Daily Current Affairs in Telugu: 2022, అక్టోబర్ 4th కరెంట్ అఫైర్స్
Mangalyan Mission : ముగిసిన జీవితకాలం
అంగారక (మార్స్) గ్రహంపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) చేపట్టిన మంగళ్‌యాన్ మిషన్ ముగిసింది. మార్స్ ఆర్బిటార్ క్రాఫ్ట్‌తో గ్రౌండ్ స్టేషన్‌తో సంబంధాలు తెగిపోయినట్లు ఇస్రో అక్టోబర్ 3న ధ్రువీకరించింది. 2013 నవంబర్ 5న ఆర్బిటార్ ప్రయోగం ప్రారంభించారు. ఆర్బిటార్ 300 రోజులపాటు ప్రయాణించి 2014 సెప్టెంబర్ 24న అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశించింది. ఈ ఎనిమిదేళ్ల కాలంలో అరుణగ్రహం ఉపరితలంపై వాతావరణ పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందించింది. మంగళ్‌యాన్ జీవితకాలం ముగిసిందని, పని చేయడం ఆగిపోయిందని, ఆర్బిటార్‌ను ఇక రికవరీ చేయలేమని ఇస్రో అధికారులు స్పష్టం చేశారు. ఇతర గ్రహాలపై పరిశోధనల విషయంలో మంగళ్‌యాన్ అద్భుత సాంకేతిక, శాస్త్రీయ ప్రయోగంగా మిగిలిపోతుందని ఒక ప్రకటనలో వెల్లడించారు.
Also read: Quiz of The Day (October 04, 2022): రామప్ప దేవాలయంను నిర్మించిందెవరు?
స్వీడిష్ శాస్త్రవేత్త స్వాంటే పాబోకు Noble Prize in Medicine
వైద్య శాస్త్రంలో స్వీడిష్ శాస్త్రవేత్త స్వాంటే పాబో(67)కు ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి దక్కింది. 2022 సంవత్సరానికి గాను ఆయనను ఈ బహుమతికి ఎంపిక చేసినట్లు నోబెల్ కమిటీ అక్టోబర్ 3న ప్రకటించింది. మానవ పరిణామ క్రమంలో ఆయన సాగించిన విశిష్టమైన పరిశోధనలు ఆదిమ మానవుల (హోమినిన్స్) కంటే ఆధునిక మానవులు ఏ విధంగా భిన్నమో తెలియజేస్తాయని పేర్కొంది. అంతేకాకుండా మనిషి శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ గురించి కీలక విషయాలను బహిర్గతం చేస్తాయని వెల్లడించింది. నియాండెర్తల్స్, డెనిసోవన్స్ వంటి హోమినిన్స్ జన్యువును, ఆధునిక మానవుడి జన్యువును సరిపోల్చి చూసి, రెండింటి మధ్య తేడాలను వివరించే నూతన సాంకేతికతను స్వాంటే పాబో అభివృద్ధి చేశారని నోబెల్ కమిటీ ప్రశంసించింది.
Also Read: Weekly Current Affairs (Sports) Bitbank: BCCI టైటిల్ స్పాన్సర్‌గా Paytm స్థానంలో ఏ కంపెనీ వచ్చింది?
- స్వాంటే పాబో తండ్రి సూనే బెర్గర్ స్టామ్ 1982లో వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందడం గమనార్హం.
- పాబో జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిక్‌లో, మ్యాక్స్‌ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఎవల్యూషనరీ ఆంథ్రోపాలజీలో పరిశోధనలు చేశారు.
- నోబెల్ ప్రైజ్ గ్రహీతకు 9 లక్షల డాలర్ల (రూ.7.35 కోట్లు) నగదు అందజేస్తారు. 2022 డిసెంబర్ 10న నోబెల్ బహుమతుల ప్రదానం జరుగనుంది.
Also Read: Weekly Current Affairs (Awards) Bitbank: ఇంటర్నేషనల్ ట్రావెల్ అవార్డ్ 2023ని ఏ రాష్ట్రం గెలుచుకుంది?
