Skip to main content

Parag Agrawal : ట్విట్టర్ నూత‌న సీఈవో 'పరాగ్‌ అగర్వాల్‌' స‌క్సెస్ స్టోరీ..

టెక్నాలజీ ప్రపంచంపై మరో భారతీయ అమెరికన్‌ తనదైన ముద్ర వేయనున్నారు.
Twitter New CEO Parag Agrawal
Twitter New CEO Parag Agrawal

ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘ట్విట్టర్‌’ సీఈవోగా భారతీయ అమెరికన్‌ పరాగ్‌ అగర్వాల్‌(37) నియమితులయ్యారు. ప్రస్తుతం సీఈవో స్థానంలో ఉన్న సంస్థ సహ వ్యవస్థాపకుడు జాక్‌డార్సే న‌వంబ‌ర్ 29వ తేదీన‌  రాజీనామా చేశారు. ఈ విషయాన్ని కంపెనీతోపాటు.. డార్సే సైతం ట్విట్టర్‌లో ప్రకటించారు. పరాగ్‌ అగర్వాల్‌ ఇప్పటి వరకు ట్విట్టర్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌(సీటీవో)గా పనిచేశారు. ఫైనాన్షియల్‌ పేమెంట్స్‌ కంపెనీ ‘స్క్వేర్‌’కు సైతం డార్సే చీఫ్‌గా ఉన్నారు. దీంతో సంస్థలో వాటాలు కలిగిన పెద్ద ఇన్వెస్టర్లు.. డార్సే రెండు బాధ్యతలను సమర్థవంతంగా నడిపించగలరా? అన్న సందేహాలను వ్యక్తం చేశారు. దీంతో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.  

వెళ్లిపోయే సమయంలో..

జాక్‌ డోర్సే


‘‘కంపెనీ వ్యవస్థాపకుడి నుంచి సీఈవో, ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ వరకు 16 ఏళ్లలో ఎన్నో బాధ్యతల్లో పనిచేశాను. కంపెనీని వీడే సమయం వచ్చిందన్న నిర్ణయానికి వచ్చేశాను. ఎందుకని? వ్యవస్థాపకుల నేతృత్వంలోని సంస్థ ప్రాముఖ్యం గురించి పెద్ద చర్చే నడుస్తోంది. అంతిమంగా ఇది ఎన్నో పరిమితులకు దారితీస్తుందని, వైఫల్యానికి ఏకైక అంశంగా మారుతుందని భావిస్తున్నాను’’ అంటూ ట్విట్టర్‌ పేజీలోని తన పోస్ట్‌లో డార్సే వివరించారు.

ఎంపిక ఇలా..: 
‘‘బోర్డు విస్తృత ప్రక్రియ, అన్ని ఆప్షన్లను పరిశీలించి ఏకాభిప్రాయంతో పరాగ్‌ను సీఈవోగా నియమించింది. కంపెనీని ఎంతో లోతుగా అర్థం చేసుకున్న పరాగ్‌ ముందు నుంచి నా ఎంపికే. సంస్థలో ప్రతీ కీలక నిర్ణయం వెనుక ఆయన ఉన్నారు. పరాగ్‌ ఎంతో ఆసక్తి, పరిశీలన, సృజనాత్మకత, స్వీయ అవగాహన, వినయం కలిగిన వ్యక్తి. మనస్ఫూర్తిగా సంస్థను నడిపిస్తారు. నేను నిత్యం ఆయన నుంచి ఎంతో కొంత నేర్చుకున్నాను. సీఈవోగా ఆయన పట్ల నాకు పూర్తి విశ్వాసం ఉంది’’అని డార్సే అన్నారు. 2022 లో డార్సే పదవీకాలం పూర్తయ్యే వరకు ట్విట్టర్‌ బోర్డులో కొనసాగుతారని కంపెనీ తెలిపింది.

11 ఏళ్లలోనే..

