Skip to main content

Inspiring Success Story: తిండి కోసం రోడ్ల‌పై చిత్తు కాగితాలను ఏరుకున్నాడు.. నేడు అంతర్జాతీయ స్థాయి గుర్తింపుతో..

జీవితంలోని ఫెయిల్యూర్స్‌లో పెయిన్ ఎంత ఎక్కువ స్థాయిలో ఉంటే సక్సెస్‌లో అంత మజా ఉంటుంది. ఎదిగిన స్థాయి నుంచి ఎదిగి వచ్చిన స్థాయి వైపు చూసుకొంటే ఎదుగుదల విలువ ఏమిటో అర్థం అవుతుంది.
vicky roy photographer
Vicky Roy, Photographer

ఢిల్లీ వీధుల చెత్తలోంచి చిత్తు కాగితాలను ఏరుకొంటూ గడిపిన కుర్రాడు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి ఫొటో గ్రాఫర్ అయ్యాడు! అతడు తీసే చిత్రాలు అంతర్జాతీయ స్థాయి అద్భుతాలవుతున్నాయి. అతడి ఫొటోలే కాదు అతడి సక్సెస్ స్టోరీ కూడా ఒక అద్భుతమే...

ఎవరైనా డబ్బులిస్తే.. 
‘‘నా జీవితం ఎందుకింత దారుణంగా ఉంది, ఎవరైనా డబ్బులిస్తే బావుండు. ఎవరైనా నన్ను పెంచుకొంటే బావుండు, అన్ని సౌకర్యాలూ సమకూరిస్తే బావుండు.. ’’ అని అనుకొనే వాడట విక్కీ.. ఢిల్లీ రోడ్లమీద స్ట్రీట్ చైల్డ్‌గా తిరుగుతున్న రోజుల్లో. అయితే జీవితం అనేది ఒక రాత్రిలో మారిపోదు, ఎవరి జీవితానికీ మ్యాజికల్ టచ్ ఉండదు అని అతి తొందరలోనే అర్థం చేసుకొన్నాడు. ఎవరి జ్ఞానబోధ లేకుండానే ఆ విషయాన్ని అర్థం చేసుకొని ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొన్నాడు. అందులోని కష్టనష్టాలను అర్థం చేసుకొని, ఆత్మవిశ్వాసంతో.. అహోరాత్రులూ కష్టపడి తను అనుకొన్న లక్ష్యాన్ని సాధించాడు. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన విక్కీ తన జీవితంలోని చీకటి గురించి మరిచిపోలేదు. పదిమంది చెప్పుకోదగిన స్థాయికి ఎదిగినా కూడా అహంకారాన్ని, ఆర్భాటాన్ని దరి చేరనివ్వలేదు. అందుకే ఇతడు విజేతగానూ స్ఫూర్తిమంతుడే, వ్యక్తిగానూ స్ఫూర్తిమంతుడే!

ఇంట్లో పరిస్థితులు అత్యంత దుర్భరంగా..

life story


కోల్‌కతాలోని తాతయ్య ఇంట్లో ఉండేవాడు విక్కీరాయ్. ఆ ఇంట్లో పరిస్థితులు అత్యంత దుర్భరంగా ఉండేవి. ఇంట్లో హింసను తట్టుకోలేక 11 యేళ్ల వయసులో మామయ్య జేబులోని డబ్బును కాజేసి ఢిల్లీ రెలైక్కేశాడు. అక్కడ నుంచి విక్కీ జీవితం కొత్త మలుపు తీసుకొంది. ఢిల్లీలో ఇతడిని రోడ్ల మీద చూసి ఎవరో ‘సలాం బాలక్ ట్రస్ట్’లో చేర్చారు. అయితే అక్కడ పరిస్థితులు ఏ మాత్రం నచ్చలేదు విక్కీకి. అక్కడ నుంచి పారిపోయి మళ్లీ రోడ్ల మీదికి వచ్చిపడ్డాడు. పనిదొరికితే పనిచేయడం... లేకపోతే చెత్త ఏరి నాలుగైదు రూపాయలు సంపాదించుకోవడం.