కొత్త జాతిని గుర్తించిన Svante Paabo
మానవ జాతి పుట్టిందెలా? వానరాల నుంచి అని చెప్పడం సులువే కానీ.. మానవులను పోలిన వానరాలూ బోలెడన్ని ఉండగా పరిణామ క్రమంలో కొన్ని నశించిపోయాయి. కొన్ని అవసరాలకు తగ్గట్టుగా పరిణామం చెందుతూ నేటి ఆధునిక మానవుడు ‘హోమో సేపియన్’గా ఎదిగాయి. ఈ అద్భుత పరిణామ క్రమంలో కీలకమైన ఘట్టాలను పరిశోధించి మరీ ప్రపంచానికి తెలియజేసిన శాస్త్రవేత్త స్వాంటే పాబోకు ఈ ఏడాది వైద్యశాస్త్ర నోబెల్ అవార్డు దక్కింది. ఎప్పుడో అంతరించిపోయిన హోమోసేపియన్ దూరపు చుట్టం ‘నియాండెర్తల్’ జాతి జన్యుక్రమాన్ని నమోదు చేయడంతోపాటు ఇప్పటివరకూ అస్సలు గుర్తించని మరో బంధువు డెనిసోవన్ జాతిని గుర్తించినందుకు ఈ బహుమతి లభించింది. సుమారు 70 వేల ఏళ్ల క్రితం ఆఫ్రికాలో మొదలైన హోమో సేపియన్‌ల ప్రస్థానంలో పరిణామంలో నియాండెర్తల్, డెనిసోవన్ జాతుల జన్యువులూ చేరాయని, ఈ చేరిక ప్రభావం మనపై ఈ నాటికీ ఉందని పాబో గుర్తించారు. వైరస్, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవుల కారణంగా వచ్చే జబ్బులకు మన రోగ నిరోధక వ్యవస్థ స్పందించే తీరు మనలో చేరిన నియాండెర్తల్, డెనిసోవన్ జాతి జన్యువులపై ఆధారపడి ఉందని పాబో పరిశోధనలు చెబుతున్నాయి.
Also read: Weekly Current Affairs (Sports) Bitbank: BCCI టైటిల్ స్పాన్సర్‌గా Paytm స్థానంలో ఏ కంపెనీ వచ్చింది?
ప్రత్యేక శాస్త్ర విభాగం
మానవ పరిణామంపై జరుగుతున్న పరిశోధనల్లో పాబో సరికొత్త శకానికి, విభాగానికి దారి వేశానడంలో ఎలాంటి సందేహమూ లేదు. నియాండెర్తల్, డెనిసోవన్ జాతులపై పాబో చేసిన పరిశోధనల కారణంగా ఇప్పుడు ‘పాలియో జినోమిక్స్’ అనే కొత్త శాస్త్ర విభాగం ఒకటి ఉనికిలోకి వచి్చంది. హోమో సేపియన్లను, మానవుల్లాంటి ఇతర జాతులను (హోమినిన్లు) వేరు చేసే జన్యువులను గుర్తించడం ఈ శాస్త్రం ఉద్దేశం. హోమో సేసియన్లలోని ప్రత్యేక లక్షణాలను గుర్తించడం అన్నమాట.
Also read: Weekly Current Affairs (Persons) Bitbank: క్వీన్ ఎలిజబెత్ II యొక్క పాలన ఎన్ని సంవత్సరాలు కొనసాగింది?
అంతరించిపోయిన హోమినిన్ జాతి
హోమో సేపియన్లు ఎప్పుడో మూడు లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో పరిణమించారని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే నియాండెర్తల్ జాతి ఆఫ్రికాకు అవతల... స్పష్టంగా చెప్పాలంటే యూరప్, పశి్చమాసియా ప్రాంతానికి చెందిన వారు. నాలుగు లక్షల ఏళ్ల క్రితం నుంచి ముప్ఫై వేల ఏళ్ల క్రితం వరకూ వీరి మనుగడ కొనసాగింది. ఆ తరువాత ఈ హోమినిన్ జాతి అంతరించిపోయింది. కానీ, 70 వేల ఏళ్ల క్రితం ఆఫ్రికా నుంచి మధ్యాసియా ప్రాంతానికి వలస వెళ్లిన హోమో సేపియన్లు నియాండెర్తల్ జాతితో కలిశారని పాబో పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఆ తరువాతి కాలంలో హోమో సేపియన్లు క్రమేపీ ప్రపంచమంతా విస్తరించారన్నమాట. ఇరు జాతులు యురేసియా ప్రాంతంలో కొన్ని వేల సంవత్సరాల పాటు కలిసి జీవించాయని అంచనా. అయితే ఈ నియాండెర్తల్స్ గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. 1990 చివరి నాటికి మానవ జన్యుక్రమ నమోదు పూర్తి కాగా.. హోమినిన్లతో మనకున్న సంబంధాలను వెతకడం మాత్రం మొదలు కాలేదు. నియాండెర్తల్స్ వంటి హోమినిన్ల జన్యుక్రమం ఏదీ అందుబాటులో లేకపోవడం దీనికి కారణం.
