Tenth Class: ‘పది’పై ప్రత్యేక దృష్టికి విద్యాశాఖ ఆదేశం
సిలబస్ విషయంలోనూ స్పష్టమైన విధానాన్ని సూచించింది. ఇందుకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను విడుదల చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ నెలాఖరు కల్లా సిలబస్ పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. జనవరి నుంచి ఫిబ్రవరి ఆఖరు వరకూ పునఃశ్చరణ చేపట్టాలని తెలిపారు. కోవిడ్ తర్వాత సకాలంలో విద్యా సంవత్సరం మొదలవ్వడంతో ఈసారి వంద శాతం ఫలితాలే టార్గెట్‌గా ఉండాలని భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రత్యేక తరగతుల నిర్వహణపై ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకూ, తిరిగి సాయంత్రం 4.30 నుంచి 5.30 వరకూ ప్రత్యేక క్లాసులు నిర్వ హించాలని షెడ్యూల్ ఇచ్చారు. డిసెంబర్ వరకూ కొంత సర్దుబాటు చేసినా, జనవరి నుంచి మాత్రం ప్రత్యేక క్లాసులు రెండు పూటలా ఉండాలని ఆదేశించారు.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2022 | టైం టేబుల్ 2022 | స్టడీ మెటీరియల్ | సిలబస్
ముఖ్యమైన పాఠాలే లక్ష్యం:
పూర్తిగా పదవ తరగతి పరీక్షలను దృష్టిలో పెట్టుకుని బోధించేలా ప్రత్యేక తరగతుల ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రతిరోజూ ఉదయం ఒకటి, సాయంత్రం ఒక సబ్జెక్టులో శిక్షణ ఇస్తారు. ఇందులో భాగంగా పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించేలా చాప్టర్స్ వారీ బోధన చేస్తారు. సూక్ష్మ పద్ధతిలో, సుదీర్ఘ, చిన్న ప్రశ్నలు వచ్చినా విద్యార్థి సమాధానాలు ఇవ్వగలిగేలా, అవి తేలిక గా అర్థం చేసుకునేలా బోధన ఉండాలని నిర్ణయించారు. కొన్నేళ్ళుగా ఏ మాదిరి ప్రశ్నలు ఇస్తున్నారనేది కొలమానంగా తీసుకుని సబ్జెక్టు టీచర్లు వీటిని రూపొందిస్తున్నారు. ముఖ్యంగా గణితంలో సమాధానాలు రాబట్టే తేలికైన పద్ధతులపై టీచర్లు వివిధ మార్గాల్లో బోధన చేయాలని అధికారులు సూచించారు. ఇవన్నీ విద్యార్థి ఎక్కువ మార్కులు సాధించేందుకు తోడ్పడతాయని భావిస్తున్నారు.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్
అన్ని జిల్లాల నుంచి నివేదికలు
ఇప్పటివరకూ పూర్తయిన సిలబస్‌పై అన్ని జిల్లాల నుంచి విద్యాశాఖ నివేదికలు తెప్పించింది. పుస్తకాలు ఆలస్యంగా రావడం, స్కూళ్ళు తెరిచినా చాలారోజులు పునఃశ్చరణ కార్యక్రమాలు నిర్వహించడంతో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో టెన్త్ సిలబస్ నిర్దేశించిన విధంగా పూర్తవ్వలేదని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ నెలాఖరు కల్లా సిలబస్ పూర్తి చేయాలని ఆదేశించారు. కాగా సబ్జెక్టు టీచర్ల కొరత ఉందని, ప్రాథమిక స్కూల్స్ నుంచి సర్దుబాటు ద్వారా వారిని తేవడానికి ఆలస్యమైందని జిల్లా విద్యాశాఖాధికారులు తెలిపినట్లు సమాచారం.