Supreme Court : ఈడబ్ల్యూఎస్ కోటా చెల్లుతుందిలా.. ప్రభుత్వోద్యోగాలు, విద్యా సంస్థల్లో..
సీజేఐ జస్టిస్ యు.యు.లలిత్ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు మెజారిటీ తీర్పు ఇచి్చంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు చెల్లుబాటు అవుతాయని న్యాయమూర్తులు జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ బేలా ఎం త్రివేదీ, జస్టిస్ జేబీ పార్డీవాలా, వాటిని కొట్టేస్తూ సీజేఐ జస్టిస్ లలిత్, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్ తీర్పు ఇచ్చారు. ఈ కోటా రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించదని మెజారిటీ న్యాయమూర్తులు పేర్కొన్నారు.
ప్రభుత్వోద్యోగాలు, విద్యా సంస్థల్లో ఆర్థికంగా వెనకబడ్డ వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కలి్పస్తూ 2019లో మోదీ ప్రభుత్వం 103వ రాజ్యాంగ సవరణ తీసుకొచి్చంది. దీని చెల్లుబాటును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 40 పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని సుదీర్ఘంగా విచారించిన ధర్మాసనం సెపె్టంబరు 27న తీర్పు రిజర్వు చేసింది. నవంబర్ 7వ తేదీన(సోమవారం) సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై నాలుగు వేర్వేరు తీర్పులు వెలువరించింది. వాటిని 30 నిమిషాలకు పైగా చదివింది. జస్టిస్ దినేష్ మహేశ్వరి ఈ తీర్పును చదివారు. జస్టిస్ రవీంద్ర భట్ తీర్పుతో ఏకీభవిస్తున్నట్లు సీజేఐ లలిత్ పేర్కొన్నారు.
ఐదుగురు న్యాయమూర్తులు, నాలుగు తీర్పులు ఇలా..
ఈడబ్ల్యూఎస్ కోటాపై రాజ్యాంగ ధర్మాసనం నాలుగు వేర్వేరు తీర్పులు వెలువరించింది. 399 పేజీల ఈ తీర్పులో జస్టిస్ దినేషశ్ మహేశ్వరిదే అధిక భాగం. సీజేఐ విజ్ఞప్తి మేరకు ఆయన తొలుత తీర్పు చదివారు. ఈడబ్ల్యూఎస్ కోటాపై నాటి అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ లేవనెత్తిన రాజ్యాంగపరమైన ప్రశ్నలకు తీర్పులో సమాధానమిచ్చారు. ‘‘ఆర్థిక ప్రమాణాల ఆధారంగా రిజర్వేషన్‌తో సహా ప్రత్యేక నిబంధనలకు అనుమతించడాన్ని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను ఈ కోటా నుంచి మినహాయించడాన్ని రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించడంగా చెప్పలేం. 50 శాతం సీలింగ్ పరిమితిని కూడా ఈ కోటా ఉల్లఘించడం లేదు. ఎందుకంటే ఈ రిజర్వేషన్లకు పరిమితి ఉంది’’అన్నారు. ఈ తీర్పుతో ఏకీభవిస్తున్నట్టు జస్టిస్ త్రివేదీ తెలిపారు.
ఈడబ్ల్యూఎస్ తరగతుల ప్రయోజనం నిమిత్తం పార్లమెంటు ఆమోదించిన సవరణను నిశ్చయాత్మక చర్యగా పరిగణించాలే తప్ప అసమంజసమైన వర్గీకరణ అని చెప్పలేమన్నారు. అసమానతలను సమానంగా చూడడం రాజ్యాంగంలోని సమానత్వాన్ని ఉల్లఘిస్తుందన్నారు. రిజర్వేషన్లకు రాజ్యాంగ నిర్మాతలు నిర్ణయించిన కాలపరిమితిని 75 ఏళ్ల తర్వాత కూడా చేరుకోలేకపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ త్రివేదీల తీర్పుతో ఏకీభవిస్తున్నట్లు జస్టిస్ పార్డీవాలా కూడా పేర్కొన్నారు.
విస్తృత ప్రయోజనాల నిమిత్తం రిజర్వేషన్లను పునః పరిశీలించాల్సి ఉంది. విద్య, ఉపాధిల్లో తగిన ప్రమాణాలు సాధించిన వర్గాలను వెనకబడిన జాబితా నుంచి తొలగించాలి. తద్వారా నిజంగా సాయం అవసరమైన వర్గాలపై దృష్టి పెట్టగలం. వెనకబాటుతనాన్ని గుర్తించే ప్రమాణాలు ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా ఉన్నదీ లేనిదీ కూడా సరిచూసుకోవాల్సిన అవసరముంది’’అన్నారు.
మైనారిటీ తీర్పు..