Also read: Aliens కి బంగారు డిస్క్ లతో సందేశం
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన పాబో
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నియాండెర్తల్స్ డీఎన్‌ఏను అధ్యయనం చేసేందుకు స్వాంటే పాబో ప్రయతి్నంచారు. వేల ఏళ్ల క్రితం నాటి.. అంతరించి పోయిన జాతి డీఎన్‌ఏ దొరకడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. కాలక్రమంలో ఎంతో డీఎన్‌ఏ నాశనమైపోయి లేశమాత్రమే మిగిలి ఉంటుంది. పైగా బ్యాక్టీరియాతో కలుషితమయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలో ప్రఖ్యాత పరిణామ జీవశాస్త్ర నిపుణులు అలన్ విల్సన్ వద్ద స్వాంటే పాబో పోస్ట్ డాక్టరల్ విద్యారి్థగా నియాండెర్తల్ డీఎన్‌ఏ అధ్యయనానికి శ్రీకారం చుట్టారు. 1990లో జర్మనీలో మ్యూనిక్ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ పురాతన డీఎన్‌ఏపై పరిశోధనలను కొనసాగించిన పాబో నియాండెర్తల్‌ల మైటోకాండ్రియా నుంచి డీఎన్‌ఏను సేకరించి అధ్యయనం చేయాలని నిర్ణయించారు. క్రోమోజోముల్లోని డీఎన్‌ఏతో పోలిస్తే ఈ మైటోకాండ్రియల్ డీఎన్‌ఏ కాపీలు వేల సంఖ్యలో ఉంటాయి. కాబట్టి విశ్లేషణ విజయవంతమవుతుందని పాబో అంచనా. సుమారు 40 వేల ఏళ్ల క్రితం నాటి నియాండెర్తల్ ఎముక ముక్క నుంచి తొలిసారి ఈయన మైటోకాండ్రియల్ డీఎన్‌ఏను వేరు చేయగలిగారు. ఈ జన్యుక్రమంతో మానవులు, చింపాంజీల జన్యుక్రమాన్ని పోల్చి చూడటం సాధ్యమైంది. కణ కేంద్రక డీఎన్‌ఏను విశ్లేషించి నమోదు చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కొత్త టెక్నాలజీల సాయంతో దాదాపు అసాధ్యమనుకున్న నియాండెర్తల్ జన్యుక్రమ నమోదును 2010లో పూర్తి చేశారు. ఈ జన్యుక్రమాన్ని హోమో సేపియన్ల జన్యుక్రమంతో పోల్చి చూసినప్పుడు ఇరుజాతుల ఉమ్మడి పూర్వ జాతి భూమ్మీద సుమారు ఎనిమిది లక్షల ఏళ్ల క్రితం ఉన్నట్లు తెలిసింది. వేర్వేరు ప్రాంతాల్లోని హోమోసేపియన్ల జన్యుక్రమాలను పోల్చి చూడటం ద్వారా మనకున్న ప్రత్యేకతలు తెలిశాయి. యూరోపియన్, ఆసియాకు చెందిన హోమోసేపియన్లలో 1–4 శాతం జన్యుక్రమం నియాండెర్తల్స్‌దని తెలిసింది.
