Success Story: ఏ ఒక్క కంపెనీ పెట్టకుండానే.. వేల కోట్లు సంపాదించాడిలా..
అయితే వీరిలా ఏ కంపెనీ స్థాపించలేదు, ఏ కొత్త ఉత్పత్తిని మార్కెట్‌లోకి తీసుకురాలేదు. కానీ మార్కెట్‌తోనే ఆడుకున్నాడు. లాభాలు తెచ్చే కంపెనీల వాటాలను వేటాడాడు... వేల కోట్ల రూపాయలకు కూడబెట్టాడు. అతనే రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం.
ఏమీ లేకుండానే..
రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా స్టాక్ మార్కెట్ గురించి కాసింత అవగాహన ఉన్నవారికైనా పరిచయం అక్కర్లేని పేరు. సొంత కంపెనీ అంటూ లేకుండా కేవలం వాటాదారుడిగా ఉంటూ వేల కోట్ల రూపాయలు సంపద పోగేసిన ఘనాపాఠీ. అది కూడా కేవలం 36 ఏళ్లలోనే 34 వేల కోట్లు సంపాదించాడు. అంటే ఏడాదికి సుమారు 900 కోట్లకు పైగానే ఆర్జించాడు. అయితే ఆ ఆర్జన వెనుక అతని శ్రమ ఉంది. మేథస్సు ఉంది. భవిష్యత్తును అంచనా వేయగలిగే నేర్పు ఉంది. అవన్ని కలిపితేనే వేల కోట్ల ఆస్తులు.
మన హైదరాబాద్‌లోనే..
ఇండియన్ బిగ బుల్ , వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియా రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా జన్మించింది మన హైదరాబాద్‌లోనే. అయితే తండ్రి ట్యాక్స్ ఆఫీసర్ కావడంతో ఆ కుటుంబం ముంబైకి వెళ్లిపోయింది. తండ్రి నుంచి వచ్చిన వారసత్వంగా ఆయన చిన్నప్పటి నుంచి లెక్కలు ఒంటబట్టిచ్చుకున్నాడు. అందుకే చదువు పూర్తి కాకుండానే డిగ్రీలో ఉండగానే స్టాక్‌మార్కెట్‌పై కన్నేశాడు.
ఏ పని చేయాలన్నా..
ఇప్పుడంటే బీఎస్‌ఈ సెన్సెక్స్ 50 వేల పాయింట్లు దాటింది. ఆరోజుల్లో అంటే 1985లో 150 పాయింట్ల దగ్గరే ఉండేది. అప్పటికి దేశంలో లైసెన్స్‌రాజ్ నడుస్తుండేది. ఏ పని చేయాలన్నా రెడ్ టేపిజం అడ్డొచ్చేది. అయినా సరే ఆ రోజుల్లోనే స్టాక్‌మార్కెట్ ట్రేడింగ్‌కి ఇండియాలో ఉన్న భవిష్యత్తును ఝున్‌ఝున్‌వాలా అంచనా వేయగలిగాడు.
రూ. 5000 పెట్టుబడితో..
తండ్రి దగ్గర అరువుగా తీసుకున్న రూ. 5000లతో బాంబే స్టాక్ మార్కెట్‌లోకి ఎంటరయ్యాడు. ఏడాది పాటు ఇబ్బందులు పడ్డాడు. అయితే మార్కెట్‌పై ఒక అంచనా వచ్చింది. ఏ కంపెనీ షేర్లు ఎలా వర్కటవుతాయో తెలిసింది. ఈసారి గురి చూసి టాటా టీ షేర్లు ఒక్కొక్కటి రూ. 43 వంతున 5,000 షేర్లు 1986లో కొనేశాడు. మూడు నెలలు తిరిగే సరికి షేర్ వాల్యు అమాంతం రూ. 143కి పెరిగింది. అంటే మూడు నెలల్లలో ఐదు లక్షల రూపాయల లాభం. ఇక అక్కడి నుంచి రాకేశ్ స్టాక్‌మార్కెట్ బుల్‌గా మారాడు. 1986 నుంచి 89 మధ్య ఏకంగా రూ. 25 లక్షలు సంపాదించాడు.
హర్షద్ మెహతా ఎఫెక్ట్ నుంచి..
ఆర్థిక సంస్కరణలు అమలవుతున్న కాలంలోనే ఇండియన్ స్టాక్ మార్కెట్‌కి హర్షద్ మెహతా రూపంలో భారీ షాక్ తగిలింది. హర్షద్ మెహెతా ఎఫెక్ట్‌ని షేర్ మార్కెట్‌పై వెంటనే అంచనా వేసిన రాకేశ్ తన దగ్గరున్న షేర్లు సకాలంలో అమ్మి నష్టాలు తప్పించుకోగా... ఈ పరిణామం ముందుగా అంచనా వేయలేకపోయిన వారి సంపద ఆవిరైపోయింది. ఎంతో నేర్పుతో హర్షద్ ఎఫెక్ట్ నుంచి రాకేశ్ తప్పించుకోగలిగాడు.
సంపదనలో..
రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా సంపదనలో అత్యధికం వాచీలు, వజ్రాలు తయారు చేసే టైటాన్ కంపెనీ నుంచే వచ్చింది. రాకేశ్ ఝున్‌ఝున్ వాటా సంపాదనలో ఒక్క టైటాన్ వాటాయే రూ.7,879 కోట్లు ఉండగా ఆ తర్వాత స్థానంలో టాటా మోటార్స్ రూ. 1,474, క్రిసిల్ రూ. 1,063 కోట్లుగా ఉన్నాయి. ఇప్పటికీ రాకేశ్ పోర్ట్‌పోలియోలో మొత్తం 37 కంపెనీలు ఉన్నాయి. ఇందులో ప్రధానమైనవిగా లుపిన్, ఫోర్టిస్ హెల్త్‌కేర్, నజరా టెక్నాలజీస్, ఫెడరల్ బ్యాంక్, డెల్టా కార్ప్, డీబీ రియల్టీ, టాటా టెలి కమ్యూనికేషన్స్ తదితర కంపెనీలు ఉన్నాయి.
వివాహం..:
బాంబే స్టాక్ ఎక్సేంజీలో 1987 నాటికి రాకేశ్ రాధేశ్యామ్ ఝున్‌ఝున్ వాలా నిలదొక్కకున్నాడు. ముంబైలో అంధేరీకి చెందిన మరో స్టాక్‌మార్కెట్ ఇన్వెస్టర్ రేఖాను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరి పేర్లు కలిసి వచ్చేలా రారే పేరుతో 2003లో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కంపెనీని నెలకొల్పారు. ప్రస్తుతం ఈ సంస్థ విజయవంతంగా రన్ అవుతోంది. అయితే 2016 ఫిబ్రవరి నుంచి సెప్టెంబరు మధ్య కాలంలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ ఆరోపణలపై రాకేశ్‌ను సెబీ ప్రశ్నించింది. మరోసారి 2020 జనవరిలో జరిగిన ట్రేడింగ్‌పైనా సెబీ విచారణ చేపట్టింది.
సీక్రెట్ జర్నీ..
ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోకి వచ్చిన రాకేశ్ హంగామా డిజిటల్ మీడియా సంస్థను స్థాపించారు. ఇంగ్లీష్ వింగ్లీష్, షమితాబ్ వంటి చిత్రాలకు సహా నిర్మాతగా వ్యవహరించారు. రాకేశ్ ఝున్‌ఝున్ వాలాపై సీక్రెట్ జర్నీ ఆఫ్ రాకేశ్‌ఝున్‌ఝున్‌వాలా అనే పుస్తకం వచ్చింది. అతని అభిమానులు వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియాగా పిలచుకుంటారు.
పెద్ద విపత్తులను..
కోవిడ్ ప్రభావంతో అన్ని రంగాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అయితే స్టాక్ మార్కెట్ రంగంపై కోవిడ్ ప్రభావం పెద్దగా ఉండబోదనేది రాకేశ్ అభిప్రాయం. పెద్ద విపత్తులను తట్టుకునేలా ఇండియన్ ఎకానమీ ఉందనేది రాకేశ్ నమ్మకం.
కేవలం 10 నిమిషాల్లోనే 850 కోట్లు..
10 నిమిషాల్లో ఎవరైన ఎంత సంపాదిస్తాం.. మహా అయితే వంద, వెయ్యి, పదివేలు రూపాయలు ఇంకా గట్టిగా మాట్లాడితే పది లక్షలు. కానీ, ఇండియన్ బిగ్ బుల్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా మాత్రం ఏకంగా 850 కోట్ల రూపాయలు సంపాదించి, తన సత్తా ఏంటో మరోమారు మార్కెట్‌కు చాటారు. ఏస్ ఇన్వెస్టర్ పెట్టుబడుల్లోని అతి పెద్ద స్టాక్ బెట్ టైటాన్, గత సంవత్సరం అక్టోబర్ 7వ తేదీన ట్రేడింగ్‌లో ధగధగా మెరిసింది. దాదాపు 10 శాతం ర్యాలీ చేసింది. కేవలం 10 నిమిషాల్లోనే మార్కెట్ క్యాపిటల్‌కు మరో రూ.17,770 కోట్లను ఈ కంపెనీ జోడించింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే టైటాన్ షేర్లు 9.32% పెరిగి, రూ.2,347 రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
ఇటీవలే విమానయాన రంగంలో..
రాకేష్ ఝున్‌ఝున్‌వాలా స్టార్టప్ ఎయిర్‌లైన్ ‘ఆకాశ ఎయిర్’ నుంచి మరో అడుగు ముందుకు పడింది. ఝున్‌ఝున్‌వాలా వాలా నేతృత్వంలో 'ఆకాశ ఎయిర్' బ్రాండ్ కింద ఎస్‌ఎన్‌వీ ఏవియేషన్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థను ఏర్పాటు చేసిన సంగతి తేలిసిందే. ఇప్పుడు ఆ కంపెనీ 72 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను ఆర్డర్ చేస్తున్నట్లు 2021, నవంబర్ 16వ తేదీన ప్రకటించింది. ఈ ఒప్పందం విలువ దాదాపు 9 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 66 వేల కోట్లు) అని ఒక సంయుక్త ప్రకటనలో తెలిపింది.