Daily Current Affairs in Telugu: ఏప్రిల్ 11, 2023 కరెంట్ అఫైర్స్
Aam Aadmi Party: జాతీయ పార్టీగా ఆమ్ఆద్మీ.. హోదా కోల్పోయిన మూడు పార్టీలివే..
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని ఎన్నికల సంఘం జాతీయ పార్టీగా గుర్తించింది. ఢిల్లీ, గోవా, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కనబర్చిన పనితీరు ఆధారంగా ఆప్‌కు జాతీయ పార్టీ హోదా కల్పిస్తున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ఇదే సమయంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ), ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లకు ఇప్పటిదాకా ఉన్న జాతీయ పార్టీ హోదాను ఉపసంహరించుకుంది. ఈ మేరకు ఏప్రిల్ 10న ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్‌ఎస్‌కు, ఉత్తరప్రదేశ్‌లో ఆర్‌ఎల్‌డీ, మణిపూర్‌లో పీడీఏ, పుదుచ్చేరిలో పీఎంకే, పశ్చిమబెంగాల్‌లో ఆర్‌ఎస్సీ, మణిపూర్‌లో ఎంపీసీ పార్టీలకు ఇప్పటివరకు ఉన్న రాష్ట్ర పార్టీ హోదాను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇక నాగాలాండ్‌లో ఎన్సీపీ, మేఘాలయలో టీఎంసీలకు త్వరలో రాష్ట్ర పార్టీ హోదా కల్పించనున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. నాగాలాండ్‌లో లోక్ జనశక్తి పార్టీ (రామ్‌విలాస్), మేఘాలయలో వాయిస్ ఆఫ్ ద పీపుల్ పార్టీ, త్రిపురలో తిప్రా మోతా పార్టీలకు ‘గుర్తింపు పొందిన రాష్ట్ర రాజకీయ పార్టీ’ హోదా ఇస్తున్నట్టు వెల్లడించింది. సంబంధిత పార్టీల ప్రతినిధులతో సంప్రదింపులు, సమీక్షల తర్వాతే ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు వివరించింది.
Assembly Elections: దేశంలో తొలిసారి ఇంటి వద్ద నుంచే ఓటు వేసే అవకాశం.. ఎవరెవరికంటే?
ప్రస్తుతం జాతీయ పార్టీలు ఆరు..
ఎన్నికల సంఘం తాజా చర్యల మేరకు ప్రస్తుతం దేశంలో ఆరు పార్టీలకు జాతీయ హోదా ఉన్నట్టయింది. బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ), నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ), ఆమ్ ఆద్మీ పార్టీ ఈ జాబితాలో ఉన్నాయి.
☛ జాతీయ హోదా పొందిన ఆప్‌ను అరవింద్ కేజ్రీవాల్ 2012లో స్థాపించారు. 2015, 2020లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో, 2022లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించింది. అతి తక్కువ సమయంలోనే తమ పార్టీకి జాతీయ హోదా దక్కడం పట్ల కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు.
☛ 1925లో ఏర్పాటైన సీపీఐ 1989లో జాతీయ పార్టీగా గుర్తింపు పొందింది. పశ్చిమ బెంగాల్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతినడం, దేశవ్యాప్తంగా కూడా తగిన సంఖ్యలో లోక్‌సభ సీట్లను సాధించలేకపోవడంతో జాతీయ హోదాను కోల్పోయింది.
☛ జాతీయ హోదా కోల్పోయిన టీఎంసీని 1998లో మమతా బెనర్జీ స్థాపించారు. టీఎంసీ 2004లో రాష్ట్ర పార్టీ హోదా పొందింది. తర్వాత అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపురకూ విస్తరించగా.. 2016లో జాతీయ పార్టీ హోదా వచ్చింది. కానీ తర్వాత పెద్దగా ప్రభావం చూపకపోవడంతో హోదా కోల్పోవాల్సి వచ్చింది.
☛ శరద్‌పవార్ 1999లో కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి ఎన్సీపీని స్థాపించారు. వివిధ ఎన్నికల్లో విజయం సాధించడంతో 2000 సంవత్సరంలో జాతీయ హోదా లభించింది. తర్వాత ప్రభావం తగ్గిపోయింది.
National Party: ఓ రాజకీయ పార్టీని జాతీయ పార్టీగా గుర్తించాలంటే ఉండాల్సిన అర్హతలివే..