Also read: Daily Current Affairs in Telugu: 2022, అక్టోబర్ 3rd కరెంట్ అఫైర్స్
సరికొత్త హోమినిన్ గుర్తింపు
స్వాంటే పాబో పరిశోధనల్లో అత్యంత కీలకమైంది.. డెనిసోవన్ అనే సరికొత్త హోమినిన్ జాతి గుర్తింపు. సైబీరియా ప్రాంతంలోని ఓ గుహలో లభించిన 40 వేల ఏళ్ల క్రితం నాటి చేతి వేలి ఎముక ఆధారంగా ఇది జరిగింది. మంచులో కప్పబడి ఉండటం వల్ల ఈ ఎముకలోని డీఎన్‌ఏకు పెద్దగా నష్టం వాటిల్లలేదు. ఈ డీఎన్‌ఏ జన్యుక్రమాన్ని నమోదు చేసి నియాండెర్తల్స్, హోమోసేపియన్లతో పోల్చి చూసినప్పుడు అది ప్రత్యేకంగా ఉన్నట్లు తెలిసింది. ఈ సరికొత్త జీవజాతికి డెనిసోవ అని పేరు పెట్టారు. తదుపరి పరిశోధనల్లో డెనిసోవన్, హోమోసేపియన్ల మధ్య జన్యువుల ఆదాన ప్రదానాలు జరిగినట్లు తెలిసింది. హోమో సేపియన్లు ఆఫ్రికా నుంచి బయటకు వచ్చే సమయానికి యూరప్ పశి్చమ ప్రాంతంలో నియాండెర్తల్స్, తూర్పు ప్రాంతంలో డెనిసోవన్లు ఉండేవారని స్పష్టమైంది. హోమోసేపియన్లు విస్తరిస్తున్న కొద్దీ ఈ రెండు జాతులతో కలవడం కూడా ఎక్కువైంది.
Also read: 38 కోట్ల ఏళ్ల నాటి గుండెను ఎక్కడ గుర్తించారు..?
Compassionate appointment హక్కు కాదు : సుప్రీంకోర్టు
కారుణ్య నియామకం అనేది హక్కు కాదని, బాధితులకు ఊరడింపు మాత్రమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హఠాత్∙సంక్షోభాన్ని, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడానికి బాధిత కుటుంబానికి కారుణ్య నియామకం దోహదపడుతుందని ధర్మాసనం పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానమేనని, ఆర్టికల్ 16 ప్రకారం చట్టంలో నిర్దేశించిన నిబంధనల మేరకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని తేల్చిచెప్పింది.
Also read: European researchers: ఊదా రంగు టమాటాకు అమెరికా ఆమోదం
24 ఏళ్ల క్రితం మృతిచెందిన వ్యక్తి కుమార్తెకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగం ఇవ్వాలంటూ కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు గతవారం తోసిపుచ్చింది. కేరళలోని ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్‌కోర్ లిమిటెడ్‌లో పనిచేసే ఓ వ్యక్తి 1995లో ఏప్రిల్‌లో విధి నిర్వహణలో ఉండగానే మృతిచెందాడు. అప్పట్లో ఆయన కుమార్తె మైనర్. కారుణ్య నియామకం కింద తనకు ఉద్యోగం ఇవ్వాలంటూ మేజరైన తర్వాత ఆమె కంపెనీకి యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. ఇవ్వలేమంటూ యాజమాన్యం స్పష్టం చేసింది. దీంతో ఆమె కేరళ హైకోర్టును ఆశ్రయించింది. బాధితురాలిని కంపెనీలో చేర్చుకోవాలని సింగిల్ జడ్జి తీర్పునిచ్చారు. హైకోర్టు డివిజన్ బెంచ్ సైతం దీన్ని సమర్థించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ కంపెనీ యాజమాన్యం సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం సెప్టెంబర్ 30న తీర్పును వెలువరించింది.
"Betting Sites ప్రకటనలను టీవీ ఛానల్లు ఆపేయాలి"
బెట్టింగ్ సైట్లకు సంబంధించిన వాణిజ్య ప్రకటనల ప్రసారంపై కేంద్రం అక్టోబర్ 3న మార్గదర్శకాలను విడుదలచేసింది. ‘ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్లను వాటికి సంబంధించిన వార్త వెబ్‌సైట్లను, వాటి ఉత్పత్తులు/సేవల సంబంధ అంశాలను చూపే వాణిజ్య ప్రకటనల ప్రసారం మానుకోండి’ అని న్యూస్ వెబ్‌సైట్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, ప్రైవేట్ శాటిలైట్ చానళ్లకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ సోమవారం సూచించింది. ఈ మార్గదర్శకాలు, చట్టాన్ని అతిక్రమిస్తే తీవ్ర స్థాయిలో చర్యలు ఉంటాయని ప్రైవేట్ శాటిలైట్ చానళ్లను కేంద్రం హెచ్చరించింది. వార్తలను ప్రచురించే పబ్లిషర్లకు, డిజిటల్ మీడియాకూ ఇదే తరహా సూచనలిస్తూ విడిగా మార్గదర్శకాలను పంపింది. ‘సొంత న్యూస్ వెబ్‌సైట్ల మాటున కొన్ని బెట్టింగ్ సంస్థలు తమను తాము అడ్వర్‌టైజ్ చేసుకుంటున్నాయి. బెట్టింగ్ సంస్థల లోగోలే ఆ న్యూస్ వెబ్‌సైట్లకూ ఉంటున్నాయి. ఈ వెబ్‌సైట్లు ఏవీ భారత చట్టాలకు లోబడి అధీకృత యంత్రాంగం వద్ద రిజిస్టర్ కాలేదు. తప్పుడు వాణిజ్య ప్రకటనలు, వార్తలు ప్రసారం చేస్తూ బెట్టింగ్, గ్యాబ్లింగ్‌కు పాల్పడుతున్నాయి. వీటిలో కొన్ని ప్రొఫెషనల్ స్పోర్ట్స్ బ్లాగ్‌లు, క్రీడా వార్తల వెబ్‌సైట్లుగా చెలామణి అవుతున్న విషయంపై వినియోగదారుల వ్యవహారాల విభాగాన్ని అప్రమత్తం చేశాం’ అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ తెలిపింది.
