Teachers: పోరుబాటలో ఉపాధ్యాయులు
ఈమేరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టగా... గురువారం హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహణకు నిర్ణయించారు. పలు ప్రధాన సమస్యలను అజెండాగా తీసుకుని ధర్నా నిర్వహిస్తుండగా, జిల్లా నుంచి ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
సమయానికి జీతాలు రావడం లేదని...
మొదటి పీఆర్‌సీ గడువు ముగిసినా పూర్తి స్థాయిలో అమలు జరగకపోగా, రెండో వేతన సవరణ సంఘం నియామకంపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదని ఉపాధ్యాయ, ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. గత పీఆర్‌సీలో 22 నెలల ఆర్థిక ప్రయోజనం నష్టపోగా ఈ దఫా అలాంటి నష్టం జరగకుండా ఉండాలంటే గత నెల(జూలై 1)నుంచే మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇక గతంలో ప్రతినెల 1వ తేదీన వేతనాలు రాగా.. ఇప్పుడు అలా జరగకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు. అంతేకాక సప్లిమెంటరీ బిల్లులు, సెలవుల జీతాలు, జీపీఎఫ్, టీఎస్‌జీఎల్‌ఐ క్లెయిమ్‌లు, పెన్షనర్ల బెనిఫిట్స్, పీఆర్‌సీ బకాయిలు ట్రెజరీలో పేరుకుపోయాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. అలాగే, హెల్త్ కార్డులపై నగదు రహిత వైద్యం పరిమితి లేకుండా అందిస్తామని చెప్పినా అమలుకు నోచుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
చదవండి: విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చేందుకే ‘ఉన్నతి’
ఖాళీల భర్తీ మాటేమిటి?
వేలాది ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండడంతో బదిలీలు, పదోన్నతులు, నియామకాల ద్వారా చేపట్టాలని కోరుతున్నారు. అయినప్పటికీ ఆ దిశగా అడుగులు పడడం లేదని ఆవేదన చెందుతున్నారు. 2019లో హడావుడిగా అప్‌గ్రేడ్ చేసిన పండిట్, పీఈటీ పోస్టులపై నెలకొన్న వివాదాన్ని త్వరగా పరిష్కరించి వారికి న్యాయం చేయాలని కోరుతున్నా పరిష్కారం కాలేదని లేదని వాపోతున్నారు.
సీపీఎస్ రద్దు కూడా..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్న పలు పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని యూఎస్‌పీసీ బాధ్యులు డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా సీపీఎస్‌ను రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని కొన్నాళ్లుగా ఉద్యమిస్తున్నారు. అలాగే, విద్యాశాఖలో పదోన్నతులు కల్పించాలని, జూనియర్ లెక్చరర్ పోస్టుల్లో పదోన్నతుల కోటా పునరుద్ధరించాలని, జీఓ 317 అమలు చేసిన తర్వాత బ్లాక్ చేసిన 13జిల్లాల స్పౌజ్ బదిలీలు నిర్వహించాలని, నూతన జాతీయ విద్యావిధానం రద్దు చేయాలని డిమాండ్‌తో ఆందోళన బాట పట్టారు. ఈమేరకు జూలై 18, 19వ తేదీల్లో మండల కేంద్రాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించగా... ఆగస్టు 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. ఇప్పుడు చివరగా గురువారం హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద మహాధర్నాకు సిద్ధమయ్యారు. ఈ విషయమై కొన్నాళ్లుగా విస్తృతంగా ప్రచారం చేసిన సంఘాల నాయకులు... జిల్లా నుంచి భారీగా ఉపాధ్యాయులు తరలివచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
సమస్యల పరిష్కరించాలనేదే డిమాండ్
ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలనే ప్రధాన డిమాండ్‌తో హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నా చేపడుతున్నాం. ఇదే రోజు పెన్షన్ విద్రోహదినంగా పాటిస్తాం. ఈ ధర్నాకు ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో తరలివచ్చేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారు.
– పి.నాగిరెడ్డి, యూఎస్‌పీఎస్‌సీ స్టీరింగ్ కమిటీ రాష్ట్ర బాధ్యుడు
మొండివైఖరి విడనాడాలి
తొమ్మిదేళ్లుగా రాష్ట్రంలో విద్యాశాఖ వివక్షత ఎదుర్కొంటుంది. విద్యాశాఖ, విద్యారంగ సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించలేదు. అన్ని శాఖల్లో పదోన్నతులు ఇచ్చినా విద్యాశాఖపై ఇవ్వలేదు. ఇకనైనా మొండివైఖరి విడనాడి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం.
– దేవరకొండ సైదులు, యూఎస్‌పీఎస్‌సీ స్టీరింగ్ కమిటీ బాధ్యుడు