ఏపీలో పోటీ చేయకపోవడంతో బీఆర్‌ఎస్‌కు హోదా రద్దు
తెలంగాణ ఏర్పాటు నినాదంతో 2001లో టీఆర్‌ఎస్ (ప్రస్తుతం బీఆర్‌ఎస్) ఏర్పాటైంది. 2004 సాధారణ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసింది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్న నేపథ్యంలో.. రాష్ట్ర పార్టీ హోదా కోసం తెలంగాణతోపాటు ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోనూ 16 చోట్ల బరిలోకి దిగింది. తెలంగాణలో ఐదు లోక్‌సభ స్థానాలను గెలుచుకోవడంతోపాటు ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో ఒకశాతం ఓట్లు సాధించింది. ఈ నేపథ్యంలో 2004 ఎన్నికల తర్వాత రాష్ట్ర పార్టీ హోదా దక్కింది. 2009 సాధారణ ఎన్నికలతోపాటు తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన ఏ ఇతర ఎన్నికల్లోనూ ఏపీలో బీఆర్‌ఎస్ పోటీ చేయలేదు. అయినా ఉమ్మడి రాష్ట్రంనాటి రాష్ట్ర హోదా గుర్తింపు.. విభజన తర్వాత కూడా ఏపీలో కొనసాగింది. ప్రస్తుతం ఎన్నికల సంఘం సమీక్షలో ఆ హోదాను కోల్పోయింది.
Weekly Current Affairs (National) Bitbank: ఆసియాలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్ ఏ నగరంలో ప్రారంభమైంది?
Calyampudi Radhakrishna Rao: కల్యంపూడి రాధాకృష్ణారావుకు అంతర్జాతీయ స్టాటిస్టిక్స్ పురస్కారం..
ప్రఖ్యాత భారత్–అమెరికన్ గణిత శాస్త్రవేత్త, గణాంకశాస్త్ర(స్టాటిస్టిక్స్) నిపుణుడు కల్యంపూడి రాధాకృష్ణారావు(102)ను ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారం వరించింది. స్టాటిస్టిక్స్ రంగంలో నోబెల్ బహుమతితో సమానమైన ‘ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్’ను 2023 సంవత్సరానికి గాను రాధాకృష్ణారావుకు అందజేయనున్నట్లు ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. స్టాటిస్టిక్స్‌లో 75 ఏళ్ల క్రితం ఆయన చేసిన కృషి సైన్స్‌పై ఇప్పటికీ అమిత ప్రభావం చూపిస్తోందని ప్రశంసించింది. కెనడాలోని ఒట్టావాలో ఈ ఏడాది జూలైలో జరిగే ఇంటర్నేషనల్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ వరల్డ్ స్టాటిస్టిక్స్ కాంగ్రెస్‌లో అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ బహుమతి కింద 80,000 డాలర్లు అందజేస్తారు. ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్‌ను ప్రతి రెండేళ్లకోసారి ప్రదానం చేస్తారు. 2017లో తొలిసారిగా ఈ అవార్డును డేవిర్ ఆర్ కాక్స్ అందుకున్నారు. 2019లో బ్రాడ్జీ ఎఫ్రాన్, 2021లో నాన్ లాయిర్డ్ స్వీకరించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
Abel Prize: గణితశాస్త్ర నోబెల్ ప్రైజ్(అబెల్) 2023ను గెలుచుకున్న లూయిస్ కాఫరెల్లి
China and Taiwan: తైవాన్‌పై యుద్ధానికి చైనా సై!
దక్షిణ చైనా సముద్రంపై యుద్ధ మేఘాలు దట్టంగా కమ్ముకుంటున్నాయి. చైనా–తైవాన్ ఘర్షణ క్రమంగా తారస్థాయికి చేరుతోంది. ఈ ద్వీప దేశంపై ఏ క్షణంలోనైనా యుద్ధానికి దిగేందుకు అన్నివిధాలా సిద్ధంగా ఉన్నట్టు చైనా సైన్యం ఏప్రిల్ 10వ తేదీ చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది. స్వయంపాలిత హోదా ఉన్న తైవాన్ నిజానికి తమ అంతర్భాగమేనని చైనా చిరకాలంగా వాదిస్తుండటం తెలిసిందే. ఈ వాదనతో తైవాన్ తీవ్రంగా విభేదిస్తోంది. పూర్తిస్థాయి స్వతంత్ర దేశంగా గుర్తింపు పొందేందుకు చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. అందుకు అమెరికా అన్నివిధాలా వెన్నుదన్నుగా నిలుస్తుండటంపై చైనా గుర్రుగా ఉంది. గత ఆగస్టులో చైనా హెచ్చరికలను ఖాతరు చేయకుండా అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ తైవాన్‌లో పర్యటించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా తైవాన్ దేశాధ్యక్షురాలు సై ఇంగ్ వెన్ జరిపిన అమెరికా పర్యటనపై చైనా మరోసారి అగ్గిమీద గుగ్గిలం అవుతోంది.
Weekly Current Affairs (International) Bitbank: "అక్రమ వలసదారుల నిరోధక బిల్లు"ను ఏ దేశం ప్రవేశపెట్టింది?
