Telangana: విద్యార్థులంటే లెక్క లేదా?
పిల్లల చదువు తలిదండ్రులకు భారం కావొద్దనే భావనతో నాణ్యమైన ఉచిత వసతితో పాటు విద్యనందించేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా ర్టీ శాఖల ఆధ్వర్యాన ప్రభుత్వం అన్ని మండల కేంద్రాల్లో గురుకులాలను ఏర్పాటుచేసింది. ఇవేకాక జిల్లాలో రెండు రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటి నిర్వహణకు ప్రభుత్వం ఏటా రూ.కోట్ల నిధులు కేటాయిస్తోంది. ఇదంతా ఓ కోణం కాగా... దాదాపు అన్ని గురుకులాల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి.
ఉన్నతాధికారుల అలసత్వం, ఉద్యోగుల ఇష్టారాజ్యంతోనే ఈ పరిస్థితి నెలకొందనే ఆరోపణలున్నాయి. ఇక వసతి కల్పనలోనూ సవతితల్లి ప్రేమ చూపిస్తున్నారన్న విమర్శలొస్తున్నాయి. బీసీ గురుకులాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉందని విద్యార్థులు వాపోతున్నారు. భోజనం, వసతి సక్రమంగా లేకపోయినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని పేర్కొంటున్నారు.
చదవండి: Telangana: గురుకుల విద్యార్థినులకు ఎలుక కాట్లు
అద్దె భవనాలతో సమస్యలు
అన్ని సంక్షేమ శాఖల ఆధ్వర్యాన గురుకులాలు మంజూరు చేసినా పక్కా భవనాలు లేక దాదాపు అన్నీ అద్దెభవనాల్లోనే నిర్వహిస్తున్నారు. చాలాచోట్ల వసతి, బోధన ఒకే గదిలో సాగుతుండగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఇంకొన్ని గురుకులాల్లో స్నానాల గదులు, వాష్ రూమ్‌లు, పరిసరాలు అధ్వాన్నంగా కనిపిస్తున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారు.
ఆర్సీవోలు తోచినప్పుడు తనిఖీ చేస్తూ విద్యార్థుల సమస్యలను గాలికొదిలేస్తున్నట్లు తెలుస్తోంది. సమస్యలు ఉన్నాయని చెప్పే విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని సిబ్బందిని అధికారులు ఆదేశించినట్లు సమాచారం. కలెక్టర్ పలు గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలలను సందర్శించారు. ఈ సమయంలో సమస్యలు చెప్పకుండా ఒత్తిడి తీసుకొచ్చారని సమాచారం. గతంలో ఒకటి, రెండు దశల్లో సీట్లు భర్తీ కాగా.. ఇప్పుడు సెప్టెంబర్ వచ్చినా గురుకులాల్లో సమస్యల కారణంగా సీట్లు ఇంకా ఖాళీగానే ఉండడం గమనార్హం.