పరాగ్‌ అగర్వాల్‌


పరాగ్‌ అగర్వాల్‌ ఐఐటీ బోంబేలో బీటెక్‌ విద్య పూర్తయిన తర్వాత స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో ఎంఎస్, పీహెచ్‌డీ పూర్తి చేశారు. పదేళ్ల క్రితం 2011లో ట్విట్టర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా చేరారు. ఆ సమయంలో సంస్థ ఉద్యోగులు 1,000 మందే ఉండడం గమనార్హం. 2018లో సీటీవో అయ్యారు. సీఈవోగా ఎంపిక కావడం తనకు గర్వకారణమని పరాగ్‌ ప్రకటించారు. ‘‘మీ (జాక్‌డార్సే) మార్గదర్శకత్వం, స్నేహానికి జోహార్లు. మీరు నిర్మించిన పని విధానం, సంస్కృతికి ధన్యుడను. సంస్థను కీలకమైన సవాళ్ల మధ్య నడిపించారు. దశాబ్దం క్రితం.. ఆ రోజులను నిన్నటిగానే భావిస్తాను. మీ అడుగుల్లో నడిచాను. ఉద్దాన, పతనాలు, సవాళ్లు, అడ్డంకులు, విజయాలు, తప్పులను స్వయంగా చూశాను. వీటన్నింటినీ మించి గొప్ప విజయాలను చూస్తున్నాను. గొప్ప అవకాశాలు మా ముందున్నాయి’’అని అగర్వాల్‌ ప్రకటించారు.

విదేశాల్లో భారతీయుల స‌త్తా..
భారతీయుల అపార ప్రతిభా సామర్థ్యాలకు నిదర్శనంగా ఇప్పటికే పలు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలను జన్మతః భారతీయులైన వారు దిగ్విజయంగా నడిపిస్తున్నారు. ఈ జాబితాలోకి పరాగ్‌ అగర్వాల్‌ కూడా చేరిపోయారు. గూగుల్‌ (ఆల్ఫాబెట్‌) సీఈవోగా సుందర్‌ పిచాయ్, మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల, ఐబీఎం  సీఈవో అరవింద్‌ కృష్ణ,  అడోబ్‌ సీఈవో శంతను నారాయణన్, మాస్టర్‌కార్డ్‌ సీఈవోగా అజయ్‌పాల్‌ సింగ్‌ బంగా తదితరులు తమ సత్తా చాటుతుండడం గమనార్హం.

టాప్‌-500 కంపెనీల్లో..
ఎస్‌ అండ్‌ పీ(అమెరికా స్టాక్‌ మార్కెట్‌ ఇండెక్స్‌) టాప్‌-500 కంపెనీల్లో యంగెస్ట్‌ సీఈవో ఘనత పరాగ్‌ అగర్వాల్‌ సాధించినట్లు తెలుస్తోంది. మెటా (గతంలో ఫేస్‌బుక్‌) సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ వయసు 37 ఏళ్లు. పరాగ్‌ వయసు కూడా 37 ఏళ్లే! అని రిపోర్టులు చెప్తున్నాయి. కానీ, జుకర్‌బర్గ్‌(మే 14, 1984) పరాగ్‌ కంటే చిన్నవాడంట!. అయినప్పటికీ ఇద్దరి వయసు ఒకటే కావడంతో యంగెస్ట్‌ సీఈవో హోదాలో ఈ ఇద్దరూ నిలిచినట్లు అమెరికా మీడియా హౌజ్‌లు కథనాలు వెలువరుస్తున్నాయి. విశేషం ఏంటంటే.. సెక్యూరిటీ కారణాలతో ఆయన పూర్తి ఐడెంటిటీని, ఇతర బయోడేటాను రివీల్‌ చేసేందుకు ట్విటర్‌ కంపెనీ అంగీకరించలేదు. అయితే పరాగ్‌ అగర్వాల్‌ 1984 ముంబైలో పుట్టినట్లు కొన్ని చోట్ల ప్రొఫైల్‌ను సెట్‌ చేస్తున్నారు కొందరు. సో.. అధికారికంగా ఆయన చిన్నవయస్కుడని ప్రకటన వెలువడాల్సి ఉంది.

టాప్‌ 500 కంపెనీల్లో బెర్క్‌షైర్‌ హత్‌వే సీఈవో వారెన్‌ బఫెట్‌(95) అత్యధిక వయస్కుడిగా నిలిచారు. ఇక 500 పెద్ద కంపెనీల సీఈవో జాబితాను పరిశీలిస్తే సగటు వయసు 58 ఏళ్లుగా ఉంది. డైరెక్టర్ల వయసు సగటున 63 ఏళ్లుగా ఉంది.  కానీ, విశాల కోణంలో పరిశీలిస్తే చిన్నవయసు వాళ్లు సీఈవో అర్హతలకు దూరంగానే ఉన్నారు. అయితే ఇలాంటి సోషల్‌ మీడియా కంపెనీలను సమర్థవంతంగా నడిపేందుకు వయసు పెద్ద ఆటంకం కాకపోవచ్చని స్టాన్‌ఫోర్డ్‌ గ్రాడ్యుయేట్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ ప్రొఫెసర్‌ డేవిడ్‌ లార్కర్‌ అభిప్రాయపడుతున్నారు.

ట్విటర్‌ ఫౌండర్‌, సీఈవో జాక్‌ డోర్సే(45)..  ఫైనాన్షియల్‌ సర్వీస్‌-డిజిటల్‌ పేమెంట్‌ కంపెనీ ‘స్క్వేర్‌’కు సైతం సీఈవో బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే రెండింటి బాధ్యతలు చేపట్టడం కష్టతరమవుతున్న తరుణంలో ఆయన ట్విటర్‌ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇక పరాగ్‌కు పూర్తిస్థాయిలో బాధ్యతలు అప్పగించాక.. జాక్‌ డోర్సే ట్విటర్‌ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవచ్చనే అంటున్నారు. కానీ, 2022 వరకు(తన కాంట్రాక్ట్‌ ముగిసేవరకు) బోర్డులో  మాత్రం మెంబర్‌గా కొనసాగనున్నాడు.

పరాగ్‌ అగర్వాల్ గురించి మ‌రికొన్ని ఆస‌క్తి విష‌యాలు..

కుటుంబ నేప‌థ్యం : 
పరాగ్‌ అగర్‌వాల్‌ పుట్టి పెరిగింది అంతా ముంబైలోనే. అటామిక్‌ ఎనర్జీ సంస్థలో ఉన్నత ఉద్యోగిగా పరాగ్‌ తండ్రి పని చేశారు. తల్లి స్కూల్‌ టీచర్‌గా పని చేసి రిటైర్‌ అయ్యారు. తండ్రి పని చేస్తున్న అటామిక్‌ ఎనర్జీ నిర్వహిస్తున్న స్కూల్‌లోనే పరాగ్‌ చదువుకున్నారు. 

ప్రముఖ సింగర్‌శ్రేయా ఘోషల్‌ క్లాస్‌మేట్‌..
ముంబైలోని అటామిక్‌ ఎనర్జీస్కూల్‌లో పరాగ్‌ అగర్‌వాల్‌, నేటి ప్రముఖ సింగర్‌ శ్రేయా ఘోషల్‌ కలిసే చదువుకున్నారు. పరాగ్‌ పుస్తకాల పురుగుగా మారి పరీక్షల్లో టాప్‌ ర్యాంకులు సొంతం చేసుకుంటుంటే శ్రేయ సంగీత ప్రపంచంలో తిరుగులేని మహారాణిగా ఎదిగింది. ముందుగా శ్రేయా ఇండియన్‌ సెలబ్రిటీగా మారగా.. ఆ తర్వాత కొంత కాలానికి పరాగ్‌ ఇంటర్నేషన్‌ ఫేమస్‌ పర్సన్‌గా ఎదిగారు. వీరిద్దరి మధ్య ఇప్పటీకీ స్నేహం కొనసాగుతోంది. పరాగ్‌ ఇండియా వచ్చినా.. శ్రేయా అమెరికా వెళ్లినా కలుస్తుంటారు. ట్విట్టర్‌లో తరచుగా చాట్‌ చేస్తుంటారు కూడా.

