిల్ల, తుర్కయాంజాల్, గజ్వేల్, వేములవాడ, ఘట్‌కేసర్, కొంపల్లి, హుస్నాబాద్, ఆదిభట్ల, కొత్తపల్లి, చండూర్, నేరేడుచర్ల, చిట్యాల, భూత్పూర్, అలంపూర్, పీర్జాదిగూడలకు రూ.2 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. దేశంలోనే అత్యధికంగా అవార్డులు సాధించిన రెండో రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పారు.
Also read: Weekly Current Affairs (Awards) Bitbank: 64వ రామన్ మెగసెసే అవార్డు 2022 గ్రహీతలు ఎవరు?
UAE: స్పాన్సర్ లేకుండా సొంతంగా వ్యాపారం.. వీసా నిబంధనలు సవరించిన యూఏఈ
మోర్తాడ్ (బాల్కొండ): విదేశాల నుంచి తమ దేశానికి వచ్చే వలసదారులకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) ప్రభుత్వం ఖుషీ ఖబర్ అందించింది. వీసా నిబంధనలను సవరిస్తూ UAE ప్రభుత్వం తీసుకున్న సరికొత్త నిర్ణయంతో ఆ దేశానికి వెళుతున్న వలసదారులకు అనేక రకాల ప్రయోజనాలు కలుగనున్నాయి. యూఏఈ పరిధిలోని దుబాయ్, అబుదాబి, అజ్మన్, షార్జా తదితర ప్రాంతాల్లో ఇప్పటివరకు సొంతంగా వ్యాపారం చేయాలనుకునే విదేశీయులకు ఆ దేశానికి చెందిన వారి ద్వారానే లైసెన్స్‌ను పొందాల్సి ఉంటుంది. ఇలా స్పాన్సర్ మధ్యవర్తిత్వం ద్వారా వ్యాపారం చేయాలనుకుంటే 51 శాతం స్పాన్సర్ పెట్టుబడి, మిగిలిన 49 శాతం వలసదారుడు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో స్పాన్సర్ పెట్టుబడి పెట్టినా పెట్టకపోయినా వలసదారుడే మొత్తం పెట్టుబడి పెట్టి లాభాల్లో వాటాను పంచిపెట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు స్పాన్సర్‌తో సంబంధం లేకుండా యూఏఈ ప్రభుత్వం అనుమతితో ఎవరైనా ఆ దేశంలో వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
Also read: ప్రపంచంలోనే తయారీ హబ్‌గా భారత్
విజిట్ వీసా గడువు 60రోజులకు పెంపు
విజిట్ వీసా కాలపరిమితి 30 రోజులే ఉండగా ఇప్పుడు 60 రోజులకు పెంచారు. అనుకోని సందర్భంలో ఉద్యోగం కోల్పోయినవారు వెంటనే ఇంటికి రావాల్సిన అవసరం లేదు. ఆరు నెలల వరకు అక్కడే ఉండి మరో కంపెనీలో పని వెతుక్కుని వీసాను రెన్యువల్ చేసుకోవచ్చు. గతంలో కంపెనీ ఉద్యోగం నుంచి తొలగిస్తే ఇంటికి రావడం లేదా కార్మికునిగా ఉండిపోయి పోలీసులకు దొరికితే కటకటాల పాలైన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఐదు సంవత్సరాల మల్టీ ఎంట్రీ టూరిస్ట్ వీసా ఉన్నవారు వరుసగా మూడు నెలల పాటు UAEలో ఉండవచ్చు. గ్రీన్ వీసా పొందినవారు తమకు ఉన్న పర్మిట్ పూర్తయితే రెన్యువల్ చేసుకోవడానికి ఆరు నెలల గడువును పొడిగించారు. ఇలా ఎన్నో రకాల ప్రయోజనాలను కల్పిస్తూ యూఏఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈనెల 3 నుంచి అమలులోకి వచ్చింది. UAEకి వలస వెళుతున్న వారిలో భారతీయుల సంఖ్యనే అధికంగా ఉండటంతో వీసా నిబంధనల సవరణ ప్రయోజనాలు ఎక్కువ శాతం మనవారికే కలుగుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Also read: Henley & Partners Group Report: న్యూయార్క్, టోక్యో... కుబేరుల అడ్డాలు.. ప్రపంచంలో 25వ స్థానంలో ముంబై
