Kerala: సార్.. మేడమ్ పిలుపులు ఇకపై నిషిద్ధం... ఏ రాష్ట్రంలోనో తెలుసా..?
కేవలం ‘టీచర్‘ అనే సంబోధించాలని కేరళ స్టేట్ కమిషనర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ప్యానెల్ (కేఎస్‌సీపీసీఆర్) విద్యాశాఖను ఆదేశించింది. ఉపాధ్యాయులను సర్ లేదా మేడమ్ వంటి గౌరవమైన పదాల కంటే లింగంతో సంబంధం లేకుండా తటస్థమైన పదంతో సంబోధించాలని ప్యానెల్ నిర్ణయించింది.
ఈ మేరకు కేరళ రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ‘టీచర్‘ అని సంబోధించేలా ఆదేశాలు ఇవ్వాలని చైర్ పర్సన్ కేవీ మనోజ్ కుమార్, సభ్యుడు విజయకుమార్‌లతో కూడిన ప్యానెల్ విద్యాశాఖను ఆదేశించింది. టీచర్ అని సంబోధించడం వల్ల అన్ని పాఠశాలల్లో పిల్లల మధ్య సమానత్వాన్ని కొనసాగించడంలో ఉపకరించడమే కాకుండా ఉపాధ్యాయులు, పిల్లల మధ్య అనుబంధాన్ని పెంచుతుందని బాలల హక్కుల కమిషన్ అభిప్రాయపడింది.
ఇదిలా ఉండగా ఉపాధ్యాయులను లింగం ఆధారంగా సర్ లేదా మేడమ్ అనే సంబోధన కారణంగా ఏర్పడుతున్న లింగ వివక్షతను అంతం చేయాలని కోరుతూ.. ఒక వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుని ప్యానెల్ ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇకపై కేరళలో స్కూళ్లలో సార్, మేడమ్ పిలుపులు వినిపించవేమో.