UGC: ఉన్నత విద్యలో ‘షేరింగ్’
వివిధ సదుపాయాలతో పాటు అత్యున్నత ప్రమాణాలతో కూడిన బోధన ఇతర అంశాల్లో విద్యా సంస్థల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణికి తెరతీసింది. నాలెడ్జ్ షేరింగ్, నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్‌కి వీలుగా టెక్నాలజీని, ఇతర వనరులను ఆయా సంస్థలు ఉమ్మడిగా వినియోగించుకునేందుకు ఈ విధానం దోహదపడనుంది. సెంట్రల్ వర్సిటీలు సహా అన్ని ఉన్నత విద్యా సంస్థలకు యూజీసీ ఆదేశాలిచ్చింది.
చదవండి: UGC: ఆన్‌లైన్ పీహెచ్‌డీలకు గుర్తింపు లేదు
అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్–గ్రాడ్యుయేట్ కోర్సులతో పాటు పరిశోధన కోర్సుల్లోనూ దీన్ని అమలుచేయాలని సూచించింది. వనరులు లేని విద్యాసంస్థలు వాటిని ఏర్పాటు చేసుకునేందుకు అదనపు పెట్టుబడి పెట్టాల్సిన అవసరంలేకుండా దగ్గర్లోని విద్యా సంస్థల వనరులను వినియోగిస్తూ తమ విద్యార్థులను ఆయా సంస్థలు తీర్చిదిద్దడానికి ఈ విధానంతో వీలుపడుతుంది.
చదవండి: UGC: మాతృభాషలో డిగ్రీ కోర్సులు
రెట్టింపు ఫలితాలు
ఈ విధానంవల్ల రెట్టింపు ఫలితాలు వస్తాయని యూజీసీ భావిస్తోంది. అకడమిక్ అంశాలు సహా ఏదైనా అభివృద్ధి కార్యకలాపాలను సమగ్రంగా అమలుచేయాలంటే అదనపు సదుపాయాలు అవసరమవుతుంటాయి. ఇందుకోసం ఆయా సంస్థలు అదనపు పెట్టుబడి పెట్టాలి. అలా కాకుండా.. ఇప్పటికే ఉన్న వనరులను సమర్థంగా ఉపయోగించడంవల్ల రెట్టింపు ఫలితాలు వస్తాయి. ఉన్నత విద్యాసంస్థలు పరస్పర సహకారంతో విద్యాపరమైన మౌలిక వనరులను పంచుకోవడం వల్ల విద్యార్థులకు సమానమైన విద్య అందుతుంది.
చదవండి: UGC: 15 ఏళ్లు నిండితే డీమ్డ్ హోదా!
ప్రస్తుతం ల్యాబ్‌లు, లైబ్రరీలు, ఇతర వనరులున్న సంస్థల్లో చదివే వారికి ఆ వనరుల ద్వారా ఉత్తమ బోధన లభిస్తుంది. కానీ, అలాంటివిలేని సంస్థల విద్యార్థులకు ఉన్నత బోధన దూరమవుతోంది. వనరులను పంచుకునేలా ఆయా సంస్థల మధ్య జరిగేఒప్పందాలతో విద్యార్థులందరికీ మేలు చేకూరుతుంది. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్–గ్రాడ్యుయేట్, పీహెచ్‌డీ కోర్సులన్నిటికీ ఈ విధానాన్ని అమలుచేయాలని యూజీసీ సూచించింది. ఆయా విద్యాసంస్థలన్నీ తమ సంస్థలోని తరగతి గదులు, ల్యాబ్‌లు ఇతర వనరుల సమాచారాన్ని సమీపంలోని ఇతర ఉన్నత విద్యాసంస్థలన్నిటికీ తెలిసేలా వెబ్‌సైట్ ద్వారా తక్షణమే అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. వీటిని వినియోగించుకోవాలనుకునే ఇతర ఉన్నత విద్యా సంస్థల నుంచి నిర్దిష్ట వనరులకు సాధారణ కనీస ఛార్జీలు నిర్ణయించి వసూలుచేయవచ్చని సూచించింది. ఆ కనీస ఛార్జీల వివరాలూ అందుబాటులో ఉంచాలని పేర్కొంది.
చదవండి: UGC: ఆ కోర్సులకు అనుమతి ఉండాల్సిందే
సంస్థల మధ్య ఒప్పందాలు
ఇక ఉన్నత విద్యా సంస్థల్లోని వనరులను పరస్పర భాగస్వామ్యంతో వినియోగించుకునేందుకు వీలుగా ఆయా సంస్థలు ఎంఓయూ కుదుర్చుకోవాలని యూజీసీ పేర్కొంది. ఏ సమయంలో ఏ సంస్థ విద్యార్థులు వనరులు వినియోగించుకోవాలో సమగ్ర టైమ్‌టేబుల్‌ను రూపొందించి ఆ ప్రకారం కార్యక్రమాలకు కమిటీలను ఏర్పాటుచేసుకోవాల్సి ఉంటుంది. తరగతి గదులు, ల్యాబ్‌లు, ఇతర వనరులు పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా సంస్థలు చర్యలు చేపట్టాలని, ఏ ఒక్క తరగతి ఖాళీగా ఉండకుండా చూసుకోవాలని యూజీసీ సూచించింది.