Also read: Weekly Current Affairs (Awards) Bitbank: 64వ రామన్ మెగసెసే అవార్డు 2022 గ్రహీతలు ఎవరు?
భారత వైమానిక దళంలో చేరిన Prachand LCH
స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అధునాతన తేలికపాటి యుద్ధ హెలికాప్టర్(ఎల్‌సీహెచ్) ప్రచండ్ భారత వైమానిక దళంలో చేరింది. అక్టోబర్ 3న రాజస్తాన్‌లోని జోధ్‌పూర్ వైమానికస్థావరంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్, ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి సమక్షంలో 4 లైట్ కంబాట్ హెలికాప్టర్లను వైమానిక దళంలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రచండ్‌లో రాజ్‌నాథ్ కొద్దిసేపు ప్రయాణించారు. పర్వతప్రాంతాల్లో, ఎడారి వంటి ప్రతికూల వాతావరణంలో పగలూ, రాత్రి శత్రువులపై దాడి చేయగలగడం ప్రచండ్ ప్రత్యేకత.
గగనతలంలోని లక్ష్యాలను గగనతలం నుంచే చేధించగల క్షిపణులను, ట్యాంక్ విధ్వంసక మిస్సైళ్లను, 20 ఎంఎం తుపాకులనూ వీటిలో అమర్చవచ్చు. నిమిషానికి 750 తూటాలను పేల్చగల సత్తా వీటి సొంతం. పర్వతప్రాంతాల్లోని శత్రు సైన్యంపై, ట్యాంక్‌లు, బంకర్లు, డ్రోన్‌లపై ఇవి సులభంగా దాడిచేయగలవని ఆర్మీ ఉన్నతాధికారులు చెప్పారు. 22 ఏళ్ల క్రితం భారత్ కన్న కల ఇప్పుడు నెరవేరిందని రాజ్‌నాథ్ అన్నారు. 1999లో పాకిస్తాన్‌తో కార్గిల్ యుద్ధకాలంలో పర్వతప్రాంతాల్లో తేలికపాటి పోరాట హెలికాప్టర్ల ఆవశ్యకతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అప్పటి నుంచి చేసిన పరిశోధన ఫలితమే ప్రచండ్ రూపంలో వచ్చిందన్నారు.
ఇంకొన్ని ప్రత్యేకతలు
ఈ హెలికాప్టర్‌లు గరిష్ట సంఖ్యలో ఆయుధాలతో పాటు మందుగుండు సామగ్రిని మోసుకెళ్లగలవు. గాలిలో ఎక్కువసేపు ఉండటానికి సరిపడా ఇంథనాన్ని నింపొచ్చు. ఎడారుల్లో, మంచుమయమైన హిమాలయ పర్వతాల్లోనూ పోరాడగలవు. ట్విన్ ఇంజన్లు ఉన్న ఈ హెలికాప్టర్ బరువు 5.8 టన్నులు. శత్రువుకు కనపడని రంగులో, తక్కువ శబ్దం చేస్తూ, రాడార్‌కు, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్లకు చిక్కకుండా వెళ్లగలవు. హెలికాప్లర్లను అడవులు, పట్టణ ప్రాంతాలలో ఉగ్రవ్యతిరేక ఆపరేషన్లలోనూ మొహరించవచ్చు. ఇక సైనిక వెర్షన్‌లో 96 హెలికాప్టర్లను తీసుకోవాలని ఆర్మీ భావిస్తోంది.
