Education News:ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం కు విద్యార్థుల ఓటు

పదో తరగతి విద్యార్థులు ఇంగ్లిష్ మీడియానికే జై కొట్టారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలను 93 శాతం మంది ఇంగ్లిష్ మీడియంలోనే రాస్తామని తేల్చి చెప్పారు. 2024–25 విద్యా సంవత్సరం పదో తరగతిలో మొత్తం 6,64,527 మంది విద్యార్థులు ఉండగా.. ప్రభుత్వ పాఠశాలల్లో 3,77,054 మంది చదువుతున్నారు.
వీరంతా మార్చి 17 నుంచి జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరు కానున్నారు. ఈ క్రమంలో పాఠశాల విద్యా శాఖ నామినల్ రోల్స్ పంపాల్సిందిగా పాఠశాలలను ఆదేశించింది. ఈ ప్రక్రియ మొదలైన అనంతరం తెలుగులోనూ పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పించామని, తెలుగు మీడియంలో పరీక్షలు రాసేందుకు కూడా దరఖాస్తు చేసుకోవాలని కోరింది.
ఇదీ చదవండి: TGPSC Group-1 Results 2024 Expected Soon: Check Details
అయితే, ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల్లోని అన్ని పాఠశాలల నుంచి కేవలం 51,037 మంది మాత్రమే తెలుగు మీడియంకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ప్రభుత్వ విద్యార్థుల సంఖ్య 25 వేలకు మించి ఉండదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన విద్యా సంస్కరణలతో 2023–24 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి ఇంగ్లిష్ మీడియం లేకున్నా సరే 4 లక్షల మంది విద్యార్థుల్లో 2.25 లక్షల మంది స్వచ్ఛందంగా ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు రాశారు.
చట్టప్రకారం ఈ విద్యా సంవత్సరం పదో తరగతి ఇంగ్లిష్ మీడియంలోకి మారింది. అయినప్పటికీ కూటమి సర్కారు ఇంగ్లిష్ మీడియం రద్దుకు కంకణం కట్టుకుని పదో తరగతి విద్యార్థులను తెలుగు మీడియం వైపు తిప్పేందుకు శతవిధాలా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.
ఇంగ్లిష్ మీడియం విద్యకే ఓటు
రాష్ట్రంలో 2019కి ముందు ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం మాత్రమే అందుబాటులో ఉండేది. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంగ్లిష్ మీడియం విద్యను కోరుకోవడం, అది ప్రభుత్వ బడుల్లో లేకపోవడంతో ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు తగ్గిపోవడం.. ప్రైవేటు పాఠశాలల్లో ఎన్‌రోల్‌మెంట్ పెరగడం పరిపాటిగా మారింది.
దీంతో దాదాపు 1,785 ప్రభుత్వ పాఠశాలలను గత టీడీపీ ప్రభుత్వం మూసేసింది. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితులపై వైఎస్ జగన్ ప్రభుత్వం అధ్యయనం చేసి తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకుంది. తద్వారా రాష్ట్రంలో సామాన్య, మధ్యతరగతి తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు ఇంగ్లిష్ మీడియం విద్యను కోరుకుంటున్నామని 95 శాతం మంది తెలిపారు. ఇంగ్లిష్ కోసమే ఫీజులు భారమైనా తమ బిడ్డలను ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్నట్టు వివరించారు. దీంతో వైఎస్ జగన్ ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది.
పేదింటి పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీ పడేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం 2020–21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను అమల్లోకి తెచ్చింది. ఆ సంవత్సరం ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టగా, 2021–22లో ఏడో తరగతి, 2022–23లో ఎనిమిదో తరగతి, 2023–24లో తొమ్మిదో తరగతికి అందుబాటులోకి తెచ్చింది. ఇదే క్రమంలో 2024–25 విద్యా సంత్సరంలో పదో తరగతి కూడా ఇంగ్లిష్ మీడియం అమల్లోకి వచ్చింది.
కుట్రను తిప్పికొట్టి మరీ..
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలో చదవలేకపోతున్నారని, మాతృభాషలో బోధన అందిస్తామని ప్రకటించింది. కానీ.. విద్యార్థులు అందుకు అంగీకరించలేదు. 2023–24 విద్యా సంవత్సరంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం చదువుతున్న పదో తరగతి విద్యార్థుల్లో 2.20 లక్షల మంది స్వచ్ఛందంగా ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు రాశారు. వారిలో 1.94 లక్షల మంది ఉత్తర్ణీత సాధించడం ద్వారా పిల్లలు ఇంగ్లిష్ మీడియంను ఎంత బలంగా కోరుకుంటున్నారో రుజువు చేశారు.
ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ బడుల్లో 25 వేల మందే తెలుగు మీడియం పరీక్షలకు అంగీకరించి.. తెలుగు మీడియం సంఖ్యను మరింత తగ్గించారు. గత ప్రభుత్వం తెచ్చిన విద్యా సంస్కరణలతో ప్రజల్లో సర్కారు బడులపై నమ్మకం పెరిగింది. దాంతో 2023–24 విద్యా సంవత్సరంలో అంతకు ముందుకంటే ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు 1,50,005 మంది విద్యార్థులు అధికంగా చేరికలు నమోదయ్యాయి. గత విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 43 లక్షల మంది విద్యార్థులు ఉండగా, వారిలో 38.50 లక్షల మంది ఇంగ్లిష్ మీడియంలోనే పరీక్షలు రాశారు.
ఇదీ చదవండి: Education News: ఐఐటీ క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో క్షీణత
ప్రభుత్వం బైలింగ్యువల్ పుస్తకాలను అందించడంతో విద్యార్థుల్లో ఇంగ్లిష్ మీడియం అంటే భయం పోయింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న అత్యధిక మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలో చదివేందుకే ఇష్టపడుతున్నారు. గతేడాది ముగిసిన పరీక్షల్లో 91.33 శాతం మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలోనే పరీక్షలు రాయడం ఇందుకు నిదర్శనం. ఇందులో 3 నుంచి 5 తరగతుల్లో 86 శాతం, 6 నుంచి 9వ తరగతి వరకు 94 శాతం మంది ఇంగ్లిష్ మీడియంలో పరీక్ష రాయగా, మొత్తం అన్ని తరగతుల్లోను పరీక్షలు 93 శాతం ఇంగ్లిష్ మీడియంలోనే పూర్తి చేశారు.
2023–24 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు టాప్ మార్కులు సాధించి ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లకు సవాల్ విసిరారు. అదీ ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు రాసి 590కి పైగా మార్కులు సొంతం చేసుకోవడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ఎందుకని ఆక్షేపించిన వారికి గట్టి జవాబు ఇచ్చారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)