Bumper Offers: ఐఎస్‌బీ విద్యార్థులకు అత్యధిక వేతనాలతో ఉద్యోగాలు.. ఓ విద్యార్థికి అయితే ఏకంగా..
నగరంలో ఈ విద్యకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్‌బీ)లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ కోర్సు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అత్యధిక వేతనాలతో పలు బహుళజాతి కంపెనీల్లో కొలువులు దక్కినట్లు వర్సిటీ వర్గాలు తెలిపాయి. తాజాగా ఓ విద్యార్థికి రూ.34 లక్షల వార్షిక వేతనం దక్కినట్లు పేర్కొన్నాయి.
270 కంపెనీలు..
హైదరాబాద్ నగరంతోపాటు మొహాలీలో ఉన్న తమ విద్యాసంస్థకు ఈ ఏడాది సుమారు 270 కంపెనీలు ప్రాంగణ నియామకాలు చేపట్టేందుకు ముందుకొచ్చాయని తెలిపాయి. ఆయా కంపెనీలు 2,066 ఉద్యోగాలను ఆఫర్ చేసినట్లు పేర్కొన్నాయి. వీటిలో దేశ, విదేశాలకు చెందిన పలు కార్పొరేట్, బహుళజాతి కంపెనీలుండడం విశేషం. వర్చువల్ విధానంలో చేపట్టిన నియామకాల్లో పలువురు విద్యార్థినీ విద్యార్థులు అత్యధిక వేతనంతో కొలువులు సాధించినట్లు ప్రకటించాయి. గతేడాది సరాసరిన అత్యధికంగా లభించిన వేతన ప్యాకేజీ రూ.28.21 లక్షలు కాగా.. ఈసారి రూ.34 లక్షలకు పెరగడం విశేషం.
ప్యాకేజీల జాతర..
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో మేనేజ్‌మెంట్ విద్యలో పీజీ చేస్తున్న వారిలో 39 శాతం మంది మహిళలే ఉండడం విశేషం. అత్యధిక వేతనాలు దక్కించుకున్న వారిలోనూ 41 శాతం మంది అతివలే ఉన్నట్లు వర్సిటీ ప్రకటించింది. తమ సంస్థలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ విద్యనభ్యసిస్తున్న వారు సుమారు 929 మంది ఉన్నట్లు తెలిపింది. పలు రంగాల్లో అగ్రభాగాన ఉన్న కంపెనీలు తమ విద్యార్థులకు కొలువులు ఆఫర్ చేసినట్లు ప్రకటించింది. మేనేజ్‌మెంట్, సాంకేతికత, కన్సల్టింగ్ కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. ఐటీ,అనుబంధ రంగాలకు చెందిన కంపెనీలు సైతం 26 శాతం కొలువులను తమ విద్యార్థులకు ఆఫర్ చేసినట్లు ఐఎస్‌బీ ప్రకటించింది.
బ్యాంకింగ్, ఇతర ఆర్థిక సంస్థలు సుమారు 10 శాతం కొలువులిచ్చాయట. కార్పొరేట్ ఫైనాన్స్, ట్రెజరీ, ప్రైవేట్– బ్యాంకింగ్, ఇన్వెస్ట్‌మెంట్, మేనేజ్‌మెంట్, ఎఫ్‌ఎంసీజీ, రిటెయిల్, ఫార్మా, హెల్త్‌కేర్ రంగాల్లోనూ 5 శాతం చొప్పున తమ విద్యార్థులు జాబ్స్ దక్కించుకున్నట్లు వెల్లడించింది. ఈ– కామర్స్ రంగంలో 8 శాతం మంది జాబ్స్ లభించినట్లు తెలిపింది.