New Medical Colleges: తెలుగు రాష్ట్రాలకు ఈ ఏడాది సమకూరిన కొత్త కాలేజీలు, సీట్లు ఇవీ..
ఏపీలో కాలేజీ రెడీ.. మరి మెడికల్ సీట్లు ఎందుకు రాలేదు బాబూ?
ఇక్కడ కనిపిస్తున్నది వైఎస్సార్ జిల్లా పులివెందుల మెడికల్ కాలేజీ. దీనిని సర్వహంగులతో గత ప్రభుత్వం సిద్ధం చేసింది. బోధనాస్పత్రి, కాలేజీ భవనాలు, స్కిల్ ల్యాబ్, హాస్టళ్లు, సిబ్బంది.. ఇలా అన్నీ సమకూర్చింది. ఈ కాలేజీలో 50 ఎంబీబీఎస్ సీట్లకు ఎన్‌ఎంసీ అను మతులు కూడా ఇచ్చింది. కానీ ఆ సీట్లను రద్దు చేయాలంటూ చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా ఎన్‌ఎంసీకి లేఖ రాసింది.
తెలంగాణలో కాలేజీ లేదు.. శిలాఫలకమే ఉంది.. మరి సీట్లు ఎలా వచ్చాయి బాబూ?
తెలంగాణలోని మహేశ్వరం ప్రాంతంలోని మెడికల్ కాలేజీ శంకుస్థాపన శిలాఫలకం. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి భవన నిర్మాణాలు చేపట్టలేదు. అయినా 50 సీట్లతో 2024–25లో తరగతులు ప్రారంభించేందుకు అనుమతులు వచ్చాయి. వెంటనే ప్రైవేటు భవనాల్లో తరగతులు ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు కూడా చేసేసింది.
తెలంగాణలో ఈ ఏడాది ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీలు మంజూరు కాగా మెదక్, కుత్బుల్లాపూర్, మహేశ్వరం, యాదాద్రి భువనగిరి వైద్య కళాశాలలకు భవనాలే లేకపోవడంతో ప్రైవేట్ కాలేజీల భవనాలను అద్దెకు తీసుకున్నారు.
సాక్షి, అమరావతి: ప్రభుత్వ నూతన వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేయాలన్న సీఎం చంద్రబాబు నిర్ణయం వేల కుటుంబాల్లో విద్యార్థులకు పిడుగుపాటులా మారింది. డాక్టర్ కావాలనే ఆశయంతో నీట్‌లో ఉత్తమ స్కోర్ సాధించినప్పటికీ ఎంబీబీఎస్ సీట్ దక్కక తీవ్ర మనోవేదన చెందుతున్నారు. ‘పక్కనున్న తెలంగాణ రాష్ట్రానికి 8 కొత్త వైద్య కళాశాలలు రావడంతో 400 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా సమకూరాయి. ఏపీలోనూ సిద్ధంగా ఉన్న ఐదు కొత్త మెడికల్ కాలేజీల ద్వారా 750 సీట్లు అదనంగా వస్తాయని ఆశపడ్డాం.
పులివెందుల కాలేజీకి ఎన్‌ఎంసీ 50 సీట్లు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వమే వద్దని నిరాకరించింది. కాలేజీలకు అనుమతులు రాకుండా కూటమి ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంది. ఈ సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే మాకు ఎంబీబీఎస్ సీట్ వచ్చి ఉండేది. ప్రభుత్వ నిర్వాకంతో ఇప్పటికే 700 సీట్లు కోల్పోయాం. వచ్చే ఏడాది ప్రారంభం కావాల్సిన మరో ఏడు కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రభుత్వం నిలిపివేసి ప్రైవేట్‌కు అప్పగించడం ద్వారా మరో 1,050 సీట్లు నష్టపోతున్నాం.
చదవండి: 2,050 Nursing Officer Jobs: నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్.. పరీక్ష సిలబస్ ఇదీ..
రెండేళ్లలో మొత్తం 1,750 సీట్లు కోల్పోవడంతో ఇక వైద్య విద్య కల నెరవేరే అవకాశం లేదు. లాంగ్ టర్మ్ శిక్షణ కోసం ఇప్పటికే రూ.లక్షల్లో వెచ్చించిన మా పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది..’ అనే చర్చ ప్రస్తుతం ప్రతి నీట్ ర్యాంకర్ల కుటుంబాల్లో సాగుతోంది. నీట్ అర్హులకు సంబంధించిన వాట్సప్ గ్రూప్‌ల్లో ఆ మెసేజ్‌లే చక్కర్లు కొడుతున్నాయి.