వెనకబడిన తరగతుల ప్రయోజనాలు పొందుతున్న వారు ఏదో ఒక విధంగా మెరుగైన స్థానంలో ఉన్నారని ఇప్పటికీ నిశ్చయంగా నమ్మలేకపోతున్నామని జస్టిస్ భట్ తన మైనారిటీ తీర్పులో పేర్కొన్నారు. ‘‘ఆరి్టకల్ 16(1), ఆరి్టకల్ 16(4) ఒకే సమానత్వ సూత్రపు కోణాలని సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈడబ్ల్యూఎస్ కోటా నుంచి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను మినహాయించడం వారి పట్ల వివక్ష చూపడమే. ఆర్థిక పేదరికం, ఆర్థిక వెనకబాటుతనం ప్రాతిపదికన రిజర్వేషన్లు అనుమతించినప్పటికీ ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీలను మినహాయించడం రాజ్యాంగ విరుద్ధం. 2001 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీల్లో 38 శాతం, ఎస్టీల్లో 48 శాతం దారిద్యరేఖకు దిగువన ఉన్నట్లు సిన్హో కమిషన్ నివేదిక పేర్కొంది. రిజర్వేషన్లకు 50 శాతం పరిమితిని కూడా 103వ రాజ్యాంగ సవరణ ఉల్లంఘిస్తోంది. 50 శాతం నిబంధనకు ఇలా ఉల్లంఘనను అనుమతిస్తే అదో మార్గంగా మారుతుంది. కనుక ఆర్థిక ప్రమాణాల ఆధారంగా రిజర్వేషన్లు చెల్లవు. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీలను మినహాయిస్తూ చేసిన 103వ సవరణ రాజ్యాంగ విరుద్ధం’’అని స్పష్టం చేశారు. జస్టిస్ భట్ తీర్పుతో సీజేఐ ఏకీభవించారు.
‘‘ఆర్థిక ప్రమాణాలపై రిజర్వేషన్ ప్రవేశపెట్టడం అనుమతించదగినదే. కానీ ఎస్సీఎస్టీ, ఓబీసీల్లో వెనకబడిన తరగతుల వారు ప్రయోజనాలు పొందుతున్నారనే కారణంతో వారిని మినహాయించడం ఏకపక్షం. 103వ రాజ్యాంగ సవరణ చట్టంలోని సెక్షన్ 3 రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘిస్తోంది. కనుక అది రాజ్యాంగ విరుద్ధం. అందుకే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కొట్టేస్తున్నాం’’
– సీజేఐ జస్టిస్ లలిత్, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్
‘‘ఆర్థిక ప్రమాణాలపై ఏకవచనంతో రూపొందించిన రిజర్వేషన్ రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘించదు. రాజ్యాంగ సవరణ రిజర్వేషన్ల50శాతం సీలింగ్ పరిమితి మించనందకు, ఎస్సీఎస్టీ, ఓబీసీలను ఈడబ్ల్యూఎస్‌ల నుంచి మినహాయించినంత మాత్రాన ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘించినట్లు చెప్పలేం’’
– జస్టిస్ దినేశ్ మహేశ్వరి
‘‘103వ రాజ్యాంగ సవరణను కొట్టేయలేం. అది చెల్లుబాటవుతుంది. ఈడబ్ల్యూఎస్ వర్గం లబ్ధి కోసం పార్లమెంటు తీసుకున్న సకారాత్మక చర్యగా దాన్ని చూడాలి. అయితే రిజర్వేషన్లకు కాలపరిమితి ఉండాలి. పార్లమెంటు, శాసనసభల్లో ఎస్సీ, ఎస్టీ ప్రాతినిధ్య గడువుకు కాలపరిమితి ఉంది. పార్లమెంటులో ఆంగ్లో ఇండియన్ల రిజర్వేషన్లకు తెర పడింది. స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ సమాజ విస్తృత ప్రయోజనాల నిమిత్తం రిజర్వేషన్ల వ్యవస్థను పునఃపరిశీలించాల్సిన అవసరముది’’
– జస్టిస్ బేలా ఎం త్రివేదీ
‘‘జస్టిస్ త్రివేదీ తీర్పుతో ఏకీభవిస్తున్నా. కానీ రిజర్వేషన్లను నిరవధికంగా కొనసాగిస్తే అవి స్వార్థ ప్రయోజనాలుగా మారే ప్రమాదముంది. వాటిని కేవలం పదేళ్లపాటు అమలు చేయడం ద్వారా సామాజిక సామరస్యాన్ని తీసుకురావాలని అంబేడ్కర్ యోచించారు. కానీ ఏడు దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. రిజర్వేషన్లు బలహీనవర్గాల సామాజిక, విద్యాపరమైన వెనకబాటు తొలగించే కసరత్తులా మాత్రమే ఉండాలి’’
– జస్టిస్ జేబీ పార్డీవాలా దేశంలో పేదలకు సామాజిక న్యాయం అందించాలని పరితపిస్తున్న ప్రధానికి దక్కిన విజయమిది. ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు 10 శాతం కోటాతో కొత్త అవకాశాలు లభిస్తాయి. సామాజిక న్యాయం బలోపేతం అవుతుంది’’
– ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర విద్యా శాఖ మంత్రి