అదే జీవితం..
అప్పటికి అదే జీవితం అనుకొన్నాడు. అయితే క్రమంగా తనలో ఒక ఆత్మవిమర్శ. జీవితం ఎటుపోతోందో అర్థం కావడం లేదనే భావన. ఆ భావన నుంచి కొన్ని పగటి కలలు, ఆశలు పుట్టుకొచ్చాయి.

ఏదో ఒకటి సాధించాలనే తపనతో..

real story


ఉన్నట్టుండి తన స్థితిగతులను ఎవరైనా మార్చేస్తే బావుండననే ఆశ కలిగింది. అయితే అది సాధ్యం కాదని చాలా త్వరగా అర్థం చేసుకొన్న విక్కీ తిరిగి ‘బాలక్ ట్రస్ట్‌లో చేరిపోయాడు. ఈసారి అక్కడ పరిస్థితులు చాలా కొత్తగా కనిపించాయి. ఇష్టంగా మారాయి. ఎందుకంటే ఏదో ఒకటి సాధించాలనే తపన మొదలైందప్పటికే. 

దాన్నే కెరీర్‌గా..

Success Story


ఆ బాలక్‌ట్రస్ట్‌కు అనేక మంది వ్యక్తులు వచ్చేవారు. అక్కడి పిల్లలకు వివిధ విషయాల గురించి చెప్పేవారు. అలా ఒక విదేశీ ఫొటోగ్రాఫర్ బాలక్ ట్రస్ట్‌కు వచ్చాడు. అతడి చేతిలోని కెమెరాను చూడగానే విక్కీ కళ్లు మెరిశాయి. ఫొటోగ్రఫీ మీద ఆసక్తి పెంచుకొన్నాడు. దాన్నే కెరీర్‌గా ఎంచుకోవాలని నిర్ణయించుకొన్నాడు. ‘బాలక్ ట్రస్ట్’లో ఉండగానే ఆ ఇంగ్లిష్ ఫొటోగ్రాఫర్‌కు సహాయకుడిగా మారాడు. భాషతో ఎంతో ఇబ్బంది వచ్చింది. అతడు చెప్పే మాటలేవీ విక్కీకి అర్థం అయ్యేవి కాదు. అయితే ఇంగ్లిష్ రాకపోయినా ఫొటోగ్రఫీలో రాణించవచ్చనే విషయాన్ని అర్థం చేసుకొన్నాడు. 

లోన్ తీసుకొని సొంతంగా..

Real Story


మెలకువలు నేర్చుకొని బాలక్‌ట్రస్ట్‌లోనే లోన్ తీసుకొని సొంతంగా కెమెరాను కొనుగోలు చేశాడు. ఆ కెమెరాతో విక్కీ చేసిన తొలి ప్రయత్నమే ‘స్ట్రీట్ డ్రీమ్స్’ ప్రాజెక్ట్. అనాథ ఆశ్రమంలో ఉండే యువకుల జీవితాన్ని తన ఫొటోలతో కళ్లకు కట్టాడు విక్కీ. అతడి ఫొటోల్లోని ఫీల్, టైమింగ్ అందరినీ ఆకట్టుకొన్నాయి. తాను అనుభవించిన స్ట్రీట్ చిల్డ్రన్ జీవితాన్ని ఫొటోల రూపంలో చూపాడు. ఆ ప్రాజెక్ట్‌కు చాలా మంచి పేరొచ్చింది. విక్కీ నేపథ్యం కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది. అలా తీసిన ఫొటోలే విక్కీ జీవితానికి, విజయానికి ప్రతిరూపాలయ్యాయి. ‘జీవితంలో మరీ గొప్ప వాడినైపోవాలి’ అనే లక్ష్యమేదీ లేదని అంటున్నాడు విక్కీ. తన జీవితంలో ఇప్పటికే చాలా మార్పు వచ్చిందని, ఇప్పుడు వచ్చిన గుర్తింపుతో లభించిన మధ్యతరగతి జీవితాన్నే తాను ఆస్వాదిస్తున్నానని అంటూ విక్కీ తన సింప్లిసిటీను చాటుకున్నాడు.

Published date : 07 Mar 2022 01:51PM

Photo Stories