Inspirational Story: పదో తరగతికే పెళ్లి... మూడేళ్లకే భర్త మృతి... కట్ చేస్తే ఇప్పుడామె‘ఆదర్శం’
అనుకోని ప్రమాదంలో ఆ ఇంటి యజమాని మరణించాడు. 20 ఏళ్లకే కష్టాలు చుట్టుముట్టినా ఎక్కాడా తొణగకుండా, ధైర్యంగా నిలిచింది. ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం చేసి పదిమందికి ఆదర్శంగా నిలుస్తోంది. ఆమె ప్రేమసాయి... ప్రేమసాయి కష్టాల ప్రయాణం ఆమె మాటల్లోనే....
చదవండి: టీ అమ్ముతూ... కోట్లకు పడగలు... ‘డికాక్షన్’ సక్సెస్‌స్టోరీ తెలుసా..?
మాది గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం నూతక్కి. పదో తరగతి కాగానే పెళ్లైంది. ఇద్దరు పిల్లలు. నాకు ఇరవై ఏళ్ల వయసులో ఆయన ఆక్సిడెంట్ వల్ల దూరమయ్యారు. తీరని విషాదమే అయినా పిల్లల కోసం బతకాలనుకున్నా. దాంతో మూడు నెలలకు ఓ పొగాకు పరిశ్రమలో సెక్యురిటీ గార్డుగా చేరా. పరువుపోతోందని చుట్టాలు మాన్పించారు. తర్వాత హైదరాబాద్‌లో టెలికాలర్‌గా, సెక్యూరిటీ గార్డుగా పనిచేశా.
చదవండి: పేపర్ బాయ్ నుంచి ఐఏఎస్ వరకు... రాజ్‌పుత్ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమే
తెల్లారకముందే ఉద్యోగానికి వెళ్లడం, పిల్లలు పడుకొన్నాక రావడం. ఇలా కొన్నేళ్లు సాగాక ఒక బట్టల దుకాణం తెరిచా. దొంగతనం జరిగి... ఉన్నదంతా పోయింది. మళ్లీ రోడ్డు మీదకొచ్చా. క్రిమి సంహారక మందుల మార్కెటింగ్ పనిలో కుదురుకున్నా. ఒక్క పాకెట్ అమ్మితే.. నలభై రూపాయలు మిగిలేవి. దాని కోసం రోజంతా పొలాల వెంట తిరుగుతూ రైతులతో మాట్లాడేదాన్ని. అలా మొక్కలకు సోకే అనేక వ్యాధుల గురించి నాకు పట్టొచ్చింది. ఆ క్రమంలోనే విజయవాడలో జీవ ఎరువులు అమ్మే ఓ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నా.
చదవండి: నోట్ల రద్దు నిర్ణయం సరైనదే: సుప్రీం... అప్పట్లో 115 మంది మృతి...
రోజంతా పొలాల్లో తిరుగుతూ పంటలకేం వ్యాధులు సోకుతున్నాయో పరిశీలించి.. సాయంత్రం అదే ఊర్లో రైతులతో మాట్లాడి, తగిన మందులు అమ్మేదాన్ని. ఖర్చు ఎక్కువ కాకూడదని పునుగులు తిని.. నీళ్లు తాగి కడుపు నింపుకొనేదాన్ని. కాలి నడకన నాలుగేసి మండలాలు తిరిగేదాన్ని. అలా నా జీవితం క్రమంగా ప్రకృతితో మమేకమైంది. సేంద్రియ వ్యవసాయం మీద ఆసక్తితో సుభాష్ పాలేకర్ తరగతులకు హాజరయ్యాను. మాకున్న 70 సెంట్ల భూమికి తోడు మరికొంత కౌలుకి తీసుకుని అరటి, మునగ, అంతర పంటగా పసుపు పండించా.
2019లో ఢిల్లీలో.. వరల్డ్ ఆర్గానిక్ ఎక్స్‌పో జరిగింది. ఇందులో మా ఉత్పత్తులకు మొదటి బహుమతి లభించింది. 2022 నవంబరులో ఢిల్లీలో.. నీతి ఆయోగ్, స్త్రీ శిశుసంక్షేమ మంత్రిత్వశాఖల ఆధ్వర్యంలో.. ‘భారత సుస్థిరాభివృద్ధిలో.. మహిళల పాత్ర’ అంశంపై సదస్సు నిర్వహించారు. అందులో నా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కి పురస్కారాన్ని అందుకున్నా.
చదవండి: మళ్లీ తెరపైకి యోయో... యోయోలో టాప్ స్కోరర్ ఎవరో తెలుసా..?
ప్రకృతి సేద్యానికి కావాల్సిన మందులు తయారు చేసి నేరుగా రైతుల పొలానికే డెలివరీ చేస్తున్నా. వివిధ రకాల సేంద్రియ ఆహార ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసి ఆర్డర్లపై డోర్ డెలివరీ చేస్తున్నాను. ఈ ప్లాంట్ చూడ్డానికి విదేశీయులూ వస్తున్నారు. రెండు సార్లు అమెరికా, ఫ్రాన్స్ అంతర్జాతీయ రేడియోల్లో మాట్లాడాను. ఇప్పుడు నా సూచనలతో దాదాపు 400 ఎకరాల్లో సేంద్రియ సాగు చేస్తున్నారు.