Salary Increment: ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరగనున్న వేతనాలు..!
వారి వేతనాలు 9 శాతం వరకు పెరగొచ్చని ‘మెర్సర్స్ టోటల్ రెమ్యునరేషన్ సర్వే’ తెలిపింది.2020లో వేతన పెంపులు తగ్గడం తెలిసిందే. కానీ, ఈ ఏడాది కరోనా పూర్వపు స్థాయిలో వేతన పెంపులను కంపెనీలు చేపట్టొచ్చని ఈ సర్వే పేర్కొంది. 988 కంపెనీలు, 5,700 ఉద్యోగ విభాగాలకు సంబంధించి అభిప్రాయాలను ఈ సర్వే తెలుసుకుంది. కన్జ్యూమర్, లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ రంగాలు 2022లో ఇతర రంగాల కంటే అధిక వేతన పెంపులను అమలు చేయనున్నట్టు ఈ సర్వే తెలిపింది.
అన్ని రంగాల్లోనూ వేతన పెంపు ఇలా..
‘‘సంస్థలు ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ఇచ్చే విషయమై కరోనా పూర్వపు స్థాయిలో పెట్టుబడులకు సిద్ధంగా ఉండడం కీలకమైన సానుకూలత. 2022లో అన్ని రంగాల్లోనూ వేతన పెంపు 9 శాతంగా ఉండనుంది. 2020లో ఇది 7.7 శాతమే. సానుకూల ఆర్థిక, వ్యాపార సెంటిమెంట్‌ను ఇది తెలియజేస్తోంది’’ అని రివార్డ్స్ కన్సల్టింగ్ లీడర్ ఇండియా సీనియర్ ప్రిన్సిపల్ మన్సీ సింఘాల్ పేర్కొన్నారు.
➤ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఆర్‌అండ్‌డీ, విక్రయాలకు ముందు సేవలు, డేటా సైన్సెస్ విభాగాల్లో 12 శాతం మేర వేతనాలు పెరగనున్నాయి.
➤టెక్నాలజీ సంబంధిత నైపుణ్యాలు కలిగిన వారికి ఈ ఏడాదే కాకుండా, రానున్న రోజుల్లోనూ ఎక్కువ వేతన ప్రయోజనాలు లభించనున్నాయి.
➤ఆరంభ స్థాయి ఉద్యోగాల కోసం క్యాంపస్ నియామకాల రూపంలో ఫ్రెషర్లను తీసుకుంటున్నందున.. టెక్నో ఫంక్షనల్ బాధ్యతల్లోని వారికి ఎక్కువ ప్రయోజనాలు కల్పించాల్సిన అవసరం నెలకొంది.