ఇంటర్‌లోనే గోల్డ్‌ మెడల్‌..
ఇంటర్మీడియట్‌లో ఉన్నప్పుడు టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో 2001లో జరిగిన ఇంటర్నేషనల్‌ ఫిజిక్స్‌ ఒలంపియాడ్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించారు.

జేఈఈ ఎగ్జామ్‌లో న‌లభై నిమిషాల్లోనే..
ఐఐటీలో సీటు లక్ష్యంగా ప్రిపేర్‌ అవుతూ వచ్చిన పరాగ్‌ జేఈఈ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌లో ఇన్విజిలేటర్లతో గొడవ పడ్డాడు. పరీక్ష ప్రారంభమైన నలభై నిమిషాల్లోనే తనకు తెలిసిన అన్ని ప్రశ్నలకు సమాధానం రాసిన పరాగ్‌.. ఆ తర్వాత అడిషనల్‌ పేపర్లు కావాలంటూ ఇన్విజిలేటర్‌ని కోరాడు.. ‘ ఈ పరీక్షలో అడిషనల్‌ పేపర్ల కాన్సెప్ట్‌ లేదు’ అంటూ ఇన్విజిలేటర్‌ సమాధానం ఇచ్చారు. మరి అలాంటప్పుడు ఇన్‌స్ట్రక‌్షన్‌ బుక్‌లెట్‌లో ‘‘టై ఆల్‌ ది సప్లిమెంట్స్‌ కరెక్ట్‌లీ ఇన్‌ రైట్‌ ఆర్డర్‌’’ అనే నిబంధన ఎందుకు చేర్చినట్టు అంటూ ఎదురు ప్రశ్నించారు. అలా ఇద్దరి మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది. దీంతో పరీక్షలో విలువైన సమయం వృథా అయ్యిందని ఇప్పటికీ పరాగ్‌ గుర్తు చేసుకుని బాధపడతారు.

ముంబై టూ..
జేఈఈ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌లో చిన్న గొడవ జరిగినా.. ఆలిండియా 77వ ర్యాంకు సాధించి ఐఐటీ ముంబైలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌లో చేరాడు. 2005లో పట్టా పుచ్చుకుని ఉన్నత విద్య కోసం అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీకి చేరుకున్నాడు. అక్కడే డాక్టరేట్‌ పట్టా సైతం పుచ్చుకున్నాడు. అప్పటి నుంచే ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ మీద ఎక్కువగా ఫోకస్‌ చేశారు.

మొద‌టి ఉద్యోగ‌మే..
‍స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ నుంచి పరాగ్‌ బయటకు వచ్చిన తర్వాత మొదటి సారి మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత యాహూ, ఏటీ అండ్‌ టీల మీదుగా 2011లో ట్విట్టర్‌లో చేరారు పరాగ్‌. ఆ సమయంలో ట్విట్టర్‌ మొత్తం ఉద్యోగుల సంఖ్య వెయ్యికి అటుఇటుగా ఉంది. అప్పటి నుంచి టీమ్‌ వర్క్‌ చేస్తూ ట్విట్టర్‌ ఉన్నతిలో కీలక భూమిక పోషించారు. 

వివాహాం:

Parag Agrawal Family


స్టాన్‌ఫోర్డ్‌లో చదివేప్పుడే వినీతతో పరిచయం. అమె అక్కడ మెడికల్‌ సైన్స్‌ విద్యార్థిగా చేరింది. ఆ తర్వాత వారిద్దరు పెళ్లి చేసుకున్నారు. వారికి అన్ష్‌ అగర్వాల్‌ అనే బాబు ఉన్నాడు. ప్రస్తుతం అండర్‌సన్‌ హారోవిట్జ్‌ అనే వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థలో భాగస్వామిగా ఆమె ఉన్నారు.

Published date : 30 Nov 2021 03:07PM

Photo Stories