Government Jobs: ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం కీలక సంస్కరణలు ఇవే.. ఈ నిబంధనలు తొలగింపు
గ్రూప్ 1 సహా అన్ని పోస్టులకూ ఇంటర్వ్యూలు రద్దు, డిజిటల్ మూల్యాంకనం, ట్యాబ్ ఆధారిత ప్రశ్నపత్రాలు, రిజర్వుడ్ మెరిట్ అభ్యర్థులకు ఓపెన్ కేటగిరీ పోస్టులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఈడబ్ల్యూఎస్ కోటా అమలు తదితరాలు ఇందులో ఉన్నాయి.
ఎక్కువ అభ్యర్థులున్న పోస్టులకే..
గ్రూప్–1 పోస్టులకు మినహా మిగతా అన్ని కేటగిరీల పోస్టులకు ప్రిలిమ్స్ పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుంది. అయితే కొన్ని పోస్టులకు లక్షల్లో దరఖాస్తులు రావడం, మెరిట్ అభ్యర్థులను నిర్ణయించడంలో సమస్యలు తలెత్తడంతో కొన్ని మినహాయింపులు చేపట్టింది. అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు అందే పోస్టులకు మినహా మిగతా వాటికి ప్రిలిమ్స్ లేకుండా ఒకే పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నారు. దీంతోపాటు గ్రూప్–1 సహా అన్ని పోస్టులకూ ఇంటర్వ్యూలను పూర్తిగా తొలగించారు. గత సర్కారు హయాంలో ఇంటర్వ్యూల పేరిట తమ వారికే పోస్టులు వచ్చేలా చేసి అర్హులకు అన్యాయం చేశారు.
గ్రూప్ 1 సహా అన్ని పోస్టులకూ..
అన్ని బోర్డులకు ఏపీపీఎస్సీ చైర్మనే నేతృత్వం వహించడంతో అక్రమాలకు తెర లేచింది. దీన్ని పూర్తిగా రద్దు చేసి గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లలో కొన్ని పోస్టులకు బహుళ బోర్డులతో ఇంటర్వ్యూలను నిర్వహించారు. బోర్డులకు వేర్వేరు చైర్మన్లను నియమించారు. గ్రూప్ 1 సహా అన్ని పోస్టులకూ ఇంటర్వ్యూలు రద్దయిన నేపథ్యంలో ఏపీ స్టేట్ సర్వీస్ కేడర్ పోస్టుల అభ్యర్థుల ఎంపికలో వ్యక్తిత్వం, పరిపాలనా దక్షతను అంచనా వేసేందుకు ప్రత్యామ్నాయ విధానాలపై కమిషన్ కసరత్తు చేస్తోంది.
ఈ ఆధారంగానే ప్రశ్నపత్రం..
టీడీపీ సర్కారు గ్రూప్ 1తో పాటు అన్ని కేటగిరీల పోస్టులకూ ప్రిలిమ్స్‌ను తప్పనిసరి చేసింది. గతంలో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తుండగా దాన్ని రద్దు చేసి 1:15 ప్రకారం మార్చింది. దీనివల్ల వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు నష్టపోయారు. పాత విధానాన్ని కొనసాగించాలని ఆందోళన చేసినా పట్టించుకోలేదు.
వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ విధానాన్ని మార్చి నిరుద్యోగులకు మేలు చేసేలా 1: 50 నిష్పత్తిని తిరిగి ప్రవేశపెట్టింది. మరోవైపు గ్రూప్ 1 మెయిన్స్‌లో ట్యాబ్ ఆధారిత ప్రశ్నపత్రాల ద్వారా పరీక్షలు నిర్వహించారు. దీనివల్ల అభ్యర్థులందరికీ ఒకేసారి ప్రశ్నపత్రం అందడంతో పాటు లీకేజ్ లాంటి వాటికి ఆస్కారం లేకుండా చేశారు. అవకతవకలను నివారించేందుకు ఏపీపీఎస్సీ డిజిటల్ మూల్యాంకనాన్ని చేపట్టింది. దీనివల్ల పారదర్శకతతో పాటు అర్హులైన వారికి న్యాయం జరుగుతుంది.