Also read: American Space Agency: అంగారకుడిపై జీవం ఆనవాళ్లు
Pau U - Bill Desk Deal రద్దు
దేశీ డిజిటల్ చెల్లింపుల కంపెనీ బిల్‌డెస్క్ కొనుగోలు ప్రతిపాదనను విరమించుకుంటున్నట్లు ప్రోజస్ ఎన్‌వీ తాజాగా పేర్కొంది. 4.7 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 38,400 కోట్లు) విలువైన ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు పేయూ నిర్వాహక సంస్థ ప్రోజస్ ఎన్‌వీ వెల్లడించింది. డీల్‌కు సంబంధించి గడువులోగా కొన్ని పరిస్థితులు అనుకూలించలేదని తెలియజేసింది. సెప్టెంబర్ ముగిసేలోగా ముందుగా చేసుకున్న కొన్ని ఒప్పంద పరిస్థితులను చేరుకోలేకపోవడంతో తాజా నిర్ణయానికి వచ్చినట్లు డచ్ ఈ–కామర్స్ దిగ్గజం ప్రోజస్ వివరించింది. అయితే ఈ డీల్‌కు సెప్టెంబర్ 5న కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) నుంచి అనుమతులు లభించినప్పటికీ ఏ ఇతర పరిస్థితులు అడ్డుపడ్డాయో వివరించలేదు. డీల్ నిబంధనల ప్రకారం కాంట్రాక్టు ఆటోమేటిక్‌గా రద్దుకానున్నట్లు కూడా ప్రోజస్ వెల్లడించింది.
Also read: Supreme Court: ‘మరణశిక్ష తగ్గింపుపై’ విస్తృత ధర్మాసనం
భారీ కంపెనీగా
బిల్‌డెస్క్ ను పేయూ సొంతం చేసుకుని ఉంటే వార్షికంగా 147 బిలియన్ డాలర్ల విలువైన పరిమాణం(టీపీవీ) ద్వారా డిజిటల్ చెల్లింపుల దిగ్గజంగా ఆవిర్భవించి ఉండేది. ప్రత్యర్థి సంస్థలు రేజర్‌పే 50 బిలియన్ డాలర్లు, సీసీఎవెన్యూ(ఇన్ఫీబీమ్) 18–20 బిలియన్ డాలర్ల టీపీవీ కలిగి ఉన్నట్లు అంచనా. డీల్ పూర్తయిఉంటే ప్రోజస్ చేపట్టిన అతిపెద్ద కొనుగోలుగా నిలిచేది. కాగా.. గతేడాది ఆగస్ట్ 31న బిల్‌డెస్క్ కొనుగోలుకి ప్రోజస్ నగదు రూపేణా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తద్వారా భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న ఫిన్‌టెక్ రంగంలో విస్తరించేందుకు వీలు చిక్కేది.
దేశంలో పెట్టుబడులు
ప్రోజస్ మాతృ సంస్థ నేస్పర్స్ 4.5 లక్షల బిజినెస్‌లకు 100 రకాలకుపైగా చెల్లింపుల విధానాలలో సేవలు అందిస్తోంది. ప్రోజస్ ద్వారా దేశీయంగా దీర్ఘకాలిక ఇన్వెస్టర్‌గా కొనసాగుతోంది. స్విగ్గీ, ఫార్మ్‌ఈజీ తదితర టెక్నాలజీ కంపెనీలలో 6 బలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది.
బిల్‌డెస్క్‌ను ఆర్థర్ ఆండర్సన్, ఎంఎన్ శ్రీనివాసు, అజయ్ కౌశల్– కార్తిక్ గణపతి 2000లో ఏర్పాటు చేశారు. స్మార్ట్‌ఫోన్ల వినియోగంతో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ ఊపందుకుంది. ఇది కంపెనీ పురోభివృద్ధికి సహకరించింది. డీల్ సాకారమైతే వ్యవస్థాపకులు ఒక్కొక్కరికీ 50 కోట్ల డాలర్ల చొప్పున లభించి ఉండేవి. బిల్‌డెస్క్ లో జనరల్ అట్లాంటిక్ 14.2 శాతం, టీఏ అసోసియేట్స్ 13.1 శాతం, వీసా 12.6 శాతం చొప్పున వాటాలు కలిగి ఉన్నాయి. ముగ్గురు ప్రమోటర్లకు దాదాపు 30 శాతం వాటా ఉంది.