మూడు రోజులుగా చైనా సైన్యం తైవాన్ ద్వీపకల్పాన్ని దిగ్బంధించి భారీ సైనిక విన్యాసాలకు తెర తీసింది. జాయింట్ స్వార్డ్ పేరిట జరిగిన ఈ యుద్ధ సన్నద్ధత విన్యాసాలు ఏప్రిల్ 10వ తేదీతో ముగిశాయి. కానీ తైవాన్ చుట్టూరా చైనా సైనిక మోహరింపులు మాత్రం యథాతథంగా కొనసాగుతున్నాయి. ‘ఏ క్షణంలోనైనా యుద్ధానికి దిగేందుకు సిద్ధంగా ఉన్నాం. స్వాతంత్య్రం కోసం తైవాన్ చేసే ప్రయత్నాలను పూర్తిస్థాయిలో అణచివేస్తాం. ఈ విషయంలో విదేశీ జోక్యాలను కూడా మర్చిపోలేని రీతిలో తిప్పికొడతాం’ అంటూ ఈ సందర్భంగా చైనా సైన్యం ప్రకటన విడుదల చేసింది. ‘తైవాన్‌లోని వేర్పాటువాదులకు, వారికి దన్నుగా నిలుస్తున్న బయటి శక్తులకు మా సైనిక విన్యాసాలు ఒక గట్టి హెచ్చరిక’ అని చైనా సైన్యం ఈస్టర్న్ కమాండ్ అధికార ప్రతినిధి షీ యీ అన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
Finland Joins NATO: నాటో కూటమిలోకి ఫిన్లాండ్..
Indian Grand Prix 3: ఇండియన్ గ్రాండ్‌ప్రి మీట్‌లో జ్యోతి యర్రాజీకి స్వర్ణం
ఇండియన్ గ్రాండ్‌ప్రి మీట్‌లో ఆంధ్రప్రదేశ్ మహిళా అథ్లెట్ జ్యోతి యర్రాజీ స్వర్ణ పతకం సాధించింది. బెంగళూరులో ఏప్రిల్ 10న జరిగిన ఈ మీట్‌లో జ్యోతి మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో విజేతగా నిలిచింది. వైజాగ్‌కు చెందిన జ్యోతి అందరికంటే వేగంగా 13.44 సెకన్లలో గమ్యానికి చేరింది. తెలంగాణకు చెందిన అగసార నందిని కాంస్య పతకం గెలిచింది. నందిని 13.85 సెకన్లతో మూడో స్థానంలో నిలిచింది.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)
Asian Wrestling Championships: వికాస్ ‘కంచు’ పట్టు
ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ రెండో రోజు(ఏప్రిల్ 10) పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో భారత్‌కు ఒక కాంస్య పతకం లభించింది. 72 కేజీల విభాగంలో వికాస్ కాంస్య పతక బౌట్‌లో 8–0తో ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో జెయిన్ తాన్ (చైనా)పై గెలుపొందాడు. భారత్‌కే చెందిన సుమిత్ (60 కేజీలు), రోహిత్ దహియా (82 కేజీలు), నరీందర్ చీమా (97 కేజీలు) కూడా కాంస్య పతక బౌట్‌లలో పోటీపడ్డారు. కానీ ఈ ముగ్గురికీ నిరాశే ఎదురైంది. కాంస్య పతక బౌట్‌లలో సుమిత్ 6–14తో మైతా కవానా (జపాన్) చేతిలో.. రోహిత్ 1–5తో అలీరెజా (ఇరాన్) చేతిలో.. నరీందర్ 1–4తో ఒల్జాస్ (కజకిస్తాన్) చేతిలో ఓటమి పాలయ్యారు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (అవార్డ్స్) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)
Martinique Open: మార్టినిక్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నీ రన్నరప్‌గా ప్రియాంక
జోయెల్ గ్రాటీన్ స్మారక మార్టినిక్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ మహిళా గ్రాండ్‌మాస్టర్ (డబ్ల్యూజీఎం) నూతక్కి ప్రియాంక రన్నరప్‌గా నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్ కార్తీక్ వెంకటరామన్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. కరీబియన్ దీవుల్లో జరిగిన ఈ టోర్నీలో నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత క్రిస్టియన్ బాయెర్ (ఫ్రాన్స్), ప్రియాంక (భారత్), కార్తీక్ వెంకటరామన్ (భారత్) ఏడు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా.. బాయెర్‌కు టాప్ ర్యాంక్, ప్రియాంకకు రెండో ర్యాంక్, కార్తీక్‌కు మూడో ర్యాంక్ ఖరారయ్యాయి.
ప్రియాంక ఏడు గేముల్లో గెలిచి, రెండు గేముల్లో ఓడిపోయింది. చివరి రెండు రౌండ్‌లలో ప్రియాంక ఫ్రాన్స్ జీఎం రొమైన్‌పై, తెలంగాణ జీఎం హర్ష భరతకోటిపై గెలుపొందింది. హర్ష 6.5 పాయింట్లతో నాలుగో ర్యాంక్‌లో నిలిచాడు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన బొమ్మిని మౌనిక అక్షయ 6 పాయింట్లతో ఏడో ర్యాంక్‌ను దక్కించుకుంది. మహిళల కేటగిరీలో ప్రియాంక, అక్షయ తొలి రెండు స్థానాల్లో నిలిచారు.