Skip to main content

Common Wealth Games 2022 : బర్మింగ్ హమ్ వేదికగా 20 క్రీడాంశాల్లో పోటీ

2022 సంవత్సరంలో 22వ కామన్వెల్త్‌ క్రీడలకు రంగం సిద్ధమైంది. ఇంగ్లండ్ లోని బర్మింగ్ హమ్ వేదికగా జూలై 28న నుంచి జరిగే ఈ పోటీల్లో దాదాపు ఐదువేల మంది అథ్లెట్లు పోటీ పడుతున్నారు.
2022 Commonwealth Games
2022 Commonwealth Games

తొలి రోజు ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించనుండగా, జూలై 29 నుంచి పోటీలు మొదలవుతాయి. మొత్తం 20 క్రీడాంశాల్లో ఆటగాళ్లు పతకాల కోసం పోటీ పడతారు. మహిళల క్రికెట్‌ తొలిసారి టి20 రూపంలో కామన్వెల్త్‌ క్రీడల్లో అడుగు పెట్టనుంది. సాధారణంగా రెండు ఒలింపిక్స్‌ మధ్య (రెండేళ్ల తర్వాత, రెండేళ్ల ముందు) వీటిని నిర్వహిస్తారు. అయితే కోవిడ్‌తో టోక్యో క్రీడలు ఆలస్యం కావడంతో సంవత్సరం లోపే ఈ మెగా ఈవెంట్‌ ముందుకు వచ్చింది. 1930లో తొలిసారి ‘బ్రిటీష్‌ ఎంపైర్‌ గేమ్స్‌’ పేరుతో నిర్వహించిన ఈ క్రీడలు రెండో ప్రపంచ యుద్ధం సమయంలో మినహా ప్రతీ నాలుగేళ్లకు ఒకసారి జరిగాయి. 1934 (లండన్‌), 2002 (మాంచెస్టర్‌) తర్వాత ఇంగ్లండ్‌ మూడోసారి కామన్వెల్త్‌ క్రీడలకు ఆతిథ్యం ఇస్తోంది. నిజానికి ఈసారి పోటీలు దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో జరగాలి. 2015లో ఆ ఒక్క దేశమే బిడ్‌ వేయడంతో హక్కులు కేటాయించారు. అయితే ఆర్థికపరమైన సమస్యలతో తమ వల్ల కాదంటూ 2017లో దక్షిణాఫ్రికా చేతులెత్తేయడంతో వేదికను మార్చాల్సి వచ్చింది. ఈ క్రీడల మొత్తం బడ్జెట్‌ 778 మిలియన్‌ పౌండ్లు (రూ. 80 వేల కోట్లు).

Also read: Weekly Current Affairs (International) Bitbank: అధికారికంగా పేరు మార్చుకున్న దేశం ఏది?

72 దేశాల క్రీడాకారులు
ఒకనాడు బ్రిటీష్‌ పాలనలో ఉండి, ఆపై స్వతంత్రంగా మారిన దేశాల మధ్య జరిగేవే కామన్వెల్త్ పోటీలు. ఈ ఆటలు... ప్రపంచ సంబరం ఒలింపిక్స్‌తో పోలిస్తే స్థాయి కాస్త తక్కువే అయినా... ఈ క్రీడలకు తమదైన ప్రత్యేకత ఉంది. వర్ధమాన ఆటగాళ్లను ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఇది సరైన చోటు. 72 దేశాలకు చెందిన ఆటగాళ్లతో ఆగస్టు 8 వరకు ఈ క్రీడా పండుగ జరుగుతుంది.

Also read: Weekly Current Affairs (Persons) Bitbank: సశాస్త్ర సీమ బల్ కొత్త డైరెక్టర్ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు?

ఆస్ట్రేలియాది పైచేయి
ఇన్నేళ్ల క్రీడల చరిత్రలో మొత్తం 932 స్వర్ణాలు సహా 2,415 పతకాలతో ఆసీస్‌ అగ్రస్థానంలో ఉండగా... 2,144 పతకాలతో ఇంగ్లండ్‌ (714 స్వర్ణాలు) రెండో స్థానంలో నిలిచింది. కెనడా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలూ పతకాల పట్టికలో ముందంజలో ఉండగా... జమైకా, కెన్యావంటి దేశాలు అథ్లెటిక్స్‌లో తమ ప్రభావం చూపించగలిగాయి. ఓవరాల్‌గా భారత్‌ కూడా 2002 నుంచి టాప్‌–5లో నిలబడుతూ వస్తోంది.  

Also read: Weekly Current Affairs (Sports) Bitbank: పురుషుల హాకీ ఆసియా కప్ 2022ను ఏ జట్టు గెలుచుకుంది?

66లో 16 పోయినట్లే ?
ఈసారి కామన్వెల్త్‌ క్రీడల నుంచి షూటింగ్‌ క్రీడాంశాన్ని తొలగించడం భారత్‌కు పెద్ద దెబ్బే. 2018లో మన దేశం సాధించిన 66 పతకాల్లో 16 (అత్యధికంగా 7 స్వర్ణాలు సహా) షూటింగ్‌ ద్వారా వచ్చాయి. భారత్‌ మూడో స్థానంలో నిలవగా, ఈసారి కిందకు దిగజారే అవకాశాలు ఉన్నాయి. అయితే బ్యాడ్మింటన్, హాకీ, రెజ్లింగ్, బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్, టేబుల్‌ టెన్నిస్‌లో మనకు ఖాయంగా మెడల్స్‌ దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. భారత్‌ నుంచి ఈసారి 16 క్రీడాంశాల్లో కలిపి మొత్తం 215 మంది క్రీడాకారులు పతకాల వేటలో ఉన్నారు. ప్రారంభ వేడుకల్లో భారత బృందానికి బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు, హాకీ జట్టు కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ పతాకధారులుగా వ్యవహరిస్తారు. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రాను ‘ప్లాగ్‌ బేరర్‌’గా ఎంపిక చేసినా అతను గాయం కారణంగా ఈ మెగా ఈవెంట్‌కు దూరమయ్యాడు. దాంతో 2018 గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌ లో భారత బృందానికి ‘ఫ్లాగ్‌ బేరర్‌’గా వ్యవహరించిన సింధుకు మరోసారి అవకాశం వచ్చింది. ఈ కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ నుంచి 16 క్రీడాంశాల్లో 215 మంది పోటీపడుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి కలిపి మొత్తం 11 మంది భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2018 గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 13 మంది బరిలోకి దిగారు.  

Also read: Daily Current Affairs in Telugu: 2022, జులై 27th కరెంట్‌ అఫైర్స్‌

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 28 Jul 2022 05:57PM

Photo Stories