Teachers in Govt. Schools: టీచర్లు కావలెను..!
Sakshi Education
- సర్కారు బడులకు టీచర్ల కొరత
- ముందుకు సాగని పాఠాలు తీవ్ర ఒత్తిడిలో ఉపాధ్యాయులు
- ఖైరతాబాద్ జోన్ పరిధిలో 80 మంది టీచర్ల అవసరం
బంజారాహిల్స్: షేక్‌పేట మండలం, ఫిలింనగర్‌లోని వినాయకనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 182 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 1 నుంచి 5 వ తరగతి వరకు ఇక్కడ విద్యాబోధన కోసం అయిదుగురు ఉపాధ్యాయులు అవసరం. అయితే ప్రస్తుతం ఇద్దరితోనే నెట్టుకొస్తున్నారు...
- బంజారాహిల్స్ రోడ్ నెం. 11లోని ఉదయ్‌నగర్ ప్రాథమిక పాఠశాలలో 250 మందికిపైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. విద్యార్థులకు సంఖ్యకు తగినట్లు కనీసం అయిదుగురు టీచర్లు అవసరం.. అయితే ఇక్కడ కూడా ఇద్దరు మాత్రమే విద్యాబోధన చేస్తున్నారు.
- బంజారాహిల్స్ రోడ్ నెం.7లోని గతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 514 మంది విద్యార్థులు చదువుకుంటుండగా ఇక్కడ 18 మంది ఉపాధ్యాయులు అవసరం. అయితే ప్రస్తుతం 13 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు.
- ఫిలింనగర్ ప్రభుత్వ రౌండ్‌టేబుల్ ఉన్నత పాఠశాలలో 1150 మంది విద్యార్థులు చదువుకుంటుండగా 40 మంది టీచర్లు కావాలి. అయితే 22 మంది టీచర్లతోనే నెట్టుకొస్తున్నారు.
also read : Telangana : మేలో టెన్త్ పరీక్షలు.. ఎక్కువ చాయిస్ ఉండేలా ప్రశ్నపత్రాలు.
- విద్యాశాఖ ఖైరతాబాద్ జోన్ పరిధిలోని 17 ప్రభుత్వ ఉన్నత, 36 ప్రాథమిక పాఠశాలల్లో టీచర్ల కొరత తీవ్రంగా ఉంది. కరోనాకు ముందు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం ఎదురు చూసిన ఉపాధ్యాయలకు కరోనా తర్వాత పెద్ద సంఖ్యలో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు క్యూ కట్టారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కళకళలాడుతున్నప్పటికీ వారికి విద్యాబోధన అందించేందుకు ఉపాధ్యాయుల నియామకం చేపట్టకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. మరో వైపు ఉపాధ్యాయులు సైతం తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఇద్దరు టీచర్లు ఉండాల్సిన స్కూల్‌లో ఒకరు సెలవు పెడితే మిగిలిన ఒక్కరు మాత్రమే అయిదు తరగతులు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. రెండేళ్ల క్రితం విద్యా వలంటీర్లు ఈ సమస్యకు కొంత వరకు పరిష్కారంగా కనిపించేవారు. అయితే కరోనా కారణంగా పాఠశాలలు మూతపడటం సర్కారుకు కలిసొచి్చంది. ఉన్న విద్యావలంటీర్లను నిర్ధాక్షణ్యంగా తొలగించారు. తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని వీవీలు చేస్తున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. ఈ నేపథ్యంలో సర్కారు బడుల్లో టీచర్ల కొరత నానాటికి తీవ్ర మవుతోంది. ప్రధానోపాధ్యాయులు సైతం టీచర్లను నియమించాలని కోరుతూ ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు ప్రతిపాదనలు పంపినా పట్టించుకునే వారు కరువయ్యారు. దీంతో వారే కొన్ని స్వచ్ఛంద సంస్థలకు మొరపెట్టుకుంటూ ఒక్క టీచర్‌కు జీతం చెల్లించాలని వేడుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో కలిపి జోన్ పరిధిలో 80 మంది టీచర్లు అవసరం ఉందని ఉన్నతాధికారులకు ఇప్పటికే ఆయా హెచ్‌ఎంలు నివేదికలు అందించారు.
Published date : 11 Feb 2022 03:57PM