నెగిటివ్ మార్కులు వద్దు..
ఏపీపీఎస్సీ నిర్వహించే డిపార్టుమెంట్ పరీక్షల్లో గత సర్కారు నెగిటివ్ మార్కులు ప్రవేశపెట్టడంతో పదోన్నతులు, ఇతర ప్రయోజనాల కోసం పరీక్షలు రాసే ఉద్యోగులు నష్టపోయారు. దీన్ని రద్దు చేయాలని ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా ఆలకించలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే డిపార్టుమెంట్ పరీక్షలలో నెగిటివ్ మార్కులను రద్దు చేసింది.
వయోపరిమితి పొడిగింపు..
ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి నిబంధనల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు కల్పిస్తున్న ఐదేళ్ల సడలింపును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వర్గాలకు కల్పిస్తున్న సడలింపు కాలపరిమితి 2021 మే నెలతో ముగిసింది. కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతుండటంతో ఈ అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా వయోపరిమితి సడలింపును 2026 మే 31 వరకు ప్రభుత్వం పొడిగించింది.
ఓపెన్ కేటగిరీ పోస్టులు ఇలా..
గత సర్కారు రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులు తమ రిజర్వేషన్ల ప్రయోజనాన్ని ముఖ్యంగా వయోపరిమితి మినహాయింపును వినియోగించుకుంటే వారిని ఆ కేటగిరీ పోస్టులకే పరిమితం చేస్తూ ఓపెన్ కేటగిరీ పోస్టులకు అనర్హులుగా చేసింది. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలతో పాటు రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులందరికీ తీరని నష్టం వాటిల్లింది. దీనిపై జాతీయ ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్లకు ఫిర్యాదులు అందినా టీడీపీ సర్కారు పట్టించుకోలేదు. ఇప్పుడు రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులు రిజర్వేషన్ ప్రయోజనాన్ని వినియోగించుకున్నా మెరిట్‌లో అగ్రస్థానంలో ఉంటే ఓపెన్ కేటగిరీ పోస్టులకు అర్హులుగా నిర్ణయిస్తూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వారికి మేలు చేసింది.
Good News: త్వరలోనే ఏపీపీఎస్సీ ద్వారా 3,946 పోస్టుల భర్తీకి రెడీ.. ఇంకా
ఈడబ్ల్యూఎస్ కోటాలో..
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడ బ్ల్యూఎస్) ప్రభుత్వ ఉద్యోగాల్లో పది శాతం కోటాను రిజర్వు చేస్తూ కేంద్ర ప్రభుత్వం 2018లో చట్టం తెచ్చిన సంగతి తెలిసిందే. టీడీపీ హయాంలో ఆ కోటా సంగతిని ప్రస్తా వించకుండా నోటిఫికేషన్లు జారీ చేయడంతో ఆ వర్గాల యువతకు అన్యాయం జరిగింది. పైగా పది శాతం కోటాలో 5 శాతాన్ని కాపులకు ప్రత్యేకిస్తున్నట్లు నిబంధనలకు విరుద్ధంగా ఉత్తర్వులు ఇవ్వడంతో అది న్యాయపరంగా చెల్లుబాటు కాకుండా నిలిచిపోయింది. దీనివల్ల నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయా వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో పది శాతం కోటా అమలుకు చర్యలు తీసుకుంది. ఈడబ్ల్యూఎస్ కోటా అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో ఏపీపీఎస్సీ ఆమేరకు చర్యలు చేపట్టింది. కొత్త నోటిఫికేషన్లలో ఈడబ్ల్యూఎస్ కోటా అభ్యర్థుల వివరాలను పొందుపర్చేలా వీలు కల్పించింది.