Skip to main content

నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు వెబ్‌సైట్‌ ప్రారంభం

హైదరాబాద్‌, 18 మార్చి 2023 : కెజీ నుం చి పీజీ వరకూ వేల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన చేస్తున్న శారదా విద్యాలయ శతాబ్ది ఉత్సవాలు ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ ఉత్సవాలలో భాగంగా జరుగుతున్న వేడుకలలో విశిష్ట వ్యక్తులు పాల్గొనడంతో పాటుగా ఈ విద్యాలయంతో తమకున్న అనుబంధాలను తెలుపుతూ విద్యార్థులలో స్ఫూర్తిని నింపుతున్నారు. దీనిలో భాగంగా మార్చి 18 న‌ జరిగిన వేడుకలకు తెలంగాణా ఐటీ, పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖల ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్‌ రంజన్‌, ఐఏఎస్‌ ముఖ్య అతిథిగా పాల్గొనగా, గౌరవ అతిథిగా అడిషనల్‌ డీజీ మరియు హెడ్‌, ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ శిఖా గోయల్‌ , ఐపీఎస్‌, ప్రత్యేక అతిథిగా సాక్షి మీడియా కార్పోరేట్‌ ఎఫైర్స్‌ డైరెక్టర్‌ రాణి రెడ్డి పాల్గొన్నారు. శారదా విద్యాలయ వెబ్‌సైట్‌ను ఈ సందర్భంగా వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శారదా విద్యాలయ ట్రస్టీ, సింథోకెమ్‌ ల్యాబ్స్‌ ఛైర్మన్‌ శ్రీ జయంత్‌ ఠాగోర్‌, శారదా విద్యాలయ సెక్రటరీ రామ్‌ మాదిరెడ్డి, కరస్పాండెంట్‌ జ్యోత్స్న అంగారా సైతం పాల్గొన్నారు. పాఠశాలకు సంబంధించిన సమస్త సమాచారంతో పాటుగా బోధనా పద్ధతులు, అందించే కోర్సులు తదితర విషయాలను ఈ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
Sharada Vidyalaya website launch of quality education for underprivileged students
నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు వెబ్‌సైట్‌ ప్రారంభం

ఈ వేడుకలలో భాగంగా అంతకు ముందు క్రీడా మైదానాన్ని సైతం ప్రారంభించారు. దీనితో పాటుగా క్రికెట్‌ అభిమానుల కోసం ఐదు నెట్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటితో పాటుగా బాస్కెట్‌బాల్‌, వాలీబాల్‌ కోర్టులు, అథ్లెటిక్స్‌, స్పోర్ట్స్‌ ఏర్పాట్లను సైతం అందుబాటులోకి తీసుకువచ్చారు. 

నిరుపేద విద్యార్థులకు మరీ ముఖ్యంగా ఆడపిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే మహోన్నత సంకల్పంతో శారదా విద్యాలయ గ్రూప్‌ను 1922లో శ్రీ వై సత్యనారాయణ ఏర్పాటుచేశారు. ఈ విద్యాలయను అప్పటి హైదరాబాద్‌ నిజాం ప్రధానమంత్రితో పాటుగా భారత తొలి రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణ ప్రారంభించారు. అత్యంత పురాతనమైన, లాభాపేక్షలేని విద్యాలయంగా ఖ్యాతి గడించిన శారదా విద్యాలయలో కెజీ నుంచి పీజీ వరకూ విద్యాబోధన సాగుతుంది .దాదాపు 1450 మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. తొలుత బాలికల కోసమే దీనిని ప్రారంభించినా అనంతర కాలంలో బాలురకీ ఇక్కడ విద్యాబోధన చేస్తున్నారు. ప్రస్తుతం విద్యాసంస్థలో 62% మంది బాలికలు ఉన్నారు. నిరుపేద చిన్నారులకు విద్యనందించడంలో అందిస్తున్న తోడ్పాటుకుగానూ 2018లో ప్రైడ్‌ ఆఫ్‌ తెలంగాణా అవార్డునూ అందుకుంది.

RaniReddyMadam

అవిశ్రాంతంగా వందేళ్లగా మెరుగైన విద్యాబోధనను పాతబస్తీ విద్యార్థులకు చేస్తోన్న శారదా విద్యాలయ విప్లవాత్మక ఆవిష్కరణలనూ మెరుగైన విద్య కోసం చేసింది. డిజిటల్‌ తరగతులను నాల్గవ తరగతి లోపు విద్యార్ధులకు తీసుకురావడంతో పాటుగా 1.36 ఎకరాల విస్తీర్ణంలో ఆటస్థలాన్నీ విద్యార్ధులకు అందుబాటులో ఉంచి ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌కూ అమిత ప్రాధాన్యత అందిస్తుంది.

తమ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా చేయడానికి శారదా విద్యాలయ ఏర్పాట్లు చేసింది. ఈ వేడుకలలో భాగంగా వందేళ్ల విద్యాలయ ప్రస్ధానంలో కీలకమైలురాళ్లతో ఓ ఫోటో గ్యాలరీని ఏర్పాటుచేశారు. 

Published date : 18 Mar 2023 10:18PM

Photo Stories