టీచర్ల బదిలీల షెడ్యూల్ మరింత ఆలస్యం.. వీరి బదిలీలపై బ్యాన్ ఎత్తివేయాలి..
ఈ ప్రక్రియకు సంబంధించిన సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ చేయాల్సి ఉందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. మరోవైపు ఉపాధ్యాయ సంఘాల నుంచి వివిధ రకాల డిమాండ్లు వస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని వచ్చే వారంలో షెడ్యూల్ ఇవ్వాలనే యోచనలో అధికారులున్నారు. ఉపాధ్యాయ సంఘాల నేతలతో పాఠశాల విద్య డైరెక్టర్, ఇతర ఉన్నతాధికారులు జనవరి 18న భేటీ అయ్యారు. వివిధ సంఘాలతో విడివిడిగా జరిగిన ఈ భేటీలో అనేక అంశాలు తెరమీదకొచ్చాయి.
చదవండి: సార్.. మేడమ్ పిలుపులు ఇకపై నిషిద్ధం... ఏ రాష్ట్రంలోనో తెలుసా..?
గతంలో జరిగిన పొరపాట్లు, వాటివల్ల తలెత్తిన సమస్యలను సంఘాల నేతలు అధికారుల దృష్టికి తెచ్చారు. వాటన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఉన్నతాధికారులు తెలిపారు. బదిలీలు, పదోన్నతుల్లో ఎలాంటి సమస్యలు రాకుండా, పారదర్శకంగా చేపట్టాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయం కావడంతో ఉపాధ్యాయ వర్గాలు సంతృప్తి చెందేలా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో అధికారులు అన్ని సంఘాల నేతల మనోగతాన్ని తెలుసుకుంటున్నారు. కాగా గురువారం మంత్రి వద్ద దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
చదవండి: School Education Department: గురువుల సేవలు ఇక పూర్తిగా విద్యకే పరిమితం
‘కనీసం రెండేళ్లు’ నిబంధన సడలించాలి..
బదిలీలకు కనీసం రెండేళ్ళు సంబంధిత స్కూల్‌లో పనిచేసి ఉండాలనే నిబంధనను సడలించాలని తెలంగాణ పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేనతో జరిగిన సమావేశంలో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) ప్రతినిధులు డిమాండ్ చేశారు. జిల్లాల్లో స్పౌజ్ బదిలీలను షెడ్యూల్ విడుదలకు ముందే పూర్తి చేయాలని, జిల్లాల్లోని అన్ని ఖాళీలను బదిలీలకు చూపించాలని, బదిలీలకు కటాఫ్ తేదీ డిసెంబర్ 31 లేదా జనవరి 31 గా నిర్ణయించాలని కోరారు.
చదవండి: Tenth Class: ‘పది’పై ప్రత్యేక దృష్టికి విద్యాశాఖ ఆదేశం
స్పౌజ్ బదిలీలపై బ్యాన్ ఎత్తివేయాలి..
జాక్టో సంఘం నేతలు కూడా పలు డిమాండ్లు లేవనెత్తారు. 13 జిల్లాల్లో స్పౌజ్ కేసుల విషయంలో విధించిన బ్యాన్ ఎత్తివేయాలని కోరారు. బదిలీలకు కనీస సర్వీసును రెండేళ్ల నుంచి జీరో సర్వీసుకు తగ్గించాలని, రిటైర్మెంట్ వయసును 61 ఏళ్లకు పెంచినందున, మూడేళ్ల సర్వీసు మిగిలి ఉన్న వారిని బదిలీల నుంచి మినహాయించాలని విజ్ఞప్తి చేశారు.