Success Story: కల కనింది... 25 ఏళ్లకే జడ్జి అయ్యింది... గాయత్రి సక్సెస్ జర్నీ సాగిందిలా..!
చదువుకునేందుకు కనీస సదుపాయాలు లేకున్నా, ఏ మాత్రం పట్టించుకోకుండా తమ లక్ష్యం మీదే గురి పెడుతున్నారు. అలా గురి పెట్టిన ఓ యువతి పాతికేళ్లకే జడ్జిగా మారింది.
గాయత్రి స్వస్థలం కోలారు జిల్లాలోని కారహళ్లి అనే చిన్న గ్రామం. నారాయణస్వామి, వెంకట రత్నమ్మ దంపతులకు ఆమె ఏకైక సంతానం. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం వారిది. తమ కూతురు తమలా కష్టపడకూడదని నిర్ణయించుకున్నారు ఆ తల్లిదండ్రులు. గాయత్రిని మంచిగా చదివించి ఉన్నతస్థాయిలో చూడాలని కలలు కన్నారు. తల్లిదండ్రులలాగే ఆ చిన్నారి అనుకుంది. బాగా చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలనుకుంది.
చదవండి: పోటీ పరీక్షల్లో సత్తా చాటిన తండ్రీకొడుకులు.. తల్లీకూతుళ్లు..
ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసింది గాయత్రి. కాలేజీలోనూ టాపరే. ఎక్కడికి వెళ్లినా చదవడం ఒక్కటే ఆమెకు అలవాటు. అలా ఇంటర్ మంచి మార్కులతో పూర్తి చేసి, కోలారు మహిళా కళాశాలలో బీకాం పూర్తిచేసింది. బీకాం అయిపోగానే లా చదివి పదిమందికి న్యాయం చేయాలనుకుంది. అందుకు తగ్గట్లు కెంగల్ హనుమంతయ్య లా కళాశాలలో జాయినయ్యింది. యూనివర్సిటీలో 4వ ర్యాంకు సాధించి సత్తా చాటింది.
చదవండి: శభాష్ అవని.... తొలి ఫైటర్ పైలట్ జీవిత విశేషాలు తెలుసా..?
లా పూర్తి చేసిన తర్వాత గాయత్రి సీనియర్ లాయర్ శివరామ్ సుబ్రహ్మణ్యం దగ్గర అసిస్టెంట్ లాయర్‌గా చేరింది. ఆ సమయంలో రోజూ వచ్చిపోయే న్యాయమూర్తులను గమనించేది. దాంతో తను కూడా వారిలా జడ్జి కావాలని సంకల్పించుకుంది. సివిల్ జడ్జి పరీక్షల కోసం అహర్నిశలూ కష్టపడి చదివింది. అదే సమయంలో కర్నాటక హైకోర్టు సివిల్ జడ్జి పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఆమె 2021లో మొదటిసారి పరీక్షకు హాజరైంది. అయితే ఫస్ట్ అటెంప్ట్‌లో ఉత్తీర్ణత సాధించినా ఇంటర్వ్యూను దాటలేకపోయింది.
ఎలాగైనా జడ్జి కావాలని ఆమె నిర్ణయించుకోవడంతో మొదటి ఫెయిల్యూర్‌ను పట్టించుకోలేదు. మళ్లీ ప్రయత్నించి.. తాజాగా తన కలను సాకారం చేసుకుంది గాయత్రి. ఇలా పాతికేళ్లకే సివిల్ కోర్టు న్యాయమూర్తిగా నియమితురాలై.. చిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన మహిళగా పేరు తెచ్చుకుంది. ఉన్నత లక్ష్యాల్ని అందుకోవడానికి పేదరికం అడ్డు కాదని ఇలా తన విజయంతోనే నిరూపించింది గాయత్రి.