Failure to Success: ఇంటర్‌లో 2 సార్లు ఫెయిల్..ఇప్పుడు రూ.72వేల కోట్లకు అధిపతి అయ్యాడిలా..
ఈ రోజు మనం ఎదుర్కొనే అతి పెద్ద సమస్య.. కొన్ని రోజుల తర్వాత చాలా చిన్నగా అనిపిస్తుంది. అందుకే ఓడిపోయినప్పుడు.. కుంగిపోకూడదు. ధైర్యంగా ముందడుగు వేయాలి.. విజయం తప్పక వరిస్తుంది. ఇందుకు నిదర్శనంగా నిలిచారు మురళి దివి. ఇంటర్ రెండు సార్లు ఫెయిలైన మురళి దివి.. నేడు 72వేలకు కోట్లకు అధిపతిగా నిలిచారు. ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. ఆ వివరాలు..
కుటుంబ నేపథ్యం :
ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా మచిలీపట్నం మురళి దివి స్వస్థలం. ఆయన తండ్రి రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. మురళి దివికి 12 మంది తోబుట్టువులున్నారు. మురళి తండ్రికి వచ్చే 10 వేల రూపాయల పెన్షనే వారికి జీవినాధారం. సరిపడా ఆదాయం లేనప్పటికి పిల్లల్ని చదువుకు దూరం చేయలేదు మురళి దివి తండ్రి. ఇంటర్‌కు వచ్చే వరకు కూడా కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల గురించి మురళి పెద్దగా పట్టించుకోలేదు.
జీవితంలో మలుపు తిప్పిన సంఘటన ఇదే..
మురళి ఇంటర్ రెండు సార్లు ఫెయిలయ్యాడు. ఈ సంఘటన మురళి జీవితం మీద చాలా ప్రభావం చూపింది. తనను చదివించడం ఆర్థికంగా భారమైనప్పటికి తండ్రి అవేం పట్టించుకోలేదు. కానీ తాను మాత్రం రెండు సార్లు ఫెయిలయ్యాననే బాధ మురళిని పీడించసాగింది. ఆ తర్వాత నుంచి మురళి మరింత కష్టపడి చదివాడు.. అమెరికాలో ఉద్యోగం సంపాదించాడు.
కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాల గురించి..
ఇంటర్‌లో ఫెయిలవ్వడం గురించి మురళి అంతర్జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘చదువు విషయంలో నేను చాలా నిజాయతీగా ఉండేవాడిని. చాలా కష్టపడేవాడిని. కానీ నాకు ఇంగ్లీష్ రాకపోవడం వల్ల రెండు సార్లు ఫెయిల్ అయ్యాను. అప్పుడే నాకు మా కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాల గురించి అర్థం అయ్యింది. ఆ క్షణమే నిర్ణయించుకున్నాను. బాగా చదివి.. మంచి ఉద్యోగం సాధించి.. కుటుంబాన్ని ఆదుకోవాలని భావించాను. కష్టపడి చదివి.. అమెరికాలో ఉద్యోగం సాధించాను’’ అని తెలిపాడు.
విధి రాత మరోలా..
మురళి దివి తన అన్నల మాదిరిగానే కెమిస్ట్‌గా మారే మార్గంలో ఉన్నాడు. కానీ విధి రాత మరోలా ఉంది. ఈ క్రమంలో మురళి గ్రీన్ కార్డ్ పొంది 1976 లో అమెరికా వెళ్లాడు. ఫార్మసిస్ట్‌గా జీవితం ప్రారంభించాడు. అమెరికాలోని వివిధ కంపెనీలలో పని చేశాడు. చివరకు ఏడాదికి 65 వేల డాలర్లు సంపాదించే స్థాయికి ఎదిగాడు. కానీ ఇంటి మీద బెంగ, మాతృభూమి నుంచి వచ్చిన పిలుపు మురళీ దివిని భారతదేశానికి తిరిగి తీసుకువచ్చింది.
సొంతంగా..
ఇండియాకు తిరిగి వచ్చాడు. కానీ ఇక్కడ ఏం చేయాలి.. అనే దాని గురించి ఏం ఆలోచించుకోలేదు మురళి. అప్పుడే అనగా 1984లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ప్రారంభం అయ్యింది. దానిలో చేరాడు మురళి. ఆరేళ్ల తర్వాత రెడ్డీస్ నుంచి బయటకు వచ్చి సొంతంగా దివిస్ లాబొరేటరీస్‌ని ప్రారంభించాడు.
బిలియనీర్‌గా..
దివీస్ ల్యాబ్స్ స్థాపించిన 23 సంవత్సరాల తరువాత, అనగా 2013లో మురళి బిలియనీర్ అయ్యాడు. 2018-19లో, అతను భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందిన ఫార్మాస్యూటికల్ ఎగ్జిక్యూటివ్‌గా నిలిచాడు. దివీస్ ల్యాబ్స్ స్టాక్ విలువ గత 3 సంవత్సరాలలో 400% కంటే ఎక్కువ పెరిగింది. అలానే కేంద్రం ప్రారంభించిన ఆత్మ-నిర్భర్ అభియాన్, మేక్ ఇన్ ఇండియా మద్దతు.. కోవిడ్ -19 మహమ్మారి వల్ల ఫార్మా ఉత్పత్తుల అవసరం పెరగడంతో దివిస్ ల్యాబ్స్ మరింత ఎదిగింది. ఫోర్బ్స్ ప్రకారం, మురళీ దివి, అతడి కుటుంబం రూ. 72,000 కోట్ల (9.9 బిలియన్ డాలర్లు) నికర సంపదతో ప్రపంచంలోని 384 వ ధనవంతులుగా నిలిచారు.