SCPCR Chairperson Kesali Apparao About Exams: విద్యార్థులపై ఒత్తిడి వద్దు.. హాల్‌టికెట్స్ ఇవ్వకుంటే కఠిన చర్యలు
పరీక్షలు దగ్గరపడుతున్న కొద్దీ విద్యార్థుల్లో తెలియని ఒక ఆందోళన మొదలవుతుంటుంది. ఏడాదంతా ఎంత బాగా చదువుకున్నా, పరీక్షల తేదీ దగ్గరపడుతుందంటే విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు. కొన్నిసార్లు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల వైపు నుంచి కూడా విద్యార్థులపై ఉండే అంచనాలు వారి ఒత్తిడి స్థాయిలను మరింత పెంచుతాయి.
అనవసరమైన ఒత్తిడి వద్దు
ఈ ఒత్తిడిలో నేర్చుకున్నదంతా మర్చిపోతారు. అందుకే ఒత్తిడి లేకండా విద్యార్థులు రాబోయే పరీక్షలకు సిద్ధం కావాలని స్టేట్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్(SCPCR) చైర్‌పర్సన్ కేసలి అప్పారావు అన్నారు. పరీక్షలపై నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడిన ఆయన విద్యార్థులపై అనవసరమైన ఒత్తిడి కలిగించవద్దంటూ విద్యాసంస్థల యాజమాన్యాలను కోరారు.
హాల్‌టికెట్స్ ఇవ్వకుంటే కఠిన చర్యలు
పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అనువైన వాతావరణం, అవసరమైన సౌకర్యాలు ఉండేలా చూసుకోవాలని, తాగునీరు, ప్రథమ చికిత్స,విశాలమైన గదులు, సరైన వెలుతురు, బెంచీలు వంటి సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. చివరి నిమిషం వరకు విద్యార్థులను టెన్షన్ పెట్టకుండా, ముందుగానే హాల్‌టికెట్స్‌ను జారీ చేయాలని, ఒకవేళ హాల్‌టికెల్స్ ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తే యాజమాన్యాలపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.
విద్యార్థులను వేధింపులకు గురి చేసినా, ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాల్సిందిగా ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సమయానికి చేరుకునేలా రవాణా సేవలను ఏర్పాటు చేయాల్సిందిగా ఇప్పటికే రవాణా సంస్థ (ఆర్‌టీసీ) అధికారులను ఆదేశించారు. ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాల్సిందిగా విద్యార్థులకు సూచించారు.