Inspirational Story : నాడు ఆకలి కన్నీరు కార్చా.. నేడు ఎందరికో ఆకలి బాధలు తీర్చా...
మెరుపు మెరిస్తే భయం... వానొస్తుందని, వాన కురిస్తే భయం... ఇంట్లో ఉండలేమని... ఎందుకంటే అది పేరుకే ఇల్లు. పేదవాడి ఇల్లు. ఇంటి పై కప్పుకు అన్నీ చిల్లులే! ఆకసమున హరివిల్లు సంగతి సరే... మరి తన ఆకలి సంగతి ఏమిటి?
తాను ఎదుర్కొన్న కష్టాలు...
ఎన్నో కష్టాలకు ఎదురీది పెద్ద చదువు చదువుకున్నాడు పుదుచ్చేరికి చెందిన అనుముతు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తయింది, ఆ తరువాత తనకు ఇష్టమైన ఫొటోగ్రఫీ కోర్స్ చేశాడు. సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది! అంతమాత్రాన నడిచొచ్చిన దారిని మరవలేదు. తాను ఎదుర్కొన్న కష్టాలు ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు ఎదుర్కొంటూనే ఉంటారు. వారికి అండగా నిలవాలనుకున్నాడు. కష్టాలు దాటి ముందుకు వెళ్లినవాడు కష్టపడుతున్న వారి కోసం వెనక్కి తిరిగి చూసుకున్నాడు.
తల్లి కడుపుమాడ్చుకుని మరీ..
అనుమతు తండ్రి వడ్రంగి. తాను ఏడుసంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తండ్రి చనిపోయాడు. ఇక కష్టాలు మొదలయ్యాయి. ‘మేమున్నాం’ అని ధైర్యం చెప్పే చుట్టాలు,పక్కాలు లేరు. తల్లీకొడుకులు కలిసి కూలీ పనులకు వెళ్లేవాళ్లు. కూలి ఉన్నరోజు తిండి. లేకపోతే పస్తులు. ఎప్పుడైనా ఇంట్లో ఒక్కరు తినడానికి మాత్రమే చాలినంత ఉంటే ‘నాకు ఆకలిగా లేదు. నువ్వు తిను నాయనా’ అనేది తల్లి!
నాలాంటి వాళ్ల కోసం..
ఎన్ని కష్టాలు పడుతున్నా బాగా చదువుకోవాలనే కోరిక మాత్రం బలంగా ఉండేది అనుమతులో. ఇది గమనించిన ఒక పూజారి అనుమతును చదివించే బాధ్యతను తీసుకున్నాడు... అలా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు అనుమతు. ‘ఇక నా జీవితం స్థిరపడింది. వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు’ అనుకోలేదు. తనవంతుగా సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో రకరకాల స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేశాడు. ఆ తరువాత తానే స్వయంగా ‘స్నేహన్’ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను ప్రారంభించాడు.
ఆకలితో ఉన్న వ్యక్తులకు..
ఆటోరిక్షా నడిపే సురేష్‌కు చూపు దెబ్బతింది. కంటి ఆపరేషన్ చేసుకోవడం తప్పనిసరి. లేకపోతే ఆటో నడపలేడు. నడపకుంటే ఇల్లు గడవడం కష్టం. ఇలాంటి క్లిష్ట సమయంలో సురేష్‌కు కంటి ఆపరేషన్ చేయించి అతని జీవితం గాడిన పడడానికి సహాయపడ్డాడు. కొందరు యువకులతో ఒక బృందాన్ని తయారు చేశాడు. ఈ బృందంలోని సభ్యులు రైల్వేస్టేషన్, పార్క్, దేవాలయం, ఫ్లై ఓవర్ల దగ్గర ఆకలితో ఉన్న వ్యక్తులకు భోజనం, టీ, బిస్కెట్లు అందిస్తారు. వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే చికిత్స చేయిస్తారు.
75 మందికి పైగా..
నగరంలో యాచన చేసే చాలామంది యాచకులతో అనుమతు మాట్లాడాడు. కొందరు గతం చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. తాము యాచించిన సొమ్మును రౌడీలు బెదిరించి తీసుకుంటున్నారని కొందరు ఫిర్యాదు చేశారు... ఇలా ఎంతకాలమని యాచిస్తారు? వీరికి ఏదైనా ఉపాధి చూడాలి అనుకున్నాడు అనుమతు. తిరువనంతపురంలోని కంతరి లీడర్‌షిప్ ప్రోగాంలో చేరి శిక్షణ తీసుకున్నాడు. ఈ శిక్షణ ఫలితంగా ఉపాధి అవకాశాలకు సంబంధించిన ప్రాథమిక విషయాలు అర్థం అయ్యాయి. ఫలితంగా 75 మందికి పైగా ఉపాధి మార్గాలు చూపించగలిగాడు.
పేద మహిళలకు..
కాటన్‌తో రకరకాల సంచుల తయారీ కోసం పేద మహిళలకు శిక్షణ ఇప్పించాడు. ఒకవైపు వీరికి ఉపాధి అవకాశం కలిపిస్తూనే, ‘స్నేహన్’ బ్రాండ్‌తో రూపొందించిన ఉత్పత్తులను అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులు, ఫొటోగ్రఫీ ద్వారా వచ్చిన డబ్బును సేవాకార్యక్రమాలకు వినియోగిస్తున్నాడు. ‘షెల్టర్‌హోమ్’ ఒకటి నిర్మించాలని, సేవాకార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలనే ప్రణాళికలను రూపొందించుకుంటున్నాడు.