కుట్రపూరితంగా కాలదన్ని సాకులు
పులివెందుల, పాడేరు, మార్కాపురం, మదనపల్లె, ఆదోనిల్లో ఒక్కో చోట 150 ఎంబీబీఎస్ సీట్లతో 2024–25లో తరగతులు ప్రారంభించేలా గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేయాలని నిర్ణయించిన చంద్రబాబు సర్కార్ వాటికి అనుమతులు రాబట్టకుండా మోకాలడ్డింది.
గత ప్రభుత్వ కృషితోపులివెందుల కాలేజీకి 50 ఎంబీబీఎస్ సీట్లతో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) ఎల్‌ఓపీ మంజూరు చేసినా.. కళాశాల నిర్వహించలేమని రాష్ట్ర ప్రభుత్వమే లేఖ రాయడంతో అనుమతులు రద్దయ్యాయి. ఇక పాడేరు వైద్య కళాశాలకు కూడా 50 సీట్లకు అనుమతులు రాగా ఈ కాలేజీ నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్నందున తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.
చదవండి: Guidance to Children : తల్లిదండ్రులు పిల్లలకు ఇలా జాగ్రత్తలు చెప్పాలి..!
కేంద్రంలో భాగస్వామిగా కొనసాగుతున్నా..
తెలంగాణకు 2024–25 విద్యా సంవత్సరంలో 8 కొత్త వైద్య కళాశాలలు మంజూరు కావడంతో 400 సీట్లు అదనంగా సమకూరాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో ఇలాంటి సానుకూల పరిస్థితి ఉండగా ఏపీలో కూటమి సర్కారు ఏర్పాటైనా, కేంద్రంలో భాగస్వామిగా కొనసాగుతున్నా విద్యార్థుల ప్రయోజనాలను కాలరాయడంపై తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. పులివెందుల కళాశాలను నిర్వహించలేమంటూ ఎన్‌ఎంసీకి లేఖ రాసి అడ్డంగా దొరికిపోవడం.. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో సాకులను అన్వేషిస్తోంది.
గత ప్రభుత్వం ఏమీ చేయకుండానే సీట్లొచ్చాయా?
కొత్త వైద్య కళాశాలలను ప్రారంభించడానికి తమ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఎటువంటి చర్యలు తీసుకోలేదని గత నెల 16న మీడియా సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒప్పుకున్నారు. ఈ ఏడాది ఏకంగా 700 ఎంబీబీఎస్ సీట్లు నష్టపోవడంపై ప్రజాగ్రహం పెల్లుబుకుతుండటంతో వైఎస్ జగన్ సర్కారు వైద్య కళాశాలలను ప్రారంభించేలా ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ చంద్రబాబు ప్రభుత్వం కొత్త రాగం అందుకుంది.
మరి గత ప్రభుత్వం ఏమీ చేయకుండానే పులివెందుల, పాడేరు వైద్య కళాశాలలకు 50 సీట్లను ఎన్‌ఎంసీ ఎందుకు మంజూరు చేస్తుందని వైద్య రంగ నిపుణులు, ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఏటా పెరుగుతున్న పోటీకి అనుగుణంగా తెలంగాణలో అదనంగా సీట్లు సమకూరడంతో 500 లోపు స్కోర్ చేసిన ఓసీ విద్యార్థులకు కన్వీనర్ కోటాలో సీటు దక్కుతుండగా ఏపీలో మాత్రం 600 దాటినా నిరాశే మిగులుతోందని నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు.
తప్పు కప్పిపుచ్చేందుకు సతమతంవైద్య కళాశాలలకు అనుమతులు రాబట్టకుండా ఈ ప్రభుత్వం విద్యార్థులకు అన్యాయం చేసింది. ఆ తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు సతమతం అవుతున్నారు. మేం వచ్చి మూడు నెలలే అయింది... వసతులు ఎలా కల్పిస్తామని అంటున్నారు. ఈ ఏడాది కనీసం 50 సీట్లతో కళాశాలలు ప్రారంభించినా వచ్చే ఏడాది పెంచుకోవడానికి అవకాశం ఉండేది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మార్గాలు అనేకం ఉంటాయి.
మంగళగిరి ఎయిమ్స్‌లో భవనాలు అందుబాటులోకి రాకముందే తరగతులు ప్రారంభించారు. తాత్కాలికంగా విజయవాడలో కొద్ది రోజులు తరగతులు నిర్వహించి అనంతరం అక్కడకు మార్చారు. తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో భవనాలు అందుబాటులోకి రానందునతాత్కాలిక భవనాల్లో ప్రభుత్వం కళాశాలలు నిర్వహిస్తోంది.
– డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, ఏపీ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
Tags
- Medical Colleges
- Telangana
- Andhra Pradesh
- NMC
- MBBS seats
- NEET Rankers
- Chandrababu Govt
- Pulivendula Medical College
- New medical colleges
- 8 New Medical Colleges
- Medical Health Department
- National Medical Commission
- Telangana gets eight new government medical colleges
- Privatise New Medical Colleges
- NDA government
- AP News
- medical education