KGBV: కస్తూర్బా కాలేజీల్లో సీట్లు ఖాళీ
కేజీబీవీలను మొదట పదో తరగతి వరకు కొనసాగించిన ప్రభుత్వం ఆ బాలికలకు కళాశాల విద్య సైతం అందించేందుకు అదే పాఠశాలల్లో ఐదేళ్ల క్రితం కళాశాలలను కూడా ప్రారంభించింది.
అయితే ఆ కళాశాలల్లో చేరేందుకు రెండేళ్లుగా బాలికలు ముందుకురావడం లేదు. దీంతో ఆ పాఠశాలల ప్రత్యేక అధికారులు ఖాళీ సీట్లను నింపేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా ఆ కళాశాలల్లో విద్యనభ్యసించేందుకు ముందుకు వచ్చే బాలికల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతోంది.
చదవండి: SCERT: పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు
జిల్లాలో 14 కళాశాలలు..
జిల్లాలో బాలికల అక్షరాస్యత శాతం తక్కువగా ఉన్న మండలాల్లో 11 ఏండ్ల కాలంలో విడతల వారీగా 16 కేజీబీవీలను ఏర్పాటు చేశారు. వాటిలోనే 14 చోట్ల జూనియర్ కళాశాలలను ప్రారంభించారు. ప్రతి కాలేజీలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సుల్లో ఏవైనా రెండు గ్రూపులు ఏర్పాటు చేశారు. ఒక్కో గ్రూపులో 40 మంది చొప్పున మొదటి సంవత్సరానికి 80 మంది, రెండో సంవత్సరానికి 80 మంది మొత్తం 160 మంది విద్యార్థినులు ఇంటర్ విద్యను అభ్యసించేలా ఏర్పాట్లు చేశారు. కానీ అధికారులు కేటాయించిన అంతమంది విద్యార్థినులు కళాశాలల్లో చేరడం లేదు.
చదవండి: KGBV Posts: కేజీబీవీ నియామకాల్లో గందరగోళం
మొత్తం 14 విద్యాలయాల్లో 2240 మంది విద్యార్థినులు ఇంటర్ విద్యను అభ్యసించే అవకాశం ఉన్నపటికీ ప్రస్తుతం ఒక్కో విద్యాలయంలో 100 నుంచి 105 వరకు మొత్తం 1450 మంది మాత్రమే ఇంటర్ విద్యాభ్యాసం చేస్తున్నారు.