Inter Students: ఇంటర్ విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు
ఉదయమో గంట.. సాయంత్రమో గంట
- ఇంటర్ విద్యార్థులకు రోజూ 2 గంటల ప్రత్యేక క్లాసులు
- ఉదయం 8 నుంచి 9.. సాయంత్రం 4 నుంచి 5 వరకు..
- రోజుకు రెండు ఆప్షనల్ సబ్జెక్టుల బోధన
- కరోనా వల్ల కొన్ని కాలేజీల్లో 50% కూడా పూర్తవని సిలబస్
- ఏప్రిల్‌లో పరీక్షలు.. మార్చిలోగా సిలబస్ పూర్తికి బోర్డు ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అదనపు క్లాసులు మొదలుకాబోతున్నాయి. ఉదయం, సాయంత్రం గంట చొప్పున రోజూ రెండు గంటలు ఎక్స్‌ట్రా క్లాసులు చెప్పబోతున్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు నిర్ణయానికి వచ్చింది. రాష్ట్రంలోని 405 ప్రభుత్వ కాలేజీల్లో ఈ తరహా ఏర్పాట్లు చేస్తామని బోర్డు అధికారులు చెప్పారు. ఏప్రిల్ 20 నుంచి ఇంటర్ తొలి, రెండో సంవత్సర పరీక్షలకు టైమ్ టేబుల్ విడుదల చేయడం.. కరోనా వల్ల కొన్ని కాలేజీల్లో ఇంకా 50 శాతం కూడా సిలబస్ పూర్తవకపోవడంతో మార్చిలోగా సిలబస్ పూర్తి చేసేందుకు అధికారులు ఈ ఏర్పాట్లు చేస్తున్నారు.
also read: National Law University:కర్నూలులో లా వర్సిటీ
ఇప్పటికే 70% సిలబస్ పూర్తవ్వాల్సి ఉన్నా..
ఇంటర్ విద్యార్థులకు సాధారణంగా జూలై, ఆగస్టులో క్లాసులు మొదలవ్వాలి. కరోనా వల్ల సెప్టెంబర్‌లో తరగతులు ప్రారంభించారు. దాదాపు నెల పాటు ఆన్‌లైన్‌లోనే బోధన సాగింది. గత నెల కూడా థర్డ్ వేవ్ వల్ల 25 రోజులు క్లాసులు నిర్వహించలేదు. దీంతో సిలబస్ పూర్తి చేయలేకపోయామని అధ్యాపకులు అంటున్నారు. లాంగ్వేజ్ సబ్జెక్టుల బోధనలో విద్యార్థులకు పెద్దగా ఇబ్బంది లేకున్నా ఆప్షనల్ సబ్జెక్టుల విషయంలో సిలబస్ ఆశించిన మేర పూర్తవ్వలేదని ఇటీవల బోర్డు గుర్తించింది. ముఖ్యంగా గణితం, ఫిజిక్స్, హిస్టరీ, ఎకనమిక్స్ సబ్జెక్టుల్లో ఇప్పటికే 70 శాతం సిలబస్ పూర్తవ్వాల్సి ఉన్నా కొన్ని కాలేజీల్లో 50 శాతం కూడా పూర్తవ్వలేదని తెలిసింది. దీంతో ఈసారి కూడా 30 శాతం సిలబస్‌ను తగ్గించింది.
also read: Breaking News : ఫిబ్రవరి 28వ తేదీ నుంచి స్కూల్ ఓపెన్.. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు
మార్చి ఆఖరు కల్లా 70% సిలబస్ పూర్తి చేసేలా..
సాధారణంగా ఇంటర్ బోధన ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. అయితే ఇక ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ప్రత్యేక క్లాసులు నిర్వహించాలని నిర్ణయించారు. రోజుకు రెండు ఆప్షనల్ సబ్జెక్టులను సంబంధిత అధ్యాపకులు బోధించే ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి నెలాఖరు వరకు 70 శాతం సిలబస్ పూర్తి చేసి వారం రోజులు రివిజన్ చేపట్టాలనే యోచనలో ఉన్నట్టు అధ్యాపక వర్గాలు తెలిపాయి. మరోవైపు ప్రైవేటు కాలేజీల్లో ఇంటర్ సిలబస్ ఇప్పటికే చాలా వరకు పూర్తయింది. ఈ నెల 15 తర్వాత రివిజన్ చేపట్టేందుకు ఆ కాలేజీలు సిద్ధమవుతున్నాయి. ఇంకోవైపు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు కూడా కోచింగ్ తీసుకుంటున్నారు. ఇలాంటి వాళ్లలో ప్రభుత్వ కాలేజీల విద్యార్థులూ ఉన్నారు. ప్రత్యక్ష క్లాసుల వల్ల పోటీ పరీక్షల టైం మార్చుకోవాల్సి వస్తోందని వారు చెబుతున్నారు.
also read: Government Jobs: ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం కీలక సంస్కరణలు ఇవే.. ఈ నిబంధనలు తొలగింపు
సరిపడా అధ్యాపకులున్నారా?
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో శాశ్వత ప్రాతిపదికన ఉన్న లెక్చరర్ల సంఖ్య 725 మాత్రమే. అతిథి లెక్చర్లు 1,658, కాంట్రాక్టు లెక్చరర్లు 3,700, పార్ట్‌టైం, మినిమమ్ టైం స్కేల్ మరో 100 మంది ఉంటారు. అయితే గెస్ట్ లెక్చరర్ల సేవలను సెప్టెంబర్ నుంచి 5 నెలల పాటు తీసుకుంటూ గతంలో ప్రభుత్వ ఆదేశాలిచ్చింది. ఈ గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుంది. ఇప్పటివరకు వీరిని పొడిగించేందుకు నిర్ణయం తీసుకోలేదు. దీంతో ప్రత్యేక క్లాసుల నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు 317 జీవో అమలులో భాగంగా దాదాపు 78 మందికి స్థానచలనం జరిగి కొన్ని ఖాళీలేర్పడ్డాయి. వీటిపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి కన్వీనర్ మాచర్ల రామకృష్ణ తెలిపారు. ఈ విషయాలను బోర్డు దృష్టికి తీసుకెళ్తామన్నారు.