Nobel Prize 2022: భౌతిక శాస్త్రంలో ముగ్గురికి ఉమ్మడిగా నోబెల్
స్టాక్‌హోమ్: భౌతిక శాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి 2022 సంవత్సరానికి గాను ముగ్గురు సైంటిస్టులను వరించింది. ఫోటాన్‌లలో చిక్కుముడులు, క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో అలెన్ ఆస్పెక్ట్(75), జాన్ ఎఫ్ క్లాసర్(79), ఆంటోనీ జీలింగర్(77) సాగించిన విశేషమైన పరిశోధనలను గుర్తించి, ఈ బహుమానానికి ఉమ్మడిగా ఎంపిక చేసినట్లు స్వీడన్‌లోని ‘రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ అక్టోబర్ 4న ప్రకటించింది. క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ నేడు ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగమని, ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని నోబెల్ కమిటీ సభ్యులు ఈవా ఒల్సాన్ చెప్పారు. సమాచార బదిలీ, క్వాంటమ్ కంప్యూటింగ్, సెన్సింగ్ టెక్నాలజీ వంటి విభాగాల్లో క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ గణనీయమైన పాత్ర పోషిస్తోందని అన్నారు. క్వాంటమ్ మెకానిక్స్ నుంచే ఈ సైన్స్ ఉద్భవించిందని తెలిపారు. ఆలెన్ ఆస్పెక్ట్ ఫ్రాన్స్‌కు చెందినవారు కాగా, జాన్ ఎఫ్ క్లాసర్ అమెరికన్ పౌరుడు, ఆంటోన్ జీలింగర్ ఆ్రస్టియా వాసి.
ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు 2010లో ఇజ్రాయెల్‌లో వూల్ఫ్ ప్రైజ్ గెలుచుకున్నారు. నోబెల్ ప్రైజ్ కోసం చాలా ఏళ్లుగా వీరి పేర్లు పరిశీలనకు వస్తున్నాయి. నోబెల్ ప్రైజ్ లభించిందని తెలియగానే మొదట తాను నమ్మలేకపోయానని జీలింగర్ చెప్పారు. ఇది తనకు సానుకూలమైన షాక్ అని ఆనందం వ్యక్తం చేశారు. ఆయన యూనివర్సిటీ ఆఫ్ వియన్నాలో పనిచేస్తున్నారు.
Also read: స్వీడిష్ శాస్త్రవేత్త స్వాంటే పాబోకు Noble Prize in Medicine
భౌతిక శాస్త్రంలో గత ఏడాది (2021) నోబెల్ పురస్కారం సూకురో మనాబే, క్లాజ్ హసల్‌మన్, జార్జియో పారిసి అనే ముగ్గురు శాస్త్రవేత్తలకు ఉమ్మడిగా లభించిన సంగతి తెలిసిందే.
Nobel Prize In Physics 2022: కణ కవలలపై పరిశోధనలు
అక్కినేని నాగార్జున ద్విపాత్రాభియనం చేసిన సినిమా ‘హలో బ్రదర్’ గుర్తుందా? 1994లో విడుదలైన ఈ సినిమా చూసుంటే.. ఈ ఏడాది భౌతిక శాస్త్ర నోబెల్ ప్రైజ్ గ్రహీతలు అలెన్ ఆస్పెక్ట్, జాన్ ఎఫ్ క్లాసర్, ఆంటోనీ జీలింగర్‌లు చేసిన పరిశోధనలు అర్థం చేసుకోవడం సులువవుతుంది. కణస్థాయిలో జరిగే కొన్ని భౌతిక దృగ్విషయాలను నియంత్రించడం వీలవుతుందని వీరు వేర్వేరుగా జరిపిన పరిశోధనలు స్పష్టం చేశాయి. ఫలితంగా అత్యంత శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్ల తయారీ మొదలుకొని హ్యాకింగ్‌కు అస్సలు చిక్కని సమాచార వ్యవస్థల రూపకల్పనకు మార్గం సుగమమైంది. ఇంతకీ ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు జరిపిన ప్రయోగాలేమిటి? హలో బ్రదర్ సినిమా చూసుంటే వాటిని అర్థం చేసుకోవడం ఎలా సులువు అవుతుంది?
