Acharya Nagarjuna University: ANUలో ముగ్గురు అధ్యాపకులకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు
ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు అధ్యాపకులు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఎకనామిక్స్ విభాగాధిపతి ఆచార్య కె.మధుబాబు, సోషియాలజీ, సోషల్ వర్క్ విభాగాధిపతి ఆచార్య వి వెంకటేశ్వర్లు, ఫుడ్ అండ్ న్యూట్రీషనల్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ కేవీ శాంతిశ్రీ అవార్డులకు ఎంపికైన వారిలో ఉన్నారు. ఈ ముగ్గురు ఈనెల 5వ తేదీన విశాఖపట్నంలో జరిగే ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలలో అవార్డులు అందుకోనున్నారు.
సోషియాలజీ ‘విక్టరీ’ వెంకటేశ్వర్లు
ఆచార్య వి.వెంకటేశ్వర్లు ప్రస్తుతం యూనివర్సిటీ సోషియాలజీ, సోషల్ వర్క్ విభాగాధిపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ‘ప్రోబ్లమ్స్ ఆఫ్ ద రూరల్ ఏజ్‌డ్: ఏ సోషియాలజికల్ పర్‌స్పెక్టీవ్: (ఏ కేస్ స్టడీ ఆఫ్ మంగళగిరి మండల్ ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) అనే అంశంపై డాక్టరేట్ చేశారు. ఈయన పర్యవేక్షణలో 25 పీహెచ్‌డీలు, ఆరు ఎంఫిల్ డిగ్రీలు ప్రదానం చేశారు. ప్రస్తుతం 06 పీహెచ్‌డీలకు పర్యవేక్షణ చేస్తున్నారు. 52 అంతర్జాతీయ జర్నల్స్‌లో, 27 జాతీయ జర్నల్స్‌లో ఆర్టికల్స్, 85 పుస్తకాలు ప్రచురించారు. 15 అంతర్జాతీయ జర్నల్స్‌లో, 172 జాతీయ స్థాయి జర్నల్స్‌లో పరిశోధనా పత్రాలు సమర్పించారు. యూకేకి చెందిన రాయల్ వెటరినరీ కాలేజ్, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న రీసెర్చ్‌లో ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఆర్థికంలో ‘మధు’ర బోధన
ఆచార్య కె మధుబాబు ప్రస్తుతం యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఎకనామిక్స్ విభాగాధిపతిగా, బాబూ జగ్జీవన్‌రామ్ అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్‌గా, యూనివర్సిటీ సీడీసీ డీన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ‘ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్– ఏ డిస్ట్రిక్ట్ వైజ్ ఎనాలసిస్(1981–2001) అనే అంశంపై డాక్టరేట్ చేశారు. ఈయన పర్యవేక్షణలో 18 పీహెచ్‌డీలు, 03 ఎంఫిల్ డిగ్రీలు ప్రదానం చేశారు. ప్రస్తుతం 06 పీహెచ్‌డీ, 02 ఎంఫిల్ పరిశోధనలు కొనసాగుతున్నాయి. గతంలో ఇండో ఆసియన్ ఆథర్ లెవిస్ డిస్టింగ్విజ్డ్ ఎకనమిస్ట్ అవార్డ్, యూనివర్సిటీ ఆఫ్ సౌత్ అమెరికా నుంచి హానరరీ డాక్టరేట్ అవార్డు, ఏఎన్‌యూ నుంచి బెస్ట్ ఇంటర్నేషనల్ పబ్లికేషన్ అవార్డును అందుకున్నారు. పలు ఎకనామిక్ అసోసియేషన్స్‌లో లైఫ్ మెంబర్‌గా కొనసాగుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో 17 ఆర్టిక్స్, జాతీయ స్థాయిలో 34 ఆర్టికల్స్, 20 పుస్తకాలు, అంతర్జాతీయ సదస్సులో 06 పరిశోధనా పత్రాలు, జాతీయ సదస్సులో 77 పరిశోధనా పత్రాలు, రీజినల్, రాష్ట్ర స్థాయి సదస్సుల్లో 12 పరిశోధనా పత్రాలు సమర్పించారు.
పరిశోధనలకు శాంతి‘శ్రీకారం’
డాక్టర్ కేవీ శాంతిశ్రీ ప్రస్తుతం యూనివర్సిటీ సైన్స్ కళాశాల ఫుడ్ అండ్ న్యూట్రీషన్ సైన్స్ విభాగాధిపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ‘ఇన్వెస్టిగేషన్ ఆన్ అడాప్షన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాక్టీజెస్ ఫర్ రెడ్‌గ్రామ్ క్రాప్ బై ద ఫార్మర్స్ ఆఫ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇండియా’ అనే అంశంపై డాక్టరే చేశారు, నెట్, స్లెట్ అర్హత సాధించారు. 24 జర్నల్స్‌లో ఆర్టికల్స్ ప్రచురించారు. 56కిపైగా సదస్సులు, కార్యక్రమాలకు రిసోర్స్ పర్సన్‌గా వ్యవహరించారు. 50కి పైగా జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో పరిశోధనా పత్రాలు సమర్పించారు. పలు రేడియో, టీవీ కార్యక్రమాలలో ఫుడ్ అండ్ న్యూట్రీషన్ అంశాలపై ప్రసంగాలిచ్చారు. ఈమె పర్యవేక్షణలో ఆరు పీహెచ్‌డీలు ప్రదానం చేశారు. పలు అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు.