Skip to main content

Vidya Deevena: విద్యా దీవెనపై అప్పీల్‌కు వెళ్తాం: విద్యా శాఖ మంత్రి

విద్యార్థులకు పారదర్శకంగా విద్యా బోధన అందించాలనేది ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్ సంకల్పమని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెప్పారు.
vidya deevena scheme
విద్యా దీవెనపై అప్పీల్‌కు వెళ్తాం: విద్యా శాఖ మంత్రి

ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి జగనన్న విద్యా దీవెనపై పూర్తి సమాచారంతో హైకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేస్తామని ప్రకటించారు. పథకాన్ని యథాతథంగా అమలు చేయాలని న్యాయస్థానాన్ని కోరతామని తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద సెప్టెంబర్‌ 7న ఆయన మీడియాతో మాట్లాడారు. 

ఆ అంశాలను పరిశీలిస్తున్నాం.. 
నేరుగా తల్లుల ఖాతాల్లో విద్యాదీవెన డబ్బులు జమ చేయడం తప్పేమి కాదని మంత్రి అన్నారు. జవాబుదారీతనం, పారదర్శకత కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తాన్ని విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేయాలని సీఎం నిర్ణయించారన్నారు. యాజమాన్యాలకు ఇస్తే పిల్లల చదువుల బాధ్యత ఎవరు తీసుకుంటారన్నారు. ప్రభుత్వం దివంగత వైఎస్సార్‌ స్ఫూర్తితో పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ చేస్తోందన్నారు. 40% మంది విద్యాదీవెన డబ్బులను యాజమాన్యాలకు చెల్లించడం లేదనే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. కొన్ని కళాశాలలు విద్యాదీవెన కోసం పీఆర్వో వ్యవస్థ ద్వారా నాన్‌ సీరియస్‌ విద్యార్థులను చేర్చుకుని ఉండవచ్చని, అలాంటి వారు ఫీజులు చెల్లించకపోయి ఉండవచ్చని అన్నారు. విచారణ జరిపి ఇవన్నీ పరిశీలిస్తామన్నారు.

ఆన్ లైన్ అడ్మిషన్లతో విద్యార్థులకు మేలు.. 
ఇంటర్‌ అడ్మిషన్లపై ఈ ఏడాది పాత విధానాన్నే అమలు చేయాలన్న కోర్టు తీర్పుపై రివ్యూకి వెళ్లటాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి సురేష్‌ తెలిపారు. గతంలో ఇంటర్‌ ప్రవేశాల్లో రిజర్వేషన్లు పాటించలేదన్నారు. విద్యార్ధుల ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ఇంటర్‌లో ఆన్ లైన్ అడ్మిషన్ల విధానం చేపట్టిందని, పూర్తి పారదర్శకత కోసమే దీన్ని తెచ్చామని స్పష్టం చేశారు. డిగ్రీ అడ్మిషన్లలో విజయవంతమైనప్పుడు ఇంటర్‌లో ఎందుకు సమస్య వస్తుందని ప్రశి్నంచారు. ఆన్ లైన్‌ అడ్మిషన్ల వల్లే పక్కాగా రిజర్వేషన్లు అమలవుతాయన్నారు. కళాశాలల యాజమాన్యాలు ఈ విషయాన్ని ఇబ్బందికరంగా భావించడం సరికాదన్నారు. ప్రైవేట్‌ విద్యా సంస్థలు కోట్లు ఖర్చు చేసి ఆన్ లైన్ అడ్మిషన్లకు అడ్డంకులు సృష్టిస్తున్నాయన్నారు. ఈ ఏడాది ఆన్ లైన్ లో అడ్మిషన్లు నిర్వహించుకునేందుకు అనుమతిస్తూ హైకోర్టు 2020లో ఆదేశించిందన్నారు. తీర్పు కాపీలోనూ ఈ అంశం ఉందని గుర్తు చేశారు. కోర్టుకి పూర్తి సమాచారం అందజేసి ఆన్ లైన్ అడ్మిషన్ల విధానాన్ని పునరుద్ధరించాలని కోరతామన్నారు. పాఠశాలల్లో 0.001% మాత్రమే కరోనా కేసులు నమోదవుతున్నాయన్నారు. 

Published date : 08 Sep 2021 02:49PM

Photo Stories