దూరంగా ఉన్నప్పటికీ ఒకేలా ప్రవర్తన
ముందుగా చెప్పుకున్నట్లు హలో బ్రదర్ చిత్రంలో నాగార్జునది ద్విపాత్రాభినయం. పుట్టినప్పుడే వేరైన ఇద్దరు కవలల కథ. కవలలంటే చూసేందుకు ఒకేలా ఉండేవారు మాత్రమే అని అనుకునేరు. వీరిద్దరు కొంచెం దగ్గరగా వస్తే చాలు.. ఒకరిని కొడితే ఇంకొకరికి నొప్పి కలుగుతుంది. కిలోమీటర్ దూరంలో ఉన్నా సరే ఒకరికి నవ్వు వచి్చనా, దుఃఖం కలిగినా అదే రకమైన భావనలు రెండో వ్యక్తిలోనూ కలుగుతూంటాయి! నిజ జీవితంలో ఇలాంటి కవలలు ఉండటం అసాధ్యమేమో గానీ భౌతిక శాస్త్రంలో మాత్రం సుసాధ్యమే. సూక్ష్మ కణాల మధ్య కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇలాంటి స్థితి ఏర్పడుతూ ఉంటుంది. దీన్నే క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అని పిలుస్తుంటారు. వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ ఈ కణాల్లో ఒకదానిలో జరిగే మార్పు ప్రభావం ఇంకోదాంట్లోనూ కనిపిస్తుందన్నమాట! అలెన్ ఆస్పెక్ట్, జాన్ ఎఫ్ క్లాసర్, ఆంటోన్ జీలింగర్‌లు పరిశోధనలు చేసింది ఈ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్‌పైనే. దూరంగా ఉన్నా కూడా ఒక్కతీరుగా ప్రవర్తించే కాంతి కణాల (ఫోటాన్లు)పై ఈ ముగ్గురు శాస్త్రవేత్తలూ వేర్వేరుగా పరిశోధనలు నిర్వహించారు. ఈ ప్రయోగాల ఫలితాల ఆధారంగా కొన్ని కొత్త, వినూత్నమైన టెక్నాలజీలు రూపుదిద్దుకున్నాయి. ఫలితంగా చాలాకాలంగా కేవలం సిద్ధాంతాలకు మాత్రమే పరిమితమైన కొన్ని విషయాలు వాస్తవ రూపం దాల్చడం మొదలైంది. లెక్కకు చిక్కనంత వేగంగా పనిచేసే కంప్యూటర్లు, అతి సురక్షితమైన సమాచార వ్యవస్థలు వీటిల్లో మచ్చుకు కొన్ని మాత్రమే.
చిరకాల శేష ప్రశ్నలు
నిజానికి క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్‌పై చాలాకాలంగా ఎన్నో శేష ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. రెండు కణాలు దూరంగా ఉన్నా ఒకేలా ప్రవర్తించడం వెనుక ఏముందో తెలుసుకునేందుకు ప్రయత్నాలు చాలానే జరిగాయి. 1960వ దశకంలో జాన్ స్టూవర్ట్ బెల్ అనే శాస్త్రవేత్త ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. గుర్తు తెలియని అంశాలు ఉన్నప్పుడు పెద్ద ఎత్తున సేకరించే కొలతల ఫలితాలు నిర్దిష్టమైన విలువకు మించి ఉండవని ఈ సిద్ధాంతం చెబుతుంది. ఈ ‘‘బెల్స్ అసమానత’’లు నిర్దిష్ట ప్రయోగాల్లో చెల్లవని క్వాంటమ్ మెకానిక్స్ చెబుతుంది. ఈ ఏడాది భౌతికశాస్త్ర నోబెల్ ప్రైజ్ గ్రహీతల్లో ఒకరైన జాన్ ఎఫ్ క్లాసర్ గతంలోని స్టూవర్ట్ బెల్ సిద్ధాంతాలను మరింత అభివృద్ధి చేయడమే కాకుండా.. లెక్కలకు మాత్రమే పరిమితం కాకుండా వాస్తవిక ప్రయోగాలు చేపట్టారు. క్వాంటమ్ మెకానిక్స్‌లో ‘‘బెల్స్ అసమానత’’లు పనిచేయవని స్పష్టమైంది. అలెన్ ఆస్పెక్ట్ ఈ విషయాలను మరింత ముందుకు తీసుకెళుతూ.. జాన్ క్లాసర్ ప్రయోగాల్లోని కొన్ని లోపాలను సరిదిద్దే వ్యవస్థను రూపొందించారు. వీరిద్దరి ప్రయోగాల ఫలితాల ఆధారంగా ఆంటోనీ జీలింగర్ ఎంటాంగిల్మెంట్ స్థితిలో ఉన్న కణాలను నియంత్రించవచ్చని ప్రయోగపూర్వకంగా నిరూపించారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
North Korea Missile: జపాన్ మీదుగా ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగం
ఉత్తరకొరియా మరోసారి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడింది. దాదాపు ఐదేళ్ల తర్వాత ఆ దేశం జపాన్ మీదుగా అక్టోబర్ 4న బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. అమెరికాకు చెందిన గ్వామ్ దీవిని సైతం తాకే సామర్థ్యమున్న ఈ అణు క్షిపణి ప్రయోగంతో జపాన్ ఉలిక్కి పడింది. ముందు జాగ్రత్తగా పలు రైళ్లను రద్దు చేయడంతోపాటు కొన్ని ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర కొరియా మంగళవారం మధ్యంతర క్షిపణి ప్రయోగం చేపట్టినట్లు దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ పేర్కొనగా, అది మధ్యంతర లేదా దీర్ఘ శ్రేణి క్షిపణి అయి ఉంటుందని జపాన్ తెలిపింది. ఒకవేళ దీర్ఘ శ్రేణి క్షిపణి అయితే అమెరికా ప్రధాన భూభాగమే లక్ష్యంగా చేపట్టిన ప్రయోగమై ఉంటుందని నిపుణులు అంటున్నారు. తాజా పరిణామాన్ని ప్రమాదకరమైన, నిర్లక్ష్యపూరిత చర్యగా అమెరికా అభివర్ణించింది.
Hockey:‘ఎఫ్‌ఐహెచ్ రైజింగ్ ప్లేయర్’గా ముంతాజ్ ఖాన్
భారత మహిళల హాకీ జట్టు ఫార్వర్డ్ ముంతాజ్ ఖాన్‌కు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) అవార్డు లభించింది. లక్నోకు చెందిన 19 ఏళ్ల ముంతాజ్ ‘రైజింగ్ ప్లేయర్’గా ఎంపికైంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో దక్షిణాఫ్రికాలో జరిగిన జూనియర్ ప్రపంచకప్‌లో ముంతాజ్ విశేషంగా రాణించి హ్యాట్రిక్‌తో సహా ఎనిమిది గోల్స్ సాధించింది. జూనియర్ ప్రపంచకప్‌లో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో భారత్ ‘షూటౌట్’లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది.