చదవండి: UGC: పీవోపీల నియామకానికి యూజీసీ మార్గదర్శకాలు..
ఈ విధానంతో విద్యార్థులకు మేలు..
తరగతి గదులు, మౌలిక సదుపాయాలు పంచుకోవడం ద్వారా విద్యార్థులకు మేలు చేకూరుతుంది. క్రీడా మైదానాలు, స్టేడియం, సమావేశ మందిరాలను కూడా అవసరాలను అనుసరించి పంచుకోవచ్చు. సైన్సేతర అంశాలకు సంబంధించిన వనరుల విషయంలో కూడా సంస్థలు పూర్తిస్థాయిలో తమ వద్ద ఉన్న అన్ని సదుపాయాలను ఇతర సంస్థలకు అందుబాటులో ఉంచాలని యూజీసీ పేర్కొంది. పరికరాలు దెబ్బతినే విషయంలోనూ వాటిని తిరిగి ఏర్పాటుచేయడంపైనా ఒప్పందంలో పేర్కొనాలి. అకడమిక్ అంశాలకు సంబంధించి ఆన్‌లైన్ లెక్చర్‌లు, వీడియోలు, లెర్నింగ్ మెటీరియల్‌లు, లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ లలోనూ ఇచ్చిపుచ్చుకోవచ్చు. విద్యార్థుల నమోదు ప్రక్రియ మొత్తం ముందుగా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ ద్వారా పూర్తిచేయాలి. ఉపాధ్యాయుల శిక్షణ, ఫ్యాకల్టీ అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిర్వహించవచ్చు.
చదవండి: UGC Latest Guidelines: పీహెచ్‌డీకి యూజీసీ తాజా మార్గదర్శకాలు, అర్హతలు, ప్రవేశ మార్గాలు..
ఖర్చులపై ముందుగానే ప్రణాళిక
వనరులను పంచుకోవడానికి ముందు వ్యయ విశ్లేషణ, ఖర్చును నిర్ణయించే పద్ధతులపై ప్రణాళిక రూపొందించుకోవాలి. లాభనష్టాలకు తావులేని రీతిలో వనరుల వినియోగంపై ఛార్జీలు వసూలుచేయాలి. ప్రయోగాల వినియోగం ఆధారంగా, నిర్వహణ వ్యయం ప్రకారం పరికరాలు ఛార్జీలు నిర్ణయించాలి. ఉన్నత విద్యాసంస్థల మధ్యే కాకుండా కాలేజీలు, పరిశ్రమల మధ్య కూడా ఒప్పందాలు చేసుకోవాలని యూజీసీ సూచించింది.
చదవండి: UGC: వర్సిటీలో బోధనకు అన్ని రంగాలకు చాన్స్
యూజీసీ పేర్కొన్న ఇతర సూచనలివే..
- ఆయా విద్యార్థులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీచేయాలి.
- తరగతి గది బోధకులు, ల్యాబ్ అసిస్టెంట్‌లు, సెక్యూరిటీ సిబ్బందికి అదనపు చెల్లింపులతో పాటు నిర్వహణ ఖర్చులలో ఆయా సంస్థలు భాగస్వామ్యం కోసం రూపొందించిన ఫార్ములాను అనుసరించాలి.
- ఒకే నగరం, పట్టణం లేదా సమీప ప్రాంతాల్లో ఉండే ఉన్నత విద్యాసంస్థల మధ్య ఈ పరస్పర సహకారం ఉండాలి.
- పరిశోధన స్థాయిలో వనరుల భాగస్వామ్యం అనేది ఆయా పరిశోధకుల స్థాయిలో ఉండాలి. పీజీ స్థాయిలో వనరుల షేరింగ్ విభాగాల వారీగా లేదా సంస్థాగత స్థాయిలో ఉండొచ్చు.
- అదే యూజీ స్థాయిలో వనరుల భాగస్వామ్యం సంస్థల మధ్యే ఉండాలి.
- సెంట్రల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ సదుపాయం వంటి హైఎండ్ పరికరాల భాగస్వామ్యంలో లాభనష్టాలు లేని విధంగా ఒప్పందాలు ఉండాలి.
- లైబ్రరీ, రీడింగ్ హాళ్లు ఆవరణ స్థలాలు తదితర వనరులనూ ఇదేరకంగా వినియోగించుకోవాలి.
- ఇ–బుక్స్, డేటాబేస్‌లు, ఆన్‌లైన్ వనరుల భాగస్వామ్యంలో కాపీరైట్ ఉల్లంఘనలకు తావులేకుండా, గోప్యతకు భంగం కలగని రీతిలో వ్యవహారాలు నడిచేలా సంస్థలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయంలో యాంటీ–ప్లాజియరిజం సాఫ్ట్‌వేర్‌తో సహా ఎలక్ట్రానిక్ వనరులను వినియోగించాలి.