Skip to main content

Address Certificates: ఇకపై కొత్త జిల్లాల పేర్లతో అడ్రస్‌ సర్టిఫికెట్లు రెడీ... ఎప్పటినుంచంటే

రాష్ట్రంలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్త జిల్లాల పేర్లతో చిరునామా సర్టిఫికెట్లు జారీ చేయడానికి ఆ శాఖ ఏర్పాట్లు చేసింది. ఆధార్‌ కార్డుల్లో కొత్త జిల్లాల పేర్లను చేర్చుకోవడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. ఆధార్‌కార్డు జారీ సంస్థ యూఐడీఏఐ సూచించిన ఫార్మాట్‌లో సోమవారం నుంచే అడ్రస్‌ సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు. రాష్ట్రంలో అంతకు ముందు 13 జిల్లాలు ఉండగా.. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఆ సంఖ్యను 26కు పెంచింది.
Address Certificates
Address Certificates

ఈ నేపథ్యంలో ప్రజలు తమ ఆధార్‌ కార్డులలో కొత్త జిల్లా పేరుతో చిరునామా మార్చుకోవాలంటే.. ఆ వివరాలతో కూడిన ఏదో ఒక ధ్రువీకరణ పత్రం దాఖలు చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రజలు ఇబ్బంది పడకుండా.. కొత్త జిల్లాల పేర్లతో కూడిన అడ్రస్‌ సర్టిఫికెట్లను సచివాలయాల ద్వారా జారీ చేసేందుకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఏర్పాట్లు చేసింది. అడ్రస్‌ సర్టిఫికెట్ల జారీ బాధ్యతను సంబంధిత గ్రామ, వార్డు సచివాలయ రెవెన్యూ అధికారులకు అప్పగించారు. ఇందుకనుగుణంగా  సచివాలయాల సేవలకు సంబంధించిన ఆన్‌లైన్‌ పోర్టల్‌లో కొత్తగా ఈ సేవను కూడా చేర్చారు.

ఈ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగకుండా క్యూఆర్‌ కోడ్‌తో కూడిన ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని నిర్ణయించారు. ఈ ధ్రువీకరణ పత్రాల పై సంబంధిత వ్యక్తి ఫోటో.. దానిపై గ్రామ, వార్డు రెవెన్యూ అధికారుల సంతకం, సచివాలయ స్టాంప్‌ ముద్ర వేసి అందజేయనున్నట్లు గ్రామ, వార్డు సచివాలయ శాఖ అధికారులు వెల్లడించారు. కాగా, ఆధార్‌ జారీకి ఉద్దేశించిన పోర్టల్‌లో కొత్త జిల్లాల పేర్లను చేర్చినట్టు యూఐడీఏఐ హైదరాబాద్‌ ప్రాంతీయ కార్యాలయ డిప్యూటీ డైరక్టర్‌ జనరల్‌ పి.సంగీత మార్చి 16న సీఎస్‌ జవహర్‌రెడ్డికి లేఖ రాశారు. కొత్త జిల్లాల పేర్లను ఎవరికి వారు తమ ఆధార్‌లో అప్‌డేట్‌ చేసుకునేందుకు అడ్రస్‌ సర్టిఫికెట్ల అవసరముంటుందని అందులో పేర్కొన్నారు.

Published date : 03 Apr 2023 01:36PM

Photo Stories