Also read: North Korea Missile: జపాన్ మీదుగా ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగం
Rest of India: ఇరానీ కప్ చాంపియన్ రెస్ట్ ఆఫ్ ఇండియా
రాజ్‌కోట్: ఇరానీ కప్ మళ్లీ రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టునే వరించింది. రంజీ మాజీ చాంపియన్ సౌరాష్ట్రతో జరిగిన పోరులో రెస్ట్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. అక్టోబర్ 4న 368/8 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన సౌరాష్ట్ర కేవలం మరో 12 పరుగులే జత చేసి మిగిలున్న రెండు వికెట్లను కోల్పోయింది. 380 పరుగుల వద్ద ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో 276 పరుగుల ఆధిక్యం పొందిన రెస్ట్ ఆఫ్ ఇండియా ముందు 105 పరుగుల లక్ష్యమే ఉండగా... దీన్ని 31.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ ప్రియాంక్ (2), యశ్ ధుల్ (8) విఫలమవగా, అభిమన్యు ఈశ్వరన్ (63 నాటౌట్; 9 ఫోర్లు), శ్రీకర్ భరత్ (27 నాటౌట్; 5 ఫోర్లు) మరో వికెట్ పడకుండా మ్యాచ్ ముగించారు. ఇద్దరు అబేధ్యమైన మూడో వికెట్‌కు 81 పరుగులు జోడించారు. దీంతో రెస్ట్ ఆఫ్ ఇండియా ఖాతాలో 29వసారి ఇరానీ కప్ చేరింది.
Also read: Nationa Games 2022 : ఏపీ, తెలంగాణకు పతకాలు
National Games 2022: జ్యోతి ఖాతాలో రెండో స్వర్ణం
అహ్మదాబాద్: జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యెర్రాజీ మళ్లీ మెరిసింది. ఇప్పటికే మహిళల 100 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన ఈ వైజాగ్ అథ్లెట్ 100 మీటర్ల హర్డిల్స్ ఈవెంట్‌లోనూ బంగారు పతకం సొంతం చేసుకుంది. అక్టోబర్ 4న జరిగిన 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును జ్యోతి 12.79 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచింది.
Also read: World Cadet Chess లో శుభి, చార్వీలకు స్వర్ణాలు
తెలంగాణకు చెందిన అగసార నందిని 13.38 సెకన్లలో గమ్యానికి చేరి రజత పతకం సాధించింది.
మహిళల జావెలిన్ త్రోలో రష్మీ శెట్టి ఆంధ్రప్రదేశ్‌కు రజత పతకం అందించింది. రష్మీ జావెలిన్‌ను 53.95 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచింది.
టెన్నిస్ పురుషుల డబుల్స్ విభాగంలో కొసరాజు శివదీప్–ముని అనంత్‌మణి (ఆంధ్రప్రదేశ్) జోడీ కాంస్య పతకం సాధించింది.
సెమీఫైనల్లో శివదీప్–అనంత్‌మణి ద్వయం 7–5, 3–6, 6–10తో ప్రజ్వల్ దేవ్–ఆదిల్ (కర్ణాటక) జోడీ చేతిలో ఓడి కాంస్యం సొంతం చేసుకుంది.
World 6 red snooker championship: ప్రపంచ వరల్డ్ 6–రెడ్ స్నూకర్ చాంప్ శ్రీకృష్ణ
కౌలాలంపూర్: ప్రపంచ 6–రెడ్ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో భారత ప్లేయర్ శ్రీకృష్ణ సూర్యనారాయణన్ విజేతగా అవతరించాడు. అక్టోబర్ 4న జరిగిన ఫైనల్లో తమిళనాడుకు చెందిన శ్రీకృష్ణ 5–1 ఫ్రేమ్‌ల (51–4, 0–39, 63–0, 39–0, 45–7, 43–2) తేడాతో హబీబ్ సబా (బహ్రెయిన్)పై గెలిచాడు. సెమీఫైనల్లో శ్రీకృష్ణ 5–4 ఫ్రేమ్‌ల తేడాతో జేమ్స్ వతానా (థాయ్‌లాండ్)పై నెగ్గాడు. 22 ఏళ్ల శ్రీకృష్ణ జాతీయ 6–రెడ్ స్నూకర్ చాంపియన్ కాగా, 2019లో జాతీయ బిలియర్డ్స్ చాంపియన్‌గా నిలిచాడు.
Also read: World TT 2022 : రెండో సీడ్ జర్మనీపై భారత్ విజయం
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP